11_018 ద్విభాషితాలు – మంచం ప్రక్క కిటికీ

.

ఈ నడిరాత్రి…

సుందరస్వప్నాలింగనంలో…

మత్తుగా మూలుగుతున్న వేళ…

ఓ అసంకల్పిత భౌతికక్షణం…

నన్ను స్పృహలోకి లాగేసింది.

చీకటి నిండిన గదిలో..

నా మంచం పక్క కిటికీ..

తెల్లగా వెలిగిపోతోంది!

కిటికీలోంచి…

ఓ వెన్నెలరేఖ చెక్కిలిని తాకి..

తనువుపై ఉన్మత్తతరంగమవుతోంది.

కిటికీ ఊచల మధ్య..దూరంగా..

అంబరంలో పూర్ణబింబం..

స్వప్నానికందని పరవశాన్ని..

నాపై విరజిమ్ముతోంది!

ఆ ప్రక్కనే…

మెల్లగా.. ముందుకు సాగుతున్న..

ఓ శ్వేతవర్ణ మేఘం..

గగనవెన్నెలవీధిలో..

 ప్రేమికులు విహరిస్తున్న..

 వెండి రధంలా…

నన్ను పట్టి లాగుతోంది!

నా భగ్నస్వప్నం గీసిన..

ఈ సుందరకాంతిచిత్రం…

గదిలోని నిశ్శబ్దక్షణాల్ని… అభిషేకిస్తోంది.

మూసుకోవడానికి ఇష్టపడని..

నా కళ్లు.. కోటి కాంతి రేఖల్ని…

వర్షిస్తున్నాయి.

దృశ్యవశమైన నా మనసు…

గతి తప్పి…

సుదీర్ఘకాలం వెనుక..

నేను పాడుకొన్న…ఓ విరహగీతమై..

తలపును తాకి….

తీయని బాధవుతోంది.

 

ఈ క్షణంలో..

నేను…

స్వప్నరూపిని!

స్వేచ్ఛామనోవిహారిని!

నేను…

నా మంచంప్రక్క కిటికీనుంచి.. బయల్వెలువడి..

వెన్నెల్లో తడుస్తూ…

నిండుచంద్రబింబం వైపుకెగరడానికి..

రెక్కలు చాస్తున్న..

భావావేశచిత్తుణ్ణి!

ప్రకృతి సౌందర్యదాసుణ్ణి!!

—- ( 0 ) —–

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾