12_011 అన్నమయ్య పాట తో…

అన్నమయ్య పాటతో… అన్నమయ్య బాటలో…

ఇద్దరు ప్రవాస తెలుగు మహిళల ఆథ్యాత్మిక సేవ

“సామజము గాంచినది సంకీర్తనం 
సామమున కెక్కుడీ సంకీర్తనం 
సామీప్య మిందరికి సంకీర్తనం  
సామాన్యమా విష్ణు సంకీర్తనం” 
విష్ణు సంకీర్తన మహిమ తెలిపే అన్నమాచార్య కీర్తన ఇది.

“ఈతడే ముక్తి దోవ యీతడే మాయాచార్యు డితడు గలుగబట్టి యిందరు బదికిరి” గురువుగా అన్నమాచార్య గొప్పదనం, ఆయన కీర్తనలు పలువురికి ఉపాధి కలిగించిన విషయం తెలిపే ఆయన మనుమడు చిన తిరుమలాచార్య రచించిన కీర్తన ఇది.

ఈ రెండు కీర్తనలలోని భావాన్ని అర్థం చేసుకొని నేటి పరిస్థితులకు అనుగుణంగా అమలుచేస్తున్నారు దుబాయ్ లో స్థిరపడ్డ ప్రవాస మహిళలు పాలూరి హిమబిందు, గురజాడ ప్రత్యూష. “అన్నమయ్య పద యజ్ఞం” పేరుతో సంగీత, సాహిత్య సేవకు శ్రీకారం చుట్టారు. ఆ ఇద్దరి సంకల్పం, ఆధునిక సాంకేతికత సహకారంతో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకొనే ప్రయత్నం గురించి వారి మాటల్లోనే…

కీర్తనలే స్ఫూర్తినివ్వగా… గురజాడ ప్రత్యూష

మాది హైదరాబాద్. కామర్స్ చదువుకున్నాను. కర్ణాటక గాత్ర సంగీతం నేర్చుకున్నాను. పెళ్ళి తరువాత కువైట్ వెళ్ళి రెండేళ్ళ తరువాత దుబాయ్ వచ్చాము.  ఏడేళ్ళుగా ఇక్కడే నివాసం. ఇక్కడి బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేశాను. ప్రధానంగా మా ఆయన పవన్ కుమార్ కున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. స్కైప్ ద్వారా సంగీత విద్య కొనసాగుతూనే ఉంది. 
 
అన్నమాచార్య కీర్తనలు నేర్చుకున్నప్పుడు విష్ణు సంకీర్తనం అసామాన్యమని, అన్నమాచార్యుల కీర్తనలను రాగి రేకులలో చెక్కే పనితో అనేకమంది కళాకారులకు జీవనోపాధి దొరికిందని అర్థమైంది. ఆ కీర్తనలే దారి చూపాయి. అనేకమంది కళాకారులతో అన్నమాచార్య కీర్తనలను రికార్డు చేయాలి, ఎందరికో జీవనోపాధి కాకపోయినా ఆథ్యాత్మిక సంతృప్తిని కలిగించాలని అనిపించింది. ఈ ఆలోచన చెప్పగానే హిమబిందు అక్క సరేననడంతో చాలా సంతోషం కలిగింది. వెంటనే విధివిధానాలను రూపొందించుకొన్నాం. ఫేస్బుక్ లో పేజీ తెరిచాం. ఈ ప్రాజెక్టుకి సాంకేతికంగా కావలసిన పనినంతా నేనే చేస్తాను. మా అబ్బాయి ప్రశస్త్(4) కూడా ఎంతో ఉత్సాహంగా నా పనులను గురించి తెలుసుకుంటూంటాడు.

మెయిల్ ద్వారా అందిన వీడియో నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసేదాకా దాని మీద పని చేస్తాను. వాటి స్క్రీనింగ్, పాటలోని మాటలు కంపైల్ చెయ్యడం, షెడ్యూల్ చెయ్యడం, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన తరువాత ఎడిట్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చెయ్యడం నా పనులు. డేటా బేస్ కూడా నిర్వహిస్తాను. కొంతమంది గృహిణులకి ఫోన్లో వీడియో తీయడం, మెయిల్ చెయ్యడం రాదు. అటువంటివారికి బేసిక్స్ నుంచీ నేర్పిస్తూ ఉంటాను. వాళ్ళు అంత ఉత్సాహంగా పాల్గొనాలని అనుకున్నప్పుడు ఆ మాత్రం సహకారం అందించడం నా కర్తవ్యం అనిపిస్తుంది. మొత్తానికి “అన్నమయ్య పద యజ్ఞం” అనే బృహత్ కార్యానికి హిమబిందు అక్క గుండెకాయ అయితే నేను మెదడుని.

భక్తి, అంకితభావమే పెట్టుబడులు : పాలూరి హిమబిందు

ఫెస్బుక్ పేజీ ద్వారా కాన్సెప్ట్ గురించి ప్రత్యూష చెప్పగానే నేను వెతుకుతున్నదేదో దొరికినట్టు అనిపించింది. తను చెప్పిన రోజే కనీసం 25 మంది కళాకారులతో మాట్లాడి మరుసటి రోజు చెప్పేశా… ముందుకెళ్దాం.. అని. ఎంతో కాలం జాగ్రత్తగా నిర్వహించవలసిన పని కాబట్టి “అన్నమయ్య పద యజ్ఞం” అని పేరు పెట్టాను. కళాకారులు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మా ఆయన కోదండ రామమూర్తి, అమ్మాయిలు మానస(17), మహతి(9) సంపూర్ణంగా సహకరిస్తున్నారు.

కేవలం శ్రుతి మాత్రమే పెట్టుకొని నచ్చిన కీర్తన పాడి లేక ఏదైనా వాయిద్యం మీద వాయించి మెయిల్ చెయ్యమని ఫేస్బుక్ లో, మాకు తెలిసిన వాళ్లతో చెప్పాము. చాలా మంచి స్పందన వచ్చింది. అది చూసి ‘ఎందుకు కష్టపడతావు, ఏం సాధిద్దామని’ అన్నవాళ్ళు కూడా రికార్డులు పంపిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 400 మంది కళాకారులు వినిపించిన 350 వీడియోలను అప్లోడ్ చేశాం. ఇందులో కొంచెం అటూఇటూగా 250 కీర్తనలున్నాయి. 
ఈ పేజీకి వీక్షిస్తున్నవాళ్ళ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పుడు వస్తున్నదానికన్నా ఎక్కువ సంఖ్యలో వీడియోలు వచ్చినా రోజూ ఇంకొక రెండుమూడు వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తాం. మేము పెట్టే ప్రతి పాటనీ వీక్షకులు సంపూర్ణంగా ఆస్వాదించాలి. అందుకే ఒక పరిమితిని నిర్ణయించాం. ప్రతి పాటా జనంలోకి వెళ్ళాలని రోజుకి రెండు పాటలు, ఆదివారం నాడు ఉదయం ఒక పాటకు వివరణ, సాయంత్రం ఒక పాట మాత్రమే ఎఫ్బీలో పెడుతున్నాం.

వెలకట్టలేని భాగస్వామ్యం

కృషి, పట్టుదలలే ఈ ప్రాజెక్టులో మా పెట్టుబడి. ఒక్క పైసా కూడా ఒకరినుంచి ఆశించడం లేదు, ఒకరికి ఇవ్వడం లేదు. అయినా, ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అన్నమాచార్య కీర్తనల మీద చిరకాలంగా పరిశోధన చేస్తున్న గంధం శంకర్ గారు అందిస్తున్న సహకారం వెలకట్టలేనిది.  గంధం శంకర్ గారు రోజూ అన్నమాచార్య జీవిత చరిత్రలోని నాలుగైదు వాక్యాలు రాసిస్తారు. ఆదివారం నాడు ఒక కీర్తనను వివరిస్తారు. ఈ అంశంతో కలవడం వల్ల యజ్ఞానికి పూర్ణత్వం లభించింది. కామిశెట్టి శ్రీనివాసులు గారు కూడా ఆశీర్వదించడంతో ఆయనవి, గంధం శంకర్ గారివి ఆథ్యాత్మిక వివరణల 11 వీడియోలను ఇప్పటివరకూ పెట్టాము. సంగీత జ్ఞానమున్న ప్రతి ఒక్కరూ అన్నమయ్య కీర్తనలకు బాణీ కట్టలనుకుంటారు. అటువంటి ఎందరో స్వరకర్తల బాణీలు జనంలోకి వెళ్లేందుకు ఇది వేదిక కావాలన్నది కూడా మా సంకల్పంలో భాగమే. ఇంకా ఎవరూ బాణీ కట్టని కీర్తనలు, ఇప్పటికే కట్టినవి కూడా కొత్త బాణీలలో జనాన్ని అలరించాలని కోరుకుంటున్నాం.

వీడియోలు పంపడానికి, మరిన్ని వివరాలకు
annamayyapadayagnam@gmail.com
ను సంప్రదించవచ్చు.

******************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

 

Please visit this page