10_013 పాలంగి కథలు – పెద్ద తరంగం

.

                శలవులకి ప్రతీ ఏడాదీ కోనసీమ వెళ్లి ఉండటం అలవాటు. నాన్నగారికి పల్లెటూళ్లంటే ఎంత మక్కువో! ముందుగా అమలాపురం వెళ్లి, ఓ పదిరోజులు పోయాక బంధువుల ఊళ్లకి వెళ్లి రావడం రివాజు! అలా ముంగండ తాతగారింటికి వచ్చాం. మా అమ్మమ్మకీ తాతయ్యకీ కూడా నేనంటే తగని ముద్దు!

పెంకుటిల్లేకాని, పెద్ద మండువాలోగిలి అది. వీధిలో ఎత్తయిన అరుగులు. పెద్ద పెద్ద గడపలు! వాటిని దాటడం ఎంత కష్టమో! గడపమీద కాళ్లెట్టి దాటకూడదట! మద్రాసులో మా ఇంట్లోనూ గడపలున్నాయేకాని, ఇంతంత పేద్దవి కావు బాబూ! చెప్పొద్దూ! ఎవరూ చూడకపోతే గడపమీద కాలేసి దాటేసేదాన్ని!!

వీధివైపు గదిలో పడుకున్న నాకు తెల్లవారుఝామున

ఏహి ముదందేహి శ్రీకృష్ణా మాం

పాహీ గోపాల బాలకృష్ణా! కృష్ణా

అంటూ పాట వినబడి మెలకువ వచ్చింది. అప్పటికే అమ్మ లేచి, గదిలోంచి వెళ్లిపోయినట్లుంది!

‘నీల మేఘ శరీర నిత్యానందం దేహి’ అంటూ పాడితే, అది పూర్తయేసరికి–ఎదురింటి అరుగుమీంచి, ‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా! ఆ పతకానికీ పట్టె పదివేల వరహాలు రామచంద్రా’ అంటూ జగన్నాథం బాబయ్య అందుకున్నారు. ఆ పాట పూర్తయేసరికి–

‘ప్రక్కతోడుగా భగవంతుడు మును

చక్రధారిౖయె చెంతనె యుండగ’

తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ అంటూ ఇంకెవరో అందుకున్నారు.

‘రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా

కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా’

అంటూ తాతయ్యే మళ్లీ అందుకున్నాడు! ఈ పాట పూర్తిచేసి…ఈ పాట మన ప్రయాగ రంగదాసు కట్టాడు. ఆమధ్య రాజోలులో కలిసినప్పుడు పాడాడు. చాలా బాగుందని పాఠం చేశాను.

ఎంత చక్కగా కట్టాడ్రా!!

‘అలాగా ఈ కొత్తపాట ఎక్కడిదా! అనుకున్నాను. రంగదాసు రాశాడన్నమాట. చాలా బావుంది సుమా! నేనూ నేర్చుకోవాలి’.

ఈలోగా పెరట్లోంచి దూరంగా….

‘శ్రీసూర్యనారాయణా! మేలుకో!! హరిసూర్యనారాయణా, ఉదయిస్తు బాలుడూ ఉల్లి పూవూ ఛాయ– ఉల్లిపూవూ మీద ఉగ్రంపు పొడిఛాయ’ అంటూ తాతయ్య చెల్లెలు పాట వినిపిస్తూంది. అప్పుడే అమ్మమ్మ చల్ల చిలకడం ప్రారంభించినట్లుంది. చిలికే శబ్దంతోపాటు,

‘గుమ్మడేడే గోపిదేవి గుమ్మడేడే కన్నతల్లి. గుమ్మడిని పొడసూపగదవే అమ్మగోపెమ్మా!’ అంటూ పాడుతోంది సన్నగా! దూరంగా చెరువు గట్టున కాబోలు.

‘కిట్టమ్మా! గోపాలబాలా కిట్టమ్మా! నందయశోద తనయా నందాకుమారా రార నవనీత చోరా రార….’అంటూ పాలేరు కుర్రాడి గొంతది!

ఇలా ఎక్కడికక్కడ, ఎవరికి వాళ్లు పాడుతుంటే సన్నసన్నగా వినిపిస్తూంటే…మంచంమ్మీదే పడుకుని వినడం ఓ కమ్మని అనుభూతి! దక్షిణం వైపు కిటికీలోంచి వచ్చే చల్లగాలితోపాటు పాటలూ, అరుగులమీది వాళ్లు మాట్లాడుకునే మాటలూ, వింటూండటం…ఆ తెల్లారగట్ట చల్లగాలితో పాటు వినిపించే మాటలూ పాటలూ ఏదో పరవశాన్ని కల్గించేది!

‘ఒరేయ్‌ అబ్బీ! ఇవాళ సాయంత్రం రామాలయం మంటపంలో ఈ పాట అందరం కల్సి పాడుదాంరా. ఏం?’

‘అలాగేకాని బావా! ఆ పెద్ద తరగం నువ్వు పాడితే వినడం, మహదానందంగా ఉంటుంది సుమా! ఆమధ్యనోసారి చెప్పావ్‌ ఆ తరంగం అర్థతాత్పర్యాలు. కానీ, ఈ రోజు మరోసారి చెప్పి, మరీ పాడు. ఎందుకంటే, ఈరోజు కుర్రకారు కూడా భజనకి వద్దామనుకుంటున్నారులే. వాళ్లూ వింటారు! అందులో మధ్యలో వచ్చే జనాలు నువ్వలా అలవోకగా అనేస్తూంటే, ఎంత సొంపుగా ఉంటుందో…’

‘నీకూ ఒచ్చుగా?’

‘అవుననుకో! చెప్పాగా! నువ్వుపాడుతూంటే ఆ అందం వేరు!!’

‘తాం…ద్ధెయ్యదై్ధత త్తాకిట తకత క్కిణ్ణం కిణ్ణం ధరికిట ధరికిట

ధిమి ధిమిధిమికిట– తొంగిటకిట– త్తొంగత్తొ కగిణ– దినహత

ధిమితా–తాం–తాం–తకధిర్గుడు–తక తధిగిణతోం….

బాలగోపాలమా ముద్ధరా కృష్ణా– పరమకల్యాణగుణాకారా’

‘ఆహా! ఆ తరంగం, జతులూ, వింటూంటే కృష్ణమూర్తి కళ్లముందు నర్తిస్తున్నట్లే ఉంటుంది సుమా!!’

‘అవునోయ్‌. తరంగాల సొబగే వేరు! తీర్థులవారు అలా పాడుతూంటే చిన్నికన్నయ్య నాట్యం చేసే వాడుకదా!! గోపబాలుడు మెచ్చిన పాటలవి!!’

వేసంగి శలవలకి వచ్చిన నాకు, ఈ పాటలు గమ్మత్తుగా ఉండేవి! ఎందుకంటే అప్పటికే చెన్నపట్నంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ, వర్ణాలూ, త్యాగరాయకృతులూ, దివ్యనామ కీర్తనలూ పాడటం వచ్చి, కాస్త గర్వం పెరిగిన రోజులవి! పైగా పదాలూ తిల్లానాలూ కూడా పాడే స్థాయికొచ్చానాయె!! ఈ తరంగాలూ, అష్టపదులూ, ఆధ్యాత్మరామాయణకీర్తనలూ బోలెడన్ని చరణాలతో, కాస్త చాదస్తపు రాగాల్తో (అని అప్పటి నా ఉద్దేశం) ఈ సంగీతం నేర్చుకోని వాళ్లు పాడుతూంటే…చెప్పొద్దూ!! నాకేవంత గొప్పగా అనిపించేది కాదు. కానీ, పైకి మాత్రం ఈ భావాలేవీ తెలియనిచ్చేదాన్ని కాదు. తాతయ్యకీ వాళ్ల స్నేహితులకీ పట్నంలో సంగీతం నేర్చుకుంటూ త్యాగరాయ కీర్తనలూ అవీ పాడే నన్ను చూస్తే ముచ్చట. చిన్నపిల్లని కదా!! పొలంనించి వచ్చి, భోంచేసి, ఓ కునుకోయి లేచి (అవునూ…కునుకోవటం అంటే తెలుసా నిద్దరోవడం అన్నమాట!!) వీధి అరుగుమీద నన్ను కూర్చోబెట్టుకుని పాడించుకునేవారు. మా వదిన మా మావయ్య కూతురే! తను ఇక్కడే తాతయ్య, అమ్మమ్మల దగ్గర అష్టపదులూ, తరంగాలూ, కృష్ణ కర్ణామృతం శ్లోకాలూ, ఇంకా ఆధ్యాత్మ రామాయణ కీర్తనలూ, ఊర్మిళ నిద్ర, కుచ్చల కథ(కుశలవుల కథ అన్నమాట!) విశ్వరూపంలాంటి ఎన్నో పాటలు నేర్చుకుని, పాడేది. చెప్పాగా! శాస్త్రీయ సంగీతం బాగా పాడతాననే అహంలో ఈ పాటలు పల్లెటూరివాళ్ల చాదస్తపు పాటల్లాగా అనిపించేవి అప్పట్లో.

తాతయ్య, ఒదిన, అమ్మమ్మ అందరూ నన్ను ఆ పాటలు నేర్పిస్తాం, నేర్చుకోమనేవారు. నాకైతే…ఇప్పటికీ గుర్తు! బాలగోపాల తరంగం నేర్పిస్తానన్నప్పుడల్లా ఆడుకోవాలంటూ పారిపోయేదాన్ని. ముఖ్యంగా ఆ పాట చాలా చాలా పెద్దది మరి!

ఆ రోజుల్లో భాగవతుల మేళాలుండేవి. వాళ్లు భామాకలాపం, గొల్లకలాపం, తరంగాలూ అవీ డాన్సు చేసేవారు. ఇహ పెళ్లిళ్లల్లో ‘భోగం మేళం’ అంటూ పెట్టేవారు. డాన్స్‌ప్రోగ్రాం అన్నమాట! వాళ్లు కూడా ఈ తరంగాలకీ, జావళీలకీ, అష్టపదులకీ నాట్యం చేసేవారు. నిజం చెప్పనా? అప్పటికే, మద్రాసులో కమలా లక్ష్మణ్, ఉదయశంకర్, అమలాశంకర్‌ల డాన్స్‌ బాలేలూ, రుక్మిణీ అరండేల్, శిష్యూలూ చేసిన భరతనాట్యాలూ అవీ చూసిన నాకు ఇవన్నీ పల్లెటూరి వాళ్ల చాదస్తపు నాట్యాల్లానే అనిపించేవి. అయినా కుతూహలంగానే చూసేదాన్ని. పైకి మాత్రం నా మనసులో భావాన్ని ఎక్కడా అనలేదు. నయం!

మొత్తానికి వీళ్లందరి పోరు పడలేక వేసంగి శలవులయేసరికి, ‘ఏహి ముదందేహి; కృష్ణం కలయసఖి, విజయగోపాలతే మంగళం….’ఇలా కొన్ని చిన్నతరంగాలు నేర్చుకున్నాను. ఇంతకీ బాలగోపాల తరంగం మాత్రం నేర్చుకోలేదు.

ఒదిన మద్రాసు కాపరానికి వచ్చింది. ఇంట్లో ఎప్పుడూ నేనో, అక్కో, ఒదినో…ఏదో ఒకటి పాడుతూనే ఉండేవాళ్లం. ఒదినకి ‘రామ నన్ను బ్రోవరా!!, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో…, ప్రక్కల నిలబడి; మా జానకీ చెట్టుపట్టక…ఇలా కొన్ని కృతులంటే చాలా ఇష్టం. ‘నాకా పాటలు నేర్పవా శలవుల్లో?’ అని అడిగేది. కానీ ‘శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండా ఆ కృతులు పాడటం మాటలు కాదు! అయినా అలా పాడకూడదు కూడా!’ అనేదాన్ని కాస్త గర్వంగా! ఒదిన కళ్లల్లో ఆశాభంగం గమనించానుకాని, అప్పట్లో ఆ విషయం గురించి పట్టించుకోలేదు కాని/తర్వాత్తర్వాత ఆ విషయం మనసులో వేధిస్తుండేది. బాగా పెద్దయాక, పెద్ద తరంగంలో సొగసూ, దాని అర్థమూ తెలిశాక–ఒదినకి క్షమాపణ చెప్పుకున్నాను.

‘పోన్లేవే! ఇంక నేను సంగీతం నేర్చుకోవడం ఎక్కడ? నువ్వు పాడుతూంటే వింటాలే! కానీ తరంగాలు నేను నేర్పుతాను. నువ్వు పాడుదువుగాని. నీ కంఠం బాగుంటుంది’.

‘తరంగాలు నేర్చుకున్నానుగా?’

‘అవి మాత్రమేనా ఇంకా చాలా ఉన్నాయ్‌. ముఖ్యంగా బాలగోపాల తరంగం మొత్తం నేర్చుకుని, నువ్వుపాడితే వినాలని ఉందే!’ అనేది. ‘బాబోయ్‌! ఆ కొల్లేటి చాంతాడంత పాటా! నాకొద్దు బాబూ’ అంటూ పారిపోయేదాన్ని. ‘అయినా నువ్వు పాడుతున్నావ్‌గా! మళ్లీ నేనెందుకు?’ అనేదాన్ని. కానీ ఒదినకి మాత్రం ఆ పాట ఎలాగైనా నాకు నేర్పి, నా చేత పాడించుకుని, వినాలని ముచ్చట. అమ్మకూడా ఎన్నోసార్లు చెప్పింది. కానీ ఎప్పటికప్పుడు ఠలాయించి వెళ్లిపోయేదాన్ని!

ఒదిన గర్భవతిట! ఎప్పటిలాగానే అప్పుడప్పుడు అడుగుతుండేది పట్టువిడవని విక్రమార్కునిలా. ఒకరోజు అమ్మ నన్ను పిలిచి ‘చూడు కమలా! ఎన్నాళ్లనుండి అడుగుతూంది ఒదిన ఆ పాట నేర్చుకోమని. ఏం, నేర్పుతానంటే నేర్చుకోవడానికేం? అంత పొగరేమిటి నీకు? అలాంటి గర్వాలు సంగీతానికి పనికిరావవమ్మాయ్‌. సంగీతం అన్నాక అంతా ఒక్కటే. పైగా అర్థాలతోనూ, సందర్భాలతోనూ సహా ఎంత బాగా చెబుతుంది ఒదిన?!’ అంటూ చీవాట్లెట్టింది.

‘ఒద్దులే అత్తయ్యా. దానికిష్టం లేకపోతే–అయినా నేనే దాన్ని పదే పదే విసిగిస్తున్నానేమో’ అంటూ నొచ్చుకుంది. పట్టించుకోని నేను ఆటలకి వెళ్లిపోయాను.

ఆరోజు రాత్రి అమ్మ పక్కలో పడుకుని, ఏవో స్కూలు విషయాలు చెబుతూంటే, అమ్మ మెల్లిగా ‘చూడు కమలా! ఒదిన ఒట్టిమనిషి కాదు. దాని కడుపులో నీ మేనల్లుడున్నాడు. తల్లి తోడబుట్టిన పింతల్లులు లేరా? తండ్రి తోడబుట్టిన మేనత్తలు లేరా? నేను అడిగిన ఈ చిన్ని కోరిక తీర్చలేకపోయారు’ అని గర్భంలోని శిశువు బాధపడుతుంది. అందువల్ల ‘చీప్పిల్ల’ పుడుతుంది తెలుసా? అలా ఒక జీవుడు మనవల్ల బాధపడకూడదుకదా! అందుకే ఇలాంటప్పుడు వాళ్లు కోరిందేదైనా తీర్చడం మనందరి విధి. తెల్సిందా? ఎందుకు చెప్పానో విను. ఒదిన్ని నువ్వే అడిగి, ఇష్టంగా నేర్చుకుని పాడు. అర్ధం కూడా చెప్పమను. నువ్వు నేర్చుకుని పాడుతుంటే నీకూ నచ్చుతుంది’ అంది. అమ్మ మాటలు నా మనసుకు బాగా నాటాయ్‌.

మర్నాడే ‘ఒదినా పెద్ద తరంగం నేర్చుకుంటాను. నేర్పవా?’ అంటూ స్కూల్‌నించి రాగానే ఒదిన దగ్గరకి చేరాను.

‘ఇష్టం లేకున్నా బలవంతంగా, అమ్మ చెప్పిందని నేర్చుకోనక్కరలేదులే. ఫరవాలేదు’ అంది ముభావంగా! ‘కాదు కాదు…ఒదినా నిజంగానే నేర్చుకుంటాను. చెప్పవూ?’ అంటూ ఆరోజే మొదలెట్టాను మొత్తానికి నేర్చుకోవటం.

మా అరవ సంగీతం మాష్టార్ని అడిగాను. ఈ తరంగం వచ్చేమోనని. ఆయనైతే పూర్తిగా సంగీతఫక్కీలో నేర్పుతారుకదా అని!

‘అబ్బే…అబ్బే! అవి నాకు రావమ్మా. నేను పాఠం చెయ్యలేదు’ అన్నారు. తర్వాత తెలిసింది. అష్టపదులూ, తరంగాలూ, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలూ ఎక్కువగా ఆంధ్రదేశంలోనే పాడేవారని.

అప్పటికే మోహనరాగంలో వర్ణం, గీతం, కృతులూ నేర్చుకుని ఉన్నానేమో! తరంగం నేర్చుకుంటూంటే పాడే విధానంలో ఏదో ఊసులు తెలిసినట్టనిపించింది.

మొత్తానికి తరంగం బాగానే సాధన చేశాను. ఆ తరంగం అర్థతాత్పర్యాలూ సందర్భమూ చక్కగా విడమరచి చెప్పింది శ్రద్ధగా!

అది భాగవతంలోని కథ! చిన్ని కృష్ణుడు తోటి గోపాలకులతో కలిసి ఆవుల్ని మేపడానికి అడవులలోకి వెళ్తాడు. కాస్సేపయాక తాము తెచ్చుకున్న ‘చల్ది’ తినేశారు. అందరూ కాసేపు ఆడుకున్నారు. అందరికీ మళ్లీ ఆకలేసింది. ‘బాగా ఆకలేస్తూంది కృష్ణా!’ అంటారు. ‘సమీపంలో ఋషులు యజ్ఞం చేస్తున్నారు. అక్కడికి వెళ్లి, కృష్ణుడు మా అందరికీ భోజనం పెట్టించమన్నాడు’ అని అడగండి అంటాడు. అలాగే గొల్లపిల్లలంతా వెళ్లి, యజ్ఞం చేస్తున్న ఋషులనడుగుతారు. వాళ్లు ‘యజ్ఞం జరుగుతూంటే మధ్యలో మీకెలా పెట్టడం?’ అంటూ వెళ్లిపొమ్మంటారు. ఆ మాటే వచ్చి కృష్ణుడితో చెబితే– ‘ఈసారి యజ్ఞశాల వెనుకవైపుకి వెళ్లి, అక్కడ ఋషిపత్నులుంటారు. వారినడగండి’ అంటాడు. వాళ్లంతా మళ్లీ వెళ్లి కృష్ణుడు భోజనం కోరాడని ఋషిపత్నులతో చెప్పగానే, వారంతా వెంటనే పదార్థాలను సర్దుకుని వెళ్లి కృష్ణునికి, గోపబాలకులకి వడ్డించి, తృప్తిగా భోంచేయటం చూసి యజ్ఞం సఫలమైందని ఆనందపడతారు. యజ్ఙం చేస్తున్న ఋషులు తాము చేస్తున్న కర్మకాండ మీద మనసు లగ్నం చేశారేకాని, ‘యాజ్ఞాది కర్మఫలప్రదుడు కృష్ణుడే’ అన్నమాట మరిచారు. కానీ, ఋషిపత్నులు మాత్రం పరిపూర్ణమైన విశ్వాసంలో, శ్రీకృష్ణుడే దైవమని నమ్మి, భక్తితో, యజ్ఞం మధ్యలోనే అయినా యజ్ఞస్వరూపుడైన స్వామిని సంతృప్తుణ్ణి చేయడమే కర్తవ్యం అనుకున్నారు. యజ్ఞఫలాన్ని పొందారు.

అవతారాలన్నిటికీ మూలమైన దైవం ఆయనే! ఆ స్వామి పేరు తల్చుకుంటే చాలు! రాధాలోలుడూ, నగధరుడూ, గోపీమనోహరుడూ, ఆనందస్వరూపుడూ అయిన శ్రీకృష్ణుని భావనలో కరిగిపోవాలినదే మనసు. సంగీత, సాహిత్య విద్యావినోదుడితడు. అంతర్యామియై అందరిలోనూ ప్రవర్తిల్లే స్వామిని యోగులైనవారు అంతర్ముఖులై తమయందే దర్శించి, తన్మయులై బ్రహ్మానందాన్ని అనుభవించేందుకు కారణం ఆ స్వామియే!! సంతతం, ఆనందతాండవమాడే బాలగోపాలుడు…సత్యప్రతిజ్ఞ సంతానగోపాలం; భక్తజన బృంద ప్రసన్న గోపాలం; సద్గుణమణి గణభూషణాజాలం; కందర్పకోటి కల్యాణగోపాలం; సిద్ధజన సిద్ధాంత సిద్ధ గోపాలం; మత్సా్యవతారాది మహిమగోపాలం….ఇలా సాగే శ్రీకృష్ణ విభూతి వర్ణన చరణం చివర

రేహురేహురే–రింఖణరింఖణ–కాహుకాహురే–కంజరికంజరి ఝేకుఝేకురే–తర్భుణ ఝణఝణ–ఢే కఢేకురే–ఢింకుకు ఢింకుకు–జయ జయ జయ జయ–ఝణ తకిటతక–తొంగిటకిట–తొంగత్తోకగిణ–దినహత–థిమితా–తాం–తాం–తకధిర్గుడు–తకతధిగిణతోం… బాలగోపాల మా ముద్ధరా– కృష్ణా పరమ కల్యాణ గుణాకారా–

నీరద నీలకళేబర–కృష్ణా నిరుపమ కౌస్తుభ కంధరా‘‘ ఈ తరంగం నోటికి బాగా పాడటం వచ్చేశాక, ఒదిన, తాతయ్య చెప్పినట్లు, గోపాలక్రిష్ణయ్య ఆనందతాండవాన్ని అనుభూతమొనర్చుకోకుండా ఉండలేం!!!

నా యిష్టదైవం శ్రీకృష్ణస్వామి!! అందుకేనేమో! పెద్ద తరంగం పూర్తిగా నేర్చుకుని పాడుతూంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఒదిన ఆనందానికి అవధుల్లేవు!! దాదాపు ప్రతిరోజూ ఇద్దరం కలిసి పాడుతూంటే, ఈ పాట అంతకుముందు ఎందుకు నచ్చలేదబ్బా! అనిపించేది. మొత్తానికి ఒదినకి ‘చీప్పిల్ల’ పుట్టకుండా (అంటే ఏమిటో తెలియదుకాని!) ఆవిడ కోరిక తీర్చాను!!

అన్నట్లు ఆ వేసంగుల్లో శలవలకి ముంగండ వెళ్లినప్పుడు తాతయ్య ఊళ్లో బంధువుల్ని వాళ్ల స్నేహితుల్ని పిలిచి, మండువా సావిట్లో సమావేశపరిచి అందరికీ ఇష్టమైన ఆ పెద్ద తరంగం పాడించుకుని, ‘శభాష్‌ పట్నం పిల్లా! అంటూ ఇదుగో పెద్ద తరంగం ముద్దుగా పాడిన చిన్ని మనవరాలికి ఈ బహుమానం…’అంటూ తన చిటికెనవేలుకున్న ఉంగరం తీసిచ్చాడు. అక్కడే ఉన్న పిన్ని అమ్మని చూసి–‘అక్కా తమ్ముడు పుట్టిన వార్త ముందుగా నాన్నకి చెప్పి ఆరోజు నాన్న వేలి ఉంగరం నువ్వు సంపాదించావు. ఈరోజు నీ కూతురు ఓ తరంగం పాడి నాన్న మరో వేలి ఉంగరం సంపాదించింది. ఏమైనా ఘటికులు మీరు’!!

ఇది నాన్న ఆశీర్వాదం మాకు అంటూ తాతయ్య పాదాలకి అమ్మ నమస్కరిస్తుంటే, నేనూ తాతయ్య కాళ్లకి మొక్కి ఆశీస్సులు పొందాను. ఇదండీ! నా చిన్నప్పటి పెద్ద తరంగం కథ!!

శుభం

————-