11_010 సంక్రాంతి

 

రామాపురం ఒక చిన్న గ్రామం. సంక్రాంతి వచ్చింది.

రామాపురంలోని గ్రామస్థులందరూ అంనందంలో  మునిగి తేలుతున్నారు. ఎన్నడూ లేనంతగా సంతోషిస్తున్నారు.

రామాపురం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు ఆ ఊరికి ఎటువంటి రవాణా సదుపాయాలుండేవి కావు. ధనవంతులు సొంత గుర్రం బండిలో పట్టణం వెళ్ళి తమ వ్యవహారాలు చక్కపెట్టేవారు. విద్యార్థులు సైకిల్ మీద పట్టణం వెళ్ళి చదువుకొనేవారు . చిరు వ్యాపారస్తులు కాలి నడకన వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు.

ఇప్పుడు పరిస్థితి వేరు. గ్రామంలో చక్కటి సిమెంటు బాటలు కనిపిస్తాయి. సూపర్ డీలక్సు బస్సులు తిరుగుతున్నాయి. ప్రైవేటు టాక్సీలు పోటీ పడుతున్నాయి. పట్నం నుంచి మెట్రో రామాపురం వరకు నడపాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

ఈ ప్రగతి వెనకాల మూల పురుషుడొకడున్నాడు.

ఆయనే విశ్వనాథం గారు. విశ్వనాథం గారు అరవింద లోచనుడు కాడు, కానీ ఆజానుబాహుడు. రామాపురానికి విశ్వనాథం గారు ఒక పెద్దరాయడు లాంటి వ్యక్తి. తీర్పులు చెప్పడు. సలహాలు ఇస్తాడు. గ్రామస్థులకు ఏదైనా సమస్య వస్తే విశ్వనాథం గారిని సలహా అడుగుతారు. ఆయన నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సద్ది చెప్పుతారు. అందుకే ఆ ఊరి ప్రజలకు ఆయన మీద అత్యంత గౌరవం.  ఆయన ఎప్పుడైనా బజారులో నడిచి వెళ్తుంటే చేతులెత్తి  నమస్కరించని వాళ్ళు అరుదు.

విశ్వనాథం గారు పేరుకు తగ్గట్టే గొప్ప శివ భక్తుడు.

నమక చమకాలు నోటికి రావుగానీ శివ నామం ఎప్పుడూ ఆయన నాలుకపైన నాట్యం చేస్తుంది.

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోను మరియు శివరాత్రికి ఇంట్లో శివాభిషేకం చేయిస్తారు.

విశ్వనాథం గారి శ్రీమతి నడి వయసు లోనే గౌరీ లోకం ప్రస్తానం చేసింది. ఆయన నిప్పు లాంటి మనిషి. మళ్లీ వివాహం చేసుకోలేదు. ఆయన ఏకైక పుత్రుడైన రామలింగేశ్వర రావుకు తల్లి ప్రేమ లోటు రాకుండా తల్లి తండ్రి రెండు పాత్రలు చాకచక్యంగా పోషించాడు.

రామలింగేశ్వర రావు తెలివైన విద్యార్థి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాడు. విశ్వనాథం గారి సన్నిహితులు అబ్బాయికి  ఇంజినీరింగ్ చెప్పించమని అనేవారు. బంధువులు వైద్య విద్య బాగుంటుంది అనేవారు. కానీ విశ్వనాథం గారు ఇంకోలా ఆలోచించారు. తనకి  పదిహేను ఎకరాల పంట భూమి వుంది. అది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి. ప్రస్తుతం ఆయన సొంత వ్యవసాయం చేస్తున్నారు. తర్వాత తరం కూడా ఆస్తి కాపాడుకోవాలి. ఒకసారి  కౌలుకిస్తే పొలం చెయ్యి జారిపోతుంది. అందుకే తన ఏకైక కుమారుని వ్యవసాయం లో పట్టభద్రుని చేసి ఆధునిక పద్ధతుల ద్వారా మంచి ఫలితం పొందవచ్చునని ఆలోచన. దైవానుగ్రహం వలన రామలింగేశ్వర రావు తండ్రి ఆలోచనలకు సమ్మతించాడు. ఇటువంటి కుమార కుసుమం లభించడం శివ భక్తులకే సాధ్యం.

కాల గమనంలో రామలింగేశ్వర రావు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడై తర్వాత పి జి కూడా చేసి తండ్రికి అండగా నిలిచాడు.

ఆ ఊర్లో చాలా మందికి పంట భూములున్నయి. కానీ ఎక్కువ మందికి రెండు మూడు ఎకరాలకు మించి లేదు. అందరూ చిన్నకారు సన్నకారు రైతులే. వాళ్ళకి అన్నీ సమస్యలే. ఎరువుల సమస్య, ట్రాక్టర్ సమస్య, కూలీల సమస్య, ఆర్థిక సమస్య.

ఒక రోజు విశ్వనాథం గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ ఊర్లోని పొలాల  యజమానులను సమావేశపరిచి ఈ విధంగా చెప్పసాగాడు. ” చూడండి మిత్రులారా,  ఇప్పుడు మన మందరం ఎవరి పొలం వాళ్ళు దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నాము. ఎవరికి వారు పట్టణము వెళ్ళి విత్తనాలు,  ఎరువులు కొంటున్నారు. ఎవరికి వారు ట్రాక్టర్ బాడుగకు తెస్తున్నారు. ఇలా కాకుండా మనమందరం కలసి ఒక సంఘంలా ఏర్పడి సమిష్టి వ్యవసాయం చెస్తే సత్ఫలితాలిస్తుంది “. కొందరికి ఈ ప్రతిపాదన బాగా నచ్చింది. కొందరికి కొన్ని సందేహాలు వచ్చాయి. విశ్వనాథం గారు చాలా ఓపికగా వాళ్ళ ధర్మ సందేహాలు నివృత్తి చేసారు. ముఖ్యంగా రామాపురం  గ్రామస్థులు విశ్వనాథం గారిని బాగా  గౌరవిస్తారు. ఆయన మీద ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం.

ఒక శుభదినాన ‘రామాపురం గ్రామీణ రైతు సహకార సంఘం’ ఏర్పడింది. విశ్వనాథం గారు ఏకగ్రీవంగా అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. మిగిలిన కార్యవర్గం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సఖ్యతకు విశ్వనాథం గారి మచ్చ లేని వ్యక్తిత్వం, నిప్పు లాంటి నిజాయితీ, నిబద్ధత, కార్య నిర్వాహక చాతుర్యం, మరియు దృఢ సంకల్పం కారణం.

నాయకులు నీతి గా వుంటే ఉపనాయకులలో ఐక్యమత్యం సహజంగానే వస్తుంది.

విశ్వనాథం గారికి తన కార్యవర్గం మీద అత్యంత నమ్మకం. పట్టణంలో ఏ పని వున్నా కార్యవర్గ సభ్యులను పురమాయిస్తారు. వాళ్ళు కూడా ఇచ్చిన పనిని భక్తి శ్రద్ధలతో నిర్వహించేవారు

ఇప్పుడు రైతులందరి తరఫున కొంతమంది సభ్యులు పట్టణం వెళ్ళి టోకుగా విత్తనాలు, ఎరువులు కొంటున్నారు. అందరూ కలిసి చందాలు వేసుకొని సంఘం తరఫున రెండు ట్రాక్టర్లు కొన్నారు.

ఊర్లోని పొలాల్ని వంతుల వారి దున్నతున్నారు.

వ్యవసాయం రాణించాలంటే దైవ సహాయం మానవ ప్రయత్నం రెండూ వుండాలి. విశ్వనాథం గారు శివ భక్తుడు కావటంతో దైవ సహాయం సహజంగానే లభిస్తుంది. గ్రామస్థుల ఐక్యమత్యం వలన మానవ ప్రయత్నం రాణిస్తుంది.

మెదటి సంవత్సరం పంటలు బాగా పండాయి. పంటను పట్టణము రవాణా చేసి సమిష్టిగా గిట్టుబాటు ధర సాధించారు. వచ్చిన ధనాన్ని పెట్టుబడి శాతం లో పంచుకున్నారు. ఈ ఏడాది మునపటి కన్నా ఎక్కువ ధనం చేతికి వచ్చింది.

విశ్వనాథం గారు ఒక రోజు తన కుమారుడైన రామలింగేశ్వర రావు ను ఆప్యాయంగా దగ్గరగా పిలిచి వ్యవసాయంలో ఇంకా మెరుగు పద్దతులు చెప్పమన్నారు.  రామలింగేశ్వర రావుకు తండ్రి అడిగితే గానీ జోక్యం చేసుకోవడం అలవాటు లేదు.

రామలింగేశ్వర రావు కొంచెం ఆలోచించి ” నాన్న గారు ఇప్పుడు మనం కొంచెం సాగు నీటి సమస్య ఎదుర్కొంటున్నాము. అందరికీ సరిపోయే ఒక పెద్ద మెట్ల దిగడు బావి కట్టించి బిందు సేద్యం ద్వారా పంటలు పండించుదాము. మోటరు నడపడానికీ సౌర శక్తి వినియోగించుదాము. పండిన పంటను పట్టణంలో విక్రయించడానికి  సొంతంగా రెండు మినీ లారీలను కొందాం. ఇందు నిమిత్తం సంఘం తరఫున బ్యాంక్ రుణం పొందవచ్చు. ఏడాదికి మూడు పంటలు పండించుదాము. ఎప్పుడూ ఒకే పంట కాకుండా పంటల మార్పిడి చేద్దాము. అందులో ఒకటి కమర్షియల్ పంట వేద్దాం. పొలాల  గట్టు చుట్టూ పూల మొక్కలు పెంచుదాము. పూల మొక్కల వ్యాపారం లో రోజూ ఆదాయం వస్తుంది. తర్వాత శక్తి వున్న రైతులం శ్రమ దానం చేద్దాము, దాని వలన రోజూ వారీ కూలీలను తగ్గించవచ్చు ” అని తనకు తెలిసిన విషయాలు వివరించాడు. కొడుకు తాను అనుకున్న రీతిలో ప్రయోజకుడైనందుకు విశ్వనాథం గారు చాలా సంతోషించారు.

రామలింగేశ్వర రావు సూచనలను విశ్వనాథం గారు సంఘ సభ్యులకు విశదంగా వివరించారు.

అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సంవత్సరం తర్వాత సంవత్సరం రైతుల ఆదాయం పెరుగుతుంది. వాళ్ళ స్థితి గతులు బాగుపడుతున్నాయి.

రామాపురం యొక్క అభివృద్ధి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అధికారులు ఇదివరకు కన్నా ఇప్పుడు తరచూ వస్తున్నారు. ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల నిర్మించారు. రామాపురం లోని పిల్లలు విద్యకు దగ్గరయ్యారు. అలాగే  ప్రభుత్వ ప్రాధమిక వైద్యశాల మరియు మాతా శిశు సంక్షేమ కేంద్ర ఏర్పడింది. పుర ప్రజలు ఇదివరకన్నా ఆరోగ్యం గా ఊపిరి పీల్చుకుని జీవిస్తున్నారు. రామలింగేశ్వర రావు సాయంత్ర సమయంలో వయోజనవిద్యా కేంద్రం నడుపుతున్నాడు. దీనివలన రామాపురం లో నిరక్షరాస్యత సూన్యమైంది.

రామాపురం లో ప్రజల ఆదాయం పెరిగినది.

అందరికీ బ్యాంక్ ఖాతాలు డెబిట్ కార్డులు లభించాయి. ఊరంతా వై ఫై వచ్చింది. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తాయి. ప్రతి ఫోన్లో వ్యాలెట్ వున్నది. చిరు వ్యాపారాలు కూడా నగదు రహితంగా జరుగుతున్నాయి. ఐమాక్సకి పునాది పడింది. అలనాటి కుగ్రామం నేటి మేటి స్మార్ట్ గ్రామంగా మారింది.

రామాపురం పురోగతికి విశ్వనాథం గారి కృషి బాగా దోహదం చేసిందని ప్రభుత్వం గుర్తించి విశ్వనాథం గారిని  ‘ రైతు రత్న ‘ బిరుదుతో సత్కరించింది.

రోజులు గడుస్తున్నాయి. కాల గమనంలో సంక్రాంతి పండుగ  వచ్చింది. ప్రతి ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులు గొబ్బిళ్ళతో  శోభాయమానంగా గోచరిస్తున్నాయి. పుర జనులు ఆనందంగా ఉషారుగా వున్నారు. ఈ ఏడాది అత్యంత అధిక రాబడి వచ్చింది. తమ సుఖ సంతోషాలకు విశ్వనాథం గారు కారణమని రామాపుర వాస్తవ్యుల నమ్మకం.

రామాపురంలో ఇదివరలో లేని సంక్రాంతి సంబర క్రాంతి ఇప్పుడు సర్వత్రా విరాజిల్లుతుంది.

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾