11_014 చేతికొచ్చిన పుస్తకం 02

చేతికొచ్చిన పుస్తకం-6 :

అవుట్ స్పోకెన్, బ్రిలియంట్ పోస్టులతో ఫేస్బుక్ లో ఆరేళ్ళ క్రితం పరిచయమైన బెడదకోటె సుజాత తర్వాతి కాలంలో వేల్పూరి సుజాత గా మారి పోయారు. మార్పు, పేరు లోనే కానీ.. వాదనలో కాదు!

రాయలసీమకు, పల్నాడుకు ఎమోషనల్ డిస్టెన్స్ పెద్దగా లేదని సుజాత మరోసారి బోధపరిచింది. ఎలిమెంటరీ స్కూల్లో నాకు ఐదేళ్లు పాఠం చెప్పిన గ్రేస్ మేరీ గారి ప్రాంతానికి చెందిన నరసరావుపేట సుజాత సొంత ఊరు కావడం అభిమానం పెరగడానికి మరో కారణమై కూడా కావచ్చు. పదేళ్ళ క్రితం తాను ఆకాశవాణి లో కలిశారు కానీ పరిచయాన్ని స్నేహంగా మార్చిందీ, దాన్ని నిరంతరాయం చేసింది ఫేస్బుక్ మాత్రమే!

సుజాత వేల్పూరి తొలి పుస్తకం నిన్ననే కొనగలిగాను. 17 కథల (రెండు వందల పుటల లోపు) సంకలనాన్ని ‘అనల్ప’ ఇటీవల ప్రచురించిడం ముదావహం. కథలు ఎలా ఉంటాయో మొదటే సూచించాను, ముఖచిత్రం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

పుస్తకం వెలువరించడంలో అనల్ప సంస్థ తీసుకున్న శ్రద్ధ బాగా కనబడుతోంది!

Sujatha Velpuri , congratulations!

 

చేతికొచ్చిన పుస్తకం- 7:

    గోవాలో పనిచేసే కాలంలో ఆఫిసు పనిమీద ఢిల్లీ వెడితే అమృతా షెర్గిల్ మార్గ్ లో గోవా భవన్ లో నివాసముండే వీలుండేది.‌ ఆ‌సక్తి కలిగి వెతికితే అమృతా షెర్గిల్, 28 సంవత్సరాలకే కన్నుమూసిన గొప్ప చిత్రకారిణి అని తెలిసింది!

     ఇప్పుడు హైదరాబాద్లో మేమున్నామంటున్న అపార్ట్మెంట్ వెనుక స్వామి రామానంద తీర్థ సమాధి ఉంది. డిసెంబర్ 27న బుక్ ఫేర్ లో కొనుక్కున్న 9 పుస్తకాలలో ఒకటి జి. వెంకట రామారావు రచించిన ‘స్వామి రామానంద తీర్థ’ మోనోగ్రాఫ్. 2017 ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా వెలువడిన తెలంగాణ మహనీయులు సీరీస్ లోని వంద పేజీల విలువైన పుస్తకమిది.

       మంచి విషయ పుష్టి, బిగువైన శైలి, లోతైన అవగాహన కలయికతో కూడిన ఈ గ్రంథం ఎవరైనా దాచుకోదగ్గది. ఆసిఫ్ జాహి వంశం, బ్రిటీష్ వారి ప్రవేశం, ఏడవ నిజాం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, సాయుధ పోరాటం, భూదానోద్యమం వంటి విషయాలు కూడా ఇందులో పొందుపరిచారు.

       అవును, పుష్కరం క్రితం ఆకాశవాణి లో పాత్రికేయ వృద్ధులు జి వెంకట రామారావు గారిని కలవడం గుర్తుకొస్తోంది.

              

చేతికొచ్చిన పుస్తకం-8:

        ఫిజిక్స్ ను ఫిజిక్స్ గా అర్థం చేసుకోవడానికి…

           ఎస్వీయూ లో 1985 లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేరాక తొలి నాలుగు నెలల్లో ఏమీ బోధపడలేదు- ఏ గడ్డు చేలల్లో ఈ గుడ్డెద్దు తిరుగుతోందో?

          ఓ రోజు అనుకోకుండా, మరెవరూ టీచరు లేరని  ప్రొఫెసర్ ఎల్ రామమూర్తి న్యూటోనియన్ మెకానిక్స్, క్వాంటం మెకానిక్స్ మధ్య తేడా ఏమిటో సూక్ష్మంగా అరగంటలో చెప్పారు. ఆ రోజు నా కన్ఫ్యూజన్ పజిల్ పూర్తిగా చిత్తగించి ఫిజిక్స్ పట్ల నా లవ్ రెట్టింపు అయ్యింది!

         బి ఎస్సీ నుంచి సంప్రదింపు పాఠ్య గ్రంథంగా ఉన్న ఈ పుస్తకం అప్పటి నుంచి నా అభిమాన గ్రంధంగా మారిపోయింది!  

        ఆకాశవాణి ఉద్యోగంలో చేరిన ఎనిమిదేళ్ళ కు 1996:లో ఈ కాపి కొన్నాను. అప్పుడప్పుడు సంప్రదించే గ్రంథాలలో ఇది ముఖ్యమైంది.

     రిచ్ మేయర్, కెన్నార్డ్, కూపర్ గార్లకు,🙏🙏🙏!

      

చేతికొచ్చిన పుస్తకం-9 :

 స్నేహధర్మం– పిల్లల కథల సంపుటి

     హన్మంత్రావ్ అనే పేరుతో ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో కథలు కొన్ని చదివాను. అది 1985 కి పూర్వపు విషయం. 2004 లో విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో ఆయనే నా సహొద్యోగి కావడం నాకు ఆశ్చర్యకరమైన సంగతి కాగా, ఆయనకు ఆనందం కలిగించిన విషయం.

        ఆకాశవాణిలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పని చేసే హనుమంతరావు చాలా సహృదయుడు, ఎంతో త్వరగా మిత్రుడైపోయారు. సాహిత్యపు సంగతులు చెప్పడానికి, వినడానికి కుతూహలపడే ఈ మిత్రుడు కొన్ని సంవత్సరాల క్రితం రిటైరై, వైజాగ్ లో సెటిలయ్యారు. ఆర్కే బీచ్ లో కొన్ని ఉదయంపూట నడకలు మధుర స్మృతులుగా మిగిలాయి!

      ఆధునిక సమాజంలో ఇమిడి పోతున్న ప్రస్తుత కాలపు పిల్లల కోసం ఎస్ హనుమంతరావు రాసిన కథల సంపుటి ‘స్నేహధర్మం’ ఇటీవల విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా వెలువడింది. సన్మిత్రుడికి శుభాకాంక్షలు!

      అందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు !

 

చేతికొచ్చిన పుస్తకం-10:

స్వతంత్రత నుండి … స్వాతంత్ర్యానికి

   

      కొన్ని  పుస్తకాలకు ఎందుకు ప్రచారం వస్తుందో తెలియనట్టే, మరికొన్ని ఏ కారణాల చేత మరుగున పడతాయో బోధపడదు!

      తెలుగు స్త్రీల సాహిత్యం క్రీ శ 1900-1947 అనే ఉపమకుటంతో 2021 జూలైలో వెలువడిన 488 పేజీల ‘స్వతంత్రత నుండి … స్వాతంత్ర్యానికి’ గ్రంథం గట్టి పరిశోధన ఆధారంగా డా జంధ్యాల కనకదుర్గ (గుంటూరు) చేసిన మేలి రచన.

       హెడ్లైన్స్ కవితా వస్తువుగా, హడావిడిగా రాసే వ్యాసాలే పరిశోధన సాగుతున్న తెలుగు సారస్వతం లో నిఖార్సయిన రీసెర్చ్ అంటే కాలం చెల్లిందా?

      వందేమాతరం, హోమ్ రూల్, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల నేపథ్యంగా తెలుగు మహిళల స్వతంత్రత ఎలా పరిణమించిందో సాహిత్య దర్పణంగా, పత్రకల ఊతంగా డాక్టర్ జంధ్యాల కనకదుర్గ శ్రమకోర్చి విశ్లేషించారు.

       కనీసం ఇలాంటి విలక్షణ ఉద్గ్రంధం గురించి పెద్దగా ఏ మగానుభావుడు లేదా మహానుభావురాలు పూర్తిగా, బిగ్గరగా నాలుగు మాటలు చెప్పింది లేదు!

Please visit this page

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీ ఆత్మీయులకు ‘ శుభకృత్ ‘ ఉగాది శుభాకాంక్షల ప్రకటనలకై మార్చి 25 లోపు సంప్రదించండి… editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com