11_014 తో. లే. పి. – కనకదుర్గ

కనకదుర్గ డింగరి–

ఇది తన అసలు పేరు.. కానీ నాకు ఆ అమ్మాయి కనకదుర్గమ్మ.. పుత్రికా సమానురాలు. కనుక ఆప్యాయంగా తనని కనకదుర్గమ్మ, దుర్గమ్మ అని పిలవడం అలవాటు. మన విజయవాడ లో ఇంద్రకీలాద్రి  పైన వెలసివున్న కనకదుర్గమ్మ కి ప్రతి రూపం గా తనని భావిస్తూ ఉంటాను. తాను నన్ను బాబాయి గారు అని  ప్రేమగా వాత్సల్యం తోనూ, వినయం తోనూ పిలుస్తూ ఉంటుంది. మాకు పరిచయం ఏర్పడి దాదాపు దశాబ్దానికి పై మాట.. ప్రసిద్ధ కవి, రచయిత, సినీ గేయ రచయిత అయిన శ్రీ దాశరధి ( కృష్ణమాచార్యులు ) గారికి దుర్గ సాక్షాత్తూ మేనగోడలు. అలాగే వారి సోదరుడు దాశరధి రంగాచార్య గారు కూడా ప్రముఖ కవి, రచయిత. బహుశా : ఆయా కారణం వల్ల కావచ్చు. దుర్గ కి కూడా ఆ సాహిత్య సువాసనలు వారి నుండి సంక్రమించాయి.   

దుర్గమ్మ కి చిన్నప్పటినుండి చదువు, సాహిత్యం అంటే వల్లమాలిన అభిమానం. పొలిటికల్ సైన్స్ లో ఎమ్. ఎ. చేసి జర్నలిజం లో డిప్లమో  పొందింది. అది ఆధారం గా రచనలు సాగిస్తూ, టోరీ.. రేడియో లో R. J. గా చేస్తూ ఉంది. శ్రీవారు శ్రీనివాస్… ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఈ దంపతులకు సంతానం. దేవాన్, పెన్సయిల్వేనియా, అమెరికాలో చాలా కాలం గా వీరి నివాసం.

దాశరధి గారితో నాకు పరిచయం ఉండడం తో ఆయన తరచూ నాకు ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవారు. 2, 3 పర్యాయాలు మేము కలుసుకున్నాము కూడా…. ఖమ్మం పట్నానికి సమీపం లోనే వారి స్వగ్రామం. నేను ఖమ్మం లో నీటిపారుదల శాఖ లో ఇంజినీర్ గా దాదాపు ఎనిమిదేళ్లపాటు పని చేసాను. నా వృత్తి గురించి విని దాశరధి గారు నాకు వ్రాసిన ఒక ఉత్తరం లో ” సుబ్బారావు గారు.. మీరు ఇంజినీరు గా చేస్తూన్న పని చాలా గొప్ప పని, ఏమంటే అలనాడు భగీరధుడు తీవ్ర తపస్సు చేసి శివుడి జటాజూటం నుండి గంగమ్మను భూమి కి రప్పించి ఆ భూమిని సస్యశ్యామలం గావించాడు… నేడు మీరూ ఇంచుమించు అదే పని చేస్తున్నారు.. పదిమందికీ మహోపకారం చేస్తున్నారు ” అని. నాకు ఆ ఉత్తరం చూసి చాలా ఆనందం కలిగింది. ఇదే విషయాన్ని, అటు తరువాత కనకదుర్గమ్మ దాశరధి గారి గురించి వ్రాసిన ఒక బ్లాగ్ ని చదివి స్పందించి వ్రాస్తూ ప్రస్తావించాను. ఆ ప్రస్తావన మా పరిచయానికి నాంది పలికింది.  

తరువాత తాను రేడియో జాకీ గా పని చేస్తూన్న టోరీ లో ఏర్పాటు అయిన దాశరధి గారి పై ప్రత్యేక కార్యక్రమం కోసం నన్ను ఫోన్ లో ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేసింది /

మరొక సంగతి. కాలిఫోర్నియా నుండి శ్రీ తల్లాప్రగఢ రావు గారి సంపాదకత్వం లో వెలువడే ఈ.. మాస పత్రిక సుజనరంజని కి తాను ” మా నాన్నకు జేజేలు ” అన్న శీర్షిక ను నిర్వహించేది. తాను అందించిన సహకారం, ప్రోత్సాహం ఆధారం గా మా నాన్నగారి గురించి నేనూ ఒక వ్యాసాన్ని వ్రాసి పంపగా అది ఆ పత్రికలో ప్రచురితం అయింది… దీనికి దేశ, విదేశాల నుండి ఎన్నో స్పందనలు వచ్చాయి. ఇది గమనించి చేసిన తన సూచన ప్రకారం ఆనందం గా నా మిత్రులు మరికొందరి నుండి ఈ శీర్షికలో ప్రచురణ నిమిత్తమై వ్యాసాలను వ్రాయించి తెప్పించి పంపడం, అవి పత్రిక ప్రచురణలో చోటు చేసుకోవడం ఎంతో ఆనందదాయకం గా భావిస్తున్నాను. ఈ విషయం లో నాకు తమ వ్యాసాలను వ్రాసి పంపి సహకరించిన మిత్రుల పేర్లను ఇక్కడ నేను ప్రస్తావించడం సముచితం గా ఉంటుందని భావిస్తున్నాను.. ఆ రచయితలు శ్రీయుతులు సత్తిరాజు శంకర్, ( శంకర్  ఆర్టిస్ట్ ). జయదేవ్ బాబు, బాలి, చల్లపల్లి శాయి, పుట్టపర్తి నాగ పద్మిని ప్రభృతులు .. 

అటు తరువాత తరచుగా మేము ఫోన్ లో సంభాషించుకుంటూ ఉండేవాళ్ళం. కనకదుర్గ భర్త శ్రీనివాస్ కూడా సౌమ్యుడు, స్నేహశీలి, సహృదయుడు.. కనకదుర్గ కు ఎంతో  చేదోడు వాదోడు.  

నాకు మరో ఆత్మీయుడు, మిత్రుడు విజయవాడ వాస్తవ్యులు శ్రీ శిష్ట్లా రామచంద్ర రావు గారు. … ఆయన సాహితీ పిపాసి. అంతవరకు బ్లాగ్ వ్రాస్తూ వచ్చిన రామచంద్ర రావు గారికి కనకదుర్గమ్మతో పరిచయం ఏర్పడడం తో అది ఆయనను శిరాకదంబం అనే ఈ.. పత్రిక స్థాపనకు పురికొల్పింది. దాని స్థాపన, సంపాదకత్వం, నిర్వహణ బాధ్యతలను ఆయన ఎంతో కార్య దీక్ష, శ్రమను వహించి ఖర్చు కి కూడా వెరవకుండా, ఒక్కరై తలదాల్చి ఎంతో కాలం గా చేస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కానే కాదు. ఏమంటే, మరొక వంక ఆయనకు ఎన్నో కుటుంబ బాధ్యతలు, ఆర్ధిక అవసరాలు..  నిజంగా ఆయన కృషి బహుశ్లాఘనీయం ! 

దుర్గమ్మ కొన్ని ఏళ్ళ క్రితం హైదరాబాద్ లో వున్న తన తల్లి గారిని చూడడానికి, అక్కడ ఉన్న తమ ఇంటి రిపేర్ పనుల కోసమని సకుటుంబం గా హైదరాబాద్ వచ్చింది. కాకతాళీయం గా ఆ సమయానికి నేనూ హైదరాబాద్ లో ఉండడం తటస్తించింది. నాకు ఫోన్ చేసి, కారును పంపి తమ ఇంటికి రావలసినదని ఆహ్వానించింది. నేను, మా బావ రాముడు ఆ కారు లో వాళ్ళ ఇంటికి వెళ్లడం, అక్కడ అందరం తొలిసారిగా ముఖాముఖీ కలుసుకుని ఆనందం గా కబుర్లను కలబోసి చెప్పుకోవడం, ఫోటోలు తీసుకోవడం… అంతకు మించి వారింట అందరం కలిసి కూర్చుని సమిష్టి గా భోజనం చేయడం… ఇదంతా, మరువలేని, మరపురాని మధురమైన జ్ఞాపకం.. ఈ కలయిక అంతకు ముందే మా మధ్యన నెలకొని ఉన్న పరిచయాన్ని స్నేహం గా రూపు దిద్ది, బలపరచింది. 

ఇలా ఇంకా రాయాలనే ఉంది. కనకదుర్గమ్మ గురించి, ఆ అమ్మాయి కుటుంబం గురించి, ఆ అమ్మాయి సాహితీ వ్యవసాయం గురించి. కానీ స్థలాభావం, సమయాభావం నన్ను హెచ్చరిస్తున్నాయి ….. మరి వాటి ఆజ్ఞ ను నేను శిరసావహించక తప్పదు కదా… మరి ఈ కథనానికి ఇంతటితో మంగళం పాడుతూ, మీ నుండి శెలవు తీసుకుంటున్నాను. మా దుర్గమ్మకి, కుటుంబానికీ, రామచంద్ర రావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీకు అందరికీ పేరు పేరునా నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. 

Please visit this page

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీ ఆత్మీయులకు ‘ శుభకృత్ ‘ ఉగాది శుభాకాంక్షల ప్రకటనలకై మార్చి 25 లోపు సంప్రదించండి… editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com