12_005 తో. లే. పి. – లలితా సింధూరి

   

నాట్యమయూరి  డాక్టర్ చి. సౌ.  లలితాసింధూరి

 

                                                                                                                                                                          చతుష్షష్టి కళలలో  కళకు ఆ కళకే ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వీటిలో నాట్యం ఒకటి. ఇందులో నృత్య రీతులను అనుసరించి మళ్ళీ అనేకానేక విభాగాలు ఉన్నాయి. ఉదాహరణకు భరతనాట్యం, కూచిపూడి నాట్యం, కథక్, ఒడిసి, కధాకళి, భంగ్రా ఇలా.. ఇలాఅన్నమాట – అయితే వీటిలో ప్రమాణాల విషయానికి వస్తే ఎక్కువ, తక్కువలంటూ పోలికలేమీ ఉండవు. శాస్త్రీయనృత్యం విభిన్న రీతులలో ఉండడం తో శిక్షణను పొందగోరే కళాభిమానులు వారి వారి అభిరుచులను బట్టి ఆ నృత్య శిక్షణా రీతులను ఎంచుకుంటారు. విశేషమేమంటే, ఆయా రంగాలలో శిక్షణ పొందగోరే వారికి ప్రాంతము, రాష్ట్రము, దేశము, భాష లతో ఏమాత్రం సంబంధం లేకపోవడం. వారికీ ఉండవలసిన అర్హత ఏమంటే నృత్యాభినయం లో శిక్షణ పొందడానికి తగిన ఆసక్తి, పట్టుదల, నేర్పు ఉండడం. మరొక విషయమేమంటే ఈ విద్యలో రాణించడానికి వారిలో చాలామందికి వంశపారంపర్యంగా వస్తూ ఉన్న ఆచారము లేదా సాంప్రదాయం. 

 

ఇక ప్రస్తుత విషయానికి వస్తే, లలితా సింధూరి నాట్యశైలి లో కూచిపూడి నాట్యమే కాకుండా జానపదం, లలిత సంగీతానికి, ఆ గీతాలకి కూడా అభినయం చేయడం లో ఎంతో కౌశలాన్ని ప్రదర్శిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో పేరు ప్రఖ్యాతులను గడించింది. అందులో మకుటాయమైన ప్రశంస ఆ అమ్మాయికి ఎలాగ లభించిందీ అంటే అమరగాయకుడు శ్రీ ఘంటసాల వారి వివిధ రీతుల గీతాలకుసముచితరీతిలో నృత్యాభినయం చేయడం ద్వారా ఉదాహరణకు — 2010 సంవత్సరం లో ఘంటసాల గారి శ్రీమతి సావిత్రమ్మ గారు వ్రాసినఘంటసాల జ్ఞాపకాలు “ అన్న పేరుతో ఒక చక్కటి పుస్తకం ప్రచురింపబడింది. అందులో సావిత్రమ్మ గారు లలితా సింధూరి ఘంటసాల వారి లలిత గీతాలకు నృత్య శైలి కి తగ్గట్టు, శాస్త్రీయ రీతిలో బాణీ కట్టి నృత్య ప్రదర్శనలను ఇవ్వడాన్ని మనసారా ప్రశంసిస్తూ తమ అమూల్యమైన ఆశీస్సులను ఆ చిరంజీవికి అందజేసారు. సావిత్రమ్మ గారి మాటలలోనే చెప్పాలంటే.. ” మామయ్య ( ఘంటసాల ) పాడిన లలితగీతాలకు లలితా సింధూరి నృత్యము చేస్తుంటే నా మనస్సు ఆ పాత రోజులలో మామయ్య ప్రతి పాటకు, పద్యానికి చేసిన బాణీలు గుర్తుకు వచ్చి ఎంతో మధురానుభూతి ని పొందాను. ఆ అమ్మాయి నృత్యము నన్ను అంత ప్రభావితం చేసింది. లలితా సింధూరి కూడా ఒక నూతన ప్రక్రియ కు నాంది పలికింది అని చెప్పాలిసిందే. అంతటి పుత్రికా రత్నాన్ని కన్నందుకు వారి తల్లిదండ్రులు వరలక్ష్మి, ప్రసాదు గార్లకి నా అభివందనాలు…. “ ఇవి ఆ అమ్మాయి కి లభించిన అమూల్యమైన ఆశీస్సులు అని నిస్సందేహంగా చెప్పవచ్చును.

 

ఈ పుస్తకం విజయనగరం లో జరిగిన ఘంటసాల వారి వేడుకల సందర్భం గా ఆవిష్కరింపబడింది. సావిత్రమ్మ గారితో మా కుటుంబానికి ఎంతో కాలం గా ఉన్న అనుబంధం ఆధారంగా ఆ పుస్తకం కాపీ ని నాకు తమ ఆశీస్సులతో సావిత్రమ్మ గారు సభలకు హాజరైన నా ఆత్మీయ మిత్రుడు, గాయకుడు, ప్లిమత్ ( ఇంగ్లాండ్ ) నగర వాస్తవ్యుడు అయిన డాక్టర్ శ్రీ నాగభైరు అప్పారావు గారి ద్వారా, అప్పట్లో ఇంగ్లాండ్ లో ఉన్న నాకు పంపించారు. ఆ పుస్తకాన్ని నేను వెంటనే ఆమూలాగ్రం చదివి ఎంతో సంతోషించాను. అందులో లలితమ్మ గురించిన సావిత్రమ్మ గారి ప్రస్తావన నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ తరువాత కొంత కాలానికి, నేను ఇండియా కి తిరిగి వెళ్ళాకా రాజమహేంద్రవరం వెళ్లడం, ఆ సందర్భం లో లలితా సింధూరి తల్లిదండ్రులను మర్యాదపూర్వకం గా ఫోను లో పలకరించడం, ఆ పైన వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని ధవళేశ్వరం లో వారి ఇంటికి వెళ్లడం జరిగాయి. అదే తొలిసారిగా మేము అందరమూ కలవడం. ఆప్పుడు మేము అంతా కలిసి తీయించుకున్న ఆనాటి గ్రూపు ఫోటోనే వ్యాసానికి జోడిస్తున్నాను. లలితా సింధూరి కి ఒక సోదరుడు. ఈ ఇద్దరి తల్లిదండ్రులు వరలక్ష్మి గారు, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు అప్పట్లో రాజమహేంద్రవరం లో ఆంధ్రా బ్యాంకు లో పనిచేసేవారు. అమ్మగారివి గృహిణి బాధ్యతలు. తల్లిదండ్రులు తమ బాధ్యతలతో బాటుగా తమ కుమార్తె కు తోడుగా ఆమెను అనుసరించి వివిధ ప్రదేశాలలో జరిగే నృత్య ప్రదర్శనలకు వెడుతూ, ఆ అమ్మాయి కి తమ సంపూర్ణ సహకార, ప్రోత్సాహాలను అందిస్తూ తనకి చేదోడు, వాదోడు గా ఉండేవారు. ఘంటసాల వారి అభిమానులుగా ఎన్నో నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలను హైదరాబాద్ లో ఎంతో కాలం గా నిర్వహిస్తూన్న ప్రముఖులు శ్రీ కె. వి. రావు గారు, శ్రీ వెలిచేటి సీతారామయ్య గారు కూడా లలితా సింధూరి కి తమ ప్రోత్సాహాన్ని ఆనాటికీ, ఈనాటికీ కూడా అందజేస్తూనే ఉన్నారు.

 

ఇక చిరంజీవి లలితమ్మ బయోడేటా లాంటి వివరాలు దిగువున క్లుప్తం గా కొన్ని : 

చిరంజీవి కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ వెంపటి వెంకట నారాయణ గారి మునిమనుమరాలు –

నాట్యంలో గురువులు : శ్రీ వేదాంతం సత్య నరసింహ శాస్త్రి గారు 

నాట్య ప్రదర్శనలు : 1000 కి పైగా — ఈ రంగం లో 20 సంవత్సరాలకు పైగా అనుభవం  

భిలై, న్యూ ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, నాగపూర్, నాసిక్, తిరువనంతపురం, త్రిశూర్, మంగుళూరు, హైదరాబాద్, మచిలీపట్టణం, కర్నూల్, గుంటూరు, కూచిపూడి, కాకినాడ వగైరా. 

అమెరికా లో :  Palo Alto, New York, Chicago, Rochester, Pittsburgh, New Jersey 

తల్లిదండ్రులు : శ్రీమతి వరలక్ష్మి, శ్రీ వై.వి.జి.కె. ప్రసాద్ గారు

వీరి సంతానం : అబ్బాయి, అమ్మాయి . . 

జననం : అమలాపురం — 1991 లో. 

చదువు సంధ్యలు ::

Degree in Engineering–in Computer Science 2008-12.

Master of Performing Arts 2012-14, MFA

Ph.D. in Classical Dance from University of Hyderabad 

Thesis Subject : Cross Cultural training and its impact on the Pedagogy and practice of Kuchipudi Dance.

Guide: Srimathi Aruna Bikshu.

Full bright Scholarship holder and studied at New York / USA. 

ఉద్యోగం: Assistant Professor / Fine Arts – (Classical Dance) — GITAMS University, Hyderabad 

వివాహం : 31-10-2020 

వరుడు : చిరంజీవి సూరజ్ వల్లూరి 

పురస్కారాలు ( Awards ) : 

బాల రత్న – State Award 2004 

బాలశ్రీ – National Award 2005

నాట్య శారద, నృత్య విలాసిని, నాట్య మయూరి… 2009

నృత్య భారతి – 2010

నృత్య కౌముది – 2010 

ప్రముఖ నృత్య కళాకారిణి : శ్రీమతి శోభా నాయుడు గారి ప్రశంసలు 

కర్నూలు, మచిలీపట్టణం, కాకినాడ, కూచిపూడి లలో జరిగిన లలితా సింధూరి నృత్య ప్రదర్శనలకు నేను హాజరై వాటిని ప్రత్యక్షం గా ఎంతో ఆసక్తి తో చూడడం, అటు తరువాత ఆ చిరంజీవిని అభినందించి, ఆశీర్వదించడం నాకు లభించిన మహద్భాగ్యం గా భావిస్తున్నాను. ప్రత్యేకించి గిరిజా కళ్యాణం యక్షగానం, కరుణ శ్రీ గారి గేయాలకు ఆ అమ్మాయి అద్భుతం గా నృత్యం చేసిన తీరు, ఆ అభినయం ఎంతగానో అభినందనీయాలు. 

ఒక కార్యక్రమం లో ఆ అమ్మాయి నృత్య ప్రదర్శన కు ముందు కార్యకర్తలు ఆ అమ్మాయి ని ఆహ్వానించి తన చేత ఒక కొబ్బరి కాయని కొట్టించారు. నేనూ వేదికపైన చూస్తూ ఉన్నాను. కొబ్బరికాయ బాగా ముదిరి పోయి ఉండడం తో ఆ అమ్మాయి ఎంత గట్టిగా కొట్టినా అది పగలడం లేదు. చివరికి ఆమె  తన బలాన్ని ఉపయోగించి గట్టిగా కొట్టడం తో కాయ అయితే  పగిలింది.. కానీ… విరిగిన ఆ డిప్ప అమ్మాయి చేతిలో గుచ్చుకుని అర చేతికి గాయమయి రక్తం కారడం…  విపరీతమైన బాధ.. ఆ వెంటనే తన డాన్స్ ప్రోగ్రాము.. అయ్యో..పాపం.. అనిపించింది. అయితేకార్యకర్తల నుండి తగినంత స్పందన రాకపోవడం విచారకరం !

 

దాదాపుగా అలాంటిదే తన మరొక అనుభవం నాకు చెప్పింది. ..  డాన్స్ వేదిక.. wooden ఫ్లోర్.. దాని పైన దళసరిగా బట్ట ఏదో కప్పారు. దానిపైన ఆ అమ్మాయి తిరుగుతూ నృత్యం చేయాలి అన్నమాట. ఇబ్బంది ఏమంటే.. అది wooden ఫ్లోర్ అవడంతో జాయింట్స్ ని కలుపుతూ వేసిన మేకులు అక్కడక్కడ పైకి లేచి ఉండేవి. అవి పైన పరచి కప్పిన cloth నుంచి పైకి పొడుచుకుని వచ్చేవి — పైకి కనబడేవి కావు. నృత్యం చేసే సమయం లో అటూ – ఇటూ కదిలి చేస్తూ ఉన్నప్పుడు కనబడని ఆ మేకులు పాదాలలో గుచ్చుకుననేవట. ఇక నిజానికి ఆ బాధ అలాంటిది – ఇలాంటిది కాదు !! అయినా సరే.. దానిని లెక్క చేయక అలాగే నృత్యం చేయాలంటే ఎంత కష్టం మరి ?!

అది మనసుకు కదిలించే ఒక బరువైన జ్ఞాపకం– కదండీ

సరే — దాని సంగతి వదిలేద్దాము. 

ఒక ముఖ్యమైన విషయం —

చిరంజీవి ఉన్నత శ్రేణి కి చెందిన నృత్య కళాకారిణి గా పేరు తెచ్చుకోవడం నాకు నచ్చిన ఒక అంశం అయితే ఆ చిన్నారి లో మరొక ప్రత్యేకత ఏమంటే పెద్దల పట్ల ఆ అమ్మాయి చూపే గౌరవం, అభిమానం, ఆప్యాయత !

హైదరాబాద్ లో రాంనగర్ గుండు లో నేను మా బావ ఇంట్లో ఉండగా తనని ఒకసారి మా ఇంటికి రావలసినదిగా కోరాము. అయితే తాను తలములకల పని లో ఉన్నా, మాకు అడ్డు చెప్పకుండా ఆటో మాట్లాడుకుని వారి పిన్ని గారింట నుండి మా ఇంటికి రావడం చాలా విశేషం. అంతే కాదు…  అంతకు మించి, ఆనందం గా మాతో కాసేపు గడపడం. ఆ సందర్భం లోనే ఆ అమ్మాయి తో జరిపిన ఆసక్తికరమైన ఇష్ఠాగోష్టి కి సంబంధించిన ఆడియో ను వచ్చే మన కదంబం ‘ సంచికలో మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి విని చిరంజీవి లలిత సింధూరి ని మనసారా ఆశీర్వదించవలసినదిగా మిమ్మల్ని కోరుతున్నాను.  

 

మా మనవరాలు లలితా సింధూరి గురించి వ్రాయాలంటే ఇంకా ఎంతో ఉంది.. కానీ ఇక్కడితో ఈ కధనాన్ని ముగించక తప్పడం లేదు. క్షమించండి ! ఏది ఏమైనా తాతగారు అన్న పిలుపులో ఎంత మాధుర్యం ?! అది అనుభవైకవేద్యం. శుభమస్తు !

 

 <><><>***  ధన్యవాదాలునమస్కారములు ***<><><>

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾