11_004 కథావీధి – అనుక్షణికం6

 

అనుక్షణికం అనేక సంఘటనల కూర్పు, కథాకాలానికి సమకాలీనం గా నడిచే వాస్తవ పరిస్థితుల లో జీవించే పాత్రల ఆలోచనల, స్వభావాల సముచ్చయం. వందల సంఖ్యలో వచ్చే ఏ పాత్ర ప్రవర్తన లోనూ రచయిత జోక్యం ఉండదు. సమకాలీన పరిస్థితులకు పాత్రల ప్రతిస్పందనే కథాంశం. కథాంశం వాస్తవ జగజ్జనితం. పాత్రల ప్రతిస్పందన సహజాతి సహజం. చదివిన వారికి, వాస్తవ ప్రపంచంలో కొందర్ని చూసినప్పుడు ‘ అనుక్షణికం ’ లోని పాత్రలు తలపుకు వస్తాయి. ఇది వడ్డెర చండీదాసు గారి మావవ స్వభావ విశ్లేషణా పరిజ్ఞానానికి మచ్చుతునక.

 

ఇదే లక్షణం, చండీదాస్ గారిని ప్రభావితం చేసిన శ్రీయుతులు శరత్ బాబు, చలం, తిలక్, బుచ్చిబాబు, ఆలూరి బైరాగి,  త్రిపుర మొదలైన వారిలో ఉన్నప్పటికీ, చండీదాస్ గారి లో చాలా పాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది.

 

ముఖ్యం గా చైతన్య స్రవంతి లో శ్రీపతి అంతరంగ ఆలోచనల ఆవిష్కారం, వాస్తవ సంఘటనల కి అతని ప్రతిస్పందన, అతని హావ, భావ వ్యక్తీకరణా పాఠకులను  విశేషం గా ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా శ్రీపతి పాఠకుల మనసులో చాలాకాలం నిలిచిపోవడమే కాకుండా రచయితే శ్రీపతి ఏమో అనే భావాన్ని కలగజేస్తుంది. వేయి పడగలు చదివిన వారికి ధర్మారావు లో విశ్వనాధ వారూ, శ్రీకాంత్ చదివిన వారికి శ్రీకాంత్ లో శరత్ బాబూ, చివరకు మిగిలేది చదివిన వారికి దయానిధి లో బుచ్చిబాబూ కనిపించడం ఆయా పుస్తకాలు చదివిన వారి అనుభవం లో ఉన్నదే.

 

అనుక్షణికం నిశ్చయం గా ఉత్తమ రచనల కోవలోకి వస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ద్వారా పాఠకులకు లభ్యం అవుతోంది. ఆసక్తి గల పాఠకులు  తప్పకుండా చదవదగిన రచన.

 

                                     ( అనుక్షణికం పరిచయం సమాప్తం )