10_005 శరన్నవరాత్రులు – శక్తి ఉపాసన

                     

                         భారతీయ ప్రాచీన పారమార్థిక సంస్కృతి విశిష్టత బహుముఖాలుగా, నానావిధాలుగా , సర్వమానవ ప్రవృత్తులకు అనుగుణంగా కనిపిస్తోంది. వివిధ ముఖాలుగా ఉన్న వైదిక ధర్మ విధానం సర్వతోముఖమై భాసిస్తోంది. ప్రాచీన మహర్షులు ప్రధానంగా సగుణ, నిర్గుణ బ్రహ్మల తత్త్వాన్ని కఠోర నిష్ఠలతో, నిశ్చలమైన భక్తితో, శ్రద్ధాపూర్వకమైన సాధనలతో ఈ తత్త్వాలని అంతర్ముఖులై దర్శించి శ్రుతిస్మృతుల  వాఙ్మయం ద్వారా మనకందించారు. ధరిత్రిలో ఉన్న మానవజీవనానికి, సన్మార్గవర్తనానికి మూలాధారాలు వేదాలే. ఇవి అపౌరుషేయాలని, ఆద్యంత రహితాలని అంటారు. మహర్షులు అమేయమైన సాధనతో అంతర్ముఖులై పరబ్రహ్మ సాక్షాత్కారానికి పరితపించడంలో తాము అంతర్బోధనలతో ఆలకించింది, ఆలపించిందే వేద వాఙ్మయం. దీన్ని వ్యాసాది మహర్షులు విభజించి వాటికి స్వరూపాన్ని కల్పించారు. నాలుగువేదాలు నాలుగు కళ్లకు ఆలవాలమై వెలిసాయి. ఋక్సామవేదాలు సాహిత్య సంగీతాలకు నెలవు అయ్యాయి. వేదరాశి పరమాత్ముని ఉచ్చ్వాసాలు. ”అనంతావై వేదాః ”  అని వేదాల అంతం చూడలేమని ఒక కథనం ఉంది. (భారతీయ వృత్తం) వేదం బోధించే విషయాలు ప్రధానంగా రెండు.(1)  కర్మ, (2) బ్రహ్మ. ఇక్కడ కర్మ అంటే ఆరాధన. బ్రహ్మ అంటే భగవంతుని స్వరూప విచారణ అని అర్థాలుగా చెప్పవచ్చు. వేదాలు ప్రధానంగా నాలుగు. మళ్ళీ ఒక్కో వేదం సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అని నాలుగు విభాగాలుగా ఉన్నాయి. సంహితలు అంటే మూల మంత్రాలు. పారాయణార్థం  ఉపదేశింప బడ్డాయి. అశ్వమేథం, పుత్రకామేష్ఠి  మొదలైనవి. ఆరణ్యకాలంటే అరణ్యాల్లో నివసిస్తూ వాన ప్రస్థాశ్రమాన్ని స్వీకరించి జీవించేవారికి ఉపయోగపడే మంత్రాలు. ఉపనిషత్తులంటే పరబ్రహ్మ తత్త్వ విచారం చేయబడేవి. పరమాత్మ స్వరూపం ఎలాంటిది? ఏ విధంగా ఉంటాడు లాంటి విషయాలున్నాయి. ప్రపంచంలో ఎన్నో రకాల వస్తుసముదాయముంది. సృష్టిలో ఉన్న సకల పదార్థాలు ఏదోరకంగా మనిషికి ఉపయోగకరంగానే ఉన్నాయి. సర్వవ్యాపియైన ఆ పరమాత్మ సృజనలో నిరుపయోగమేముంటుంది? కాని అన్ని వస్తువులు, సకల పదార్థాలు అన్ని కాలాల్లో అందరికి ఉపయుక్తాలు కావు. మనుషులందరూ ఒకటే అయినా తత్త్వాల ననుసరించి ఎన్నో భిన్నత్వాలు, విభిన్నత్వాలు భాసిస్తున్నాయి. ఈ విషయం మన మహర్షి సత్తములకు తెలుసు. కాబట్టి వారు ఎంతో సూక్ష్మమైన దృష్టితో పారమార్థిక జీవన విధానం కూడా వ్యక్తిని అనుసరించి, అతని ప్రకృతికనుగుణంగా బోధన, సాధనలుండాలని  అనేకమైన తత్త్వ విచారాలను మనకి అందించారు. పారమార్థిక విషయోపదేశం సర్వ సామాన్యంగా కాకుండా సాధకునికనుగుణంగా వివిధ రకాలుగా కనిపిస్తోంది. దీని గురించి స్పష్టంగా చెప్పాలంటే శంకరాచార్యులు ఉపనిషత్తుల  నుండి ద్వివిధ ఉపాసనా విధానాలను మనకందించారు. అవి సగుణ, నిర్గుణ ఉపాసనలు. సర్వావస్థల్లో అర్థజ్ఞాన నిపుణులైనవారి కోసం నిర్గుణ పారమార్థిక వ్యవస్థని ఏర్పరచారు. సర్వసామాన్యులైన వారికోసం సగుణ విద్యను బోధించారు. దీనికాద్యులు ఆదిశంకరులు కాదు. ప్రాచీన మహర్షి సంప్రదాయాన్నే క్రీ.శ. 5వ శతాబ్దిలో శంకరులు మరింత ప్రాచుర్యానికి తెచ్చారు. అంతర్ముఖులై ధ్యాన సాధన చేత సూక్ష్మతత్త్వ విచారణ చేసేవారి నిర్గుణ బ్రహ్మారాధన తక్కువగా కనిపిస్తుంది. విగ్రహారాధనతో, షోడశోపచార పూజా విధానాలతో సగుణ బ్రహ్మారాధన మన భారతీయ సంస్కృతిలో ఎక్కువగా కనిపిస్తుంది. మొదటిది ఆంతరమైతే, రెండవదైన సగుణారాధన బాహ్యంగా గోచరిస్తుంది. ఈ వివిధ ప్రవృత్తులను సమన్వయపరిస్తే అంతటా ఆ పరమాత్మను దర్శించవచ్చు. అదే వైదిక ధర్మ విచారమవుతుంది.

షణ్మతాల గురించి మొట్టమొదట ప్రస్తావించింది, షణ్మతారాధన ప్రవేశ పెట్టింది 5వ శతాబ్దానికి చెందిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు.విష్ణువు, శివుడు, శక్తి, సూర్యుడు, గణపతి, స్కందుడు. ఈ ఆరుగురి ఆరాధన కనిపిస్తుంది. స్మార్తులు ఈ ఆరాధనని ఎక్కువగా ఆచరిస్తుంటారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసే ఈ విధానం వలన ఏ దైవాన్ని ప్రధానంగా ఆరాధిస్తారో వారి మధ్య వైషమ్యాలు లేకుండాలని, వివిధ రూపాల్లో ఉన్నా పరబ్రహ్మమొక్కటే అని చెప్పడమే శంకరాచార్యుల ఉద్దేశంగా కనిపిస్తోంది. స్మృతులను అనుసరించేవారినీ, ఒక్క సంప్రదాయానికి కట్టుబడకుండా దైవారాధన చేసేవారిని స్మార్తులంటారు. ఆగమాలననుసరించి షణ్మతాలు ఏర్పడ్డాయి. స్మార్తులు ప్రధానంగా అద్వైతులుగానే ఉంటారు. ఆదిశంకరు లేర్పరచిన  పంచాయతన ఆరాధన చేసుకుంటారు.

అమ్మ ఇక్కడ పరదేవత. వేదాల్లో వివిధ తత్త్వాలతో శక్తి కనిపిస్తోంది. గంగ, భవాని, గాయత్రి, కాళి, తార, భువనేశ్వరి, బగళ, ధూమవతి, కమల, మాతంగి, షోడశి, భైరవి.  వీరి పూజావిధానమంతా మంత్ర, తంత్ర, యంత్రాలతో కూడి  ఉంటుంది. శాక్తేయంలో కనిపించే విద్యని “శ్రీవిద్య”అని అంటారు. ఉపాసనలో పంచదశి, షోడశి కనిపిస్తోంది. స్మార్తులు పంచదశి అయితే షోడశిలో ఎక్కువ మహావిద్య ఉంటుంది. శ్రీ చక్రం, శ్రీ యంత్రం వంటివి ప్రధానంగా శ్రీవిద్యోపాసన విధానంలో ఉన్నాయి. లలితాపరమేశ్వరి, బాలా త్రిపుర సుందరిగా ఇక్కడ అమ్మ కొలువుంటుంది. ఎక్కువగా శివశక్తులను కలిపి పూజిస్తారు.

అందులోనూ శక్తి ఆరాధన ముఖ్యంగా శరత్కాలంలో వచ్చే శరన్నవరాత్రుల్లో చేస్తే అనంతమైన శక్తిని అమ్మ అనుగ్రహిస్తుందని శాక్తేయం చెబుతోంది. ప్రకృతిలో మనకు శరత్కాలం సంధి కాలం. ఈ కాలంలో ముఖ్యంగా జనులకు అనారోగ్యం కలిగించి వారి ప్రాణాలను సైతం సంహరించే యమదంష్ట్రలు తెరచుకుని ఉంటాయని అంటారు. ఇలాంటి బాధల నుండి తప్పింఛుకోవాలంటే శక్తి ఆరాధన ఒక్కటే శరణ్యమని అంటోంది శాస్త్రం. సకల శక్తులకు నిలయమైన ఆ జగన్మాతను ఆరాధించి చేసే అర్చనా విధానమే నవరాత్ర వ్రతమని అంటారు.

“సర్వ వ్యాధి ప్రశమనీ, సర్వ మృత్యు ప్రశమనీ..” అనే నామాలతో అమ్మను అర్చింఛడంలో ఉన్న అంతరార్థం ఇదే. అపారమైన మానసిక, శారీరక శక్తులు జాగృతమై అర్చనాది ఉపాసనలతో మరింత శక్తిని పుంజుకుని ఆధ్యాత్మిక శక్తిగా మారి చివరకు సాధకుడు శక్తిమంతుడవుతాడు. సకల శక్తి స్వరూపిణిగా అమ్మను అర్చించి, అరాధించడానికి అనువైన సమయం శరన్నవరాత్రులు. వీటినే దేవీ నవరాత్రులు అని కూడా అంటారు.

మనిషి మనసు చంచలమైనది. ఈ చంచల మనసును అచంచలంగా ఉంచుకోవాలంటే చంద్రుని అనుగ్రహం ఉండాలని జ్యోతిషం చెబుతుంది. అయితే డోలాయమానమైన మనసును అదుపులో ఉంచడానికి మరోక మార్గాన్నిమన మహర్షులు శక్తి ఉపాసనగా సూచించారు. శరత్కాల చంద్రుని వెన్నెలలో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. జ్యోతిష్య శాస్త్రం రీత్యా చంద్రుడు తల్లితో సమానం. అంటే జగన్మాత స్వరూపం. కాబట్టి ఈ శరన్నవరాత్రుల ఆరాధనలో అమ్మను అన్నపూర్ణ, దుర్గ, కాళి, గాయిత్రి, లలిత, బాలా, లక్ష్మి, సరస్వతి ఇత్యాది నామాలతో పూజలు అందుకుంటుంది. పేరు ఏదైనా, ఎలా ఆరాధించిన అందుకనే మూల శక్తి ఒక్కటే. సకల చరాచర జీవకోటిలో అంతర్లీనంగా ఉంటూ సర్వత్రా శక్తిని ఇచ్చే మహాశక్తి అంతా ఈ చిత్ శక్తి. కాబట్టి అమ్మను “చిచ్చక్తిశ్చేతనా రూపా”… అని ఆ జగదంబను శక్తి చైతన్య స్వరూపంగా కొలవడం జరుగుతోంది.

జగన్మాతయే అన్ని ప్రాణుల్లో నిక్షిప్తమై ఉంటూ తన అనంత శక్తి సందర్భానుగుణంగా ఒక్కో విధంగా వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఆత్మశక్తి, ప్రాణశక్తి, జ్ఞానశక్తి, యోగశక్తి, సిద్ధశక్తి, చైతన్యశక్తి, విద్యాశక్తి, విజయశక్తిగా విభిన్న రూపాల్లో జీవకోటిని అంతటిని ఉజ్జీవింపజేసేది ఆ శక్తిస్వరూప అయిన అమ్మే. ఈ శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి, జీవన పరమార్థాన్ని పొందడానికి చేసే ఉత్సవాలే దసరా లేదా నవరాత్రి ఉత్సవాలు. ఈ నవరాత్రుల్లో శక్త్యారాధన అనంతమైన ఫలితాన్నిస్తుంది. సరస్వతిగా విద్యాశక్తిని, శమీ వృక్ష పూజతో విజయశక్తిని, మనసులో గల మాలిన్యాలను తొలగించి, అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞానశక్తిని ఇస్తుంది. అంతే కాకుండా ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు చేసే ఈ ఉత్సవాలను నవరాత్రి ఉత్సవాలు అంటారు. “రాత్రి” అనే శబ్దం మరొక అర్థంలో ప్రాణవాచకం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అనేవి నవ ప్రాణాలు. ఈ తొమ్మిది ప్రాణాల్లో ప్రతిష్టితమై ఉండి వాటిని కాపాడే ముఖ్య ప్రాణదేవత ఆ పరదేవత. ఈ తొమ్మిది ప్రాణాలు పరదేవతా రూపాలే. కాబట్టి ఎవరైతే నవరాత్రి వ్రతం ద్వారా అమ్మను ఉపాసన చేస్తారో వారిలో ఉన్న ప్రాణాశక్తి చైతన్యం అవుతుంది. నర్ద పాంచరాత్రంలో రాత్రి శబ్దానికి జ్ఞానాన్నిచ్చేవాడు, జ్ఞానదేవత, పరదేవత అనే అర్థాలున్నాయి. దీనివల్ల ఈ నవరాత్రి ఆరాధన ద్వారా మనలో ఉన్న ప్రాణశక్తి చైతన్యవంతమవుతుందని చెప్పవచ్చు.

నవరాత్రి ఉపాసన సకల సిద్ధులను, మంచి యోగాలను అనుగ్రహిస్తుంది. జగన్మాత అయిన ఆ తల్లి తన భక్తుల అభీష్టాలను నెరవేరుస్తుంది. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, సంధమాత, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిద అని నవదుర్గలుగా కొలువై మనకు గల దుర్గమాలను అంటే కష్టాలను తొలగించి అనుగ్రహిస్తుంది. సిద్ధిద రూపంలో కొలువైన ఆ తల్లి లౌకిక, అలౌకిక సిద్ధులకు అధిదేవతయై సకల సిద్ధులను ప్రసాదిస్తుంది.

ఈ శరత్కాలం ప్రకృతి నియమాలనుసరించి వర్షాలకు, చలికి మధ్య సంధికాలం కాబట్టి ప్రజలకు అనారోగ్యం కలిగిస్తుంది. ప్రాణాలను హరించే శక్తి ప్రకృతిలో ఉంటుది. అందుకే ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండే శక్తినిమ్మని ఆ పరాశక్తిని పూజింఛాలి. మన వైదిక ధర్మం ప్రకారం ఏ పండుగ చేసినా అది మన ఆధ్యాత్మిక ఉన్నతికి కారకమవుతుంది. మనలో గల సుషుప్తి అవస్ఠను తొలగించి ఆత్మను చైతన్య పరచి అంతిమంగా పరమపదానికి చేర్చేవి మన పండుగలు.

***********************************************