.
సంగీతము, గానము ఇవి ఉచ్వాస, నిశ్వాసాలు. ఈ కళలు కేవలం మానవజాతి కి మాత్రమే పరిమితం కాలేదు. పశుపక్ష్యాదులు, ఆఖరికి ప్రాణం లేని శిలలు కూడా వీటిచేత ప్రభావితం అవుతున్నాయి అంటే అది అతిశయోక్తి కాదు. మన పెద్దలు ” శిశుర్వేత్తి పశుర్వేత్తి…” అంటూ వీటి ప్రాధాన్యతను నొక్కి వక్కాణించారు. నిజానికి మానవ జీవితం లో వీటి ప్రాముఖ్యతను మనం అంచనా వేయడం అసాధ్యం. అనాదిగా ఈ కళలను నమ్ముకుని వాటిపైన ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తూ వాటి మధురిమలను సమాజంలో పదిమందికీ పంచుతూ తమ జీవితాన్ని పునీతం చేసుకుంటున్న వారు శ్రీ త్యాగరాజ స్వామి వారు అన్నట్లు ” ఎందరో మహానుభావులు… అందరికీ వందనములు “.
.
ఇక విషయానికి వస్తే, సంగీతము – గానము ఈ రెంటిలో ఆరితేరిన కళా కౌశలాన్ని తన సొంతం చేసుకున్న మహనీయులలో ఒకరు మన ఘంటసాల మాస్టారు. ఈ సత్యం మనమందరము ఎరిగినదే. వారి బాల్యం నుండి పేదరికం తనను బాధిస్తున్నా దానిని ఏమాత్రం లక్ష్యపెట్టక, మొక్కవోని విశ్వాసము, పట్టుదల, సంగీతం పట్ల అకుంఠితమైన ఆరాధన తో గురుముఖం గా ఈ విద్యను అభ్యసించి, తన ప్రత్యేకతను నిలుపుకున్నారు ఘంటసాల వారు. సరే.. తన సంగీత విద్యాకౌశలం తన పిల్లలకు కూడా కొంత సంక్రమించడం దైవ సంకల్పం. ఘంటసాల మాస్టారు, సావిత్రమ్మ దంపతుల పుత్ర సంతానం విజయకుమార్, రత్నకుమార్. ఈ దంపతుల కుమార్తెలు శ్యామల, సుగుణ, శాంతి.
.
విజయకుమార్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, చెన్నై నుండి సంగీతం లో డిప్లొమా ను సంపాదించాడు. కీ బోర్డు వాయించడం, అడపాదడపా పాడడం ఈతని వ్యాసంగాలు. ఇతనికి ఇద్దరు పుత్ర సంతానం. వెంకటేశ్వరరావు, దిలీప్. విజయకుమార్ సహృదయుడు. వినయశీలి. తండ్రి గారు పాట కచ్చేరీలను చేసిన అనేక సందర్భాలలో సహకారవాద్యం గా కీ బోర్డు ని వాయించేవాడు. దురదృష్టం ఏమంటే చిన్న వయసులోనే విజయకుమార్ దంపతులు కాలం చేయడం.
.
ఇక రత్నకుమార్… తనకు ఫిలిం టెక్నాలజీ లో డిప్లొమా ఉంది. గాత్ర మాధుర్యం ఉన్నా, తన ఆసక్తి ఉన్న రంగం లో అడుగు పెట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గొప్ప పేరును సంపాదించుకున్నాడు. తెలుగు, తదితర దక్షిణాది భాషలలో నిర్మితమైన అనేక చలన చిత్రాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల చేత ఈ రంగం లో ఎన్నో పురస్కారాలను, ప్రశంసలను అందుకున్నాడు. వినయము, సౌశీల్యము ఈయనకు భూషణములు. ఈయన కు ఇద్దరు కుమార్తెలు వాణి – వీణ.. ఇద్దరు చదువులలో రాణించడమే కాకుండా వంశపారంపర్యం గా వస్తూన్న సంగీత రంగం లో కూడా గుర్తింపు ను తెచ్చుకున్నారు. వీరిలో వాణి వీణ వాయిస్తుందని, వీణ పాడుతుందని మేము ఇద్దరం కలుసుకున్న ఒకానొక సందర్భం లో రత్నకుమార్ వవ్వుతూ నాతో చెప్పడం జరిగింది.
.
రత్నకుమార్ ని నేను తొలిసారిగా కలిసింది ఎన్నో ఏళ్ళ క్రితం. మిత్రుడు శ్రీ గొల్లపూడి మారుతీ రావు కుమారుడు దర్శకుడు శ్రేనివాస్ చిత్రం అవుట్ డోర్ షూటింగ్ చిత్రీకరణ లో ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోవడం సంభవించింది. అతని ఉత్తర క్రియల సందర్భం గా వారి ఇంటికి వెడుతూన్న మేము కాకతాళీయంగా కలుసుకున్నాము. తదనంతరం వివిధ ప్రదేశాలలో జరిగిన సంగీత కార్యక్రమాలలో ఇద్దరం కలుసుకునే వాళ్ళం. ఒక సందర్భం లో వారి తండ్రి గారి మంచితనాన్ని ప్రస్తావిస్తూ వేదిక పైన రత్నకుమార్ పాడిన పాట ” ఓ నాన్నా.. నీ మనసే వెన్నా.. ” ( ధర్మదాత చిత్రం లోని పాట ) ఈనాటికీ నా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. రత్నకుమార్ గాత్ర మాధుర్యం ప్రశంసనీయం.
.
చెన్నై వెళ్లిన అనేక సందర్భాలలో నేను ఘంటసాల మాస్టారి సతీమణి సావిత్రమ్మ గారిని కలుసుకోవడం, ఇద్దరం కాసేపు కబుర్లు చెప్పుకున్నాకా, వీడ్కోలు చెప్పే ముందు అమ్మ ఆశీస్సులను పొందడం నాకు పరిపాటి. అప్పట్లో అమ్మకి సాయంగా నరసింగ ఉండేవాడు. తాను వయసులో నాకంటే పెద్ద.. మా కబుర్లలో సరదాగా తానూ శృతి కలుపుతూ ఉండేవాడు. ఆ మధ్య నరసింగ కూడా కాలం చేయడం మరొక దురదృష్టకర సంఘటన.. నరసింగ మరణం అమ్మని కొంత మానసికం గా కృంగదీసిందని చెప్పవచ్చును.
.
ఇలా ఉండగా, ఈ మధ్యనే… రత్నకుమార్ కూడా కొంత అనారోగ్యానికి లోనై, చికిత్స పొందుతూ దేహత్యాగం చేసాడు… చాలా చాలా బాధాకరం !! ఈ దుర్ఘటనను తలుచుకుంటూ ఉంటేనే అప్రయత్నం గా నా కనులు వర్షిస్తున్నాయి… రత్నకుమార్ ఆత్మ కు శాంతి కలగాలని, అతనికి నివాళులను అర్పిస్తూ, శోక నిమగ్నులై ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు ఈ దుర్భర పరిస్థితికి తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ…. వారందరికి నా ప్రగాఢ సానుభూతిని అందజేస్తున్నాను.
.
<><><> నమస్కారములు~ ధన్యవాదాలు <><><>
.
👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾
******************************************************