12_009 ఆనందవిహారి

 

ఆధునిక కథ – పౌరాణిక దృష్టి … డా. వై. సుభాషిణి

 

ఆధునిక జీవితంలో ప్రాముఖ్యత ఉన్నవారి జీవితాలను పౌరాణిక దృష్టితో చూడడం అనే ప్రక్రియ తెలుగు కథలలో అనాదిగా వస్తోందని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సహాయ ఆచార్యులుగా సేవలందిస్తున్న  డా. వై. సుభాషిణి పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతిని పురస్కరించుకొని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో మార్చి 11 శనివారం సాయంత్రం ప్రసారమైన ” ‘నెట్ ‘ ఇంట్లో సమావేశం”లో భాగంగా ఆమె ప్రసంగించారు. ముందుగా … గాంధీజీ బోధించిన ఆశయాలను జీవితాంతం పాటించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాన్ని క్లుప్తంగా వివరించారు. అనంతరం “ఆధునిక కథ – పురాణ దృష్టి” అంశంపై మాట్లాడుతూ…. తెలుగు కథానిక గత వందేళ్ళ కాలంలో  తన పరిధిని బాగా విస్తృతపరచుకుందని అన్నారు. సృజనాత్మకత ప్రధాన అంశంగా సాగుతూ ఎప్పటికప్పుడు వర్తమాన, సామాజిక జీవితాలతోపాటు పౌరాణిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఆధునిక రచయతలు రాస్తున్న పౌరాణిక కథలు భక్తిని, భగవంతుడిని, మానవ జీవితాన్ని ముడి వేసి చూపుతాయని చెప్తూ వాటిలోని వివిధ రకాలను పేర్కొన్నారు. ధర్మాచరణ లుప్తమైపోతున్న  తరుణంలో మనిషికి ధర్మం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటివి బోధించే ప్రయత్నం అధునిక కథలు చేస్తున్నాయని వివరించారు. స్త్రీని కూడా పౌరాణిక దృక్పథంతో చూస్తున్నాయని అంటూ… పౌరాణిక కథలను ఆధునీకరించడం, పాఠాంతరాలను తయారు చేయడం అనేవి ఇటీవల విస్తృతంగా జరుగుతున్నాయని సుభాషిణి చెప్పారు. ఇలా పాత సాహిత్యాన్ని కొత్త పద్ధతిలో చెప్పడం అనే ప్రక్రియ ప్రాముఖ్యతను ప్రముఖ రచయిత ఆన్డ్రియన్ రిచ్ మాటలలో ఉటంకించారు. ఈ కోవకు చెందిన “విముక్తి”, “ఊర్మిళ రేఖ”, “మృణ్మయ నాదం”, “సైకత కుంభం”, “అశోకం”, “పులోమి”, “విభూతి”, “కృష్ణార్పణం”, “ఇదండీ దీపావళి”, “విలుకత్తె సీత”, “ప్రేమాయ”, “సమాగమం”, “జగత్కారువు”, “ఉఫ్ వెంట్రుక”, “కర్ణోపదేశం” వంటి కథల సారాంశాన్ని, వాటి ఉద్దేశాన్ని తెలిపారు. 

వోల్గా, కాత్యాయని విద్మహే, కాళోజీ, వరిగొండ కాంతారావు, కస్తూరి మురళీకృష్ణ, ముక్తేవి భారతి, కెవి నరేందర్, పిలకా గణపతి శాస్త్రి తదితర ప్రమఖులు రచించిన ఈ కథల ఆధారంగా… స్త్రీలు నాటి నుంచి నేటి వరకు అనునిత్యం ఏదో ఒక రకమైన వికాసంతో మార్పు చెందుతున్నారని సుభాషిణి వ్యాఖ్యానించారు. నాటి స్త్రీలు పాతివ్రత్య ధర్మాన్ని కలిగి నిత్యం అనుమానాలు, అవమానాల నీడన జీవించగా… నేటి స్త్రీలు వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం కోసం ఆరాటపడుతూ పలు విద్యలలో ప్రావీణ్యం పొందే ప్రయత్నం బాగా చేస్తున్నారని వివరించారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. 

కార్యక్రమం మొదట్లో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న దుగులూరు సురేఖ వీక్షకులకు స్వాగతం పలికి వక్తను పరిచయం చేశారు. 17 సంవత్సరాల బోధనానుభవం కలిగిన డా. సుభాషిణి ఎం.ఏలో బంగారు పతకం  పొందారని తెలియజేశారు. చదువుకొన్న విశ్వవిద్యాలయంలోనే శిక్షకురాలిగా రాణిస్తున్నారని కొనియాడారు.  

******************************* 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page