12_012

ప్రస్తావన

పుష్కర యాత్ర

వచ్చే ఆగష్టు 15వ తేదీకి ‘ శిరాకదంబం ’ పుష్కర కాల యాత్ర పూర్తి చేసుకుంటోంది. ఈ యాత్ర లో ఎన్నో అడ్డంకులు, ఒడుదుడుకులు ఎదురయ్యాయి…. ఎదురవుతూనే ఉన్నాయి. ఒక పత్రిక -అందులోనూ అంతర్జాలంలో చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే పత్రికలు ఉన్న పరిస్థితుల్లో అప్పటికి ఉన్న పరిమిత వనరులను ఉపయోగించుకుంటూ ప్రారంభించి, అంతర్జాలంలో అధిక సంఖ్యలో పత్రికలున్న… ఇప్పటివరకు నిరాటంకంగా నడుస్తూ వచ్చింది ‘ శిరాకదంబం ’.

పత్రిక ప్రారంభించడానికి కావల్సిన ఆర్థిక బలం లేదు…. అంగ బలం లేదు. కేవలం అభిరుచే పెట్టుబడి. రచయిత మిత్రులే అండదండలు. తమ రచనలతో వారందించిన ప్రోత్సాహమే ఊపిరిగా, అందుబాటులో ఉన్న కంప్యూటర్ సాయంతో, గూగుల్ సౌజన్యంతో వెబ్సైట్ ప్రారంభించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లోనే ఉగాదికి ఆడియో కవిసమ్మేళనం, పిల్లలకు కథల పోటీలు, పిల్లల్లోని ప్రతిభను వెలికి తెచ్చే అంశాలతో ‘ బాలకదంబం ’ వంటి ఎన్నో అంశాలను తీసుకుని ప్రయోగాలు కూడా చెయ్యడం జరిగింది.  అనంతర కాలంలో కొందరు స్నేహితుల సహకారంతో కొత్త పరికరాలను ఏర్పాటు చేసుకోవడం, పూర్తి స్థాయి వెబ్సైట్ రూపొందించుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే వీక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగింది.

ఆథ్యాత్మికత, సాహిత్యం, సాంస్కృతికం, సామాజికం వంటి అన్ని అంశాలతో కూర్చిన కదంబం ఈ ‘ శిరాకదంబం ’. ఈ పన్నెండు సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు. రాబోయే కాలంలో కూడా మరిన్ని క్రొత్త అంశాలను జోడించి పాఠకులను అలరించాలని ప్రయత్నం. దీనికి అందరి సహాయ, సహకారాలు తప్పనిసరి.

ఆగష్టు నెల సంచిక అయిన పన్నెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం తమ రచనలను, చిత్రాలను ( రేఖా, వర్ణ, వ్యంగ్య ), దృశ్య ( ప్రసంగాలు, ఇంటర్వ్యూ లు, పాటలు, నృత్యాలు వగైరా వీడియోలు ), శ్రవ్య ( ప్రసంగాలు, పాటలు, ముఖాముఖీ సంభాషణలు వగైరా ఆడియోలు ) అంశాలను ప్రచురణ కోసం పంపించదల్చుకున్నవారు జూలై 25వ తేదీ లోగా పంపించవలెను. వాటితో బాటు అవి మీ స్వంతమేనని, దేనికీ అనుసరణ కాదని, ఇంతకుముందు ఏ ప్రింట్ పత్రికకు గాని, వెబ్సైట్ కు, అంతర్జాల పత్రికకు, మరే ఇతర మీడియా కు ప్రచురణ నిమిత్తం పంపి ఉండలేదని హామీ పత్రం కూడా జతపరచాలి. రచనలు యూనికోడ్ లో టైప్ చేసి MS Word ఫైల్ గా పంపించాలి. లేదా నిడివి తక్కువగా ఉంటే మెయిల్ లో type చేసి పంపించవచ్చును. ఆడియోలు, వీడియోలు సాధారణ ఫార్మాట్ లో మెయిల్ / డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించాలి.

పంపించవలసిన మెయిల్ : editorsirakadambam@gmail.com; చివరి తేదీ : 25 జూలై 2023

మిత్రులు, శ్రేయోభిలాషులు తమ శుభాకాంక్షలను సందేశాల ద్వారా అందించగలరని ఆశిస్తూ….

పన్నెండు సంవత్సరాలుగా పత్రికకు, రచయితలకు ప్రోత్సాహన్నందిస్తూన్న అందరికీ నమస్సులను తెలియజేసుకుంటూ…..

మీ

శి. రా. రావు 

మనవి : చందా గడువు ముగిసిన మిత్రులు దయచేసి తమ చందాను వీలైనంత త్వరగా పునరుద్ధరించి సహకరించవలసిందిగా మనవి.