.
మేస్టారు : ఈగను చూసారా ?
తేనెటీగను చూసారా ?
తేనెటీగకూ ఈగకు ఉండే
తేడా చూసారా ?
.
పిల్లలు : ఈగల నెఱుగుదుము !
తేనెటీగల నెఱుగుదుము !
ఎక్కడ కు ళ్ళుంటే
ఈగ అక్కడ ఉంటుంది !
ఎక్కడ మధు వుంటే
తేనెటీగ అక్కడ ఉంటుంది !
ఈగలు తెగ కుట్టు –
తేనెటీగలె మాౙట్టు !
.
మేస్టారు : చెడును గ్రహించేవా ళ్ళంతా
చెడ్డవాళ్లు – వాళ్ళీగలౙట్టు !
మంచిని చూసేవాళ్లు తేనె
తీగలౙట్టూ – మనౙట్టూ !
.
రాణియీగకే పెత్తన మిచ్చి
క్రమశిక్షణతో ఉంటాయి !
తమసంఘములో స్త్రీపురుషుల కివి
‘ సమానహక్కులు ’ సాధించాయి !
.
చేదుపూలలోసైతము నేర్పుగ
స్వీకరించు నివి తీయనిమధువులు !
చేదుబ్రతుకులో తీపిని చూచుట
బోధించు – నీవే మనకు గురువులు !
.
పూలగుండె నొప్పింపక తేనెలు
పుణికి పుణికి తీసుకు వస్తాయి !
ఉన్నవారికడ తెచ్చిన దంతా
లేనివారికే పంచేస్తాయి !
అంతకన్న మఱి ‘ అహింస ’ యేమిటి ?
ఇంతకన్న ‘ సోషలిజం ’ ఏమిటి ?
.
కాలమువిలువను గమనించి
క్రమశిక్షణతో పని చేస్తాయి !
శ్రమించి తెచ్చినతీయనితేనెలు
జగతికి దానం చేస్తాయి !
శ్రమదానమ్మును చేస్తాయి !
.
గాంధీ నెహ్రూ నిజ మౌశిష్యులు
క్రమశిక్షణ గలతేనెటీగలే !
శ్రమదానము సంపత్తిదానమును
సలుపు వినోభా కనుగుశిష్యులే !!
.
**********************