11_011AV ఆనందవిహారి

                            హాంగ్ కాంగ్ లో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు

 

హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు నిర్వహించే తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను కోవిడ్ నిబంధనల కారణంగా అంతర్జాలంలో జూమ్ ద్వారా నిర్వహించడం జరిగిందని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి గారు తెలియజేశారు. నవతరం బాలబాలికలకు తెలుగు భాష, సంస్కృతి యొక్క గొప్పదనాన్ని తెలియజెప్పి, వారికి మన భాష పట్ల, మన సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించే ఉద్దేశ్యంతో చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం వంటి అనేక సాంప్రదాయాలను ఈ ఉత్సవాలలో భాగంగా పాటించడం ఆనవాయితీగా వస్తోందని జయ తెలియజేశారు.  

ఈ సంవత్సరం తప్పనిసరి పరిస్థితుల్లో అంతర్జాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్ఆర్ఐ తెలుగు ఐడల్ 2021 రెండవ విజేతగా నిలిచిన హర్షిణి పచ్చంటి ప్రార్థన గీతంతో ప్రారంభమయింది. పిల్లలందరూ సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేశారు. కొందరు తమ గాత్రంలో శాస్త్రీయ సంగీతాన్ని వినిపించగా, మరికొందరు వాద్య సంగీతంతో అలరించారు. పిల్లల తెలుగు సినీ గీతాలాపన, ప్రదర్శించిన సినీ నృత్యాలు కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. అలాగే త్యాగరాజ ఆరాధన సందర్భంగా  వారికి, స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జన్మదినం సందర్భంగా వారికి ఈ కార్యక్రమం నివాళులు అర్పించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ అర్బన్ డిజైనర్, సర్టిఫైడ్ టౌన్ ప్లానర్ డా. సుజాత గోవాడ విచ్చేశారు. పాల్గొన్న బాలలనందరినీ అభినందిస్తూ, తెలుగు సమాఖ్య కృషిని ఆమె మెచ్చుకున్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ దర్శకులు కిశోర్ మాట్లాడుతూ తెలుగు వారీనందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్న సమాఖ్య ప్రయత్నాన్ని అభినందిస్తూ, పిల్లల ప్రదర్శనలను మెచ్చుకున్నారు.

హాంగ్‌కాంగ్ లో మూడు దశాబ్దాలకు పైగా వైద్యులుగా సేవలందిస్తున్న డా. పలుకూరి వెంకట్రావు కూడా సతీసమేతంగా ఈ కార్యక్రమం లో పాల్గొని పిల్లలను ఉత్సాహపరిచారు. సమాఖ్య కార్యకలాపాలు ఎంతో స్పూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. వారు సరస్వతీదేవిని స్తుతిస్తూ భక్తి గీతాన్ని కూడా ఆలపించారు.

ఈ వేడుకలలో పాల్గొన్న బాలబాలికలను, వారి తల్లిదండ్రులను అభినందిస్తూ, విజయవంతం కావడానికి సహకరించిన సాంస్కృతిక కార్యదర్శి సువర్ణ చుండూరు, ఉప కోశాధికారి రమాదేవి సారంగ, ఆర్థిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, జనరల్ సెక్రెటరీ గర్ధాస జ్ఞానేశ్వర్ లతో బాటు స్వచ్ఛందంగా సేవలందించిన అపర్ణ కందా, రాజీవ తదితరులను సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి అభినందిస్తూ వందన సమర్పణ చేశారు.

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾