.
ఏమిటీ…..ఇవ్వాళ లంచ్ కి ఏం చేస్తున్నావు అంటారా?
ఏదో ఒకటి చేస్తాలేండి…బ్రేక్ ఫాస్ట్ చేసి గంటన్నా కాలేదు, అప్పుడే లంచ్ ఏంటీ అంటూ ప్రశ్నలు.
మీరు రిటైర్ అయిన తర్వాత నాకు పనీ…మీకు హడావిడి ఎక్కువైంది. అస్తమానం కాలుగాలిన పిల్లిలా పైకీ కిందకీ తిరగడం….. లేదంటే నా చుట్టూ తిరగడం.
సాయంకాలం వంటేమిటీ…..పప్పుపులుసు లోకి కారం అప్పడాలా…మెడ్రాస్ అప్పడాలా? రేపు దోశెల్లోకి అల్లం పచ్చడి గట్టిగా చేస్తున్నావా లేక జారుడు పచ్చడా?… అంటూ ఎంక్వయిరీలు మొదలు పెడతారు.
పోనీ పాపం కదా అని, అడిగినవన్నీ చేసిపెడుతుంటే అంతలోనే “నువ్విలా వండి పెడుతుంటే నా ఆరోగ్యం ఏం కాను? రేపటినుంచీ ఇవన్నీ ఆపేసి లంచ్ కి సాలెడ్లు..రాత్రికి చపాతీలు చెయ్యి” అంటూ అక్కడికేదో నా తప్పిదమైనట్టు ఇంకో కొత్త పురమాయింపులు ఇవ్వడం.
ఇన్నేళ్ళు ఉద్యోగం…ఉద్యోగం….అంటూ ఇల్లు వాకిలీ పట్టకుండా ఏం చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవారు. ఉన్నట్టుండి ఇప్పుడు తగుదునమ్మా అంటూ అన్నింట్లో వేళ్ళు పెడుతున్నారు! ఇన్నేళ్లొచ్చినా ఎప్పుడు ఏ పని చెయ్యాలో తెలీదు. మొన్నటికి మొన్న ఓ పక్క వియ్యాల వారు వచ్చే టైం అయిందని నేను గాబరా పడిపోతుంటే, మీరు గుట్టుచప్పుడు కాకుండా అటకెక్కి కూర్చున్నారు. అమ్మాయి అత్తగారు “ వెరీ ఈజ్ యువర్ హస్బండ్ ” అంటే తెల్లమొహం వేసి చిన్న పిల్లాడిని వెతుక్కున్నట్టు మీకోసం ఇల్లంతా వెతకాల్సి వచ్చింది. ఏమన్నా అంటే “నువ్వేగా ఆరునూరైనా ఆదివారం లోపల యాటిక్ సర్దాలి” అన్నావు అంటూ నెపం నా మీదకు నెడతారు.
ఇన్నాళ్ళు ఏ సాయం అడిగినా “అదుగో ఇదుగో “ అంటూ ఏళ్లకు ఏళ్ళు గడిపేవాళ్ళు. ఇప్పుడు “లేడికి లేచిందే వేళ” అన్నట్టు మీ మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడమే. ఓ సమయం సందర్భం ఏమి లేదు. పోనీ ఏ ఒక్క పనన్నా సరిగ్గా చేస్తారా…పూర్తి చేస్తారా అంటే అదీలేదు. అన్నీ సగంలో ఒదిలెయ్యడం, ప్రతి దానికీ ఏదో ఒక కారణం చెప్పటం.
“ ఇంట్లో సరైన టూల్ లేదు. వెధవ! ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఇచ్చి చావలేదు …..రాంగ్ సైజూ…..ఇప్పుడు ఈ మాడల్ లో రావడం లేదుట…..దిస్ ఈజ్ నాట్ ది రైట్ వెదర్”……అంటూ సవాలక్ష సాకులు చెప్తారు.
“కొత్తవి పెడతా” అంటూ కిచెన్ కాబినెట్స్ నాబులన్నీ ఊడపీకి మూడు నెలలైంది. కొత్తవి పెట్టటం మాట ఎలా ఉన్నా, ఉన్నవాటిని చెత్త బుట్ట దాఖలు చేసిపారేసారు. రోజు కాబినెట్ తలుపులు తీసుకోవాలంటే చచ్చే చావుగా ఉంది.
పైన బెడ్రూములో వాకిన్ క్లాజెట్ ని “వరేవా! అనేటట్టు చేసేస్తా చూసుకో!” అంటూ అందులో ఉన్న సామానంతా తెచ్చి గెస్టు రూములో పడేసి ఇప్పటికి పది రోజులైంది. ఇంతవరకు ఎక్కడా ఉలుకు పలుకు లేదు. ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు అంటే “ ఎలా రీ డిజైన్ “ చెయ్యాలా అని ఆలోచిస్తున్నా అంటారు. ఏం చెయ్యాలో తెలీకుండానే ముందస్తుగా అక్కడివన్నీ ఎందుకు కదిల్చారుటా? అయినా పొద్దస్తమానం ల్యాబ్ లో వేలాడుతూ పేషంట్ల మీద ఎక్సపర్‌మెంట్లు చేసే మీకు, కాబినెట్స్ గురించి.. క్లాజెట్ల గురించీ ఏం తెలుసునని కమిట్ అయ్యారు ?
వింటర్ లో ఒక్కరోజు టెంపరేచర్స్ పైకెళ్ళాయని ఉన్నపాటున ఓ పొట్టిలాగు తగిలించుకుని “గరాజ్ అంతా గజిబిజిగా ఉంది.. సర్దిపారేస్తా” అంటూ సామానంతా తీసికెళ్ళి లంబాడివాళ్ళు పరిచినట్టు డ్రైవే మీద పరిచి పెట్టారు. మన పక్కింటి జో “ఆర్ యు హావింగ్ గరాజ్ సేల్ ? “ అంటూ జోకేసాడు! మీరు ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళు నా ప్రాణం హాయిగా ఉందని మీరు ఉద్యోగం మానేశాక తెలిసింది. మీ ప్రాజెక్టులు.. రిపేర్లు కాదు కాని ఇల్లంతా నానా కంగారుగా ఉంది. ఎక్కడ అడుగు పెట్టాలన్నా భయంగా ఉంది. ఎప్పటిలా నేను చూసుకుందాం అంటే “మే హునా” అంటూ వెంటనే రంగప్రవేశం చేస్తారు.
పోనీ కాస్త బయట పనులు చెప్దామంటే అదో తంటా! రెండు వస్తువులు పట్టుకు రమ్మంటే పది వస్తువులు పట్టుకొస్తారు. ఏమన్నా అంటే “సేల్ లో ఉన్నప్పుడే కొనుక్కోవాలి. రిటైర్ అయిన తర్వాత వెయిట్ తోపాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.” అంటూ జోకులేస్తారు! ఇన్నేళ్ళైనా ఇంట్లో ఏ రకం పాలు వాడతామో తెలీదు. వొంటికి వాడుకునే బాడీ వాష్ కీ, తలకు వాడుకునే షాంపు కీ తేడా తెలీదు. ఏ క్యుపాన్ ఎక్కడివ్వాలో తెలీదు. ఏది కలుపు మొక్కో, ఏది మంచి మొక్కో తెలీదు. తీరి కూర్చుని… ప్రతి సంవత్సరము వాటంతట అవే వచ్చేమొక్కలన్నీ చెప్పా పెట్టకుండా పీకి పడేసారు.
బయటికి వెళ్తు౦టే చాలు “నేనూ వస్తా” అంటూ నాకూడా బయల్దేరుతారు. పోనీ వచ్చిన వాళ్ళు మౌనంగా ఉండి నా పని నన్ను చేసుకోనిస్తారా అంటే అదీ లేదు. మిమ్మల్ని మన షాపులకు తీసుకెల్డం అంటే పిల్లలతో టాయిస్ స్టోర్ కెళ్ళినట్టే!
“దోసకాయలు తీసుకో. దోసావకాయ తిని చాలా రోజులైంది…..పెద్ద వంకాయ తీసుకుంటున్నా.. నిప్పులమీద కాల్చి వంకాయ పెరుగు పచ్చడి చెయ్యి” అంటూ అక్కడికక్కడే మెన్యూలు..రెసిపీలు ఫిక్స్ చేసెయ్యడం. ఇదిగో భవానీ ! “బెండకాయలు తీసుకోకు.. వాటికి నా ఈడుంది” అంటూ స్టోరులో నలుగురూ వినేటట్టు వార్నింగులు ఇవ్వడం.
“అవన్నీ చూడ్డానికే తప్ప తినడానికి బావుండవండీ” అన్నా వినిపించుకోకుండా “నా చిన్నతనంలో…..” అంటూ చెరుగ్గడలు…సపోటాలు…సీతాఫలాలు…. ఏవి కనిపిస్తే అవి తీసుకోవడం ఇంటికొచ్చాక ఛీఛీ! తూథూ! అంటూ గార్బేజ్ పాలు చెయ్యడం. ఆ వస్తువులు కొనుక్కునే సంబరంలో మన బండి ఎక్కడో పెట్టి మర్చిపోతారు. లేదంటే మన వస్తువులు తీసికెళ్ళి ఇంకోళ్ళ బండిలో పడేస్తారు.
మీరు ఏమి చెయ్యక్కరలేదు, నేను చేసుకోగలను..అలవాటైన పనులే కదా అంటే “ ఊరికినే ఉన్నాను కదా ఇప్పుడన్నా నీకు సాయం చెయ్యనీ” అంటారు.
మీ మనసు నా కర్ధమైందిలేండి………..
వెనక మా చిన్నప్పుడు ఓసారి అన్నయ్యను, నన్ను ఇంట్లో వొదిలి, చెల్లెల్ని తమ్ముడ్ని తీసుకుని మా అమ్మా నాన్న పెళ్ళికి వెళ్లారు. జాగ్రత్తగా ఉండమని….బుద్ధిగా ఉండమని చెప్పి వెళ్ళేముందు నాన్న, అన్నయ్యకు కొద్దిగా చిల్లర డబ్బులు ఇచ్చి వెళ్లారు. అమ్మా- నాన్న ముందు అలాగే అని తల ఊపి వాళ్ళు అటు
బస్సెక్కగానే మేము విజ్రుంభించాం! మొదటి సారిగా ఇంట్లో ఎవరూ పెద్దవాళ్ళు లేకుండా ఉన్నామేమో.. మా సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి! ఇద్దరం ఇల్లంతా ఇష్టం వచ్చినట్టు పరిగెత్తాం. ఆ తర్వాత వంటింటి గూట్లో ఉన్న పంచదార డబ్బా ముందు పెట్టుకుని పండగ చేసుకున్నాం!
మర్నాడు పొద్దున్నే అమ్మ పై అలమరలో సత్తు డబ్బాలో దాచి ఉంచిన పచ్చి వేరుశెనగ పప్పులన్నీ పరగడుపున మెక్కాం. మధ్యాహ్నం మస్తాను సాయిబు సైకిలు చప్పుడు విని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరం ఐస్ ప్రూట్ కొనుక్కున్నాం. చీకటి పడుతూ౦డగా, సెంటర్లో రోజూ సాయంకాలం బసవరాజు బడ్డీ కొట్టు ముందు, పొయ్యి పెట్టి సాంబయ్య వేసే ఉల్లిపాయ పకోడీలు…చల్ల పునుగులు పట్టుకొచ్చాడు మా అన్నయ్య . “నీకు ఎక్కువ వచ్చాయంటే నీకు ఎక్కువ వచ్చాయని” దెబ్బలాడుకుంటూ ఇద్దరం రెండు పొట్లాలు ఖాళీ చేసాం! మర్నాడు అమ్మా వాళ్ళు తిరిగి వచ్చేసరికి అన్నయ్య, నేనూ పొట్టలు పట్టుకుని వేలాడి పోతూ మంచానికి అతుక్కుపోయి ఉన్నాం. మళ్ళీ మాములుగా లేచి తిరగటానికి మాకు నాలుగు రోజులు పట్టింది.
మా ముప్పైఆరు గంటల స్వాతంత్రాన్ని ఆబగా వాడేసుకోవాలని చిన్నతనంలో మేము ఆత్రత పడినట్టే ఇన్నాళ్ళు ఇంటి విషయాలు ఏమి పట్టించుకోని మీరు, ఇప్పుడు ఒక్కసారిగా అన్నీ చెయ్యాలని, నాకు శ్రమ తగ్గించాలనీ తెగ ఆరాట పడిపోతున్నారు.
నలబై అయిదేళ్ళ కిందట అమెరికాలో జీవితం మొదలుపెట్టినప్పుడు నాకంతా అయోమయంగా, భయంగా ఉండేది. అన్నింటికీ మీ వంక చూసేదాన్ని. డాక్టర్ పట్టా ఉన్న మీరు “అమెరికాలో ఎవ్వరూ ఇంకోళ్ళ మీద ఆధారపడరనీ….ఇక్కడ అందరికీ అన్ని పనులు వచ్చి ఉండాలి” అంటూ నా అశక్తతను, అసమర్థతని ఎత్తి పొడిచారు. ఇంగ్లీషులో గబగబా నాలుగు వాక్యాలు కూడా మాట్లాడలేని నేను, కారుని మొగవాళ్ళు మాత్రమే నడుపుతారని అనుకునే నేను, మీ పుణ్యమా అని చాలానే నేర్చుకున్నాను!
మీరు తెల్లవారుజామునే హాస్పిటల్ కు వెళ్ళినా.. ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వచ్చినా, ఇన్నేళ్ళుగా ఇంట్లో జరగవలసిన పనులు జరుగుతూనే వచ్చాయి. ఇంటి విషయమైనా… పిల్లల విషయమైనా.. ఇంకో విషయమైనా ఎప్పుడో తప్ప మీ దాకా రానీకుండా ఇన్నాళ్ళు అన్నీ నేనే చూసుకుంటున్నాను. మీ కోసం…పిల్లల కోసం…మన ఇంటికోసం…నేను చేస్తున్న పనులు. పడుతున్న శ్రమ, తీసుకునే నిర్ణయాలు మీకు “ఓస్ ఇంతేనా” అని తేలిగ్గా అనిపించవచ్చు. కానీ… మీ వృత్తిలో మీ విజయాల వెనక మీ శ్రమ ఉన్నట్టే, ఈ ఇంట్లో సుఖసంతోషాల వెనక నా కృషి.. నా కష్టం కూడా ఎంతో ఉంది. ఉద్యోగం మానేసి ఖాళీగా ఉండటంతో మీకు అన్నీ తెలుసునని, అలవోకగా ఇంటిని నడపగలననీ అనుకుంటున్నారు. మీరు నిజంగా నాకు సాయం చెయ్యాలనుకుంటే ఓ పని చెయ్యండి!
మీ లాంటి డాక్టర్ల దగ్గరకు కుర్ర డాక్టర్లు వచ్చినప్పుడు “మేము వేసే ప్రతి అడుగుని జాగ్రత్తగా గమనించి శ్రద్ధగా నేర్చుకుని వృద్ధి లోకి రండి” అని వాళ్లకు బోధిస్తారుగా?! అలాగే మీరు కూడా కొన్నాళ్ళపాటు భక్తిగా నా వెనకాలే ఉంటూ, ఇంట్లో ప్రతి పని నేను ఎలా చేస్తానో, ఎందుకు చేస్తానో, నాకెలా కావాలో గమనించి బుద్ధిగా నేర్చుకోండి. అప్పుడు ఈ ఇంటి బాధ్యత అంతా మీ చేతుల్లో పెట్టేసి నేను హాయిగా రిటైర్ అయిపోతా! సరేనా?!
ఏమిటీ…. సుఖంగా ఉన్నఈ ప్రాణాన్ని అనవసరంగా రొష్టు పెట్టటం ఎందుకు, ఈసారికి ఇలాగే కంటిన్యూ అయిపోదాం అంటారా ?!!!
( తొలి ప్రచురణ మధురవాణి సంచిక 2016)
రిటైర్డ్ హస్బెండ్ –నేపథ్యం
ఓసారి అందరం కలుసుకున్నప్పుడు, మావారు ఇంకొద్ది నెలల్లో రిటైర్ అవబోతున్నారని తెలిసి, ఒకావిడ “రామకృష్ణ గారు రిటైర్ అవుతున్నారట మరి.. మీరు రెడీ అవుతున్నారా?” అని అడిగారు. నాకు వెంటనే అర్ధం కాలేదు. ఆయన రిటైర్ అవుతుంటే, నేను రెడీ అవటం ఏమిటీ అని! ఆ తర్వాత ఆవిడ ఎందుకు అలా అన్నారో తెలిసింది! ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు, ఇంటిగొడవ పట్టించుకోని మగవాళ్ళతో ఇల్లాలికి ఒక అనుభవం అయితే, ఉద్యోగం మానేసి రిటైర్ అయిన భర్త ఇంట్లో ఉంటున్నప్పుడు, ఇల్లాలికి అది ఇంకోరకమైన అనుభవం! మా ఫ్రెండ్ ఉన్నట్టుండి “నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను” అన్నారు. అదేమిటీ.. అంటే “ఏం లేదు, మావారు రిటైర్ అవుతున్నారు. ఇద్దరం ఇంట్లో కూర్చుంటే ఏం దెబ్బలాటలు వస్తాయో అని ఎందుకైనా మంచిదని”.. అంటూ నవ్వారు! ఒకాయన రిటైర్ అయి “ఎప్పుడూ నీతో టైము గడపలేదని సాధిస్తూ ఉంటావుగా” అంటూ.. రోజంతా ఆవిడ కూడా తిరుగుతూ ఉంటే ఆవిడకు ఏం చెయ్యాలో తోచలేదుట! అందరి అనుభవాలు కలబోస్తే, ముచ్చట ఇలా తయారైంది!!
.
************************************