12_006 ముకుందమాల – భక్తితత్వం 13

సర్వజ్ఞులలో సర్వజ్ఞుడు. అజ్ఞులలో అజ్ఞుడు. అంతటి దేవుడు తనను తానే తగ్గించుకుని, గోపాలుడు అయినాడు.   కేవలం పరాత్పరుడైతే అందుకోలేమనీ, దుర్లభుడనీ దూరంగా ఉంటాం. అలాగని కేవలం సులభుడైతే నిర్లక్ష్యం చేస్తాం. అందుకే ఉన్నతుడూ, సులభుడూ కూడా అయినాడు! ఇదే శ్రీకృష్ణావతారంలోని విశేషం. ముల్లోకాలలోనూ భక్తులైన వారి అనిష్టాలను తొలగించి, ఇష్టప్రాప్తిని కల్గించేవాడు. త్రైలోక్య రక్షామణి. గోపికలు సదా శ్రీకృష్ణుని దర్శనకాంక్షతోనే ఉంటారు. క్షణమైనా దేవదేవుని కనుమరుగును సహించలేరు వాళ్ళు. ‘‘తద్విస్మరణే పరమవ్యాకులతేతి యధావ్రజగోపికానాం’’ నారద భక్తిసూత్రము. అందుకే గోపీలోచన చాతకాబుద మణి ఇతడు. శ్రీకృష్ణుడు సౌందర్య ముద్రామణి. ఆ స్వామి ఆనంద స్వరూపుడు. ఆనందంగా ఉండే వారు అందంగా ఉంటారట ! భగవంతునిచే వరింపబడిన వారు అందంగా ఉంటారు.     అంటే, భగవంతుని ప్రేమించి, అనుగ్రహం పొందిన వారికి, తన స్వస్వరూపాన్నీ, సౌందర్యముద్రనూ అనుగ్రహిస్తాడట స్వామి! అటువంటి దేవుడు సౌందర్యముద్రామణి. జ్ఞానం, భక్తి, వీటి స్వరూపం రుక్మిణీదేవి. ఈమెకు అలంకారమైన వాడు శ్రీకృష్ణుడు. రుక్మిణీ ఘనకుచద్వంద్వైక భూషామణి! నిత్యానపాయినియైన లక్ష్మియే కృష్ణావతారంలో రుక్మిణి! స్వామికి అత్యంత ప్రియమైన కాంతామణి ఈమె! ఆ తల్లి ఘనవక్షః స్థలమునకు ఆభరణమైనాడు స్వామి! (జ్ఞాన భక్తులకు అలంకారం స్వామి!) ఇంతటి విశేషశక్తి గల్గిన గోపాలచూడామణి మాకు శ్రేయస్సునిచ్చి, పరమపురుషార్థమైన మోక్షానందాన్ని ప్రసాదించుగాక! అంటూ కులశేఖరులు ప్రార్థిస్తున్నారు.

          ఈ గోపాలచూడామణి ప్రాశస్త్యాన్ని తనదైన శైలిలో అన్నమయ్య ఇలా పాడుకుంటారు ఆనందంతో.

          ప॥   ముద్దుగారే యశోదముంగిటముత్యమువీడు

                   దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ॥

          చ॥   అంతనింత గొత్లెతల అరచేతి మాణిక్యము

                   పంతమాడే కంసునిపాలి వజ్రము

                   కాంతుల మూడులోకాలగరుడ పచ్చపూస

                   చెంతల మాలోనున్న చిన్నికృష్ణుడు ॥

          చ॥   రతికేళి రుక్మిణికి రంగుమోవి పవడము

                   మితిగోవర్ధనపు గోమేధికము

                   సతమైశంఖచక్రాల సందుల వైఢూర్యము

                   గతియైమమ్ము గాచే కమలాక్షుడు ॥

          చ॥   కాళింగుని తలలపైన గప్పిన పుష్యరాగము

                   ఏలేటి శ్రీవెంకటాద్రి ఇంద్రనీలము

                   పాలజలనిధిలోనబాయని దివ్యరత్నము

                   బాలుడైతిరిగీ పద్మనాభుడు

        శ్రీకృష్ణుని సౌందర్యముద్రామణి అనీ, రుక్మిణిదేవికి మణి భూషణమనీ గోపాలచూడామణీ అనీ చెబుతూ భక్తుల పాలిటికి త్రైలోక్యరక్షామణి ఇతడు అంటూ వర్ణిస్తారు శ్రీ కులశేఖరులు. అన్నమయ్య ఈ గోపాలదేవునే యశోద ముంగిట ముత్యంగా, గొల్లెతల అరచేతి మాణిక్యంగా కాళింగుని తలపై పుష్యరాగంగా వర్ణిస్తూ కంసుని పాలిట వజ్రమైన ఈ దేవుడు మాకు గతియైన కమలాక్షుడు అంటూ వర్ణిస్తారు. ఏమి ఈ భక్తుల భావ సారూప్యం! గత శ్లోకంలో గోపాల చూడామణి వైశిష్ట్యం చెప్పిన మహారాజు ఈ శ్లోకంలో సంసారమనే పాముకాటుకు మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు.

  1. శత్రుచ్ఛేదైక మంత్రం సకల ముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం

               సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం

               సర్వేశ్వర్యైక మంత్రం న్యసనభుజగ సందష్ట సంత్రాణ మంత్రం

               జిహ్వే! శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మసాఫల్య మంత్రం॥

        ఓ నాలుకా! శ్రీ కృష్ణమంత్రాన్ని సదా జపించు. అది జన్మానికి సాఫల్యాన్ని కల్గిస్తుంది. మానవునికి విషయాలే ప్రధాన శత్రువులు. విషయాలు సంగత్వాన్ని కలుగజేస్తాయి. ఇదే కోరికలకు మూలం. కోరిక తీరకుంటే క్రోధం కలుగుతుంది. క్రోధ తీవ్రత మోహంగా పరిణమించి, భగవంతుని స్మృతిని మరపింపజేస్తుంది. అందువలన బుద్ధి చెడి ఆత్మ వినాశనానికి దారి తీస్తుంది అంటారు భగవద్గీతలో. 

        శ్లో॥   ధ్యాయతో విషయాన్సుంసః సంఙ్గస్తేషూపజాయతే

               సంఙ్గాత్సంజాయతేకామః కామక్రోధోభిజాయతే

               క్రోధాద్భవతిసమ్మోహః సమ్మోహాత్స్మతివిభ్రమః

               స్మృతిభ్రంశాద్బుద్ధినాశః బుద్ధినాశాత్ప్రణశ్యతి ॥

అంటూ విషయ సంగత్వం మానవుని పతనానికి ఏవిధంగా దారి తీస్తుందో విపులంగా చెప్పారు శ్రీ కృష్ణ పరమాత్మ. ఆత్మ నాశనానికి హేతువు విషయ సంగత్వం. కనుక కామక్రోధాదులను శమింపజేసే కృష్ణమంత్రాన్ని సదా జపించమని చెబుతున్నారు. అన్ని ఉపనిషత్తులూ ఆ కృష్ణ మంత్రాన్నే పూజించాయి. శ్రీ కృష్ణ మంత్రము సర్వ ఉపనిషద్వాక్యములచే పూజనీయమైన మంత్రము. కృష్ణ అనే పదానికి నిత్య నిరవధిక ఆనందం అని అర్ధం. శ్రీ కృష్ణుడే పరబ్రహ్మ. బ్రహ్మ నిత్య సత్యం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మÑ ఆనందోబ్రహ్మÑ రసోవైసః మొదలైన వేదాంత వాక్యాలు శ్రీ కృష్ణ నామాన్నే ప్రతిపాదిస్తున్నాయి. రాసీభూతమైన అవిద్యాంధకారాన్ని అంతం చేసేది. అదే సంసారోత్తార మంత్రం. ఆనంద స్వరూపుడైన ఈ శ్రీకృష్ణుడే! మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని చెప్పినారు కదా స్వామి!

        సకృత్‌ స్మృతోపి గోవిందః నృణాంజన్మశతైః కృతమ్‌

        పాపరాశిం దహత్యాశు తూలరాసిమివానల

        కొండలా పోగుబడ్డ దూదినైనా అగ్ని క్షణంలో భస్మం చేసినట్లుగా, శతాధిక జన్మలనుండి సంచితమైన పాపరాశినైనా గోవిందుని నామం క్షణంలో దహించగలదు. పాపముక్తిని కల్గించడమే కాదు. అన్ని ఐశ్వర్యాలనూ ప్రసాదించగల్గేది ఈ మంత్రం. సర్వైశ్వర్యైక మంత్రం. భగవానుని నుండి మనలను దూరం చేసే వ్యసనాలనే పాముకాటు వలన బాధింపబడే మానవుని కాపాడేది కూడా ఈ మంత్రమే. అందుకే పదే పదే జపించమని కోరుకుంటున్నారు జిహ్వను.

        భాగవతులైన భక్తులందరికీ భగవన్నామ మంత్ర మహిమ కరతలామలకమే! అందుకే ప్రతీ భక్తుడూ ఆ నామమంత్ర మహిమను కొనియాడకుండా ఉండలేరు. త్యాగరాజు రామమంత్రాన్ని గురించి ఇలా పాడారు.

        ప.    రామనామము జన్మ రక్షక మంత్రం తామసముసేయక భజించవె మనసా

        చ.    కామకోటి రూప రామచంద్రా కామితఫలదా రామచంద్రా

               జ్ఞానస్వరూపా రామచంద్రా త్యాగరాజార్చిత రామచంద్రా॥

మననాత్‌ త్రాయతే ఇతి మంత్రం. భగవన్నామం పదేపదే మననం చేయడం వలన మంత్రమై తరింపజేస్తుంది. భక్తుడైన సాధకుడు తన ఇష్టదైవం యొక్క నామాన్ని మంత్రంగా జపించి తరించగలడు. దీనులను ఎప్పుడు రక్షించేదీ మంత్రం అంటారు. ఎంతటి సౌలభ్యం!

        శ్రీ కృష్ణ మంత్ర జపం తర్వాత, ఇప్పుడు శ్రీ కృష్ణదివ్యౌషధం గురించి చెబుతున్నారు మహారాజు రాబోయే శ్లోకంలో…

        తారకమంత్రము కోరగ దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా

        అన్నిటికిది కడసారి జన్మము… అంటూ నమ్మకంగా చెబుతున్నారు రామదాసులవారు.

  1. శ్లో॥ వ్యామోహ ప్రశమౌషధం మునిమనో మృత్తి ప్రవృత్త్యౌషధం

                  దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనీ సంజీవనై కౌషధం

                  భక్తాత్యంత హితౌషధం భవ భయ ప్రధ్వంసనై కౌషధం

                  శ్రేయః ప్రాప్తికరౌషధం పిబ మనః శ్రీకృష్ణ దివ్యౌషధం

        భవతరణానికి మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ అనసరించడానికి తనను తాను ఉద్భోధించుకుంటున్నారు శ్రీ కులశేఖరులు. ఈ విధంగా సాధకులకు మార్గదర్శకులు అవుతున్నారు. శ్రీ కృష్ణమంత్రజపం గురించి చెప్పి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణదివ్యౌషధం శ్రేయః ప్రాప్తికరం సుమా! అంటున్నారు. జన్మమృత్యుజరా వ్యాధిగ్రస్తులూ, అవిద్యాసర్పద్రష్ఠులూ సేవించవలసిన మందు ఇది.

        శ్లో॥   మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః

               బంధాయ విషయాసంగీ ముక్తై నిర్విషయం మనః

        విషయం సంగత్వంలో మనసు బంధాన్ని కల్గిస్తుంది. విషయాలను వీడి భగవంతుని వైపు మరలితే ఆ మనసే మోక్షాన్ని కల్గజేస్తుంది. ఈ విషయం తెలిసిన అన్నమయ్య ‘‘తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము’’ అంటారు.

        అందుకే వ్యామోహ జ్వరపీడితమైన మనసును శ్రీకృష్ణ దివ్యౌషధాన్ని పానం చెయ్యమంటున్నారు. శ్రీకృష్ణనామమే ఆ దివ్యౌషధం. వేద్యో, వైద్యః ఔషధం, భిషక్‌ అని విష్ణు సహస్రనామమున భగవానునికి పేర్లు. లోకంలో రోగానికి వైద్యుడు వేరు, మందువేరు కానీ ఇక్కడ శ్రీకృష్ణుడే వైద్యుడు ఔషధం కూడా. సాధారణంగా ఔషధానికి అనుపానం, పధ్యం అన్నవి చెబుతూంటారు. కానీ ఇక్కడ శ్రీ కృష్ణ దివ్యౌషధానికి సంకీర్తనమే అనుపానం. నిరంతర స్మరణమే పధ్యం. ఈ ఔషధాన్ని తాగక్కర్లేదు. మనసులో స్మరిస్తే చాలు. వ్యామోహాన్ని శమింపజేసి, అరిషడ్వర్గాలనే రాక్షస బాధల నుండి విముక్తిని కల్గించేదీ ఔషధం. ముల్లోకాలలోనూ ఈ ఔషధానికి మించిన సంజీవని లేదు సుమా! అంటున్నారు. భక్తులైనవారికి ఎంతో ఇష్టమైనది ఈ ఔషధం. 

        ‘‘అహంక్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం,

        మంత్రోహమహమే వాజ్యం, అహమగ్నిరహంహుతం’’  అని భగవానుడే చెప్పియున్నాడు భగవద్గీతలో.

        ఒకసారి పరమాత్మే ఉపాయమని నమ్మి, పరమాత్మను చేరగలిగితే, తిరిగి సంసారంలో పడనక్కరలేకుండా కాపాడతాడు.

        ప॥   అన్నిటికీ పరమౌషధము ` వెన్నుని నామము విమలౌషధము

        చ.    మొత్తపు బంధవిమోచనమునకు        చిత్తజగురుడే సిద్ధౌషధము

        చ.    పరిపరివిధముల భవరోగములకు హరి పాదజలమే ఔషధము

        చ.    ఇలనిహపరముల నిందిరావిభుని అలరి భజింపుటే ఔషధము ॥

        భక్తులు తరించేది ఈ నామ ఔషధసేవనం వల్లనే! ఏ విధంగానూ కష్టపడక్కర లేకుండా వాడవచ్చు ఈ ఔషధం. ఇంతకీ ఇది శ్రీహరి పాదజలమే అని అన్నమయ్య అంటారు.

శంకరాభరణం

        ప॥   శ్రీహరి పాదతీర్ధంబే చెడని మందు

               మోహపాశాలగోసి మోక్షమిచ్చే మందు ॥

        అ.ప. కారమై కంట గించని కడుచల్లని మందు

               నూరని కాచనియట్టి నున్నని మందు

               పంకజాక్ష వేంకటరమణ ప్రసన్నునిమందు

               శంకించక తనదాసులచేపట్టే మందు ॥

కమాస్‌ రాగం ` ఏక తాళం

        ప॥   రామజోగి మందు కొనరే పామరులారా ॥ 2 ॥

        చ.    రామజోగి మందు మీరు ప్రేమతో భుజింపరయ్య

               కామక్రోధలోభము లెల్ల కడకు పారద్రోలే మందు ॥

        చ.    కాటుక కొండలవంటి కర్మములెడబాపే మందు            

               సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచే మందు ॥ రామ ॥

        అంటారు రామదాసు. భక్తులైన వారికి ఎంతో హితమైనది ఈ ఔషధం. భవభయప్రధ్వం సనైకౌషధం! భవభయాన్ని పోగొట్టే మందు, ” యాంతిమద్యా జినోపిమాం ’’ నన్నారాధించేవారు నన్నే పొందగలరు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. పరమాత్మనే ఉపాయంగా చేసుకుని ఆశ్రయిస్తే, మళ్ళీ జన్మించాలనే భయం ఉండదు. శ్రేయః ప్రాప్తి` అంటే మోక్షప్రాప్తిని కల్గించేది అన్నమాట. మందు తెలియక బాధపడే భవరోగ పీడితులకు మహారాజు చెప్పిన వైద్యం ఇది. ఎంతో నిరపాయం అయింది.

  1. ఆమ్నాయాభ్యసనా స్యరణ్య రుదితం

                   వేదవ్రతా న్యన్వహం

                   మేదశ్ఛేదఫలాని పూర్తవిధయః

                   సర్వే హుతం భస్మని

                   తీర్థానా మవగాహనాని చ గజ

                   స్నానం వినా యత్పద

                   ద్వద్వాంభోరుహ సంస్కృతిం విజయతే

                   దేవ స్స నారాయణః

తరువాయి వచ్చే సంచికలో……

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——–   ( 0 ) ——-

 

Please visit this page