11_010 దేవతలు – గ్రామదేవతలు

 

దేవతలకి గ్రామదేవతలకి తేడా ఏమిటి అని పరిశీలిస్తే సామాజిక శాస్త్రవేత్తలు లేదా ఆధునిక చరిత్రకారులు చెప్పే సమాధానం ఒకటి ఉంటుంది, ఆధ్యాత్మికవేత్తలు చెప్పే సమాధానం ఒకటి ఉంటుంది. ఈ రెండు సమాధానాలని కూడా క్లుప్తంగా ఇస్తాను. ముందు ఆధునికుల దృక్పథం.

 

గ్రామదేవతలు ఒక ప్రాంతానికి – ఒకటి లేదా రెండు గ్రామాలకి — పరిమితమై ఉంటారు. వాళ్ళు గ్రామాన్ని రక్షించడానికి ఊహించబడిన శక్తికి ప్రతీకలు. మరొకరకం అయితే మానవులే దేవతగా కొలవబడుతున్నవారు. వాళ్ళు సాధారణంగా ఊరికోసం త్యాగంచేసిన స్త్రీలు అయి ఉంటారు. గ్రామదేవతలు ముఖ్యంగా పంటలని కాపాడడంకోసం, ఊరిని రోగాలనుంచి రక్షించడంకోసం పూజింపబడతారు. అందుకనే పంటలు చేతికందివచ్చే సమయంలో జాతరలుంటాయి. ఋతువులు మారే సమయంలో బలులుంటాయి. గ్రామాలు నగరాలుగా విస్తరించినప్పుడు, లేదా నగరాలలో కలసిపోయినప్పుడు కూడా ఆయా ప్రాంతాలలో ఆయా గ్రామదేవతలకి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. ఉదాహరణకి విశాఖపట్నం తీసుకుంటే పెదవాల్తేరు, అక్కయ్యపాలెం, సీతమ్మపేట, జాలరిపేట ఇలా ప్రతి ప్రాంతంలోనూ ఆయా గ్రామదేవతలు ఉన్నారు. ఈ గ్రామదేవతలకి మనలాగే కోపతాపాలు, పంతాలు, పట్టింపులు ఉంటాయి. వీళ్లకి ఊరు చివర చిన్న చిన్న గుళ్లు ఉంటాయి. కొంతమందికి అయితే గుళ్లుగోపురాలు ఉండవు. చెట్టుక్రిందే ఉంటారు. వీరి పూజావిధానం అవైదికం.

 

ఇక దేవతలు ఆర్యదేవతలు. వీళ్లు సర్వత్రా వ్యాపించిన శక్తిమంతులు. పెద్దపెద్ద దేవాలయాలలో సపరివారంగా కొలువుదీరి ఉంటారు. సృష్టిస్థితిలయలకి అధిపతులు. అన్ని ఊళ్ళల్లోను వీరి ఆలయాలు ఉంటాయి. వీరి పూజావిధానం వైదికం.

 

ఇది శాస్త్రీయమైన విశ్లేషణ అని కొందమంది భావన. అయితే ఈ వివరణలో పై పై అంశాల పరామర్శే ఉంది తప్ప వారికి చెందిన శక్తిమయమైన విశ్లేషణ ఉండదు.

 

ఇక ఆధ్యాత్మికమైన వివరణకి వస్తే—

దేవతైనా గ్రామదేవతైనా శక్తియొక్క స్వరూపమే. ఎక్కువ కాండిల్స్ బల్బు వెలుగు ఎక్కువ దూరం ప్రసరించినట్లు, తక్కువ కాండిల్స్ ఉన్న బల్బు వెలుగు తక్కువ దూరం ప్రసరించినట్లు తేడా అంతే. వెలుగు పరిధి ఎక్కువైన కొద్ది వారి బాధ్యత కూడా ఎక్కువ అవుతుంది. క్లర్కుకన్న ఆఫీసరు బాధ్యత ఎక్కువ అయినట్లు. దేవతలలో చాలారకాల దేవతలు ఉన్నారు. కొందరు కనిపించే దేవతలు, కొందరు కనిపించని దేవతలు కూడా ఉంటారు. ఇక గ్రామదేవతలందరు మనం అనుకునే దేవతల కోవలోకి చెందరు. కొందరు మాత్రమే చెందుతారు. వారు అమ్మవారి యొక్క అంశలు. మరి కొందరు కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం దేవతలుగా గుర్తింపబడతారు. ఆ పని అయిపోగానే వారు మాయమైపోతారు. మాయమైపోవడమంటే మరొకరూపం స్వీకరించడమో, మరొకపనిని చేపట్టడమో చేస్తారు. వారికి మనలాగే పరిణామక్రమం ఉంటుంది. మూలదేవతలకి ఈ పరిణామక్రమం ఉండదు. ఇక పూజా విధానాలు, గుళ్లు గోపురాలు అన్నవి మన వికాసం కోసం గాని, వారి కోసం కాదు కనుక వాటికి ఉన్న ప్రాధాన్యం కొన్ని సందర్భాలలో చాలా తక్కువ. సాధన, ధ్యానం చేస్తున్నవారికి ఈ వివరణలోని అంశాలు క్రమంగా అవగతమవుతాయి.

 

గ్రామదేవతలు భారతదేశమంతా ఉన్నారు. ఒక్కొక్క చోట వీరిని ఒక్కో పేరుతో పిలుస్తారు. వీరు ఎక్కువగా శక్తిస్వరూపిణులు కనుక స్త్రీదేవతలు. అయితే గ్రామానికి రక్షకులుగా ఉండే మగదేవతలు కూడా ఉంటారు. వీరు క్షేత్రపాలకుల కోవకి చెందినవారు. కాలభైరవస్వరూపులుగా వీరిని పూజిస్తారు. తమిళనాడులో కనిపించే అయ్యనార్లు ఇటువంటివారే. గ్రామదేవతల గుడిలో ఉండే పోతరాజులు వీరూ ఒకరేనా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. ఎందుకంటే పోతరాజుకన్న వీరు శక్తిమంతులు. వీరు మగ గ్రామదేవతలు.

 

ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామదేవత అనుమతి తీసుకునే గ్రామంలో అడుగుపెట్టాలి. అందుకనే గ్రామదేవతల గుళ్లు ఊరి పొలిమేరల్లోనే ఉంటాయి. ఊళ్లు పెరిగిన సందర్భంలో అవి ఊరి మధ్యలోకి వచ్చేసాయనుకోండి. ఎంత పెద్ద కార్యాలయంలోనైనా, ఇంటిలోనైనా బయట ఉన్న సెక్యూరిటీగార్డు అనుమతితోనే లోపల ప్రవేశిస్తాం కదా. కార్యాలయ అధికారి అయినా, ఇంటి యజమాని అయినా అతను తలుపు తీసేవరకు ఎదురు చూడాలి కదా. అదే ప్రాధాన్యం, గ్రామరక్షణ బాధ్యత గ్రామదేవతలకి ఉంటాయి. ఒక పెద్ద కంపెనీకి అనేక శాఖలుంటే, ఆ శాఖాధిపతులకు ఎంత అధికారం ఉంటుందో అంత అధికారంకూడా గ్రామదేవతలకి ఉంటుంది. అయితే వారి శక్తి, మహిమ ఆ గ్రామం వరకు మాత్రమే పరిమితమై ఉంటాయి. వీరు కూడా కొన్ని నియమనిబంధనలకి కట్టుబడే ఉంటారు. ఆ రకంగా దేవతలకన్న వీరు తక్కువవారు కనుక వీరికి క్షుద్రదేవతలని కూడా పేరు. అయితే ఈ పేరుని క్షుద్రశక్తులుగా భావించి పొరబడకూడదు. క్షుద్రదేవత అంటే చిన్న, అల్పమైన దేవత అని అర్థం అంతే. ఆ విధంగా వీరు మోక్షప్రదాతలు కారు. కేవలం కామప్రదాతలు మాత్రమే.

 

మనకి పురాణాలలో లంకాధిదేవత లంకిణి గ్రామదేవతవంటిదే. కాశీకి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఆయనే గ్రామదేవత అని భావించాలి. శీతలాదేవి, మానసాదేవి, రేణుక మొదలైనవారు ఉత్తరభారతదేశంలో గ్రామదేవతలుగానే ఎక్కువ ప్రసిద్ధి పొందారు. అలాగే దక్షిణానికి వస్తే, మరియమ్మ, చౌడేశ్వరీ, మైసమ్మ, పోచమ్మ, నూకాలమ్మ, పోలేరమ్మ మొదలైనవారు గ్రామదేవతలు. వీరిలో మరియమ్మ, శీతల, పోలమ్మ మొదలైనవారు రోగనివారకమైన శక్తిస్వరూపిణులు. గ్రామదేవతల బాధ్యతలలో గ్రామానికి పట్టే అంటురోగాలని తొలగించడం పెద్ద బాధ్యత. అందుకని కొందరి దేవతల పేర్లు ఆ రోగాలపేర్లుగా ఉంటాయి.

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾