13_002 బాలకదంబం – ఒక్కటే

అనగనగా ఒక గ్రామంలో భైరవశర్మ అనే ధనికుడైన బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతని భార్య వేదవతి. ఆ దంపతులకి ఆరేళ్ళ కొడుకు పేరు రాఘవ శర్మ.

భైరవశర్మ భార్య వేదవతి మడి, ఆచారాలని అధికంగా పాటించేవారు. కొడుకుని తమ కులపు పిల్లలతో తప్ప వేరే కులం వారితో కలవనిచ్చేవారు కాదు.

భైరవశర్మకి ఇంటిపనీ, తోటపనీ చేయడానికి సూరీడని పాలేరు ఉండేవాడు. సూరీడుకి ఒక కూతురు పేరు మంగళ. తల్లిలేని బిడ్డని ఒంటరిగానే పెంచుకొచ్చాడు. మంగళకి ఇప్పుడు ఎనిమిదేళ్ళు. పనికి వచ్చేటప్పుడు కూతుర్ని వెంటబెట్టుకుని వచ్చేవాడు.

 తండ్రి పని చేస్తుంటే తానూ చిన్న చిన్న పనులు చేస్తూ, ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుండేది మంగళ.

మంగళతో ఆడుకోవాలని ఉబలాటపడుతున్న కొడుకుని వద్దని వారించాడు భైరవశర్మ. 

“ఎందుకు నాన్నా అక్కతో ఆడుకుంటే ఏమవుతుంది?” కొడుకు ప్రశ్నకి కోపం ముంచుకొచ్చి “అది నీకు అక్కేమిటీ, వెధవ వరస కలపడం నువ్వూనూ” కసురుకున్నాడు.

“నువ్వే కదా పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకూడదన్నావు?”

 “మనవాళ్ళని అలా పిలవకూడదన్నాను”

“వాళ్ళు మనవాళ్ళు కాదా?”

“కాదు. వాళ్ళు అంటరాని వాళ్ళు. అలాంటి పిల్లతో నీకు ఆటలేమిటీ?”  

“అంటరాని వాళ్ళంటే?”

“అంటే వాళ్ళని మనం ముట్టుకోకూడదు, వాళ్ళతో కలిసి తిరక్కూడదు”

“మన వాళ్ళంటే?

“అంటే …అంటే…..నీకిప్పుడు చెప్పినా అర్థం కాదుగానీ పోయి ఆడుకో” 

తండ్రి విసుక్కునేసరికి బిక్క ముఖం వేసాడు రాఘవ.

ఎంత ఆలోచించినా తండ్రి మాటలు బోధపడలేదు సరికదా ‘వాళ్ళని ముట్టుకోకూడదంటాడు నాన్న కానీ మరి సూరీడు మా అందరి బట్టలూ ఉతుకుతాడు, ఆరిపోయిన బట్టలు మడత పెడతాడు, అవేగా మేము కట్టుకుంటాము! ఇల్లు ఊడుస్తాడు, అంట్లు తోముతాడు, గేదె పాలు పితుకుతాడు. ఆ పాలేగా నేను తాగుతాను! ఏంటో మరి?” వాడి చిన్న బుర్రలో సవాలక్ష సందేహాలు.

ఒకరోజు రాఘవ తన తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉంటే కొంచం దూరంలో కూర్చుని చూస్తోంది మంగళ.

ఇంతలో ఎక్కడినుంచో అదుపు తప్పిన గిత్త వేగంగా పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్న పిల్లల మీదకి వచ్చింది. అందరూ భయపడి అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తారు.

అదంతా ప్రక్కనే కూర్చుని చూస్తున్న మంగళ గభాలున పరుగెత్తి రాఘవ పైకి రాబోయిన గిత్తకు అడ్డు వెళ్ళి వాడిని బలంగా ప్రక్కకి  తోసేసింది. ఆ క్రమంలో గిత్త కొమ్ములు తగిలి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది.

పిల్లల అరుపులు విని తోటలో పనిచేస్తున్న సూరీడు పరిగెత్తుకుంటూ వచ్చి గిత్త కొమ్ములు పట్టుకుని లొంగదీయాలని ప్రయత్నిస్తుంటే తోడుగా మరి నలుగురు వచ్చి గిత్తని తాడుతో బలంగా కట్టి లాక్కెళ్ళారు.

కొడుకు అరుపులు విని  చేస్తున్న పూజ మధ్యలోనే వదిలేసి భైరవశర్మ, వంటపని వదిలేసి వేదవతీ ఉరుకున వచ్చి భయంతో ఏడుస్తున్న కొడుకుని కావలించుకున్నారు.

తన ప్రాణాలు అడ్డుపెట్టి కొడుకు ప్రాణాలు కాపాడిన మంగళ త్యాగం సాహసం భైరవశర్మ అంతరాత్మని మొదలంటా కుదిపేశాయి.   

వెంటనే, స్పృహ తప్పిన కూతుర్ని చూసి దిక్కు తోచక ఏడుస్తున్న సూరీడు ఒడిలోంచి, మంగళని తన చేతుల్లోకి ఎత్తుకుని గబగబా ఆస్పత్రికి తీసుకెళ్ళాడు భైరవశర్మ.

గాయంతో అధిక రక్త శ్రావమై మంగళకి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళ ది అరుదైన గ్రూపు రక్తం. సూరీడు రక్తం సరిపడదని తేలి వెంటనే రక్త దానం చేయడానికి ముందుకొచ్చాడు భైరవశర్మ.

పరీక్ష చేయగా భైరవశర్మదీ అదే గ్రూపని తేలింది. అలా సమయానికి  మెరుగైన వైద్యం అందడంతో  ప్రాణాపాయంనుంచి బయటపడింది మంగళ. 

“నాన్నా మంగళకి నావల్లనే కదా దెబ్బలు తగిలాయి” వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకుని దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ “మంగళ కాదు బాబూ అక్కా అని పిలవాలి సరేనా?” అన్నాడు.

“మరి వాళ్ళని అంటకూడదూ అన్నావుగా?”  

“నావల్ల ఘోరమైన తప్పు జరిగిందిరా బాబు. ఆ దేవుడు నా కళ్ళు తెరిపించాడు. ఎవరూ అంటరాని వాళ్ళు కాదు. అందరిలో ఉండేదీ ఒకే రక్తం. మనమంతా ఒక్కటే. అందరం కలిసిమెలిసి ఉండాలి”

ఇప్పుడు కూడా తండ్రి మాటలలో అంతరార్థం బోధపడకపోయినా, ఆ పసివాడికి మహదానందం కలిగించిన విషయం, ఇకపై తాను మంగళని అక్కా అని పిలవచ్చు, అక్క తో కలిసి ఆడుకోవచ్చు ఎంచక్కా అనేదే!  

****************** 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page