తెలంగాణ ప్రాంతంలో మాత్రమే జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ తెలంగాణ ప్రజలందరికీ ప్రీతిపాత్రమైనది. భగవంతుణ్ణి పూలతో పూజించటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆనవాయితీ. అయితే, పూలనే గౌరీదేవిగా భావించి పూజించటం ఈ ప్రాంతవాసుల ప్రత్యేకత. మహిళల మధ్య, కుటుంబాల మధ్య ప్రేమానురాగాలను పెంచే అద్భుతమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ.
బతుకమ్మ పండుగను పెత్రమావాస్య (భాద్రపద బహుళ అమావాస్య) నుండి తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఆశ్వయుజ శుక్ల అష్టమి అనగా, దుర్గాష్టమి నాడు అత్యంత వైభవంగా పుట్టింటి నుండి అత్తగారింటికి బతుకమ్మను పంపిస్తున్నట్టు అనుకొని స్త్రీలంతా కలిసి దగ్గరలోని చెరువులో అయినా, కొలనులో అయినా ఓలలాడిస్తారు. నీటిలోవదులుతారు. చివరి రోజున నైవేద్యంగా తొమ్మిది రకాల సద్దులు చేస్తారు.
బతుకమ్మ పండగకు సంబంధించి ఒక కథ :-
పూర్వము చోళ దేశములో ధర్మాంగుడు అనే రాజు వుండేవారు. అతని భార్య సత్యవతి. వారు సంతానం కోసం నూరు నోములు నోముకుని నూరు మందిని కన్నారు. వారు అత్యంత శూరులైనా కూడా శత్రువుల చేతిలో చనిపోతారు. ఆ బాధతో రాజు, రాణి రాజ్యం వదిలిపెట్టి వనములో నివసిస్తూ లక్ష్మీ దేవి గురించి ఘోర తపస్సు చేస్తారు. ఆ లక్ష్మీ దేవి వీరి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అయి ఏ వరం కావాలో తెలుపండి అంటుంది. అప్పుడు రాణి సత్యవతి లక్ష్మీ దేవితో నువ్వే నాకు కూతురిగా నా కడుపున పుట్టాలి అని కోరుకుం ది. అందుకు లక్ష్మీ దేవి సంతోషం చెంది తథాస్తు అని ఆ రాణి కి కూతురిలా పుడుతుంది. ఆ సమయంలో మునులు, ఋషులు, అత్రి, వశిష్ఠ మహ ఋషులు కూడా వచ్చి ఆ లక్ష్మీ దేవికి బ్రతుకడానికి వచ్చినది కనుక “బతుకమ్మ” అని పేరు పెడతారు. ఆ రాజు రాణి ధన్యులుగా భావించి సంతోషముగా వారి రాజ్యానికి వెళ్ళి చక్కగా రాజ్యపాలన చేస్తాడు. కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు “చక్రాంగుడు” అనే పేరు తో రాజు వేషములో ఈ రాజు ఇంటికి వచ్చి, వారి పుత్రికైన లక్ష్మీ దేవిని వివాహం చేసుకుని ఇల్లరికంగా ఉంటాడు. వారు పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉంటారు. రాజ్యం సకల సౌకర్యాలు, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉంటుంది. రాజు, రాణి, బతుకమ్మ రూపంలో లక్ష్మీదేవి, చక్రాంగుడు రూపంలోని విష్ణువు పిల్లా పాపలతో సిరిసంపదలతో సంతోషంగా ఉంటారు.
అలా ఈ జగతిలో శాశ్వతంగా ఆ లక్ష్మీ దేవి బతుకమ్మ గా ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు పుట్టింటికి వచ్చినట్టు వచ్చి, ప్రజల మధ్య ఉండి అందరికి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలిగించి చివరి రోజు అత్తవారింటికి వెళ్తున్నట్టుగా ఆ పూలబతుకమ్మను నీటిలో సాగనంపి, మళ్ళీ ఏడు రావాలని ఆ గౌరిదేవి, లక్ష్మీ దేవిని రూపంలో ఉన్న బతుకమ్మను మహిళలంతా వేడుకుంటారు.
ఈ పండుగలో పూలకెంత ప్రాధాన్యముందో పాటలకీ అంతే ప్రాధాన్యముంది. బతుకమ్మ పాటలన్నీ ఎప్పుడో పూర్వకాలంలో అజ్ఞాత మహిళలు ఆశువుగా అల్లినవే. సరళమైన భాషతో, రాగయుక్తమైన శైలిలో బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే అందమైన పాటలివి. వీటిలోని సాహిత్యవిలువలు అమూల్యమైనవి.
జానపద, పురాణేతిహాస, చారిత్రక ఘట్టాలతో పాటు సున్నితమైన మానవ సంబంధాలు పాటలలో ప్రధాన వస్తువులు.
బతుకమ్మ పండుగ వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి అంతా పూల వనంలా అందంగా కనువిందు చేస్తుంది. రకరకాల, రంగురంగుల పూలు విరబూస్తాయి. ఈ కాలంలో ప్రకృతిలో లభించే అడవిపూలనే ఎంచుకొని బతుకమ్మను పేర్చుతారు. తంగేడు, గునుగు, కట్ల, గోరంట, గుమ్మడి, రుద్రాక్ష, మందార, గన్నేరు, సీతజడల పూలు మొదలైనవాటితో ఎంతో ఆకర్షణీయంగా బతుకమ్మను తీర్చిదిద్దుతారు.
ఔషధ గుణాలున్న ఈ పూలను వాడటం వలన వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరాలను నివారించుకోవచ్చు. ఎన్నో జబ్బులు నివారించడంలో తంగేడు వంటి అడవిపూలు మంచి ఔషధంలాగా పనిచేస్తాయి. ఆధునిక వైద్యులు కూడా ఈ విషయాలను ఒప్పుకుంటున్నారు.
ఇక నైవేద్యాల విషయానికొస్తే… ఈ తొమ్మిది రోజులూ ఆరోగ్యాన్ని ప్రసాదించే ధాన్యాలనే నైవేద్యాలలో ఉపయోగిస్తారు. రోజుకొక రకమైన పులిహోర, చివరి రోజైన సద్దుల బతుకమ్మ రోజు తొమ్మిది రకాల సద్దులు (పులిహోరలు) చేస్తారు. చింతపండు, నువ్వులు, కొబ్బరి, పల్లీలు, పెసరపొడి, ఆవపొడి, దద్దోజనం (పెరుగన్నం), బెల్లం అన్నం, నిమ్మకాయ, మామిడికాయ… ఇలా అందుబాటులో ఉన్నవాటితో చేస్తారు.
సద్దుల బతుకమ్మను తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా నువ్వులపొడి, పల్లీలపొడి, కొబ్బరిపొడి, నెయ్యి కలిపిన సత్తుపిండి, తులసీదళాలు మొదలైనవి నైవేద్యంగా తీసుకెళ్తారు. వర్షాకాలంలో శరీరానికి వేడి కలగాలని నువ్వులు, పల్లీలు మొదలైనవి బెల్లంతో కలిపి నైవేద్యం చేస్తారు. దీని ద్వారా ఐరన్, ప్రోటీన్లు లభించి ఆరోగ్యంగా ఉంటాము. అందుకే ఈ పండుగ ఆరోగ్య ప్రదాయిని అని కూడా చెప్పుకోవచ్చు.
బతుకమ్మకు పాడే పాటలు జీవితంలోని ఎన్నో రకాల కోణాలను తెలియజేస్తూ మంచి విషయాలు చెప్పేవిగా ఉంటాయి. అటువంటి కొన్ని పాటలను పరిశీలిద్దాం.
బతుకమ్మ పండుగ తెలిసిన ప్రతీ ఆడపడుచుకు తెలిసే పాట ఇది…
ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే గౌరమ్మ
తంగేడు పువ్వప్పునే గౌరమ్మ
తంగేడు కాయప్పునే గౌరమ్మ
తంగేడు పువ్వుతోని ఆడెవారెవ్వరో పాడెవారెవ్వరో
అందాన పుట్టినా బంగారు బాలలు
నెలకొన్న నెలరాజులే గౌరమ్మ
ఎప్పటికి వైభోగమే గౌరమ్మ
ఇంకేమి పువ్వప్పునే గౌరమ్మ
ఇంకేమి కాయప్పునే గౌరమ్మ
ఇలా గుమ్మడి, గునుగు, గోరంట, కట్ల, మందార అంటూ రకరకాల పూలను చెప్తూ పాట పాడుతారు. దీన్ని బట్టి ఆ కాలంలో దొరికే ఔషధ గుణాలున్న పూల గురించి మనకు తెలుస్తుంది.
జనకు జనకునింట్లో కోల్
సత్య జనకునింట్లో కోల్
పుట్టింది సీతమ్మ కోల్
పురుడే కోరింది కోల్
పెరిగింది సీతమ్మా కోల్ పెళ్ళి కోరింది కోల్
అంటూ సీతాకళ్యాణం పాట.
శ్రీ గౌరి నీపూజ ఉయ్యాలో
చేయబూనితినమ్మ ఉయ్యాలో
కాపాడి మమ్మేలు ఉయ్యాలో
కైలాస రాణి ఉయ్యాలో
అంటూ మహిళలందరూ తమ పసుపుకుంకుమలను కాపాడి, సకల సౌభాగ్యాలు ఇవ్వమని ఆ గౌరీదేవిని కోరేపాట. ఈ పాట ద్వారా స్త్రీల భక్తి తెలుస్తుంది.
గొల్లభామలమ్మా చక్కని
గోపిక స్త్రీలమ్మా చక్కని
పదహారు వేల స్త్రీలు భామలు
పడుచు కన్యలమ్మా భామలు
అంటూ గోకుల కృష్ణుడు, గోపికల మధ్య రాసక్రీడల పాట.ఈ పాట ద్వారా కృష్ణ లీలలు తెలుస్తాయి.
కలవారి కోడలు కోల్
కలికి కామాక్షి కోల్
వచ్చిరి అన్నలు కోల్
వనములు దాటి కోల్
పండుగకి అన్నలు అక్కచెల్లెళ్ళని పుట్టింటికి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇంటికి వచ్చి వారి అత్తమామల అనుమతి తీసుకొని తోబుట్టువులను తమతో తీసుకెళ్ళే పాట. ఇటువంటి పాటల వల్ల కుటుంబం, సంస్కృతి, సాంప్రదాయం, బాంధవ్యాలు, బాధ్యతలు తెలుస్తాయి. చక్కటి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను తెలిపే పాట ఇది.
రోజు బతుకమ్మను ఓలలాడించే పాట పాడుతారు.
ఇసుకలో పుట్టిన గౌరమ్మా
ఇసుకలో పెరిగిన గౌరమ్మా
పసుపులో పుట్టిన గౌరమ్మా
పసుపులో పెరిగిన గౌరమ్మా
ఇలా కుంకుమలో, పూలలో, అక్షింతలలో పుట్టిన గౌరమ్మా అంటూ అన్నింటినీ కలిపి చెప్తూ, అన్ని కులాల పేర్లు కూడా చెప్తూ పాట పాడుతారు. అంటే, అందరూ కులమతాలను వీడి, వాటికి అతీతంగా కలసికట్టుగా ఈ పండుగను స్త్రీలు, పిల్లలు కలసి చేసుకుంటారని అర్థమవుతుంది.
చివరగా బతుకమ్మను నీళ్ళలో వదిలి మళ్ళీ ఏడు రావాలని వేడుకుంటూ ఓలలాడించే పాట.
హిమవంతు నింట్లో పుట్టి
హిమవంతు నింట్లో పెరిగి
అంటూ శ్రీమహాలక్ష్మి రూపమైన బతుకమ్మను గౌరీదేవిగా భావించి పుట్టింటి నుండి అత్తవారింటికి పంపిస్తున్నట్టుగా భావిస్తూ అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో తెలియజేస్తూ సాగే పాట ఇది.
అత్తమామల పట్ల బుద్ధి కలిగి వుండాలి, ఎవరితో ఎదురు తిరిగి మాటకు మాట సమాధానం ఇవ్వకూడదు, ఎక్కువగా బయట తిరుగకూడదు,
సాయంత్రం నిద్రపోవటం మంచిది కాదు, కాళ్ళతో భూమిని తన్నకూడదు, పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లల ప్రవర్తన వలన తల్లిదండ్రులకు, అత్తమామలకు చెడ్డపేరు రాకుండా, కుటుంబ గౌరవమర్యాదలు కాపాడాలి అని, అసలు స్త్రీలు ఎలా మసులుకోవాలో తెలియజేస్తున్నట్టుగా ఉంటుందీ పాట.
పెళ్ళైన ఆడపిల్లలు పండుగ సందర్భంగా పుట్టింటికొచ్చే ఆనవాయితీ ఉండబట్టి చిన్ననాటి స్నేహితులందరినీ కలుసుకోవచ్చని పెళ్ళైన మహిళలంతా ఈ పండుగ కోసం ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురు చూస్తూంటారు. ప్రతి సంవత్సరం స్త్రీలు అందరూ వారి చిన్ననాటి స్నేహితులను ఈ తొమ్మిది రోజులలో ఒకసారైనా తప్పక కలుస్తారు. స్నేహానికి ప్రతిరూపం ఈ బతుకమ్మ పండుగ..
ఈ విధంగా బతుకమ్మ పండుగ భక్తిని పెంపొందించే పండుగ. అంతేకాక ఆరోగ్యాన్ని, కుటుంబబాంధవ్యాలను, ప్రకృతిని,
సుఖసంతోషాలను, సంస్కృతీ సాంప్రదాయాలను తెలియజేసే సంపూర్ణమైన పండుగ.