10_013 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – ఉరుకులు … పరుగులు

.

ఇదిగో… మీతో ముఖ్య విషయం ఒకటి మాట్లాడాలి, కాసేపు అవన్నీ ఆపుతారా ?

ఏమిటీ! నా మాట వినటానికి మీ పనులేవి ఆపనక్కరలేదా? విషయం ఏమిటో  చెప్పమంటారా?

మీ ప్రతిభకు జోహార్లండి! సోఫాలో కూర్చుని లంచ్ తింటూ, కంప్యూటర్ లో సినిమా పాటలు వింటూ, ఆన్ లైన్ లో బిల్లులు పే చేస్తూ, ఎదురుగుండా టీవీ లో వస్తున్న గేమ్  చూస్తూ……ఇక నేను చెప్పేది వింటారా ?

ఏమిటీ..నా మాట వినడానికి ఇవేవి అడ్డం రావంటారా ?

మీకు అడ్డు రాకపోయినా నాకు అడ్డు వస్తాయి. నాకు తెలీక అడుగుతా, ఒకేసారి ఇన్ని పనులు చెయ్యటం అంత అవసరమా? ఏమిటో  ప్రపంచమంతా ఇలాగే ఉంది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ అష్టావధానాలు-శతావధానాలు చేసేస్తున్నారు!

ఆ రోజుల్లో మీరు అమెరికా నుంచి నాకు  ఉత్తరాలు రాస్తుండే వారు. ఇక్కడ టైముకు చాలా విలువ ఇస్తారని, అమెరికాలో అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారని మీరు రాస్తే ఏమిటో అనుకున్నాను! ఈ దేశం వచ్చాక తెలిసింది, ఇక్కడ అందరూ ఏదో ఒక “పని“ కాదు “పనులు“ చేస్తూ ఉంటారని.

నలభై నాలుగేళ్ళ కిందట న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్టినప్పుడు, నేను కారు ఎక్కగానే స్టయిల్ గా నాతో మాట్లాడుతూ, ఒక చేత్తో అలవోకగా డ్రైవ్ చేస్తున్న మిమ్మల్ని, మీ టాలెంట్ ని చూసి మురిసిపోయాను!

ఆ తర్వాత నేను కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు మా బాస్, ఫోన్ లో మాట్లాడుతూనే మరోపక్క యాడింగ్ మిషిన్ లో నెంబర్లు టక టకా నొక్కుతూ….కాగితాల మీద సంతకాలు పెడుతూ…మద్య మధ్యలో కాఫీ సిప్ చేస్తూ…కళ్ళతోనే మాకు హలో చెప్పే మిసెస్. ఏబ్రమ్స్ ఎబిలిటీ చూసి ఆశ్చర్యపోతుండే దాన్ని! అప్పట్లో నాతో పని చేసే సుజాన్ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న సింగిల్ మామ్ అయ్యుండి కూడా, ఫుల్ టైం ఉద్యోగం చేస్తూ.. పార్ట్ టైము స్కూలుకు వెళ్తుండేది !

మన పిల్లలు చిన్న వాళ్ళుగా ఉన్నప్పుడు, ప్లేట్లో ఫుడ్ పెట్టి టేబుల్ దగ్గర కూర్చోపెడితే.. టీవీ లో కార్టూన్లు చూస్తూ, టాయిస్ తో ఆడుకుంటూ కిందా మీద పోసుకుంటూ తిన్నామని అనిపించేవారు! ఆ తర్వాత స్కూళ్ళ కెళ్ళటం మొదలు పెట్టాక ఇద్దరూ పుస్తకాలు కార్పెట్ మీద పరిచి, టీవీ లో షోలు, సినిమాలు చూస్తూ, ఫోన్లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ హోంవర్క్ లు చేసేవాళ్ళు.

ఇక ఇప్పటి తరం వాళ్ళు సరేసరి! వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తుంటే, నాలాంటి వాళ్లకు కళ్ళు తిరుగుతాయి. ఇరవై నాలుగు గంటలు ఉరుకులే ఉరుకులు, పరుగులే  పరుగులు. వీళ్లకు ” అవ్వా కావాలి-బువ్వా కావాలి “ అన్నట్టు ఏది తక్కువ కాకూడదు! పెద్ద పెద్ద చదువులు చదవాలి….ఇద్దరూ  ఉద్యోగాలు చెయ్యాలి…కెరియర్ లో పైకి వెళ్ళాలి…. మళ్ళీ లక్షణమైన ఫ్యామిలి లైఫ్ కావాలి. సోషల్ లైఫ్ సరేసరి. పిల్లల ఏక్టివిటీస్…. పెద్దవాళ్ళ ఏక్టివిటీస్….బిజినెస్ ట్రిప్పులు….వెకేషన్ ట్రిప్పులు అంటూ ఎప్పుడూ పరుగులే!

ఉమెన్స్ లిబ్, ఇండిపెండెన్స్, ఐకెన్ డు ఎనీ థింగ్, హీ కెన్ డూ……  లాంటివి బాగా వంట పట్టించుకున్న  ఈకాలం అమ్మాయిలకి పరిగెత్తటమే తప్ప నిలబడటం అనేది తెలీదు. అందరికీ లైఫ్ లో ఏమైనా మిస్ అయిపోతామేమో అన్న ఆదుర్దా, అన్నీ పొందాలన్న తపన ఎక్కువైపోయింది.   

ప్రాక్టీస్ తో తీరిక లేదనే నా కొడుకు, పసి పిల్లవాడిని పొట్టకు ఆనించుకుని, చెవులకు హెడ్ ఫోన్స్ తగిలించుకుని జాగింగ్….. అంటూ బయలు దేరుతాడు. ఇదేం పనిరా అంటే “ టైం మానేజ్ మెంట్ మామ్! నా ఎక్సర్సైజ్, మెడిటేషన్, స్పెండిగ్ టైం విత్ మై సన్……..త్రీ ఇన్ వన్ “ అంటూ సమర్ధించుకుంటాడు!

అసలు ఈ మధ్య కాలంలో స్థిమితంగా జీవితాన్ని గడిపేవాళ్ళ మాట అటుంచి, స్థిమితం గా ఒక్క పని చేసే వాళ్ళను చూద్దాం అన్నా కనిపించటం లేదు కదా! రోజు వాక్ లో నాకు ఎదురయ్యే వాళ్ళలో, ఒక్కళ్ళు కూడా ఆ నడక మీద మనసు పెట్టరు. సెల్ ఫోను లో మాట్లాడుతూ…అరుస్తూ…..పోట్లాడుతూ నడిచేవాళ్ళు కొంతమంది అయితే, ఓ చేత్తో కుక్కల్ని, ఓ చేత్తో స్ట్రోలర్ని బాలెన్స్ చేస్తూ సెల్ ఫోన్ లో సీరియస్సుగా మాట్లాడుతూ నడిచే నారీమణులు మరికొంతమంది.

ఆ మధ్య మాకజిన్ ఇంట్లో పెళ్ళికని శాండియాగో వెళ్ళినప్పుడు, ఎయిర్ పోర్ట్ లో నన్ను పికప్ చేసుకోడానికి నా మేనల్లుడు మోహన్ వచ్చాడు. చిన్నప్పటి నుంచీ వాడు ఉట్టి హడావిడి మనిషి! నన్ను చూసి చూడటంతోనే అత్తా! అంటూ లొడ లొడా మాట్లాడుతూ, నిముష నిముషానికి మోగే సెల్ ఫోను ఆన్సర్ చేస్తూ, వెనక సీట్లో ఉన్న పిల్లల మీద అరుస్తూ, మధ్య మధ్యలో శాండ్ విచ్ తింటూ జీ.పీ.ఎస్ వేరే రోడ్డు తీసుకోమని చెప్తున్నా హడావిడిలో వినిపించుకోక ట్రాఫిక్ లో చిక్కుకుపోయి నానా అవస్థ పడి ఎలాగో పెళ్ళి జరిగే చోటుకు చేరుకున్నాం. వాన్ లో ఉన్నంతసేపు డ్రైవ్ చేస్తోంది వాడే అయినా గాబరాతో నాకు చెమటలు పట్టేసాయి !

“ బాడీ ప్రజంట్ మైండ్ ఆప్సేంట్ “ అన్నట్టు, కొంతమంది పని చేస్తున్నట్టు కనబడతారు, కానీ వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది. పిల్లల్ని షాపింగ్ కార్ట్ లో కూలేసి, వాళ్ళు అరిచి గోల పెడుతున్నా, వాళ్ళు చేతికందిన వన్నీ లాగి విసిరికొడుతున్నా పట్టించుకోకుండా, స్టోర్ లో ఉన్న కూరలన్నీ ప్లాస్టిక్ బ్యాగుల్లో కుక్కుతూ, అదే పనిగా సెల్ ఫోన్లో సొల్లుకబుర్లు మాట్లాడే మనుషుల్ని చూసినప్పుడల్లా నాకు చిరాకు పుడుతుంది.  

ఏమిటీ ఈ స్పీడ్ యుగం లో నాలాగా నత్త నడక నడిస్తే లాభం లేదంటారా?

మీ మాట నిజమే. కానీ….నేను పుట్టి పెరిగిన వాతావరణం “ ఆల్ వేస్ వన్ థింగ్ ఎట్ ఎ టైం ” అంటూ నొక్కి  వక్కాణించింది. అదే నా నరనరాల్లో జీర్ణించుకు పోయింది, అందుకే మీలాగా అరడజను పనులు ఒకేసారి చెయ్యటం నాకు చేతకాదు! మేము చిన్నప్పుడు కంచం ముందు కూర్చుని కబుర్లు మొదలెడితే వెంటనే  తాతయ్య “ అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. ఆహారాన్ని మౌనంగా – శ్రద్ధగా తీసుకున్నప్పుడే అది వంటికి పడుతుంది “ అని కోప్పడేవారు.

స్కూల్లో రోజు పాఠం, ఎక్కాలు, పద్యాలూ…… అప్పజెప్పేటప్పుడు మేము ఏమాత్రం అటు ఇటు చూస్తూ చెప్పినా మా మాస్టారు బెత్తంతో రెడీ గా ఉండేవారు వాయించటానికి! దిక్కులు చూస్తూ పాఠాలు అప్పచెప్తే  నేర్చుకున్న పాఠం బుర్రలోకి వెళ్ళకుండా, అదీ ఏ దిక్కుకో పారిపోతుంది అనేవారు! నీ దృష్టి నీ మనసు ఎప్పుడూ చేస్తున్న పని మీదే ఉండాలి గుర్తుంచుకో.. అంటూ బెత్తం ఆడించేవారు!   

ప్రతి పనికి ఓ పద్ధతి, ఓ టైము ఉంటుందని మా నాన్నగారు ఎప్పుడూ అంటుండేవారు. మా అన్నయ్య ఎం. ఎస్. ఫైనల్ ఇయర్ లో ఉండగా మంచి సంబంధం వస్తే అమ్మ చేసేద్దాం అంది. పెళ్ళిలో మాకు బోలెడు గిఫ్ట్స్ వస్తాయని, తెలిసీ తెలియని వయసులోవున్న అక్క, నేను అమ్మకు వంత పాడాం !

నాన్నగారు ససేమిరా వీల్లేదన్నారు. అమ్మ అంత మంచి పిల్లను ఒదులుకోవటం ఇష్ట్టం లేక “ చదువుకు పెళ్ళికి లంకె ఏమిటీ? దేని దారి దానిదే ” అని వాదించింది. దానికి నాన్నగారు “ ముందు పని వెనక, వెనక పని ముందు చెయ్యకూడదు. చదువు పూర్తి అవబోతున్న సమయంలో పెళ్ళి చేసి వాడి దృష్టి మళ్ళించకూడదు. మనిషి ఒక లక్ష్యంతో ముందు కెళ్ళాలంటే క్రమశిక్షణ, నియమం ఉండాలి. చదువు అయి ఉద్యోగం రాగానే పెళ్ళి చేసుకుంటే, అప్పుడు వాడు హాయిగా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు పెళ్ళి చేస్తే వాడిని అనవసరంగా తిక మక పెట్టిన వాళ్ళం అవుతాం “ అంటూ ఓ పెద్ద క్లాస్ తీసుకున్నారు. దానికి తగ్గట్టు మా అన్నయ్య కూడా “ నో “ అన్నాడులెండి!

కానీ అవతలి వాళ్ళు కూడా మా అన్నయ్య లాంటి మంచి అబ్బాయిని ఒదులుకోవటం ఇష్టం లేక “ అలాగే  ఆగుతాం, ఈలోగా మా అమ్మాయి కూడా చదువు కంటిన్యూ చేస్తుంది “ అని చెప్పారు. అన్నట్టుగానే  “ ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ ” అయిన అన్నయ్యకు వెంటనే మంచి ఉద్యోగం రావడం, మా వదినతో పెళ్ళిఅవడం….. కధ సుఖాంతం అయిందనుకోండి !

ఈ దేశంలో పిల్లలు బొడ్డూడకుండానే బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్లు, డేటింగ్ లు, లివింగ్ టుగెదర్ లు అంటారని తెలిసి మొదట్లో ఆశ్చర్య పోయాను! మనిషి ఎదగడానికి అమెరికాలో అవకాశాలతో పాటు, అవరోధాలు కూడా సరి సమానంగా ఉన్నాయని ఇక్కడ జీవితం మొదలుపెట్టాక తెలిసింది.      

స్కూల్లో చదువుతూనే, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ, డేటింగులు చేస్తూ, రెక్కలు రాకుండానే ఆకాశ వీధుల్లోకి ఎగిరిపోవాలని అనుకునే ఈ పిల్లల్ని చూసినప్పుడల్లా, నాకు మా నాన్నగారే గుర్తుకొస్తారు. ఆయన మాటల్లోని అర్ధం, నిజం ఏమిటో ఈ దేశం వచ్చాక, పిల్లల తల్లినయిన తర్వాత స్పష్ట్టంగా తెలిసొచ్చింది.

ఒకేసారి పది పనులు చేస్తూ ఏదో పొడిచేస్తున్నాం, సాధిస్తున్నాం అని అనుకుంటాం. కానీ అన్నీచెయ్యాలి అన్న ఆదుర్దాలో, హడావిడిలో ఏదీ సరిగ్గా చెయ్యలేం, ఏదీ పూర్తిగా అనుభవించలేమని తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి, మీరు ఇన్ని పనులు ఒకేసారి చేస్తూ మీ బుర్రను ఎంత విసిగిస్తున్నారో ? మీరు రాంగ్ బటన్ నొక్కి, కంప్యూటర్ ని తిడితే ఏం లాభం ?

మా మాస్టారు అన్నట్టు మనస్సుని ఊరికే అటు ఇటు పరుగులు పెట్టిస్తే, మన జీవితం గజిబిజి గా చిందర వందరగా అయిపోతుంది. “ అసలే కోతి, దానికి తోడు కల్లు తాగిందని “ మనిషికి మొదటి నుంచీ ఆశ ఎక్కువ, దానికి టెక్నాలజీ తోడయిన తర్వాత ఇక మిగిలింది ఉరుకులు-పరుగులే !!

తొలి ప్రచురణ “సుజనరంజని”  2011

.

*****************************************************