11_008 హాస్యగుళికలు – అమ్మ నిక్కు – అమ్మాయి జర్కు

 

మౌనవ్రతం మాధవరావు: ఏమిటోయ్, హైటెక్ హేమా! ఎప్పుడూ విష్ణుమూర్తి చేతిలో చక్రంలా, సరస్వతి చేతిలో పుస్తకంలా నీ చేతిలో ఎప్పుడూ ఉండే ఐ పాడ్, సెల్ ఫోన్లు కనిపించడం లేదేంటి? వాట్స్ న్యూసు?

 

హైటెక్ హేమ: ఆపండి మీ ఊసు. ఇవాళ పెట్టినది తిని చక్కగా తొంగోండి. నేను చాలా బిజీ. పెళ్ళిళ్ళ పేరమ్మ, ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ మనింటికి వస్తున్నారు.

 

మాధవరావు: ఓ, వైఫై విమల, ఇంటర్నెట్ ఇందిర, మొబైల్ మీనా, వాట్సాప్ వనజ, కీబోర్డ్ కమల, ఐప్యాడ్ అంబుజం… వీళ్ళంతా వస్తున్నారా!?

 

హైటెక్ హేమ: మీకెప్పుడూ మా ఫ్రెండ్స్ ని ఆడిపోసుకోవడమే పని. ఇవాళ మీతో వాదించే టైం లేదు.

 

మాధవరావు: ఆఁ! ఆఁ! అర్థమైంది. ఇక నా పని ఎప్పుడూ ఇంతేగా! (నోరు మూసుకొని లోపలికి వెళ్తాడు.)

 

హైటెక్ హేమ: హాయ్. రండి రండి. మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం. కూర్చోండి.

 

వైఫై విమల: మీ అమ్మాయి ట్విట్టర్ ట్విన్కిల్ కి పెళ్ళి సంబంధాలు తీసుకొని పేరమ్మ వస్తోందంటే సామాన్యమైన విషయమా! కంగ్రాట్స్ అండీ.

 

ఇంటర్నెట్ ఇందిర: ఇంకా పేరమ్మ గారు రాలేదేమిటీ?

 

హేమ: ఆఁ, ఎక్కడో ఐటమ్ సాంగ్ భక్తిగా పాడుకుంటూ ఉండి ఉంటుంది. వస్తుందిలెండి, వెయ్యిళ్ళ పూజారి కదా! ఈలోగా మీరు తెచ్చిన సంబంధాల గురించి చెప్పండి.

 

మొబైల్ మీనా: మంకుపట్ల మల్లీశ్వరి గారి సంబంధం చూడు. అబ్బాయి పేరు మానవ్. 6.2.

 

హేమ: ఏమిటది? అబ్బాయి జీతమా? హైటా?

 

మీనా: జీతం హేమా. పిల్లవాడు యుకేలో ఉంటాడు. ఒక్కత్తే చెల్లెలు, ఛాయాదేవి. చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం.

 

హేమ: ఇంతకీ ఆ ఛాయాదేవికి పెళ్ళైందా?

 

మీనా: సంబంధాలు చూస్తున్నారు. ఆడపడుచు పెళ్ళి బాధ్యత దీనికెందుకు? ఇదసలే చిన్నపిల్ల.

 

ఇంటర్నెట్ ఇందిర: అయితే ఈ సంబంధం విను. సుడిగాలి సూర్యకాంతం గారబ్బాయి.

 

హేమ: ఆపవే ఇందిరా! ఇంటిపేరు వింటేనే హడలెత్తుతోంది. సుడిగాలట. మరి అబ్బాయి పేరు తుఫానా సునామీనా! పైగా అత్తగారి పేరు వింటూంటేనే ఈ సంబంధం వద్దనిపిస్తోంది. నెక్స్ట్?

 

వాట్సాప్ వనజ: ఇది వినవే హేమా పిడివాదం ప్రభావతి గారబ్బాయి. ఎనిమిదిన్నర లక్షలు. పిల్లాడు దర్జాగా ఉంటాడు. అమెరికాలో సెటిలైపోయాడు.

 

హేమ: అయితే అబ్బాయి అమెరికా. లగేజ్ ఇండియా. ఇంతకీ వారెంతలో ఉన్నారో!?

 

వనజ: వాళ్ళకి ఒక్కడే అబ్బాయి. ఇక ఇవాళో రేపో మీకున్నదంతా వాళ్ళదే కదా. ఎప్పుడైనా సరదాగా ఇండియా వచ్చి ఉందామనుకున్నప్పుడు మీరు రాసివ్వబోయే ఇల్లు ఉండనే ఉంది.

 

హేమ: ఆఁ ఆఁ ఉంటుంది! అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అంత ఖర్మ పట్టలేదులెండి మా అమ్మాయికి. ఈ సంబంధం కాన్సెల్. నెక్స్ట్?

 

కీబోర్డ్ కమల: అయితే ఈ సంబంధం ఎలా ఉంటుందీ? ఉడుంపట్టు ఉమామహేశ్వరి గారబ్బాయి. మహేష్. మహేష్ బాబు ఫ్యాన్. ఈ అబ్బాయి కూడా హీరోలా ఉంటాడంటే నమ్ము.

 

హేమ: అసలే ఉడుంపట్టు వారు. మరి తాపట్టిన కుందేటికి మూడు కాళ్ళేనా వారి వ్యవహారం?

 

కమల: మూడు కాకపోతే ముప్పై. నీ పట్టు మాత్రం సామాన్యమా?

 

హేమ: అబ్బాయి తల్లిదండ్రులు సీనియర్ సిటిజెన్సా? సూపర్ సీనియర్ సిటిజెన్సా?

 

కమల: ఎందుకలా అడుగుతున్నావు?

 

హేమ: ఆఁ, ఏంలేదు. సీనియర్ సిటిజన్స్ అయితే రైల్వే టిక్కెట్లలో కన్సెషన్స్, గుళ్ళలో స్పెషల్ దర్శనాలకి తప్ప మా అమ్మాయి పనికి ఏ విధమైన కన్సెషనూ ఉండదు. ఉదయాన్నే లేచి హార్లిక్స్ లు, విక్స్ లు, అయొడెక్స్ లు, నక్స్ లు ఇవ్వడానికే సమయమంతా సరిపోతుంది. “దొరకునా ఇటువంటి సేవ” సంబంధం మాకొద్దు. నెక్స్ట్?

 

ఆన్లైన్ అమల: అయితే హేమా.. నేనొక సంబంధం తెచ్చాను విను. కయ్యాలమారి కైకమ్మ గారికి ఒక్కడే కొడుకు. ఇద్దరు కూతుళ్ళు. ఆడపిల్లలకి ఈ ఊరి సంబంధాలే చేశారు.

 

హేమ: ఆడపిల్లలకి ఊళ్ళో సంబంధం అంటే నా కూతురికి ఊపిరాడదేమో! ఇక పండగలు, పబ్బాలు, పూజలు, వ్రతాలు, వీకెండ్స్ అన్నీ ఇక్కడే. ఆస్తంతా ఇక హారతి కర్పూరమే. నా కూతురికి ఇక మిగిలేది చేతిలో చిప్పే.

 

ఐప్యాడ్ అంబుజం: అయితే మా ఫ్రెండ్ సంకటాల సంతానలక్ష్మి గారి అబ్బాయి ఉన్నాడు, విను. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. స్ఫూరద్రూపి, బాధ్యతలు తెలిసినవాడు. మీ అమ్మాయి సుఖపడుతుంది.

 

హేమ: ఆఁహా…

 

అంబుజం: వీరికి ఇద్దరు అమ్మాయిలు,ముగ్గురు అబ్బాయిలు. ఈ అబ్బాయి చివరివాడు. ఉమ్మడి కుటుంబం.  ఒక్కొక్కరికీ ఎంత లేదన్నా పాతిక ఎకరాలు ముడతాయి. ఆలోచించుకో.

 

హేమ: చాల్లేవమ్మా చెప్పొచ్చావ్! కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ అన్న సామెత నీకు తెలియనిదా! అసలే మా అమ్మాయి (గుండమ్మ కథలో జమున టైపు.) ఎర్లీ మార్నింగ్ 10 గంటలకు అలారం పెట్టుకొని మరీ లేస్తుంది. దానికక్కడ బెడ్ కాఫీ ఎవరిస్తారు? అయినా ఓ చీర

కొనాలన్నా ఓ షికారుకెళ్ళాలన్నా సవాలక్ష పర్మిషన్లు, కోటి అప్లికేషన్లు కావాలి. అందరికీ నచ్చేలా నడుచుకొచ్చేసరికి నా కూతురి జీవితం తెల్లారిపోతుంది. అయినా ఈ సంబంధం అంత బావుంటే నాదాకా ఎందుకొచ్చావ్? నీ కూతురికే చేయలేకపోయావా?

 

అంబుజం: నాకంత సీను లేదులే. ఇటువంటిదేదో జరుగుతుందని తెలిసే నా కూతురు తనకు నచ్చిన వాడితో కనబడకుండా పోయింది.

 

పేరమ్మ ప్రవేశం: కాస్త ఆలస్యంగా కనిపిస్తున్నందుకు క్షమించాలి.

 

హేమ: రండి, రండి పేరమ్మ గారూ…

 

పేరమ్మ: మీకు లక్షసార్లు చెప్పాను, నన్ను పేరమ్మ కాదు, Alliance Arranger అని పిలవమని.

 

అందరూ: సరేనండీ, అలయన్సో బ్రిలియన్సో, కూర్చోండి, కూర్చోండి.

 

పేరమ్మ: ఏం కూర్చోవడమో! ఇప్పుడే రాంగ్ నంబర్ రమణమ్మ గారి రెండో కూతురికి రెండో మొగుణ్ణి కుదిర్చి వచ్చేసరికి నాకు చుక్కలు కనిపించాయి.

 

హేమ: అయ్యో, పాపం! అలసిపోయి వచ్చినట్లున్నారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జూస్?

 

పేరమ్మ: ఇవేమీ వద్దు కానీ Boost is the secret of my energy. అదేదో కాస్త ఇచ్చుకుంటే ఇక వర్షం వెళ్ళేలోగా నేను క్లబ్ లో ఉండాలి.

 

హేమ: అమ్మా, పేరమ్మా! అత్తామామల్లేని సంబంధం ఏదన్నా ఉంటే చెప్పండి బాబూ.

 

పేరమ్మ: లేకేం? మీ స్టేటస్ కి తగినట్టుగా ఒంటికాయ సొంటికొమ్ము లాంటి సంబంధం ఒకటుంది. ఇంటి పేరు జగడాలవారు. అబ్బాయి పేరు జగదీశ్. అనకూడదు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్న ఎంత పుణ్యాత్ములో! కోడలి చేత చీవాట్లు, దెప్పులు తినకుండా పాపం ఈమధ్యే కాలం చేశారు.

 

హేమ: అమ్మా! ఇప్పుడు మీరు Alliance Arranger అనిపించారు. ఇలాంటి సంబంధం కోసమే టార్చ్ లైట్ వేసి ఇండియా అంతా వెతుకుతున్నాను. అమ్మా సూరమ్మా, ఇంకా ఇలాంటి సంబంధాల లిస్ట్ ఉంటే చెప్పండి.

 

మాధవరావు: అమ్మాయిని ఒక్కమాట అడిగి…

 

హేమ: ఏమిటి అమ్మాయిని, మిమ్మల్ని అడిగేది? వెళ్ళి హాయిగా కాఫీ తాగండి.

 

పేరమ్మ: ఫ్రెండ్స్! అయితే ఈ సంబంధం మీకు ఓకేనా?

 

అందరూ: హేమా! ఆ వచ్చేది మీ అమ్మాయి twinkle లాగా ఉందే! కూడా ఒకబ్బాయి, మెడలో దండలు…

 

హేమ: ఆఁ ఆఁ! ఎంత పని చేశావే! ఏమిటీ అఘాయిత్యం? నువ్వు బయటికెళ్ళి చేసింది ఇదా! ఎవరతను?

 

ట్విట్టర్ Twinkle: ఆయనే మీ అల్లుడమ్మా! మా ఆఫీస్ కొలీగ్. నాకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు.

 

పేరమ్మ: అయితే మరి ఆ సంబంధం?

 

Twinkle: సంబంధం లేదు, గింబంధం లేదు. వెళ్ళి రండి. మళ్ళీ కనిపించండి.

 

మాధవరావు: ఇకనైనా బుద్ధొచ్చిందా నీకు? హై క్లాస్ సంబంధాల మోజులో పడి పిల్ల అభిప్రాయం తెలుసుకోకుండా పెత్తనం వెలగబెట్టావ్. నేను నెత్తీ నోరూ కొట్టుకొని చెబితే వినక నా నోరు మూయించావ్. అనుభవించు.

 

ఫ్రెండ్స్: రండర్రా! చూడవలసిందంతా చూశాం. వినవలసినదంతా విన్నాం. ఆల్ ద బెస్ట్ అమ్మా! వస్తాం.

 

Twinkle: ఎలా ఉంది నా jerk!

             ఎక్కిందా నీకు kick?

 

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾