11_012 బాపు ఆత్మకథ – మరోసారి ( ప్రత్యేకం )

 

ఓ బాపూ ! చూస్తూనే ఉన్నావు నువ్వు 

తుపాకీ గుళ్ళతో సాగనంపాము నిన్ను 

స్వేచ్చని మాకిచ్చి నువ్వెళ్ళి పోయావు 

ఈ మహా ప్రసాదం ఎవరికి బాపూ 

భారతావనికా ఆవేశ ప్రజానీకానికా 

సమాధానం వెతుక్కోమన్నావు ఎందుకో 

బదులు చెప్పక ముందుకెళ్ళిపోయావు 

నీ అనుయాయులు మూకుమ్మడిగా 

మరి ప్రజాస్వామ్య మన్నారేమిటీ 

నీ ఆలోచన అందక మునుపే 

జనావళి అందలమెక్కింది 

నీ మనసేమిటో తెలియక మున్నె 

ఊహాగానాల ప్రతిధ్వనులు 

ఆచి తూచి నువ్వు ముందడుగేస్తే 

జనమంతా పరుగుల ప్రభంజనం 

ఓ బాపూ ! నా మాటలు వింటున్నావా 

ప్రక్కవాడి కాసు కాశ నీకెందుకు వద్దన్నావు 

ఎవడో నేసిన గుడ్డకి దండెం వద్దన్నావు 

తెలిసే తలుచుకు నుండుంటావు 

యుగాల వెనుకటి ఆ రాముణ్ణి ! 

అర్హులనే నిను చేరిన వారికి అర్హత 

నందించావు ముందుకి నడిపించావు 

మరి గణ తంత్రం నేర్పిందేమిటి ?

ఓట్ల తంత్ర శాస్త్రాలా ? పదవీ వ్యామోహాలా

మరిగిన అధికారపు మత్తు విన్యాసాలా  

బాపూ ఓమాటిటు రావా ! వెనుతిరుగొకసారి 

స్వాతంత్య్రం ఇచ్చిందేమిటి తెలియలేదు 

అయోమయపు అశిక్షిత గడ్డకట్టి ఉంది కదా 

నువ్వు నిర్వచనం చెప్పక మునుపే 

ఆబగా ముఠాలు కట్టాం జెండా పండగ చేస్తున్నాం 

యుద్ధం చేసిన వీరులు కనుమరుగయ్యారో 

బేలతనపు యువత దాటిందెల్లలు !!

బాపు ఇదేనా నువ్వనుకున్న స్వేచ్ఛ

ప్రపంచపు కుగ్రామంలో వీధులకి

లేవే ఇంకా పేర్లూ,  గుర్తింపూ ! పతాకాలూ!

ఇక్కడి నుంచి మరెక్కడికి బాపూ 

ఒకనాడది అదృష్టమనుకున్నాం 

ఈనాడది భయానకపు భుజంగ పాశం!

అప్పటికి తారక మంత్రం ఈనాడది నారక యంత్రం 

నవ నాగరికం ఓర్వలేక, పాత రీతి పాడలేక 

మళ్ళీ నిన్నే పిలుస్తున్నాం ఎలుగెత్తి 

ఓమాటిటు వెనక్కి చూడు ఓ బాపూ !

మరోసారి నీ ఆత్మ కథ వ్రాస్తావా 

గూడు దాటిన స్వేచ్ఛ నీకుంది కదా  

ఈ గూట్లో స్వేచ్ఛ బ్రతుకు మార్గం చెప్పు !!

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾