10_013 రాయల యుగం – స్వర్ణ యుగం

.

               ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఏనాటికీ మరువలేని మధుర యుగం రాయల యుగమని చెప్పడానికి తెలుగువారందరూ గర్వించాలి. ఈ యుగంలో రాజుల నుండి ప్రజల వరకూ ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఎంతో విలాసవంతమైన రసిక జీవనాన్ని గడిపారు. ఈ యుగంలో ఎన్నో ప్రత్యేకతలు, మునుపెన్నడూ లేని విలక్షణమైన విశేషాలు ఉన్నాయి. ప్రబంధ యుగం లేక రాయల యుగంగా పిలవబడే ఈ యుగం స్వర్ణయుగంగా భాసిల్లింది.

.

క్రీ.శ. 1336లో నెలకొన్న విజయనగర సామ్రాజ్యం 1565లో అంతరించింది. సుమారు 230 ఏళ్ళ కాలమూ మహా వైభవంతో విరాజిల్లిందని చెప్పడంలో ఇసుమంత కూడా అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని ఆ కాలంలో రాయబారులుగా, యాత్రీకులుగా మన దేశానికి వచ్చిన విదేశీయు లైన “నికోలోకొంటి” అనే ఇటలీ దేశస్థుడు, “అబ్దుల్ రజాక్” అనే పారసీక దేశపు రాయబారి, “బార్బోసా”, “పయెస్” అనే పోర్చగీసు యాత్రీకులు, “లుడో వికోడే వార్దేమా” అనే ఇటలీ దేశపు యోధుడు మొదలైనవారు విజయనగర సామ్రాజ్య విభవాన్ని, అందునా రాయల యుగ వైశిష్ట్యాన్ని వేనోళ్ళ కొనియాడుతూ గ్రంథాలు రాశారు. వీరి రాతలను బట్టి రాయల కాలంలోని రాజ్య విస్తీర్ణం, నగర వైశాల్యం, రాజభోగం, ప్రజల జీవన విధానం, నాటి సుసంపన్నమైన సాంఘిక జీవన వైభవం మొదలైన అన్ని విషయాలూ ఖండాంతరాలకు కూడా వ్యాపించాయని చెప్పవచ్చు.

.

“తెలుగు అదేలయన్న దేశంబు తెలుగేను
దెలుగు వల్లభుండ దెలుగొకండ
యెల్ల నృపులు గొలువ నెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స” 

.

అని తెలుగు భాష గొప్పదనాన్ని, తియ్యదనాన్ని సాక్షాత్తు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు నోట పొగిడించిన శ్రీకృష్ణదేవరాయల తెలుగు భాషాభిమానం సువ్యక్తమవుతోంది. రాయల యుగం అన్ని రకాలుగా అంటే రాజ్యపరంగా, సామాజిక పరంగా, సంగీత సాహిత్యాది లలితకళల పోషణ పరంగా, ప్రజాపాలనా పరంగా ఎల్లెడలా అత్యంత వైభవాన్ని సంతరించుకొని స్వర్ణయుగంగా వెలసింది.

.

శ్రీకృష్ణదేవరాయలు రాజు కావడంతోటే రాజ్య విస్తీర్ణం విజయవంతంగా గావించాడు. ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాయచూరు, శివ సముద్రం, శ్రీరంగపట్టణం, కళింగం, కటకం మొదలైన దేశాలపై దండెత్తి సునాయాసంగా వశం చేసుకున్నాడు. దాదాపు దక్షిణ భారతం మొత్తాన్ని తన కైవసం చేసుకొని సువిశాలమైన మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

.

మహా సామ్రాజ్య నిర్మాణం కాగానే వివిధ దేవాలయాలను ఉద్ధరించిన మహోదరుడు శ్రీకృష్ణదేవరాయలు. అమరావతి, కంచి, శ్రీకాళహస్తి, గోకర్ణం, రాజమహేంద్రవరం, శ్రీశైలం, శ్రీకాకుళం, శ్రీకూర్మం, తంజావూరు, మధుర, కుంభకోణం, రామేశ్వరం, శ్రీరంగం, శ్రీజగన్నాథం, సింహాచలం, బెజవాడ మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రాలని దర్శించాడు. ఆయా దేవస్థానాలకు అనేక వసతులు కల్పించాడు లెక్కకు మిక్కిలిగా దానాలు చేశాడు. విలువైన ఆభరణాలను సమర్పించాడు. తన అమేయమైన భక్తి ప్రపత్తులను చాటుకొన్నాడు రాయలు. ప్రధానంగా రాయలు వైష్ణవ మతావలంబకుడు. ఆతని ఇలవేల్పు శ్రీవేంకటేశ్వరుడు. రాయలు ఎన్నోమార్లు ఏడుకొండలెక్కి శ్రీనివాసుని దర్శించాడు. నవరత్న ఖచిత కిరీటాది ఆభరణాలనెన్నింటినో స్వామికి సమర్పించాడు. ఉదయగిరి దుర్గం నుండి బాలకృష్ణుని విగ్రహాన్ని తెచ్చి విజయనగరంలో స్థాపించాడు. హంపీలోని విరూపాక్ష దేవునికి చేసిన దానాలు మరెన్నో ఉన్నాయి. తిరుమల శ్రీవేంకటేశుని గర్భాలయం పైన ఉన్న విమానానికి బంగారు తాపడం చేయించాడు. కృష్ణరాయలు భగవంతునికే తన దానాలు పరిమితం చేయలేదు. భాగవతుల సేవ కూడా మెండుగా చేశాడు. వేనవేల అగ్రహారాల్ని భాగవతులకు ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పించాడు. అనంతమైన దానధర్మాలు, పుణ్యకార్యాలను చేసి తరించాడు.

.

రాయల యుగంలో ఉన్న రసిక జీవనాన్ని కొంత తెలుసుకుందాం. అప్పటి ఇళ్ళు ఋతువులకు అనుకూలంగా ఉండేటట్లు నిర్మింపబడ్డాయి. ముంగిట్లో ఇరువైపుల అరుగులు, బొమ్మలతో తీర్చిదిద్దిన స్తంభాలుండేవి. ఆ కాలంలోనే ఇంటికొక పూలతోట ఉండేది. చెంగలువల కొలను, దాని పక్కనే కృత్రిమంగా తయారు చేసిన కొండ ఉండేవి. అందులోనే గుహలు, మీదికి మెట్లు, నీటిని పైకి వెదజల్లే ధారా జలయంత్రాలు ఉండేవట. ఇక అంతఃపురాలలో చిత్రశాల, నాట్యశాల, మజ్జన గృహం, భోజనశాల, చంద్రశాల, పానశాల, జలయంత్రధామాలు, కోపగృహాలూ మొదలైనవి ఉండేవి. అవన్నీ వేటికవే వాటి వాటి ప్రత్యేకతలతో ఎంతో అందంగా నిర్మింపబడ్డాయని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ తన “రాయలనాటి రసికత”లో కళ్ళకు కట్టినట్లు వ్రాశారు. సామంతులు, మంత్రులు, దండనాథులతో మంతనాలు సలపడానికి భవనాలు వేరుగా ఉండేవట. ఆ కాలంలో రాజులు, ధనాఢ్యులు అష్టభోగాలననుభవిస్తూ ఎంతో సుఖ జీవనాన్ని గడిపారని నాటి విదేశీ యాత్రికుల రాతల వల్ల తెలుస్తోంది. స్త్రీ పురుషులిరువురు పాము పొర లాంటి వస్త్రాలను ధరించేవారట. ఆభరణాలను ఇద్దరూ అలంకరించుకొనేవారు. మగవారు కాలికి కడియాన్ని ధరించడం గౌరవ చిహ్నంగా భావించేవారట. సుగంధ ద్రవ్యాలు విరివిగా వాడేవారు. గంధ పుష్పాలతో ఇళ్ళన్నీ ఎప్పుడూ సువాసనలతో నిండి ఉండేవి. వేసవిలో పాన్పులపై గంపలకొద్దీ పువ్వులను పరచుకొని నిద్రించేవారట. ఆయా ఋతువులకు తగ్గ ఆహారపానీయాలను తీసుకొనేవారు. పాన్పుల మీద చిగురాకులను కూడా పరచుకొనేవారట. అప్పటి స్త్రీ భోగ్య వస్తువుగా పరిగణింపబడేది. ఆ కాలంలో బహుపత్నీవ్రతం ఎక్కువగా కనిపించేది. రాయలకు 12 మంది భార్యలు, అంతఃపురంలో 12000 మంది స్త్రీలున్నారని పయెస్ తెలిపాడు. ఎంతమంది భార్యలుంటే అంతటి భోగమని అప్పటి రాజులు భావించేవారు. వారికి భోగతృష్ణే కాదు, శౌర్యం, ఔదార్యం, పాండిత్యం, వైరాగ్యం కూడా ఉండేవి. ఇలాగ అఖండ ఐశ్వర్యంతో, భోగాలతో నాటి ప్రజల జీవనం ఎంతో గొప్పగా సాగిందని చెప్పవచ్చు.

.

ఇక రాయల యుగంలో పరిపాలనా విధానాన్ని కొంత పరికిద్దాం. రాజు అవడంతోనే రాయలు అఖండమైన మహాసామ్రాజ్యాన్ని దక్షిణాపథంలో స్థాపించాడు. రాయలు తన పాలనలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, మత విషయాలలో ఎంతో జాగ్రత్త వహించేవాడు. కడు మెలకువతో వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యం కాకున్నా ప్రజల సుఖజీవనం కోసం చాలా గొప్పగా, నేర్పుతో రాజ్యపాలన చేశాడని చెప్పవచ్చు. పంచాయితీ సభలు, గ్రామ పరిపాలన, శిస్తుల వసూళ్ళు, నేరాల విచారణ, కట్టుబాట్లు, కుల వివాద పరిష్కారాలు మొదలైన ప్రతి విషయం మీద ఎంతో శ్రద్ధ చూపిస్తూ పాలించాడు. తలారులు ప్రజలకు, దేశానికి రక్షణగా రాత్రుళ్ళు గస్తీ తిరుగుతూ ఉండేవారు. ప్రజలకు శత్రు రాజుల, చోరుల భయం కలుగకుండా శాంతి భద్రతలతో చక్కగా పరిపాలన చేశాడు. వ్యవసాయాభివృద్ధితో రాజ్యాన్ని సస్యశ్యామలం చేసి, పరిశ్రమలు నెలకొల్పి, విదేశీ వ్యాపారాలతో దేశాన్ని అభివృద్ధి చేశాడు. శ్రీకృష్ణదేవరాయలు తాను వైష్ణవ మతానుయాయి అయినా పరమత సహనంతో అన్ని మతాలవారినీ సమానంగా ఆదరించిన మహామహుడు. శివాలయాలను కూడా నిర్మించి ఎన్నో దానధర్మాలు చేశాడు. రాయల పాలనలో రాజ్యమంతటా అన్ని మతాల వారూ యథేచ్ఛగా ప్రశాంత జీవనం గడిపారని బార్బోసా అనే విదేశీయుడు పేర్కొన్నాడు. పాడిపంటలతో ఎంతో సుభిక్షంగా రాయలు రాజ్యపాలన చేసిన తీరుని విదేశీ యాత్రికులు ఎంతగానో ప్రశంసించారు. రత్నాలు రాశులుగా పోసి అమ్మడం ప్రపంచంలో ఎక్కడా లేదని కూడా వీరి రాతల వల్ల తెలుస్తోంది. 16వ శతాబ్ది కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగమనే చెప్పాలి.

.

“సంగీతమపి సాహిత్యం – సరస్వత్యాస్తన ద్వయమ్
ఏకమాపాత మధురమ్ – అన్యదాలోచనామృతమ్”

.

ఆపాత మధురమైన సంగీతాన్ని, ఆలోచనామృతమైన సాహిత్యాన్ని కూడా శ్రీకృష్ణదేవరాయలు అమోఘంగా పోషించాడు. రాయల యుగంలో కవిత్వాది ఇతర లలిత కళాభివృద్ధి ఆకాశాన్ని అంటిందని నొక్కి చెప్పవచ్చు. తన పాలనలో ఏ రాజూ అప్పటివరకూ చేయని ఎన్నో విశేషమైన సేవలు, కవితా పోషణ చేసిన విద్వాంసుడు రాయలు. “భువన విజయా”న్ని నెలకొల్పి తీరిక సమయాల్లో  కవితాగోష్ఠులు ఎన్నో ఏర్పాటు చేశాడు. ఆ భువనవిజయంలో అష్టదిగ్గజ కవులను పోషించాడు. ఇతడు కన్నడిగుడైనా తెలుగును ఎంతగానో అభిమానించి ఎందరో కవులను పోషించి వారిచేత ఎన్నో రకాల ప్రబంధాలను, కావ్యాలను రచింపజేశాడు. భువనవిజయంలో ఎన్నో సమస్యలు ఇచ్చి కవులచేత పూరింపజేశాడు. ఆ కవితా గోష్ఠులను తనివితీరా ఆస్వాదించాడు. అవి చదివి నేటికీ మనం కూడా ఆస్వాదిస్తున్నాం. నన్నెచోడుడు, గోన బుద్ధారెడ్డిలు రాయలకన్నా ముందుగా తెలుగులో వెలసిన రాజకవులు. కానీ రాయలు రాజకవి మాత్రమే కాదు. ” నభూతో న భవిష్యతి ” గా కవి పండితుల పోషణ కూడా గావించాడు.

.

రాయల యుగం ప్రబంధాలకు పుట్టినిల్లు అనే చెప్పాలి. ఆయన కాలంలో ప్రబంధాలు లెక్కకు మిక్కిలిగా వెలిశాయి కాబట్టి ఆ యుగాన్ని ప్రబంధ యుగమని అన్నారు. ప్రసిద్ధ వస్తువుని గాని కల్పిత ఇతివృత్తాన్ని గాని లేక రెండింటిని మేళవించి గాని ప్రబంధ కవులు రచనలు చేశారు. మనుచరిత్ర, పారిజాతాపహరణం, వసుచరిత్ర లాంటి ప్రబంధాలు, రాఘవ పాండవీయం లాంటి ద్వ్యర్థి కావ్యాలు, కళాపూర్ణోదయం లాంటి కల్పనా కథలు, అలంకార గ్రంథాలు ఎన్నో పుంఖానుపుంఖాలుగా వెలశాయి. ఈ యుగంలో ఉన్నంతమంది మహాకవులు మరే ఇతర యుగంలోనూ లేరు. ఈ కవుల మధ్య పోటీ తత్త్వం కూడా ఎంతో ఉండేది.

.

ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలు సైతం గొప్ప కవిగా వాసికెక్కాడు. రాయలు గొప్ప విద్వాంసుడు, రసజ్ఞుడు. తెలుగు భాష మీది అభిమానంతో తెలుగులో “ఆముక్తమాల్యద” అనే ప్రబంధాన్ని స్వయంగా అమేయమైన ప్రతిభతో సంతరించాడు. ప్రకృతిని రాయలు పరిశీలించినంత సూక్ష్మంగా మరే ఇతర తెలుగు కవీ పరిశీలించలేదంటే అతిశయోక్తి కాదు. సంస్కృత సాహిత్యంలో భోజుడికెంత ఉన్నతమైన స్థానం ఉందో తెలుగు వాఙ్మయంలో కృష్ణరాయలకి అంతే ఉత్కృష్టమైన స్థానం ఉండడం వల్ల ఈతడు ఆంధ్రభోజుడనిపించుకున్నాడు. స్వతహాగా వైష్ణవ మతావలంబకుడైన రాయలు విష్ణుభక్తి వైభవాన్ని “ఆముక్తమాల్యద”లో ఆద్యంతం కనబరిచాడు. ఇతడు స్వయంగా కవి మాత్రమే కాదు వివిధ కవి పండిత పోషకుడు కూడా. రాయలెంతటి కవితా రసజ్ఞుడో తెలుసుకోవాలంటే ఆతని మరణానంతరం పెద్దన తన పట్ల రాయలకుండిన ఆదరాభిమానాలని ఈ చాటు పద్యంలో చాటుకున్నాడు.

.

“ఎదురైనచోఁ దన మద కరీంద్రము డిగ్గి, కేలూత యిచ్చి యెక్కించుకొనియె
మను చరిత్రంబందుకొనువేళ బురమేగఁ, బల్లకిఁ దన కేలబట్టి యెత్తి
బిరుదైన ఘనగండపెండేరమునకీవె, తగుదని తానె పాదమున దొడిగె
కోకట గ్రామాద్యనేకాగ్రహారంబు, లడిగిన సీమలయందు నిచ్చె
నాంధ్ర కవితా పితామహ యల్లసాని పెద్దన కవీంద్ర యని నన్ను బిలచునట్టి
కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబు కరణి…..”

.

అని అనిపించుకున్న ఈ రాజకవికి సాటి ఇంకెవరు? అల్లసాని వాని అల్లిక జిగిబిగికి ఉబ్బితబ్బిబ్బయిపోయి గౌరవాదరాలతో పెద్దనకి స్వయంగా గండపెండేరం తొడగడం, పల్లకీ మోయడం రసికరాజైన రాయలకే చెల్లింది.

.

ఇక ఈ ఆంధ్రభోజుని పాండితీ ప్రకర్ష అనన్యసామాన్యం. శ్రుతి స్మృతి పురణాలు, జ్యోతిశ్శాస్త్రం, పూర్వోత్తర మీమాంసాదులు, సాంఖ్య యోగ తంత్రాలలో కూడా రాయలకి అభినివేశం ఉండడాన్ని పరికిస్తే ఆతని ప్రతిభాపాటవాలు వేనోళ్ళ కొనయాడినా తక్కువే అనిపిస్తుంది. ఆముక్తమాల్యదలో ఆద్యంతం రాయల పాండితీ ప్రతిభ మనకు దర్శనమిస్తుంది. లలితకళలలో కవిత్వంతో పాటు ఉన్న సంగీత, సాహిత్య, నాట్య, చిత్రలేఖన, విగ్రహశిల్ప కళలని సైతం ఆదరించి పోషించాడు రాయలు. ఈతని శిల్పకళా పోషణకు నిదర్శనంగా ఎన్నో దేవాలయాలు, గోపుర మండపాలు దక్షిణపథంలో, ప్రధానంగా హంపిలో నేటికీ మనకు కనిపిస్తున్నాయి. ఇంతటి ఆదరణ, పోషణ మరే భారతదేశ రాజచరిత్రలోనూ లేదు.

.

రాయలు కవి మాత్రుడే కాక స్వయంగా గొప్ప వైణికుడు. గుర్రపు స్వారీలో నిపుణుడే కాక అశ్వ హృదయం తెలిసినవాడు. చతురంగ చతురుడు. పోర్చుగీసు వర్తకులు తమ దేశపు సంగీత వాయిద్యాలను రాయలకి బహూకరించారు. ఈ యుగంలో వెలువడిన అనేక ప్రబంధాలకు కృతిభర్త. ఇంతటి వైభవోపేతమైన జీవితాన్ని తాను గడపడమే కాకుండా తన ప్రజలకు కూడా గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. రాజ్యపాలనాపరంగా కూడా ఎంతో వైభవంగా విలసిల్లిన శ్రీకృష్ణదేవరాయల యుగం నిజంగా స్వర్ణయుగమే.

.

**********************