10_018 తో. లే. పి. – ఎన్నార్ చందూర్

.

మాలతి, యన్నార్ చందూర్ దంపతులు తెలుగు పాఠక లోకానికి చిరపరిచితులు. యన్నార్ చందూర్ గారు అంటే అది తెలిసిన పేరు — తెలియని పేరు చందూరు నాగేశ్వరరావు గారు. వీరి స్వస్థలం ఏలూరు పట్టణం. మాలతి గారు వీరి మేనకోడలు… సతీమణి. ప్రమాణాలు పాటించి రచనలు చేయడం లో ఇద్దరు సిద్ధహస్తులు. మాలతి గారు ఆంధ్రప్రభ వారపత్రికలో కొన్ని సంవత్సరాలు ‘ ప్రమదావనం ‘  అనే ఆకర్షణీయమైన శీర్షికను నిర్వహించి, పాఠకుల ప్రశ్నలకు ఆసక్తికరమయిన సమాధానాలను ఇస్తూ ఉండేవారు. అంతే కాకుండా, పేరెన్నికగన్న ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన నవలలను, తెలుగు పాఠకులకు పరిచయం చేసేవారు.. ప్రతీ పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటూ ఆయనను విజయపధం లో నడిపిస్తుందని మనవాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ మాలతి గారికి చందూర్ గారు అందించింది ఒక ప్రత్యేక తరహాకు చెందిన ఒక ఆలంబన. 

చందూర్ దంపతులు తమ వివాహం అనంతరం మదరాసు లో స్థిరపడ్డారు. చందూర్ గారు 1948 లో మదరాసు, ఆకాశవాణి కేంద్రం లో కొంతకాలం పనిచేశారు. అటు తరువాత  కొంతకాలానికి స్వతంత్ర పత్రికారచయిత గా మూల సూత్రాలకి కట్టుబడి పనిచేసారు. త్రైమాస పత్రిక ” కథానిధి “, “మాలి ” అనే మాస పత్రికను నడిపారు. ఇవే కొంత కాలానికి ” జగతి ” మాస పత్రిక గా కొత్త రూపు దాల్చాయి. 44 పేజీల ఈ మాస పత్రిక వెల కేవలం నాలుగురూపాయలు మాత్రమే… చాలా ఆకర్షణీయమైన అంశాలు ఇందులో చోటు చేసుకునేవి. నేను ఈ మాస పత్రికకి 2001 లో మూడు వందల రూపాయలను చెల్లించి చందాదాగారునిగా జీవిత సభ్యత్వాన్ని పొందాను. దానిని ధృవీకరిస్తూ చందూర్ గారు తన సంతకం చేసి ఒక పత్రాన్ని పంపారు. అదే ఈనాటి తోక లేని పిట్ట. 

ఇక వ్యక్తిగత విషయాల ప్రస్తావన కు వస్తే, చందూర్ గారు మితభాషి. పెదవులపై చిరునవ్వు ఆయనకు సహజ అలంకరణము. విశ్వసాహిత్యానిపై ఆయనకు అంతులేని అవగాహన, పట్టు ఉన్నాయి. 

జగతి మాస పత్రికలో ప్రత్యేక ఆకర్షణ ఆయన స్వయం గా నిర్వహించే ” జగతి డైరీ ” శీర్షిక. ఇందులో ఆయన ప్రస్తావించిన అనేక అంశాలు పాఠకుల విశేష అభిమానాన్ని చూరగొన్నాయి అనడం లో ఏమాత్రం సందేహం లేదు. విశేషమేమంటే, 1960 నుండి 2010 వరకు… అంటే దాదాపు 50 సంవత్సరాల పాటు ప్రచురింపబడిన ఈ వ్యాసాలన్నీ ఒక పుస్తకరూపం దాల్చడం ! 1376 పేజీల ఈ ఉద్గ్రంధం ‘ జగతి డైరీ 1960-2010 ” పేరిట క్వాలిటీ పబ్లిషర్స్, విజయవాడ వారి సౌజన్యంతో 2013 లో వెలుగు చూసింది. హార్డ్ బౌండ్ ఎడిషన్ వెల 750 రూపాయలు. 

చందూర్ గారిని నేను ప్రత్యక్షం గా కలిసిన సందర్భం లేదు. కాగా మాలతి చందూర్ గారిని మాత్రం ఒక పర్యాయం కలవడం జరిగింది. అదీ చెన్నై లో. ‘ పెళ్లి పుస్తకం ’ చిత్రం విడుదల అయిన రోజులవి. చెన్నై లో బాపు గారింట మేము విడిది చేసిన సందర్భం అది, బాపు గారు వారి అబ్బాయి వెంకట రమణ ని మా దంపతులకు తోడుగ ఇచ్చి ఆళ్వార్ పేట లో ఆ చిత్రం ప్రదర్శించబడే ప్రివ్యూ థియేటర్ కి పంపించారు. అదుగో— ఆ థియేటర్ లోనే మాలతి చందూర్ గారిని అనుకోకుండా కలిసి మర్యాదపూర్వకం గా పలకరించడం జరిగింది. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు మాలతి గారు మాతో… మరువరాని, మరువలేని అందమైన అనుభూతి అది. 

.

.

<><><>*** నమస్తే @@@ ధన్యవాదములు ***<><><>