11_010 సప్తపర్ణి కథలు – రాగి చెంబు

 

ప్రతీచి నడక వేగం పెరిగింది. పరుగుగా మారింది. ఎలాగైనా పది మైళ్లు పూర్తిచెయ్యాలి. 

అలసటగా ఉంది. తెలియని దుఃఖం కూడా ఉంది. కౌన్సెల్లెర్ డాక్టర్  క్రిస్టల్ చెప్పింది. 

నిరాశ దిగులు వంటివి తగ్గాలంటే క్రమశిక్షణ, వ్యాయామం కావాలని. 

ఇప్పటికే పన్నెండు సార్లు తాను మారథాన్ పూర్తి చేసింది. అందరు అందుకే పరిగెడతారా ? 

వీళ్ళందరికీ ఎందుకు దిగులు ? మనసుకి బలం లేకనా ? ఉన్నట్టుండి లిజ్ మాట వినిపించింది ” రా ప్రతీచీ .. కానీ.. ఎక్కడికో వెళ్ళిపోతే పరుగుల ప్రయోజనం ఉండదు. ఏదైనా మాట్లాడు ”. చిన్న ఊపిరి తీసుకుంది ప్రతీచి. రెండడుగులు ముందుకి వేసి ప్రక్కనే పరుగు ప్రారంభించింది 

 “ పదేళ్ల క్రితం నేనెలా ఉన్నాను ? అప్పుడు ఎందుకిలా లేను ? అని ఆలోచిస్తున్నాలే లిజ్.

మనం పరుగిడుతుంటే ఏమవుతోంది లోపల ? నాకు అలసట తప్ప ఆనందం ఎందుకు కలగటం లేదు ? కానీ ఓమాట చెప్పనా ? ఈ ఉదాసీనత బాధ కాదు, నిర్వేదం కాదు, దుఃఖం కాదు. ఒక రకమైన శాంతి భావనే ! ” 

లిజ్ సమాధానంలో ఏ భావనా లేదు. ‘ నాకు నీ ఆలోచనలు అర్థం కావు. కానీ మరీ మరీ వినాలని ఉంటుంది ‘. మనం జాగింగ్ సమయం లో చాలా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకుంటు న్నాం కూడా. నేను ఎప్పటికీ ఊహించలేని వెళ్లలేని చోట్లకి తీసుకెళ్తావు. చాలా బావుంటుంది. నీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా చాలదు. అసలు భాష చాలా బలహీనమని నీ వలన తెలుస్తోంది. మాటలు లేకపోయినా ఫరవాలేదనిపిస్తుంది ”. 

‘ లిజ్ ! నాకు చాలా వస్తువులు చాలా చాలా అపురూపంగా అనిపిస్తాయి. నీకు ఆలా అనిపించేవేమిటి ? ‘ 

“ నాకు మా తాత గారి ఇంగ్లీష్ పోయెట్రీ పుస్తకం. దాన్లో ఎన్నెన్నో గీతలుంటాయి. కొన్నిపదాలకి రంగు గీతాలు. ఆలోచిస్తూ ఉంటాను. తప్పకుండా ఆ పదాలు ఆయన మనసుని కదిపేవో, సంతోషాన్నిచ్చేవో అయి ఉంటాయి. 

ఇంకో విషయం చెప్పాలనిపిస్తుంది నాకు. ఆయన ఎవరినో అమితం గా ప్రేమించారని నా భావన. తన జీవిత కాలమంతా నిశ్శబ్దం గా లోపల దాచుకున్నారు. కానీ ప్రతీక్షణం జీవించారు ఆ ఊహల్లో. అందుకే అంత అందంగా ఆనందంగా ఉండగలిగేవారేమో ! అదెలా సాధ్యం అని ఎప్పుడు ఆలోచిస్తాను. ఆ రంగుల్లో, గీతాల్లో తన ప్రేమని చూస్తారనిపిస్తుంది. ఎనభై ఏళ్ళొచ్చినా ఆయనలో ప్రేమించగల శక్తి ఇగిరిపోలేదు. ఎంతో అందం గా ఉహించగలరు. ఆయన చుట్టూ సౌందర్యం గడ్డ కట్టినట్లుంటుంది. ఏంచేసినా, ఏం మాట్లాడినా చుట్టూ ఉన్నవాళ్లు వేరే ప్రపంచం లోకి వెళ్ళిపోతారు.. ఆయన వాడిన ప్రతీ వస్తువు దాచుకోవాలనిపించేది “.

ఈ సారి నవ్వింది లిజ్. ఊపిరందక ఉక్కిరిబిక్కిరైంది. పరుగు అపి చెయ్యి పట్టుకుంది ప్రతీచి.

 “ ఏమైంది ? ” ” ఏమిటో ఆయన మన ప్రక్కన నడుస్తున్నట్లుంది. మన మాటలు వింటున్నట్లు అనిపించింది ”.  

వెనక ముందు చూసింది ప్రతీచి. ఎవరో ఏడు పదుల వయసు ఆయన పరుగులతో ముందుకి

వెళ్లారు. “ ఏయ్ ! ప్రతీచీ చూడు ! ఆయన తీరు అచ్చంగా మా జార్జ్ తాతలా ఉంది ‘. ” లిజ్ నేనెప్పుడూ ఆయనని మన జాగింగ్ సమయాల్లో చూడలేదు ఇంతవరకు. ఏదో చల్ల గాలి తగిలినట్లయింది ప్రక్కనుంచి వెళ్తుంటే ! వెళ్లి కలుద్దామా ? త్వరగా వెళదాం “. ఇద్దరు పరుగు వేగం పెంచారు. ఇంక ఇరవై అడుగుల్లో దగ్గరకి వెళ్తారు.

“ ఏం మాట్లాడతాం ప్రతీచీ “ “ ఏముంది వాతావరణం బావుంది అందాం ముందు ఆ తర్వాత అదే సాగుతుంది ”. ఇద్దరు ఆయన తలో ప్రక్కకి చేరారు. ఏదో తెలియని సౌందర్య భావన పెరుగుతోంది ఇద్దరిలో. ఆత్మ బలం వెయ్యింతలైనట్లు.  

‘ చాలా ఆహ్లాదం గా ఉంది కదండీ ‘  పలకరించింది ప్రతీచి. ఎక్కడినుంచో వస్తోంది మాట ! తనేనా అంటున్నది ? చిన్న నవ్వుతో ప్రక్కకి తిరిగారు ఆయన ! దిగ్భ్రాంతితో ‘ మామయ్యా ‘ అంది ప్రతీచి. చిన్న వణుకు కలుగుతోంది. ఇద్దరూ  అవాక్కయిపోయారు ! ఎవరూ లేరు మధ్యలో. అదేమిటి ? చుట్టూ చూసారిద్దరూ ! మళ్ళీ మళ్ళీ చూసారు. 

ప్రతీచి చెయ్యి గట్టిగా పట్టుకుంది లిజ్. ఎవరు లేకపోవటమేమిటి ?

“ వెళ్లిపోదామా ! నాకు ఏమనిపిస్తోందో చెప్పలేకపోతున్నాను. ఆయన ఏరీ ప్రతీచీ “ !

ఈ సారి నిశ్చేష్ఠత ప్రతీచి వంతు అయింది. “ లిజ్ ! అదేమిటి ? నువ్వు చూసావా ఆయనని ? ”  ” అవును చూసాను. జార్జి తాత లా ఉన్నారని చెప్పాను కదా ఇంతసేపు నేను చెప్పినవి

నువ్వు వినలేదా ? “  “  మనం నిజం చూడలేదా ? కేవలం ఉహేనా ? ముమ్మాటికీ కాదు. చూసాం ” ! 

ప్రతీచి ఆగింది. లిజ్ చెయ్యి పట్టుకుని ఆపింది. లేక్ మిచిగన్ ఎంతో అందంగా ప్రవహిస్తోంది. ఎందరెందరో నడుస్తున్నారు. పరుగులు పెడుతున్నారు. ప్రేమికుల జంటలు, ఒంటరి వాళ్ళు, పిల్లలు పెద్దలూ ఎందరెందరో చుట్టూ ! 

“ కాస్సేపు ఇక్కడ కూర్చుందామా ? ” ఏమిటో దీనత ధ్వనించింది ప్రతీచి కంఠం లో. విపరీతంగా చెమట పట్టింది ఇద్దరికీ ! పచ్చ గడ్డిలో భూమిని కరుచుకుని పడుకున్నారు. ఆకాశం వైపు చూస్తూ ! సమయం తెలియటం లేదు. సన్నని కంఠం తో లిజ్ “ ఇది నిజమూ కాదు. అబద్ధమూ కాదు. కానీ ఈ అనుభూతి చాలా అపురూపం ప్రతీచీ “ 

“ అవును ! ఈ రోజు నువ్వు పుష్యమిని జ్ఞాపకం చేస్తున్నావు. తాను నేను స్కూల్ నుంచి కాలేజీ వరకు చదువుకున్నాం ! ఎక్కడుందో తాను ! ఆ చిన్నతనం పరమ అద్భుతం గా అనిపిస్తుంది తలచుకుంటే ! ‘ ఆనందమే జీవిత మకరందం ‘ అన్నాడు కదా ఆ కవి “ ! 

తన బ్యాక్ ప్యాక్ నుంచి రాగి చెంబు పైకి తీసింది. ఒక మంచినీళ్ల సీసా తీసి అందులో పోసింది. ” ఎందుకలా ? తిన్నగా ఆ ప్లాస్టిక్ సీసా నుంచే త్రాగవచ్చుకదా ! అదో పనా మనకి ” ! లిజ్ మాటలు పొడి గా వినిపించాయి. 

“ ఆలా అనకు లిజ్ ! ఈ రాగి చెంబులో నీళ్ల తడి నాకు నా మనసుకీ దాహం తీరుస్తుంది.

నా సర్వాన్నీ ఆవరిస్తుంది. అది ఎప్పటికప్పుడు దుఃఖం గానో సుఖం గానో పరిణమిస్తుంది. ఈ రంగు చూసావా అది  గతాన్ని వర్తమానం గా మార్చగలదు. నేను వలస వచ్చాను. నాతో నా బుద్ధి కూడా వచ్చింది. దానికి అప్పుడప్పుడు ఉపశమనం కావాలి. నా ప్రవాస వాసానికి అభద్రతా భావం లేకుండా చెయ్యగలదు. అంచుల దాకా నీళ్లు. చిన్న చిన్న కదలికలు చూడు ! 

మన ఊహల్లా గానే కదా ! అందే లోగా మటుమాయం. ఉహలన్నీ ఆవిరైపోతాయి. కానీ ఏదో తళతళ ! ఒక ఊపు ! ఎక్కడినుంచి దిగివస్తాయో ఎప్పుడన్నా ఆలోచించావా ? మన లోపల ఊహలు ఉగులాడుతున్నట్లు ఈ నీళ్లు రాగిచెంబు అంచుల దాకా ఊగుతాయి. అంచులు దాటవు. కానీ ఊహలు ? లోపల బయట అంతా అవే  కదూ ! మహాదేవ శాస్త్రి మామయ్య నాకిదిచ్చినప్పుడు ఎంచక్కా ముందుగది అద్దాల బీరువా అరల్లో దాచుకోవచ్చని సంబరం తో తెచ్చాను. భద్రం గా ! అతి అపురూపంగా ! ” తీసుకుపో ప్రతీచీ మీ దేశానికి ! నీ తర్వాత నీ పిల్లలకియ్యవే అమ్మాయీ ! ” అప్పటి మామయ్య నవ్వు ఈ రోజు నాకు పెద్ద ప్రశ్నార్థక

మై కూర్చుంది. ఆ మాటలు తలచుకున్నప్పుడల్లా ఊపిరాడనివ్వవు నాకు. 

నేను వెయ్యక పోయినా పచ్చని తులసి ఆకులూ ఆ నీళ్ళని పవిత్రం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటావు ? గంగ చెంబులూ… రాగిచెంబులూ..  తులసాకులు… ఏమిటివన్నీ ? భావాలిక్కడ రసిస్తున్నాయి. ఈ రోజు నువ్వు వచ్చావు నా జీవితం లోకి. 

అప్పటి వరకూ పుష్యమి… నాతో నా ఆలోచనలని తాను కూడా భజిస్తూ !

ఈ రమణ మేమిటి పుష్యమీ అంటే “ అవును అవునంటే అవును. కాదంటే కాదు. ఈ అనుభూతి అందరికీ ఉంటుంది. కొందరికి అప్పుడప్పుడు. మరికొందరికి ఎక్కువగా “ అనేది అరుదైన విషయం ఏమిటంటే అరుదైన అనుభవం అన్ని వేళల ఉండటం.

ఇందాకా ఏమైంది ఆలోచించు. ఆయన ఎవరు ? నిన్ను నీ అట్టడుగు లోపలి ప్రపంచానికి, నన్ను రాగి చెంబు అంచులకీ తీసుకు వెళ్ళిందే ఆ ఆలోచన ? ‘ ఒక్క క్షణంలో అంతా గతమైపోయిందే ! వర్తమానం లోకి ఓమాటు తన్నుకొచ్చి చటుక్కున విరిగి వెనక్కి పోయిన కెరటంలా”  ! 

ప్రతీచికి ఉద్రేకం పొంగుతోంది. లిజ్ వింటోందా లేదా అన్న ఆలోచన లేదు. లిజ్ మాత్రం శిలలా మంత్ర ముగ్ధ అయి వింటోంది. “ నిజం గా నాకేమనిపిస్తోందో చెప్పనా లిజ్ ? ఈ క్షణం లో నాకు పుష్యమి నువ్వు ఒకరై వింటున్నట్లుంది. ఈ రాగి చెంబులో కేవలం ఈ నీళ్ళే కాదు… గంగ నీళ్లున్నాయి. యౌవనోద్రేకంతో నలభై మైళ్ళ ప్రయాణం తర్వాత, అందక అల్లరి పెట్టె ఊపిరితో అవస్థ పడుతూ, తోట బాటసారులందరినీ దాటుకుంటూ, షేర్పాల వెనక దోవ చూస్తూ,  

వేదం చెప్పే రుద్ర స్వరూప సాక్షాత్కారానికి హిమాలయాల లోయల్లో అడవుల్లో పరుగులో,

మనసు శరీరం అఘమర్షణ స్నానంచేసిన మానస సరోవరంలో నీళ్ళున్నాయి.

కాళ్ళ జోడూ, వ్యాస పీఠం, చేతికర్రా, పత్తి కాయలూ ఆస్తిగా ఆలంబనగా సామాన్య మానవుని ఆర్తికి పట్టం కట్టాలనుకున్న గాంధీ మహాత్ముడు తన జీవిత కాలం లో చాలా భాగం గడపిన దక్షిణాఫ్రికా భూభాగపు కేప్ టౌన్ అంచుల్లో నీళ్ళున్నాయి….. 

భూమి ‘ గోళం ‘ అవునో కాదో తేల్చుకోవాలని శాసించిన నావికుల ప్రయాణ పతాకాల రెప రెపల్లో… మానవ జాతి వర్ణాలూ వర్గాలూ ఆవేశాలూ కరిగి నీరై పారిన పసిఫిక్, అట్లాంటిక్, హిందూ సముద్రాల నీళ్ళున్నాయి.

లిజ్ ! వింటున్నావా ! ఏ రంగుల ఏ రసాయనిక చర్యో ఆ నీళ్ళున్నాయి.

శాంతి ప్రవచనాల ఉత్సవాల ట్రినిడాడ్ చుట్టూ గోడ కట్టిన సముద్రంలో నీళ్ళున్నాయి.

భాషలూ, మతాలూ, దండ యాత్రలు చేసి యుద్ధంలో చనిపోయిన వీరుల ఎముకలు దాచిన కొండచరియలని ఒరుసుకు ఎగసి పడే  గ్రీసు చరిత్ర ఉదృతంలో దాక్కున్న సముద్రపు జలం ఉంది. సముద్రా లెన్ని కథలు చెప్తాయి ?

అప్పుడే లేవకు లిజ్ ! పాములు పాకని భూభాగంట ! పొడుగ్గా సాగి సాగి ‘ land ends ‘ అని ఆంగ్లంలో అంతరించిన న్యూజిల్యాండ్ జీవన మర్యాద ప్రవాహమైన నీళ్లు కూడా ఉన్నాయి నా రాగి చెంబులో !

మానవ మేథ పెరిగి రాచరికపు దర్పంతో, పురాతన వైభవంతో, కరుడు కట్టి ఘనీభవించి, ‘ జిబ్రాల్టర్ ‘ – ” Non Plus Ultra – No more Beyond ” గా స్థంభించి పోయిన సముద్రపు నీళ్ళున్నాయి. 

రాజస్సంతా కరిగి నీరై పోయిన మెడిటరేనియన్ సముద్రపు నీళ్ళున్నాయి. 

లిజ్ ! మహాదేవ శాస్త్రి మామయ్య ఏమనుకొని నాకిచ్చాడో ఈ రాగిచెంబు ! ప్రపంచం చుట్టింది నాతో పాటు. అన్ని సముద్రాల నీళ్లు పట్టింది. అద్దాల వారాల దీపాల వెలుగుల్లో వందల వందల రాగి చెంబుల్లా కనిపిస్తుంది ఇది ! 

ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా నుదుటి మీద వాన చినుకులు పడ్డట్టుంటుంది. 

ఉల్కలు కళ్ళ ముందు రాలి పడ్డట్టుంటుంది.

చటుక్కున గుండెలోకి దూసుకుపోతున్నట్లుంటుంది. 

ఇప్పుడు చెప్పు. నాలో భావ విస్తీర్ణత పెంచే రాగి చెంబుని ఏమనాలి ?

ఈ రోజు నా రాగి చెంబు ఇందాకా మనం చూసిన వ్యక్తి ప్రాణశక్తిని పట్టినట్లు గా అనిపించటం లేదూ ! “

నెమ్మదిగా లేచింది లిజ్. ప్రతీచి భుజం మీద చెయ్యి వేసింది.

‘ మై డియర్ ఫ్రెండ్ ! నీ దేశం దాటి వచ్చిన నీకు నీ మామయ్య ఇచ్చిన కానుక.

నీకు ఒక విధంగా ఊపిరి. ఆ నీళ్లలో మునిగి పోకు ! ఎగుడు దిగుళ్ళు మనసుకీ సముద్రాలకీ సమానం. ఫిలాసఫీ చదువుకున్నప్పుడు విన్నాం. గుర్తుందా ? తేలుతావో ఈదుతావో ! ఒడ్డు చేరే ప్రయత్నం మాత్రం తప్పదు. లోపలి లోతుల్లోంచి పైకి తేలటం ఒక ప్రయాణం. 

తేలి ఈదుకుని ఒడ్డు చేరటం రెండో ప్రయాణం “

ఈ సారి లిజ్ కంఠం వినిపించటం లేదు ప్రతీచికి.

” ఈ ప్రయాణం పేరు కాలం ప్రతీచీ ! ఇది ప్రాణ యాత్ర.ఈ గోదావరి ఒడ్డున పాలంగిలో మామిడి చెట్టు క్రింద తులసి కోట నానుకుని నున్నాను. నీ ప్రయాణాల్లో తోడుగా ! ” పుష్యమి మాటలు వినబడుతున్నాయి.

రెండు వైపుల నుంచీ లిజ్ – పుష్యమి ఇద్దరి మాటలూ స్పష్టంగా సన్నగా తియ్యగా లోపలికి పోతున్నాయి.

‘ కెరటాలు లేని సముద్రాలూ, తడి లేని నీళ్ళూ ఎలాంటివో తెలుసా ప్రతీచీ ? కవుల మాటల్లో కుందేటి కొమ్ములు ‘ లిజ్ ముందుకి నడుస్తోంది.

” మహాదేవ శాస్త్రి మామయ్య మనకిచ్చిన మరో బహుమానం ! నీతి చంద్రిక. 

సంసార వృక్షమునకు ఫలములు రెండు, సత్గ్రంథ పఠనము సజ్జన సాంగత్యమూ. మనిద్దరం కనీసం ‘ కూత  వేటు దూరం లో కూడా లేము. 

ప్రతీచీ ! ‘ కూత వెయ్యటం కూడా బోలెడు ఖర్చు నాకు ! మనం కలిసేది లేదు. నీకు నీ ప్రపంచం ! నాకు నా ప్రపంచం ! మన జీవితం మనో భవమే కానీ వర్తమానం కాదు.

మనసుకి దగ్గర ! మనకి దూరం ! మన ఆలోచనలే మన గ్రంథాలు. చదువుకుందాం. 

లే ! వెళ్ళు ప్రతీచీ ! ముందుకి వెళ్ళు. ” పుష్యమి లేదు వెళ్ళిపోయింది. 

తనలో సర్వం కరిగి నీరవుతోంది. తాను తడిసి ముద్దవుతోంది. పరుగు మొదలైంది. ఆలోచనల తుఫాను వెలిసిన ప్రశాంతత ! ఒక నిశ్శబ్దత ! ప్రాణం ఒళ్ళంతా పరచుకున్న స్థితి. 

లిజ్ పరుగు లంకించుకుంది. వెనక్కి చూసి తనని రెచ్చగొడుతూ !  

తాను రాగిచెంబుని గుండెలకి హత్తుకుని, సంచీలో పెట్టి పరుగు జోరు పెంచింది. 

రాగి చెంబులో పదిలంగా ప్రాణ యాత్ర మొదలైంది !! 

                                   ——————————————————

                       అంకితం :  రాగిచెంబు నిచ్చిన మహాదేవ శాస్త్రి మామయ్య కి ప్రేమతో పూర్ణ 

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾