10_012 ద్విభాషితాలు – గురు సన్నిధి

.

 ( ఫిబ్రవరి 9.. శ్రీ వీణ చిట్టిబాబు వర్ధంతి సందర్భంగా )

———————

చిట్టిబాబు వీణ

———————

ఓ గంధర్వుడు

గగనతలం నుంచి బయలు దేరి..

దారిలో ….

చంద్రుణ్ణీ..వెన్నెల్నీ..

సూర్యుణ్ణీ..వెలుగునీ..

మేఘాల్నీ..మెరుపుల్నీ..

చేతివేళ్ళకు తగిలించుకొని..

భువికి చేరి..

వీణ తీగెలపై విరజిమ్మాడు!

సౌందర్యం ధ్వని తరంగమై….

ప్రవాహమై…

జీవనదిలా..దేశమంతటా పారి….

ఎల్లలు దాటి….

రస హృదయాల్ని..

తన్మయుల్ని చేసింది.

ఆ తీగపై కోయిల వాలి…

గొంతు సవరించింది.

వేదం జీవం పోసుకొంది.

కీర్తన అమృతవర్షిణి అయ్యింది.

సృజన సర్వజన స్వరమయ్యింది!

ఆ నాదంతో……

ఔత్సాహిక వైణికులు..

తమ గమకానికి…

గమనానికి…

బాట వేసుకున్నారు.

ఆధునికంలో..

పోకడలెన్నొచ్చినా..

ప్రావీణ్యమెన్ని మెట్లెక్కినా..

మహతీ ప్రపంచ చిత్రపటంలో..

అతడో హిమాలయం!

ఆ పారవశ్యం…

అజరామరం!!

.

****************

.

గురుసన్నిధి

                అమలాపురం భారతీ గానసభ వేదికపై మోహనరాగం వీణ తీగెలపై.. ప్రవహిస్తూ వీణ ప్రేమికుల్ని సమ్మోహనాసంద్రంలో ముంచెత్తుతోంది. చప్పట్ల హోరులో ఈలోకంలోకి వచ్చి పడ్డాను. “చిట్టిబాబు వీణంటే అదో పారవశ్యంరా!” నా ప్రక్కన కూర్చొన్నాయన ఆనందానికి పట్టపగ్గాలు లేవు. మా వూరి నుంచి… ఈ కచేరీకోసం బస్సులు మారి ప్రయాణం చేసొచ్చిన శ్రమ ఎప్పుడో మాయమయ్యింది. చిట్టిబాబు గారు కచేరీ ముగించి లేచి నుంచున్నారు.

వేదిక వద్దకు వెళ్లి “ఒక్కసారి కూర్చొని వీణ చేత్తో పట్టుకోండి. ఫొటో తీసుకుంటాను”. ఆయన్ను అడిగాను. చిరునవ్వు నవ్వి మళ్ళీ కూర్చున్నారు. ఆ తరువాత.. అంత పెద్ద విద్వాంసుణ్ణి అలా అడిగావేమిటి? అని ఓ మిత్రుడు  మందలించాడు. నిజమే గదా! సిగ్గుపడ్డాను. ఆ మరుసటి నెలలో మా రామచంద్రపురం త్యాగరాజ సంగీత సభలో చిట్టిబాబు గారి కచేరీ. ఆ సభకు నేను ఉప కార్యదర్శి నవ్వడంతో.. మొదటిసారి ఆయనతో మాట్లాడి, కలిసి ఫొటో తీయించుకొనే అవకాశమొచ్చింది. కచేరీ అయ్యాక మా సభా కార్యదర్శి నన్ను వారికి పరిచయం చేస్తూ.. ” ఈ నగేష్ బాబు అనే కుర్రాడు మీ వీణ రికార్డులు విని వీణ సాధన చేస్తుంటాడు. మీకు అభ్యంతరం లేకపోతే.. మీ బసలో మీ ముందు కొంతసేపు వీణ వాయిస్తాడు. విని ఆశీర్వదించండి “అన్నారు. నా గుండెల్లో రాయి పడింది. వీణకి మరో అర్థమైన.. ఆ అంతర్జాతీయ స్థాయి వైణికుని ముందు.. నా కున్న మిడిమిడి జ్ఞానంతో వీణ వాయించడమా! కాళ్లలో వణుకు మొదలైంది. వైణిక సార్వభౌములు చిరునవ్వుతో నా భుజం తట్టి..” రికార్డులు విని వీణ సాధన చేయడం విచిత్రమే. పొద్దున్నే వీణ తీసుకొని రా! వింటాను ” అన్నారు. ఒక ఆనందం… భయం మిళితమైన భావన కలిగింది. కానీ మర్నాడు ఒక పెద్ద హాల్లో ఆయన ముందు కూర్చోగానే ఒక చెప్పలేని అనుభూతి.  ఆయన వీణను ఎంత ప్రేమించానో చెప్పుకొనే అవకాశం నాకు  దొరికింది.అది ఆయన సన్నిధి బలం కావొచ్చు. ఆయన రికార్డు విని సాధన చేసిన…. అమృతవర్షిణి రాగంలో… సుధామయి…అనే  కీర్తన ఆయన బాణిలోనే వాయించాను. ఆయన భావప్రకటన కోసం ఆత్రంగా చూసాను. అభిప్రాయం చెప్పకుండా “ఇంకొకటి వాయించు ” అన్నారు. బాగుండకపోతే ఇంకొకటి వాయించమనరుగా! అంతే! వేళ్ళ లోకి అనంతమైన శక్తి ప్రవేశించింది. ఆయన స్వరపరచిన నండూరి సుబ్బారావు గారి ఎంకి పాట ” కొమ్మల్లో కోయిలా… కూ  యంటదే ” పలికించాను. అంతే! అదృష్టం నా  తలుపు తట్టింది. లేచి… దగ్గరకు వచ్చి నా తలపై చెయ్యి వేసి ఆశీర్వదిస్తూ.. ” మద్రాస్ వస్తావా? శిక్షణ ఇస్తాను” అన్నారు. ఆ ప్రేమకు వళ్ళు జలదరించి.. ఆనందభాష్పాలు రాలేయి. ఓ మహా వైణికుని వద్ద శిష్యరికమంటే పూర్వ జన్మ ఫలమే !  అదే మాసం ఆఖరున… ఆయన పిలుపునందుకొని… మద్రాస్ వెళ్ళాను. నార్త్ ఉస్మాన్ రోడ్ లో.. నా మిత్రుడు గొర్తి బదరీ విశ్వనాధ శాస్త్రి ఆహ్వానంపై అతని ఇంట్లో దిగాను.  సౌత్ ఉస్మాన్ రోడ్ లో గురువు గారి ఇల్లు. రోజూ ఉదయం, సాయంత్రం శిక్షణ. సరిగ్గా ఆయన చెప్పిన టైంకి ఒక్క సెకను తేడా లేకుండా వెళ్ళేవాడిని. నా కాల నియమాన్ని చాలా ఇష్టపడేవారు.

మేడపై పెద్ద హాల్లో చుట్టూరా వీణలు. నా ముందు తపోదీక్షలో కూర్చొన్న మునిలా గురువు గారు. ఆయన నోటితో పాఠం చెబితే నేను అర్థం చేసుకొని వీణపై వాయించాలి. అగ్ని పరీక్షే! నా మనోభావాల్ని చదివినట్లున్నారు. “నా మీటు.. నా  బాణీ.. నీ నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. అర్థంకాని వారికి ఎదురు వీణ. నీకెందుకు?” అన్నారు నవ్వుతూ! పాఠాన్ని అలాగే మననం చేసుకొంటూ.. బదరీ విశ్వనాథశాస్త్రి  ఇల్లు చేరుకొని.. నేను తెచ్చుకొన్న వీణపై అనేక గంటలు సాధన చేసేవాణ్ణి. గురువుగారి పాఠం ఒక్క తప్పులేకుండా వాయించి చూపించాలనే పట్టుదల నాది. నా  శ్రమ ఆయన గుర్తించారు. నాలుగు రోజులు గడిచేసరికి నన్ను కుటుంబంలో కలిపేసుకున్నారు. నా పుట్టినరోజునాడు… నా  గురుపత్ని సుధ గారు.. ఇంట్లో పులిహోర.. స్వీటు తయారు చేసారు.”మళ్ళీసారి నుంచి ఇంకెక్కడా దిగకు. మా ఇంటికే వచ్చేయ్ “అన్నారు.

శిష్యుణ్ణి తల్లిదండ్రుల్లా ఆదరించిన ఆ సంస్కారానికి రుణపడివున్నాను.

ప్రతి సంవత్సరం 2, 3 సార్లు మద్రాస్ వెళ్ళేవాణ్ణి. గురుకులవాస విద్య లభించడం ఎంత అదృష్టం! గురువుగారితో cassette రికార్డింగుల్లో పాల్గొనే అనేక అవకాశాలు కలిగాయి. Bells Of Joy అనే cassete రికార్డింగ్ లో నేను వారికి కంపోజింగ్ అసిస్టెంట్ గా కూడా వున్నాను. నోట్స్ అంతా నాచేతే వ్రాయించేవారు. Elements And Mankind అనే రికార్డింగ్ లో నాకు కీలకపాత్ర ఇచ్చారు.

కచేరీ వున్న రోజు ఉదయం వీణ కు కొత్తతీగె మార్చి… తీగె సర్దుకోవడానికి కొంతసేపు సాధన చేసేవారు. ఆ సమయంలో ఆ వాదన అమోఘం. ఆయనలో సృజన పొంగి ప్రవహించేది! తమిళసభల శ్రోతల్లో పండితులుండేవారు. అప్పుడు ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకు ప్రవహించేది. స్వరకల్పనలో విన్యాసాలు చేస్తుంటే తాళాలు వేసేవాళ్ళ చేతులు వణికేవి. 

అనేక కచేరీలు వేదికపై గురువుగారు నన్ను ప్రక్కన కూర్చోబెట్టుకొని  తాళం వేయమనేవారు. మొదట్లో భయం వేసినా…నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

అదో మధురానుభూతి!

ఆయన కుటుంబజీవనం కూడా ప్రేమమయంగా వుండేది. ఒక మహా విద్వాంసుని భార్య అయినా సుధ గారు సాధారణ గృహిణిగా ఉండేవారు. గురువుగారి ముగ్గురు కుమారులూ నాపై సోదరభావం కనబర్చే వారు.

గురువుగారికి చదరంగమంటే మహా ఇష్టం. ఆయనతో చదరంగమాడటమంటే నాకు భయంగా వుండేది. ఒకసారి ఆయనకు నేను చెక్ చెప్పే సందర్భమొచ్చింది.

గుండె వేగంగా కొట్టుకుంది. “ఫర్వాలేదు. ఒక ప్లేయర్ లాగే ఆడు ” అంటూ నవ్వి…ధైర్యం చెప్పారు. నాకు Old  English classic films video  cassettes తెప్పించి చూపించేవారు. టీవీ లో Tennis match వస్తే వదిలిపెట్టేవారు కాదు. అంత ఇష్టం ఆయనకి!

టీవీ షూటింగ్స్… రికార్డింగ్స్ వున్నప్పుడు మాకు ఇంట్లో పండగలా వుండేది. అందరం కలిసి చేసే భోజనాలు … కబుర్లలో దొర్లే ఛలోక్తులు! గురువుగారు మంచి హాస్యప్రియులు. ఆయన దేశవిదేశాల కచేరిల్లో ఎదురైన చిత్రమైన అనుభవాలు చెప్పి నవ్వుతూ నవ్వించేవారు. ప్రముఖ నటుడు కమలహాసన్ బాల్యంనుండే గురువుగారి అభిమాని.

M. G. రామచంద్రన్, జయలలిత, దర్శకులు బాపు, బాలచందర్ లాంటి మహామహులు ఆయన వీణను ప్రేమించేవారు.

నేను వ్రాసే తెలుగంటే గురువుగారికి మహా ఇష్టం. నా ఉత్తరాలు కుటుంబసభ్యులకు చదివి వినిపించేవారు. 1995 ఫిబ్రవరిలో ఊహించని విధంగా ఈ ప్రపంచం నుంచి అదృశ్యమయ్యి మమ్మల్ని దుఃఖ సముద్రంలో ముంచారు.

 ఆయనకు నివాళిగా నా శిష్యులతో కలసి “గురుస్మరణ ” అనే audio C. D. ని స్వరపరచి…సమర్పించాను. ఆ విద్వాంసుని యుగంలో నేను జన్మించడం, ఆయన ప్రియశిష్యునిగా ఉండడం… గురుసన్నిధిలో కొన్ని సంవత్సరాలు అభ్యాసం చేయడం… పూర్వజన్మ సుకృతం. సంగీతప్రపంచమున్నంతకాలం వీణ చిట్టిబాబు స్వరం ఆయన అభిమానుల్లో… కొత్త తరం శ్రోతల్లో… వీణవిద్యార్థుల్లో… ఉత్తేజం నింపుతోనే వుంటుంది! గురువుగారికి మరోసారి నా హృదయాంజలి!

.

***********************************

.

గురు సన్నిధిలో ‘ వీణావాద్యరత్న’ ద్విభాష్యం నగేష్ బాబు

.