10_020 పాలంగి కథలు – పండుగ వేళ….

.

మనం తలపెట్టిన కార్యాలు ఏ విఘ్నాలూ రాకుండా నెరవేర్చే విఘ్నేశ్వరుని పూజించి,

‘‘మోదకములు మొక్కి భువికి మోదము కలిగించవలెను గణనాయక!

జనగణముల మనములు వెలిగించ నీవు విచ్చేయవయా!!’’

అంటూ ఆహ్వానించి పూజించి వేడుకునే పండగ వినాయకచవితి. అన్ని వయసులవారూ ఆనందంగా కలిసి చేసుకునే పండగ.

ఈసారి చవితి పండగ మా ఇంట్లో చాలా ప్రత్యేకం. గెట్ టుగెదర్ లాగ చాలాకాలం తర్వాత మా అత్తగారి కూతుళ్లు ( క్షమించండి. మా ఆడపడుచులన్నమాట!! వాళ్లల్లో కొందరు మా పిల్లల వయసువాళ్లే. అందుకే అలా అన్నాను ) వాళ్లాయనలతో సహా వచ్చారు. ఇంకా కొడుకులూ, కోడళ్లూ, మనవలూ, మునిమనవలూ అందరూ దూరాభారాలనుండి కూడా రావడంతో ఈసారి పండగ ప్రత్యేకతని సంతరించుకుంది. ఎప్పుడో చాలాకాలం క్రితం ఉండేది ఇల్లు ఇంత సందడిగా. అప్పటికంటే పెరిగిన తరాల చిన్నవాళ్లతో అదీ పట్నాలనుండి, పైదేశాలనుండి కూడా వచ్చిన పిల్లలందరితో అసలైన పల్లెటూరి ఉమ్మడి కుటుంబం అందం వెల్లివిరిసిందీనాడు మా ఇంట్లో!!

‘‘ బాబోయ్‌! mud తో పిసికి బొమ్మ చేస్తారా?! ఛీ…ఛీ… చేతులూ, ఒళ్లూ ఖరాబైపోతుంది కదమ్మా! పొలం వెళ్లి అదేదో గెరికట? ఇంకా పెత్రి తేవాలని చెప్పావట? what is పెత్రీ? అసలా బురదలో కాళ్లు పెట్టి నడవడం ఎలాగమ్మా? I can’t. I hate that mud. ”

“ తప్పు నాన్నా! you should not hate anything here. ఇలా రా చెబుతా. పెత్రీ కాదు…పత్రి! అంటే green leaves అన్నమాట. ”

“ ఓహ్‌…green leaves అయితే ఇంట్లో గార్డెన్‌లోనే ఉన్నాయిగా! రోజ్, లిల్లీ, బనానా ఇంకా…ఏవేవో…? అవును what is గెరికీ? ”

“ ఓ…అదా! గెరికీ కాదు. గరిక అంటే green grass. ”

గౌతమ: grass తో దేముడికి పూజేమిటమ్మా? ఫ్లవర్స్‌తో కదా పూజ చేస్తారు!

అనూరాధ: USలో అయితే ఇవన్నీ దొరకవు కనుక అలా చేస్తాం. కానీ ఇక్కడ వినాయకుడిని చాలా green leavesతోనూ, గరికతోనూ పూజ చేస్తారు. great grand pa తో మీరందరూ కలిసి వెళ్లి collect చేసి వాటి నేమ్స్‌ అడిగి తెలుసుకో. you must identify those plants నాన్నా! అలాగే మరో మాట. మట్టిని hate చేయకూడదు తెలుసా? ఆ మట్టి లోంచే  great grand pa ధాన్యం, కూరలు, పళ్లూ పండిస్తున్నారు. వాటినే కదా మనం తింటున్నాం? అలాంటి నేలను నువ్వు హేట్‌ చేస్తున్నట్టు తెలిస్తే బాధపడతారు కదా! సో…మనం భూమాతకు దణ్ణం పెట్టాలి.  పొలం వెళ్లి ‘ ఇది మా పొలం. ఈ భూమాత మా motherland. mother earth will gives us శక్తి, ’ అని gratitude తో నమస్కారం చేయాలి తెలిసిందా? కాలికి మట్టి అయితే wash చేస్తే పోతుంది కదా!

గౌతమ: సరేలే అమ్మా! వెళ్తానులే!!

అనూరాధ: సూరి మావయ్యా వాళ్ల పిల్లలతో కలిసి వెళ్లండి. వాళ్లు మిమ్మల్ని guide చేస్తారు OK?

ఆత్రేయ: అమ్మా సూరి అంకుల్‌… No సూరి మావయ్య. సరే, సరే సూరి మావయ్య coconut tree ఎక్కి కాయలు కోస్తారట కదా? భయం వెయ్యదూ? అలా పైకి ఎక్కడానికి? ఎలా ఎక్కుతాడో చూడాలి!

అమ్మా  lader ఎక్కి upstair నుంచి అంత పెద్ద brass vessel తెచ్చారేమిటి? ఏం చేస్తారు?

అనూ: upstair కాదు…అటక!

గౌతమ: ఓహో అటకా!?

గౌతమ: అంత పెద్ద గిన్నెలో బోళ్లు ఉండ్రాళ్లు చేస్తారట. అత్త చెప్పింది. అన్ని తినగలమా అమ్మా?

ఆత్రేయ: అది కాదురా అన్నయ్యా…బొజ్జ గణపతికి బోళ్డు కావాలి కదా? అందుకోసం అన్నమాట!!

శారద: పిల్లలూ, సూరిమావయ్య కొబ్బరి చెట్టెక్కి కాయలు కోస్తున్నాడు. చూస్తామన్నారుగా రండి!

అలా చెట్టెక్కుతుంటే భయం భయంగా కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయారు. అమెరికాలో ఇలాంటి సీన్‌ ఎప్పుడూ కనబడదు కదా! సూరిబాబు చెట్టుమీద నుంచి కాయలు కిందకు పడేస్తుంటే దూరంగా పరుగెత్తి ఆశ్చర్యంగా చూస్తూ నించున్నారు.

చాలా ఏళ్ల తర్వాత రవి అనూ పిల్లలతో కలిసి వచ్చారు పండగవేళ. ఎన్నేళ్ల నుండో USAలో ఉన్నా వీళ్లిద్దరికీ ఇక్కడి పల్లెటూరి వాతావరణం మీద మమకారం పోలేదు. అందుకే పిల్లల్ని అన్నీ చూడమనీ, తెలుసుకోమనీ ప్రోత్సహిస్తుంది వాళ్లమ్మ.

గిరిజ: నిరుడు వినాయకచవితికి అమెరికాలో కొడుకింట్లో చేసుకున్నావ్‌ కదా వదినా? ఏం అనూ! అక్కడికీ, ఇక్కడికీ బోలెడు తేడా ఉంది కదూ!

అనూ: ‘‘అవును పిన్నీ. ఇంత సందడీ, హడావుడీ అక్కడెలా వస్తుంది! అక్కడా అత్తయ్య ఉండ్రాళ్లు చేస్తామన్నారుగానీ, ఆ రోజావిడ జలుబు భారంతో ఉన్నారని తెప్పించేశాను నేనే’’.

మాణిక్యాంబ: అదేమిటే…? ఉండ్రాళ్లు తెప్పించడమేమిటి? బజారులో దొరికే వస్తువా ఏమిటి? అందులో అమెరికాలో??! (ఆశ్చర్యంగా అడిగింది)

అనూ: నిజమే పిన్నీ! అక్కడ కొందరు అవసరాల్ని వ్యాపారంగా చేస్తుంటారు ఉభయతారకంగా. నిజానికి ఇలాంటివి చెయ్యడం అందరికీ రాదు కూడాను.

గిరిజ: ఇంతకీ నీకు వచ్చా ఉండ్రాళ్లు చేయడం?

అనూ: ఆ…నాకు వచ్చు.మా అమ్మ రెండుసార్లు ఈ పండక్కి మా దగ్గరుంది. అప్పుడు దగ్గరుండి నేర్పింది. బాగానే చేస్తాను. ఇంతకీ ఓ friend వాళ్లమ్మ విజయవాడనుంచి వచ్చారు. ఆవిడ వాళ్ల పక్కనే ఉన్న ఓ అరవ ఫ్రెండు అత్తగారు, ఇద్దరూ ఇక్కడికొచ్చాక మంచి స్నేహితులయ్యారు. వాళ్లిద్దరూ కలిసి అటు అరవ వంటలూ, ఇటు మన తెలుగువారి పిండివంటలూ కూడా చేసి సప్లై చేస్తూ ఉంటారు. అటు కాలక్షేపం, ఇటు ఆర్థికం కూడా. అసలు విషయం– ఆ రాజేశ్వరి పిన్నిగారు పంపించారు పది గంటలకల్లా. ముందురోజు రాత్రి ఫోన్‌ చేసి చెప్పాలెండి 12 ఉండ్రాళ్లు కావాలని.

‘‘ఏం విడ్డూరాలే తల్లీ! ఆ మాత్రం ఉండ్రాళ్లే చేయలేకపోయిందా మీ అత్తగారు?! అమెరికా వెళ్తే సూకరాలు పెరిగిపోతాయేమిటర్రా?!’’ నాన్నమ్మగారి సన్నాయి నొక్కులు.

‘అదేం కాదులెండత్తయ్యా. పాతికేసి కొబ్బరికాయలు కోరి కొబ్బరి లౌజు ఎలా చేస్తాను? అంత సూకరాల సోమిదేవినైతే?  అక్కడ బియ్యం నూక పోయించడానికి వీధి చివర్న పిండిమర ఉండదు మరి! అదీకాక కొబ్బరికాయలు బాగా ముదురువి. పిప్పిలాగ ఉంటుంది. అన్నింటికీ మించి అప్పుడు నాకు ఒంట్లో బాగోలేదు అంతే ”. మొత్తానికి సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకున్నాను దీటుగా.

“ అదా సంగతీ! పోనీలేవే కమలా ! పనికి వెరిచేదానివి కాదు కదా అని అలా అన్నానంతే! ”

“ అమ్మాయ్‌…అనూరాధా! ఇలా రా!! మా వంశోద్ధారకుడు వాడి పేరేమిటన్నావ్‌? గౌతమ్‌. గోత్రం పేరు పెట్టానన్నావ్‌. మనది భరద్వాజస గోత్రం కదా ! ”

“ అది కాదు మామ్మగారూ…గౌతమ మహర్షి తెచ్చిన గంగపారే ప్రదేశం కదా మన పశ్చిమగోదావరి జిల్లా. అందుకు గౌతమీ నదిని, గౌతమ మహర్షిని గుర్తు చేస్తూ ‘గౌతమ’ అన్నాం ”.  

గౌతమ: నాపేరు గౌతమ భరద్వాజ తాతమ్మా.

‘నా తండ్రే ఎంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతున్నావ్‌ రా! అదిగో… నా మనవరాలూ ఉంది…ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. య్యా…నానమ్మా అనడం ఒక్కటే వచ్చు దానికి. సరేకానీ చిన్నాడి పేరేమిటి? ఇంకేదో గోత్రంట కదా?’

‘నేను ఆత్రేయ భరద్వాజ తాతమ్మా’

‘మరి ఈ పేరు గురించి వివరించవమ్మా మనవరాలా!’

‘తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం కదా నాన్నగారిది? అందుకు గుర్తుగా ఆత్రేయ భరద్వాజ అని పెట్టాం’.

‘అబ్బో!! ఎంతంత ఆలోచనలర్రా! మా కాలంలో ఎంతసేపూ పెద్దల పేర్లు పెట్టేవాళ్లం అంతే’.

‘మీరు మీ కాలంలో చాలా మోడ్రనే ట కదా! మీ అమ్మగారి పేరు గౌరమ్మ అయితే గిరిజని, లక్ష్మమ్మ పేరు ఇందిరని పెట్టారట కదా!’

‘ఓసీ భడవా! చాలా విషయాలే సేకరించావ్‌. ఇంతకీ పాలవెల్లి కట్టడం పూర్తయిందా? తాతగారు ఇంకా రాలేదు పొలం నుంచి. గేదె ఈనమోపుగా ఉందన్నారు ”.  

‘ నేవెళ్లి చూసి వస్తానమ్మమ్మా. ఇక్కడేగా ’ చిన్న రవి లేచాడు.

‘అబ్బే…అక్కర్లేదురా వచ్చేస్తారు. మీరంతా తెమలండి. అన్నట్లు ఒరే…కొట్టుగదిలో బస్తాలో ఉలవలుంటాయి. ఉజ్జాయింపుని ఓ శేరు డబ్బాలో పోసి పట్టుకురా నాయనా. గిరిజా ! కాస్త పిడకలతో దాలి వేసి కుండలో ఉలవలు,  నీళ్లోసి, దాలి మీద పెడుదువు తల్లీ’’.

‘నేవేస్తాలెండత్తయ్యా. దాలి వెయ్యడం మర్చిపోయి ఉండొచ్చు. చాలాకాలం అయిపోయింది కదా!’

‘అక్కర్లేదులే వదినా…గుర్తుంది. కానీ అగ్గిపెట్టె, కిరసనాయిలు ఎక్కడుందో నువ్వే చెప్పాలి’.

‘అదిగో మాటలోనే వచ్చేశారర్రా తాతగారు. నూరేళ్లాయిష్షు. గేదె ఈనిందేమిటి? ఏం దూడ? ’

‘ పెయ్య దూడేలే. పాలివిగో. పాలేరొస్తాడు ఉడికించిన ఉలవలివ్వండి. పిల్లలుండగా గేదె ఈనుతుందో లేదో అనుకున్నాను. జున్ను ప్రాప్తి ఉంది వీళ్లకి. ఏరా తాతా…జున్ను తింటావా?’

‘what is జున్ను?  మనూ అక్కా.  do you know what is జున్ను? ’

‘ I know, but I don’t like it’’.

‘why? అమ్మా జున్ను ఎలాగుంటుంది?’’

‘‘అది milk sweet రా. చేశాక taste చేద్దువుగానిలే. నాకూ, నాన్నకీ ఎంతిష్టమో!’’

‘తాతమ్మా మీ ఇంట్లో fire place బాగుందిలే. కానీ కళ్లు మండుతాయ్‌. అయినా బాగుంది’.

‘అదేమిటే? ఏదో ప్లేసంటాడు?’

‘అదా…నీళ్ల పొయ్యి గురించి. ఇందాకా ఇందిర పిన్ని పెరట్లో నీళ్ల పొయ్యి దగ్గిర కూర్చుంటే ఆవిడ ఒళ్లో కూర్చుని పొయ్యి దగ్గిర మంట పెడుతూ కూర్చున్నాడు. అమెరికాలో చలి కాగడానికి ఇంట్లో, హాల్లో ఉంటుంది చలిమంట. దాన్ని fire place అంటారు’.

‘బాబీ వచ్చాడండోయ్‌ పెళ్లాం పిల్లలతో! ఎన్నాళ్లయిందిరా నాయనా నిన్నుచూసి? ఇలా రా. అలా చిక్కిపోయావేమిట్రా తండ్రీ. వేళకు తిండి తినడం లేదూ?’ అభిమానం నిండిన గొంతుతో అప్పుడే వచ్చిన మనవణ్ని పలకరించింది. దౌహిత్రుడొచ్చిన ఆనందం ముఖంలో కనబడుతుంటే…

‘ఏరా ఇదేనా రావడం?’

‘అవును తాతగారూ. ఎలాగున్నారు? ఇంకా పొలం వెళ్తూనే ఉన్నారన్నమాట. ఇంకా అమరకానికివ్వలేదా?’

‘అమరకానికిచ్చేస్తే. ఈ గేదెలూ, పాడీకామాటం అవీ ఎలా కుదుర్తాయిరా అబ్బీ. ఏదో ఇంకా ఓపిక ఉన్నన్నాళ్లూ ఇలా సాగనీ. ఏమ్మా కమలా? కందా బచ్చలీ వేస్తారేమిటి? బచ్చలి పట్టుకొచ్చాను పొలంనించి. కంద ఇంట్లో ఉందిగా’.

‘అలాగే మావయ్యా. మీ చిన్నమ్మాయి వంటావిడ్ని పురమాయించిందివాళ. ఎప్పుడూ పండగరోజుల్లో వంటింట్లోనే గడిచిపోతుందంటూ. మామిడి కాయ పప్పు వేయమంటాను. పునాసమామిడి చెట్టు కాచిందని కోసి పట్టుకొచ్చాడు పెద్దబాబు నిన్న పొలం వెళ్లినప్పుడు. కొబ్బరి పచ్చడి ఎలాగూ చెయ్యాలి’.

‘అమెరికా పిల్లలు ఈ కూరలు తినరేమో కదా? బంగాళా దుంపలు తెమ్మను అబ్బాయిని’.

‘తెచ్చారు మావయ్యా. వేయించమంటానులెండి’.

‘య్యా..! య్యా…! french fry…భలే! అమ్మా I want to eat now! I am hungry’.

‘ఇన్నాళ్లకు ఆకలన్నమాట విన్నాన్రా నీ నోట. అయినా పూజ చేసుకోవాలి కదా? పూజ అవగానే వినాయకునికి నైవేద్యం పెట్టి, అప్పుడు వెంటనే మీకు? OK?’

‘ఇదుగో మనవరాలా! పిల్లలందరికీ ఇంకోసారి తలో గ్లాసూ పాలు ఇవ్వమ్మా. పొద్దున్నే టిఫిను అలవాటు కదా? కుర్ర నాగన్నలు ఉండలేరు. పూజ కదాని టిఫిన్‌ చెయ్యలేదు మరి! అయినా తాతగారు వచ్చేశారుగా అందరి స్నానాలూ అయిపోయాయ్‌ కూడాను. పూజ మొదలెట్టేద్దురుగాని. ఇంతకీ దేవుడి దగ్గర అన్నీ సర్దారా? అన్నట్టు వస్త్రాలూ, యజ్ఞోపవీతాలు చేశారా? పూలూ, పత్రీ, అక్షింతలూ అన్నీ రెడీయేనా? దీపం కుందులు వెండివి నాలుగూ తెచ్చావా అమ్మా సరోజా?’

‘తాతమ్మా…తాతమ్మా…సరోజ పిన్ని, శారదమ్మమ్మ దేవుడి దగ్గిర ఎంత బాగా decorate చేశారో చూడు వచ్చి. పాలవెల్లి ఎంత బాగుందో. గౌతమకీ,  ఆత్రేయకీ ప్రతీదీ సంబరంగా ఉంది. గునగునా పరిగెడ్తూ తెగ కబుర్లు చెబుతున్నారు. ఇహ పూజ మొదలెట్టండి. ఏరి మా అబ్బాయిలూ, వాళ్లబ్బాయిలూ, అమ్మాయిలూ? అమ్మా గిరిజా! ఏరమ్మ మీ ఆయనా వాళ్లూ?’

‘తోచడం లేదని అలా రోడ్డుమీదికెళ్లొస్తామని వెళ్లారమ్మా. వచ్చేస్తుంటారులే’.

‘ఈలోగా అందరికీ గ్లాసుల్లోనూ, పంచపాత్రల్లోనూ ఆచమనానికి నీళ్లూ, ఉద్ధరిణిలూ పెట్టండమ్మా. పూలు పత్రీ మరిన్ని పళ్లాలలో అమర్చి అన్నివైపులా అందరికీ అందుబాటులో పెట్టండి’.

‘మేం రెడీ నాయనమ్మా. మేం చూడండి ఎలా రెడీ అయ్యామో తాతమ్మా. బాగున్నామా? మనవల, మునిమనవల హాజరు’.

‘అబ్బో! బుజ్జి బుజ్జి పంచెకట్టులో తయారయారా బంగారు తండ్రులు! ఎంత ముద్దుగా ఉన్నారర్రా! మీకూ పంచెలే!!’

‘అమ్మమ్మా మా పట్టు పరికిణీలు బాగున్నాయా?’ పెద్ద మనవరాలు అమెరికాలో ఉన్నా చక్కగా తెలుగు మాట్లాడుతుంది. చిన్నది దాని వెనకే ఉంటుంది నిశ్శబ్దంగా చూస్తూ.

‘కళకళలాడుతున్నారర్రా. అందరూ కూర్చుని పూజ చేసుకోండి. వంటింట్లో పనిలేదుగా! ఆవిడ చేస్తుందిలే అందరూ వచ్చి చుట్టూ కూర్చోండి. పిల్లలూ కోడళ్లూ అందరూ వచ్చారా? ఆడపిల్లలు కాళ్లకి పసుపు రాసుకున్నారా? ఏదీ? నాకాళ్లకి కూడా రాయండి మరి! అందరూ తల్లో పూలు పెట్టుకోండి చక్కగా. నాకో చిన్ని ముక్క ఇవ్వండి. ఇంతకీ మట్టి విఘ్నేశ్వరుణ్ణి తయారు చేశారా లేదా?’

బాబీ తయారు చేసిన బొమ్మ చూపిస్తూ ‘ఇదుగో అమ్మమ్మా, నేనూ కమలత్తయ్యా కలిసి చేశాం. బాగా వచ్చిందేమో చూడు!’

‘అబ్బా! ఎంత బాగుందో. నిరుడు ఇంట్లో ఎవ్వరూ లేరు. తాతగారు కొని పట్టుకొచ్చారు. అబ్బే! ఆ అచ్చుబొమ్మకి కనుముక్కు తీరే లేదు. ఇదెంత ముద్దొస్తుందో!’

‘yes…తాతమ్మా. This is fine. మావయ్యా చెయ్యంతా మట్టి అయిపోయింది. త్వరగా కడుక్కో. నేను నీళ్లు పోయనా? వెంటనే డెట్టాల్‌ లోషన్‌లో చెయ్యి కడిగేసుకో. లేకపోతే infection వస్తుంది’.

‘అక్కర్లేదురా తండ్రీ. మట్టి itself an anti-septic? తాతగారు కాలికి దెబ్బ తగిల్తే మట్టి రాసేస్తారు వెంటనే!’ ‘అవునా…నిజమా!!’

‘అందరూ చుట్టూ కూర్చోండి పీటలు వేసుకుని. అదేమిటి రెండువైపులకీ పెట్టారు దేముళ్లని?’

‘మరి అందరూ ఒకవైపునే కూర్చోడం కుదరదు కదా అమ్మమ్మగారూ!’

‘కుర్చీ మీద కూర్చోకూడదా?’ సూరి కొడుకు ప్రశ్న.

‘కూడదు. ఇలా వచ్చి నా ఒళ్లో కూర్చో కావలిస్తే’.

‘అక్కర్లేదు నేనూ, చెల్లీ, గౌతమ, ఆత్రేయ, అన్నా అక్క హరిప్రియా మేమంతా ఈవైపు. తణుకు తాతగారు, ఇంకా తాతగార్లూ, మావయ్యలూ, పెదన్నాన్న, నాన్న ఆవైపూ కూర్చుంటాం’’.

‘మరి తక్కినవాళ్లంతా ఎక్కడ కూర్చుంటారు?’ బాబి కూతురి సందేహం! ‘అక్కర్లేదులే. మీరంతా పూజ చెయ్యండి శ్రద్ధగా. ఇక్కడ్నించే ‘మమ’ అనుకుంటాంలే!’ వసంత జవాబు.

‘మీరంతా వెనక లైన్లో కూర్చోండి అమ్మాయిలూ!!’

‘great grand paa…మీరే పూజ చేయించే బ్రహ్మగారట కదా! మీరు కుర్చీలో కూర్చుని పూజ మంత్రాలు చెప్పండి’.

‘అలాగే రా తాతా. బాగానే ఉన్నాయ్‌ నీ పురమాయింపులు’. ‘ఓం గణానాంత్వా గణపతి హవామహే…! నీక్కూడా వచ్చేమిట్రా?’

‘అవును మా hyd తాతగారు యూఎస్‌ వచ్చినప్పుడు మాకు నేర్పించారు. ఇంకా బోల్డన్ని శ్లోకాలు, అష్టకాలూ కూడానూ!’

‘so…నీకు ఇంగ్లిష్, సంస్కృతం, తెలుగు– three languages వచ్చన్నమాట!’ సూరి కొడుక్కి ఆశ్చర్యం!

‘ఇందిరా, వసంతా నైవేద్యానికి ఉండ్రాళ్లు చెయ్యడం అయిందేమో వెండి పళ్లాల్లో పెట్టి పట్టుకురండమ్మా’.

‘అలాగేనమ్మా!’

‘కర్పూర హారతి వెలిగించడండి. అందరూ కళ్లకద్దుకోండి. వంట చేసే రామేశ్వరమ్మగార్ని కూడా ఓసారి ఇలా వచ్చి హారతి కళ్లకద్దుకోమను. లలితా, లక్ష్మీ! ఆ నైవేద్యం పళ్లాలు పట్టుకెళ్లి వంటింట్లో పెట్టండమ్మా.

పూజ పూర్తయింది కదా. మంగళహారతి పాడండర్రా’’ అంటూనే తనే– ‘విఘ్నము శాయకురా వినాయకా…!’అంటూ పాట అందుకున్నారు. పాట ముగించి ‘ఆత్రేయ, గౌతమ మీరు పాడతారట కదా! పాడండి మరి!’ అనగానే వారు వెంటనే ‘శ్రీ గణనాథ సిందూర వర్ణ…’ అంటూ పాడారు. మెచ్చుకోలుగా చూస్తూ చక్కగా పాటపాడారర్రా. బాగానే నేర్చుకున్నారన్నమాట. మానసా…నువ్వూ అక్కా కలిసి రెండో గీతం పాడండి! ఆలస్యం చెయ్యకండి మరి.

అలాగే ‘కుంద గౌర గౌరీవరా…’బాగుంది,

‘ఇందిరా మీరంతా కలిసి ఓ పాట పాడండి మరి’.

ఇందిర ముందుగా ‘తొండము నేకదంతమును’ పద్యం చక్కగా రాగయుక్తంగా పాడి ‘వందనం గిరినందినీ ప్రియనందనా’ పాట అక్కచెల్లెళ్లంతా చక్కగా పాడారు. ఇప్పుడు నీ ఒంతు. కమలా నువ్వూ నీ మనవరాలూ పాడండి. ‘వాతాపి గణపతింభజే…’హరిప్రియా…నీకు ‘సిద్ధి వినాయకం’ వచ్చుగా. పాడు. తాతగారూ మీకు వచ్చుగా? నాతో పాడండి. ‘సిద్ధ యక్ష కిన్నెరాది సేవితం…’ అఖిల జగత్ప్రసిద్ధ మూల…’ ‘ఎన్నాళ్లయిందిరా అబ్బాయి నువ్విలా పాడి. పోన్లే. నీ మనవరాలి పుణ్యమా అని చాలా కాలానికి నీ పాట విన్నాం. మళ్లీ వీణ వాయించడం మొదలెట్టరా అబ్బాయ్‌. సాయంత్రం ఫ్యాక్టరీ నుంచి వచ్చాక ఓ అరగంటైనా వాయిస్తే బాగుంటుంది’ తాతగారు గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ.

‘ఏవిటో నాన్నా. సాయంత్రం పూట బద్ధకం వచ్చేస్తుంది. ఆదివారంనాడు హరిప్రియ తనతోపాటు పాడకపోతే ఊరుకోదని ఇలా కొన్ని కృతులు మళ్లీ పాడటం మొదలుపెట్టాను మొత్తానికి’.

‘అమ్మా…అమ్మా…చూడు చూడు great grand paa & తాతమ్మ are so happy కదూ! కదూ నాన్నా?’

‘అవును కన్నా. మనం ఇలా పండక్కి వచ్చి చాలా మంచిపని చేశాం రవీ!’

‘అవును అనూ. కారణం నువ్వే ఈ ఆనందానికి.  Thanks a lot’.

‘వినాయక చవితి కథ ఎవరు చదూతారర్రా? సరోజా నువ్వు చదువమ్మా. అందరూ అక్షతలు చేత్తో పట్టుకోండి’.

‘మరి గణపతి పద్యాలో. ఇందిరా నువ్వు చెప్పు అందరూ చెబుతారు. ‘ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య…’ అందరూ తాతగారి దగ్గరకెళ్లి కథాక్షతలు వేయించుకోండర్రా’.

‘తాతమ్మకీ పెద్దతాతగారికీ కాళ్లకి నమస్కరించండి. రా రవీ! మనం కూడా నమస్కారం పెడదాం’.

‘ఏవండోయ్‌! పందిరి మంచం సొరుగులో డబ్బు పెట్టారుగా! తెచ్చి పిల్లలందరికీ తలో వెయ్యీ ఇవ్వండి’’.

‘పంట డబ్బంతా నీకూ నీ పిల్లలకే సరిపోతుంది మరి!’

‘కంట్రకం మాటలనకండి. మీ పిల్లలూ, మనవలూ ఒక్కొక్కళ్లు కోటీశ్వరులు. వాళ్లే మీ పంట! ఇలా అందరూ కంటినిండా ఉంటే ఇంకేం కావాలి మనకి!’

‘సరేలే ఊరికే అన్నాను. ఇదుగో డబ్బు. నువ్వే ఇయ్యి. వాళ్లకి నేను ఆశీర్వచనం ఇస్తాలే’.

‘శతమానం భవతి. శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యే మేంద్రియే ప్రతి తిష్టతి’

‘రోజులు ఇలా వెళ్లిపోతే చాలు పరమాత్మా’.

‘ఈ magazineలో మీ వదిన రాసిన ఆర్టికల్‌ పడింది ఏం పుస్తకం అది?’ ‘అరణ్యస్పందన’ట అంటూ శారదా వాళ్లాయన పుస్తకం తెచ్చారు.

‘ఏమిటి తాతగారూ…మా నాయనమ్మ రాసిన articleలా? ఏదీ…పేరు చూపించండి’.

‘నీకు తెలుగు రాదుగా చదవడం? తెలుగులో ఉంది. ఇదుగో…‘భమిడి కమలాదేవి’ అని. కనబడిందా?’

‘ఊ. నాకివ్వరా పుస్తకం! నాన్నకి చూపిస్తా. ఇదుగో నాన్నా. ఈ article…నాకోసం?’

‘అమ్మా! మా నానమ్మ magazine లో వినాయకుని గురించి article రాసింది. నాన్న మా కోసం చదివారమ్మా. I came to know so many things about వినాయకా!’

అనూ: మంచిది నాన్నా! పెద్దవాళ్ల మాటల్ని అందుకే miss చేయకూడదంటాను. మనకి తెలీనివి వాళ్లకి చాలా తెలుసు.

రవి: అమ్మా నీ article వల్ల చాలా విషయాలు తెలిశాయమ్మా మాకు కూడా.  I am very proud of you Ma.

‘నాయనా రవీ…! మీ నుండి పొందే ఈ చిన్న అప్రిషియేషనే నాకు శక్తీ బలం!! థాంక్స్‌ పిల్లలూ!’

నడవండి ఇంక. ఉండ్రాళ్లూ, పులిహోరలతో భోజనానికి.

.

**************************************

.

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾

 

******************************************************