10_010 ఆనందసిద్ధి

” ఇప్పుడు మనం చేసే పనులకు, మనం కారణం కాదు, వేరే దైవమో, లేక అదృశ్యశక్తో కారణమని నిరూపించాలి. అంతే కదా? ” స్వామి అడిగారు.
” అవునండి ” అన్నారు ఇద్దరూ.

” మనం ఏ పని చేసినా ఆ పని చేయడానికి ముందు మనకి వచ్చిన ఆలోచనే కదా దానికి ఆధారం? ” స్వామి అడిగారు.

” అవును ఆలోచనేనండి ” నారాయణ.

” ఆలోచనలు మనకి వస్తాయా లేక తెచ్చుకుంటామా ? ” స్వామి ప్రశ్న.
నారాయణ కొంచంసేపు ఆలోచించి. ” అవే వస్తాయండి ” అన్నాడు.

” బాగా గ్రహించావు.  ఆలోచనలు నువ్వు తెచ్చుకోవు. అవే వస్తాయి. అందులో నీ ప్రమేయం లేదు. మనం చేసే పనులకి, మనకి వచ్చే ఆలోచనలే ఆధారమయినప్పుడు, ఆలోచనలు మనం తెచ్చుకోలేదు కాబట్టి, చేసిన పనులకు మనం కారణం కాదు ” అవునా అడిగారు స్వామి.
” ఆలోచనలు మనం తెచ్చుకోము సరే, అవి ఎక్కడినుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి ? వాటిలో కూడా మన ప్రమేయం  ఉండకూడదు కదా? ” అడిగాడు ఆనంద్.  
” ముందు ఎక్కడి నుంచి వస్తాయో చూద్దాము. అప్పుడు అందులో నీ ప్రమేయమేమయినా ఉందేమో తరవాత చూద్దాము. ఎవరికయినా ఆలోచనలు రెండు మూలాల నుంచి రావచ్చు. ఒకటి డి.ఎన్.ఏ, రెండవది వాసనలు. పునర్జన్మ మీద నమ్మకం ఉంటే మొత్తం అంతా వాసనలే అనవచ్చు.  కొంత మంది కి కొన్ని కొన్ని మానసిక వ్యాధులు ఆలోచనలు మీద ఆధారపడి ఉంటాయి. డిప్రెషన్ లాంటి వ్యాధులు. వాటి మూలం జీన్స్ లో ఉండవచ్చు. డిప్రెషన్ కి కారణమయిన ఆలోచనలు జీన్స్ వల్ల కావచ్చు. అతి చిన్నప్పుడే సంగీతం, చిత్రకళ వంటి వాటి మీదకి కొందరు పిల్లలు ఆకర్షితులు అవుతున్నారంటే, జీన్స్ అని చెప్పవచ్చు. ఇప్పుడు నువ్వు ఎవరికి ఎక్కడ పుట్టావు అన్నదాని మీద నీ కంట్రోల్ లేదు కాబట్టి, నీ జీన్స్ ద్వారా వచ్చే ఆలోచనలకి, వాటి వలన చేసే పనులకి నువ్వు బాధ్యుడివి కావు. అలాగే నువ్వు పుట్టినప్పటి నుంచీ నీ అయిదు ఇంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలన్నీ, కొంతకాలం పైపైన ఉండి కాలక్రమేణా మనసు అడుగుకు చేరతాయి. అంటే నీ అంతఃకరణలో భాగం అయిపోతాయి. వాటినే వాసనలు అంటాము. ఇప్పుడు చిన్నప్పుడు మీ నాన్నగారు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ పెరిగావు. అప్పుడు ఏర్పడిన వాసనలకు నువ్వు కారణం కాదు కదా ? అలాగే మీ నాన్నగారు ఏ స్కూల్ లో వేస్తే అక్కడ చదివావు. అక్కడ ఏర్పడిన వాసనలకి నువ్వు ఒక్కడివే కారణం కాదు కదా? అలాగే నీ జీవితం లో వెనక్కి తిరిగి చూసుకుంటే నీ ఆలోచనలకి నువ్వు కారణం కాదని తెలుస్తుంది ” వివరించారు స్వామి.

” వాసనలు అంటే అనేకానేక గత అనుభవాల సారం అని కదా అన్నారు. అన్ని లక్షల విషయాల నుంచి ఒక విషయం మీద మనకి ఆలోచన ఎలా వస్తుంది ? ” అడిగాడు నారాయణ.

” ప్రపంచం యొక్క స్వభావం గురించి నిన్న చెప్పుకుంటూ మనం ఒకటి అనుకున్నాము. ఈ సంబంధిత ప్రపంచం లో ( relative world ) ఒక కార్యానికి ( effect ) ఇది ఒక్కటే కారణం ( cause ) అని చెప్పలేము. ఇప్పుడు మీరు ప్రొద్దుటే కుర్చీలో కూర్చుని వీధిలోకి చూస్తున్నారు. రోడ్డు మీద మీ గుమ్మం ముందునుంచి ఎవరో ఎర్ర చీర కట్టుకుని వెళ్లారు. అది చూడగానే మీకు ఫ్రిజ్ లో ఆపిల్ గుర్తుకు వచ్చి లేచి వెళ్లి తీసుకుని తిన్నారు. దీనికి కారణం మీరు వెతుక్కుంటూ వెడితే, మొదట ఎర్ర చీర ఆవిడ మనసు లోకి వస్తారు. ఆవిడ అలా వెళ్ళడానికి కారణం, ఆ వీధిలో ఎవరో ఇంటికి పని మీద వెడుతోంది. ఆలా వెనక్కి వెడితే అనంతంలో పడతారు.

అందుచేత ప్రపంచంలో జరిగే దానికి, మనకు కావలిసిన వ్యవహారానికి మించి కారణం వెతకకూడదు. అందుచేత మన పనులకు, ఆధారం ఆలోచనలు కాబట్టి, వాటి మీద మన నియంత్రణ లేదు కాబట్టి, మనం ఏది చేసినా, మనకి ఏది జరిగినా భగవంతుడో లేదా ఒక అదృశ్య శక్తో కారణం అనుకోవాలి తప్ప, మనం కారణం అనుకోకూడదు ” అన్నారు స్వామి.

” మన చాలా మనస్తాపాలకి కారణం, ఏ పని అయినా మనం చేస్తున్నాము అనుకోవడం వల్లేనన్న మాట ” అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఆ నంద్.  
” అష్టావక్ర మహర్షి గొప్ప జ్ఞాని. ఆయన ఏమన్నారో చూద్దాం.
అహం కర్తేత్యహం మాన మహా కృష్ణాహి దంసితః l
నాహం కర్తేతి విశ్వా సామృతం పీత్వా సుఖీ భవ ll
( నేను చేస్తున్నాను అని అనుకోవడం ఒక గొప్ప విషసర్పం తో కాటు వేయించుకోవడం లాంటిది : నేను కర్తను కాను అనే విశ్వాసమనే అమృతం తాగి సుఖంగా ఉండు ) ” శ్లోకం వివరించి స్వామి మళ్ళీ ఇలా అన్నారు.

” మనం కర్త కాదు అని అనుకోవడమే కాదు, నిజం కూడా అదే. మీకు నమ్మకం దృఢ పడేలా ఇంకా కొన్ని విషయాలు పరిశీలించవచ్చు. ఇప్పుడు మనం ఏమి అనుకున్నాము? మనం చేసే పనులకు ముందు మనకి ఆలోచనలు వస్తాయి అనుకున్నాము. అలా రావడంలో మన ప్రమేయం లేదు అని నిర్ధారించాము. ఇది ఇంకా గట్టిపడాలంటే ఇంకో విషయం మీరు గమనిస్తే తెలిసిపోతుంది. ఒకటి చెప్పండి. మీరు ఉచ్చ్వాస నిశ్వాసాలు మీరు కావాలని చేస్తారా? లేదా అవే జరుగుతాయా? ” అడిగారు స్వామి.

” అవే జరుగుతాయి కదండీ, మనకి తెలివి లేని నిద్ర సమయం లో కూడా అవి జరుగుతూనే ఉంటాయి కదా? అందులో మన ప్రయత్నం ఏమి ఉంది ? ” అన్నాడు ఆనంద్.

” మీరు కొంతసేపు వాటిని బలవంతంగా ఆపితే, ఆ సమయంలో ఆలోచనలు కూడా ఆగిపోతాయి. ఊపిరి వల్లే ఆలోచనలు రావడం జరుగుతోందని తెలిసినప్పుడు, ఆ ఊపిరి సల్పడంలో మన ప్రమేయం లేనప్పుడు, ఆలోచనలు రావడంలో కూడా మన ప్రమేయం లేదు.

ఏది జరిగినా ఒక పద్ధతిలో, మన అధీనంలో లేని శక్తి వలన జరుగుతుంది అని గమనించవచ్చు. ఇంకా నిశితంగా పరిశీలిస్తే చాలా విషయాలు మీకు ఈ రహస్యాన్ని బహిర్గతం చేస్తాయి.

ఇప్పుడు మీరు ఒక అన్నం ముద్ద తిన్నారు. అది మీ నోటి ద్వారా ప్రవేశించి, అనేక శరీర భాగాల సమన్వయం తో, అనేక రసాయనాల సహాయంతో రక్తంగానూ, ఆ తరవాత శక్తి గానూ మారడంలో, మీ ప్రమేయం ఏమన్నా ఉందా? అందులో ఒక అదృశ్య ప్రణాళిక లేదు ? మీ లోపల జరిగే వాటి లాగే, మీ బయట జరుగుతున్నవి గమనించండి. 

సూర్యుడు, భూమి, చంద్రుడు మొదలయిన వాటి నిర్దిష్ట గమనం లో ప్రణాళిక లేదూ? బయటా, లోపల అన్నీ ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఒక అనంత శక్తి వల్ల జరుగుతుంటే, మీకు లేదా మీ ద్వారా జరిగే వాటికి మాత్రం మీరు కారణం  అనుకోవడం సరి అయిన జ్ఞానం లేకపోవడమే ” వివరించారు స్వామి.

” మీరు చెప్పిన దాని మీద నమ్మకం కుదిరింది స్వామీ !” అన్నారు ఇద్దరూ.

” నమ్మకం ఒక్కటే కాదు, ఏ పనికి ఫలితాలు వచ్చినా ఇది గుర్తు తెచ్చుకోవడం అలవాటయితేనే మీరు ప్రశాంతంగా, అనవసరమయిన భావోద్వేగాలు లేకుండా ఉండగలుగుతారు. సిద్ధాంతం మీద దృఢమయిన, నమ్మకం ఉంటే సరి అయిన సమయంలో అది గుర్తుకువచ్చి మీకు సహాయపడుతుంది “.

“ అయితే పూజలూ, భజనలూ అవీ చేయనక్కర లేదాండీ ? ” అడిగాడు ఆనంద్.

” మీకు ఏ పని చేయాలని మనఃస్పూర్తిగా అనిపిస్తే అవన్నీ చేయండి. కానీ ఫలానా ఫలితం కావాలని చేయడం తెలివి తక్కువతనం. మనం చర్చించిన సిద్ధాంతం మీద మీకు నమ్మకం కలిగితే, మీ పనులకి ఏ ఫలితాన్నయినా భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తారు. అప్పుడు అంతా ఆనందమే. దీనినే ‘శరణాగతి’ అని కూడా అంటారు. గీతలో చెప్పింది కూడా అదే కదా? దీని వల్ల మీ ఆధ్యాత్మిక జీవితం లోనే కాదు, ప్రపంచ వ్యవహారాలలో కూడా గణనీయమయిన మార్పు గమనిస్తారు ” భరోసా ఇచ్చారు స్వామి.

” ప్రపంచ వ్యవహారాలలో కూడా అన్నారు, కొంచం వివరిస్తారా? ” అడిగాడు నారాయణ.

” చాలామంది, పూజలూ, జపాలూ అవీ ఎందుకు చేస్తారు?, భవిష్యత్తులో ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న భయం వల్ల, లేదా ప్రపంచ వ్యవహారాలలో భాగంగా మీరు చేసే పనులకు మీకు కావల్సిన ఫలితాల కోసం. అంతే కదా? ” అడిగారు స్వామి.

” అవునండి. అది ఇదివరకే అనుకున్నాము కదా? ” ఆనంద్.

” అంటే మీరు ప్రపంచం యొక్క ప్రభావం మీమీద పడకుండా ప్రయత్నిస్తున్నారన్న మాట. కానీ మనం  తెలుసుకున్న శరణాగతి పద్ధతి లో, ప్రపంచం ప్రభావం నుంచి తప్పించుకుని మీరు ప్రపంచం మీద నియంత్రణ సాధించవచ్చు ” స్వామిజీ అన్నారు.

” అదెలాగ సాధ్యం ? ఉదాహరణలు చెబితే అర్థం అవుతుందేమో ! ” అన్నాడు ఆనంద్.  
” ఏముంది చాలా సింపుల్. మీరు ప్రమోషన్ కావాలనుకున్నారు. వస్తే ఆనందం, రాకపోతే విచారం. దానికోసం  ప్రార్థనలు చేసినా రాకపోతే అప్పుడూ విచారమే. అలా కాకుండా మన ప్రయత్నం మనం చేద్దాము. ప్రమోషన్ వచ్చినా, రాకపోయినా ఫరవాలేదు. ఎందుచేతనంటే అదే దైవ నిర్ణయం అనే దృక్పధం లో మీరు ఉన్నారనుకోండి, అంటే మీరు ప్రపంచ ప్రభావం నుంచి బయట పడటమే కాకుండా, దానిమీద ఒక నియంత్రణ వచ్చినట్టు. ఆ దృక్పధం ఎప్పుడయితే మీకు దృఢపడిందో, ప్రపంచంలో ఏదీ మిమ్మలని బాధించదు. అంటే మీ నియంత్రణ లోకి అది వచ్చినట్టే. అద్వైత సాధన ద్వారా, స్వరూపం తెలుకోవడం ద్వారా పరమాత్మని గుర్తించిన తరువాత కూడా అదే స్థితి ” వివరించారు స్వామి.

” అంటే శరణాగతి ఏ ఫలితాలనిస్తుందో, అద్వైత జ్ఞానం కూడా అదే ఫలితాన్ని ఇస్తుందన్నమాట ” అన్నాడు ఆనంద్.

” అవును నిస్సందేహంగా. కొన్నాళ్లు, మనం చర్చించిన విషయాలు అమలులో పెట్టడానికి ప్రయత్నించండి. మళ్ళీ సందేహాలు వస్తే రండి. మాట్లాడదాం ” అన్నారు స్వామి  లేస్తూ.

మిత్రులు ఇద్దరూ  స్వామి కి నమస్కరించి వచ్చేశారు.

సమాప్తం
****************************