————————————————————–
దేవీ ఉపాసకుడు శ్యామశాస్త్రి
1763-1827
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరుగా భావించబడే శ్రీ శ్యామశాస్త్రి గారు కూడా 18 వ శతాబ్దానికి చెందినవారు కావటంతో ఒక విషయం ప్రస్ఫుటం గా తెలియవస్తుంది. దాదాపు ఇదే శతాబ్దం లో పాశ్చాత్య సంగీతంలో కూడా ఇలాగే గొప్ప చలనం, సంచలనం కలిగి మొట్జార్ట్, బాక్, బీతోవెన్ వంటి వాగ్గేయకారులు ఉద్భవించారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా భావించబడే ఈ ముగ్గురూ కూడా తిరువారూర్, లేక శ్రీపురం, శ్రీనగరం అని ప్రసిద్ధికెక్కిన పుణ్యక్షేత్రాలలో దాదాపు ఒకే సమయానికి జన్మించటం ఒక విచిత్రమైన దైవఘటనగా భావించవచ్చు. అందుచేత చరిత్రలో ఈ కాలాన్ని సంగీత స్వర్ణమయ సమయంగా పరిగణించవచ్చు.
ఇక శ్యామశాస్త్రి గారి విషయానికి వద్దాం. వీరు 1762 లో తంజావూరు జిల్లాలో తిరువారూరు గ్రామంలో జన్మించారు. తెలుగు, ఇంకా సంస్కృత భాషల్లో ఉద్దండులు. వీరు సుమారు 300 కీర్తనలను రచించినప్పటికీ, కేవలం 40 మాత్రమే
వాడుకలో ఉండటం విచారకరం. సుప్రసిద్ధమైన ” విరిబోణి ” భైరవి రాగ, అట తాళ వర్ణం, మరికొన్ని గేయ ఫణతులు రచించిన ఆదియప్పయ్య గారి స్నేహాన్ని, అనుగ్రహాన్ని చిన్న వయసులోనే సంపాదించుకున్నారు. వారిని ” కామాక్షి ” అని ప్రేమగా పిలిచేవారట.
వీరి తండ్రిగారి మరణం తరువాత, వీరి కులదైవం అయిన స్వర్ణ కామాక్షి అర్చన చేయటం వీరి విధిగా మారింది. తంజావూరు మహారాజుగారు ఇచ్చిన మాన్యపు భూమి ఆధారంగా జీవనం కొనసాగిస్తూ కామాక్షి దేవిపై అనేక కృతులను రచించారు. ” సంగీత సాంప్రదాయ ప్రదర్శిని ” అనే గ్రంథ రచయిత అయిన శ్రీ సుబ్బరామ దీక్షితుల వారు శ్యామశాస్త్రి గారి గురించి ఇలా పేర్కొన్నారు – ” ఇతని కీర్తనముల గేయఫణతులు అతీతానాగతాగ్రహ చమత్కారములతో నారికేళపాక రీతిగా నుండుట వలన గాయకులలో తెలియని కొందరు సోమరులు రంజనము కల్గించుటకు సామర్ధ్యము లేక గడుసని చెప్పుచున్నారు. దీనికి శ్రీనాథ కవిచే తెనిగింపబడిన శృంగార నైషదములో ప్రథమాశ్వాసమున గల ఈ పద్యం చక్కగా విశదీకరిస్తుంది.
చ|| పనివాడి నారికేళ ఫల పాకమునం జనియైన భట్ట హ
ర్షుని కవి తానూ గుంభములు సోమరిపోతులు కొందరయ్య తా
నని కొనియాడ నేరరది యట్టిద లే జవరాలు చెక్కు గీ
టిన సవా స్పల్ప బాలుడే డెందమునం గలుగంగా నేర్చునే.
నిజానికి వీరి రచనలను అరటిపండు ఒలిచి తిన్నంత సులభము, మధురమూ అని తెలియచేయటానికి ” కదళీ పాకం ” అని అనటం సామాన్యం.
వీరి కీర్తనలన్నీ కూడా వీరు ఉపయోగించిన రాగ భావములకు చక్కని అభివ్యక్తీకరణ చేస్తాయి. అయినప్పటికీ ఆనందభైరవి రాగాన్నీ వీరు వాడుకున్న పధ్ధతి, దానిని మలిచిన రీతిని ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. ఆనందభైరవి రాగంలో వీరి కీర్తనలు వీరి సమకాలీకులందరికంటే భిన్నంగా ఉంటూ, ఆ రాగమంటేనే అంబకు ప్రతీకగా నిలిచేలా రూపొందిస్తారంటే అతిశయోక్తి కానేరదు. ఈ రాగంలో వీరి నాలుగు కీర్తనలు కూడా ఆ రాగానికి సంపూర్ణ న్యాయాన్ని ఇస్తాయి. ఇందులో ” పాలించు కామాక్షి ” ఎంతో భావాభివ్యక్తిని కేవలం ఆనందభైరవి రాగంలో కావటాన్నే ఇనుమడించిందని అనవచ్చు.
ఇవిగాక చింతామణి, కల్గడ, మాంజి అనే అపూర్వ రాగాలలో కూడా కీర్తనలను రచించారు. గౌలిపంటు రాగంలో ఒక తమిళ కీర్తనను కూడా వ్రాశారు. చక్కని జ్ఞానాన్ని అందచేసే వీరి తానవర్ణాలు, స్వరజతులు ప్రతి సంగీత విద్యార్థీ తెలిసే ఉంటారు. వీరికి మిశ్ర చాపు తాళం ( తకిట తక ధిమి అనే 7 అక్షరాలు గలది ) అంటే చాలా మక్కువట. వీరి కీర్తనలన్నీ సంస్కృతాంధ్ర భాషల కలయిక తో పాడుకోవటానికి ఎంతో అనువుగా సరళంగా ఉండటం విశేషం. వీరి కృతులకు ” శ్యామకృష్ణ ” అనే ముద్ర ఉంటుంది.
వీరు ప్రత్యేకంగా దేవీ ఉపాసకులు కావటాన సంగీత త్రిమూర్తులలో గల మిగతా ఇద్దరివలె కాకుండా, కేవలం దేవీపరమైన కీర్తనలనే రచించారు. చాలావరకూ శ్రీ కామాక్షీ దేవి పైనే ఇవి ఉన్నాయి. కానీ మధుర మీనాక్షిదేవిని గురించి నవరత్నాలు రచించినా వాటిలో కేవలం కొన్ని మాత్రమే లభిస్తున్నాయి. ఇవి కాకుండా, తంజావూరులో బృహన్నాయకీ దేవి, తిరువయ్యూరు ధర్మసంవర్ధనీదేవి, అంబికాదేవిపైన కూడా వీరు కీర్తనలు రచించారు.
వీరి రచనల్లో ” శంకరి శంకురు”, సరోజదళ నేత్రి”, ” బిరాన వరాలిచ్చి “, ” హిమాద్రి సుతే “, ” దురుసుగా కృప చూపి” తెలియనివారుండరు.