10_016 నాకు తెలిసిన మహానుభావులు – స్పూర్తిదాతలు

.

మా చిన్నతనంలో… అంటే 70సం.లకు పూర్వం నాటి విషయం. ఈరోజుల్లోలా ఇంటికి వచ్చిన పెద్దలకి

తగినంత అవసరమనిపిస్తే కానీ ఇంట్లో వాళ్ళని, భార్యనీ పరిచయం చేసే అలవాటు ఉండేది కాదు.

వచ్చిన వాళ్ళకు కాఫీ, టీలు ఆఫర్ చేసే అలవాటు కూడా ఉండేది కాదు. మంచినీళ్ళు, వేసంకాలం అయితే మజ్జిగ తేట ఇవ్వడం వరకే!ఎటొచ్చీ భోజనం వేళకి వస్తే మాత్రం భోజనానికి ఆహ్వానించేవారు అంతే. చిన్న పిల్లలు చద్దన్నం తినేసేవారు. అలా కాకపోయినా 9గం.ల కల్లా వంట పూర్తి చేసి భోజనాలు పెట్టేసేవారు. 10 – 10.30 కల్లా భోజనాలు పూర్తయిపోయేవి. కర్రల పొయ్యిల మీద వంట కదా!

ఒకసారి వంట పూర్తయి పొయ్యిలో కర్రలు లాగేస్తే (ఎందుకో ఆర్పేస్తే ? అనేవారు కాదు). ఇహ మళ్ళీ సాయంత్రమే పొయ్యి వెలిగించడం !,

పనిమీద ఎవరింటికేనా వెళ్ళవలసి వచ్చినా10 గం.ల కల్లా భోజనం పూర్తి చేసుకుని మరీ వెళ్ళేవారు.

నాకు తెలిసి… మర్యాద, అభిమానం, స్నేహం, ఉపకారం పుష్కలంగా ఉన్న రోజులవి.1927లోనే విజయనగరం నుండి వెళ్లి మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ లో చేరిన నాన్నగారు శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారు, ఆతర్వాత ఆంధ్రదేశం నుండి ఎవరొచ్చినా, రామకృష్ణయ్య గారిల్లు వాకబు చేసుకుని మరీ వచ్చి ఉండేవారు.

” వండనలయదు వేవురు వచ్చిరేని నడికిరేయైన

అన్నపూర్ణకు నుద్దియౌ నతని రమణి…..”

అన్నమాట అమ్మకి సరిగ్గా సరిపోతుంది. పేరుతో సహా!! ఈ మాట అన్నది నేను కాదు. ఆరోజుల్లో

అమ్మచేతి వంట తిన్నవాళ్ళు.. దశాబ్దాల తర్వాత కోరాడ వారమ్మాయిగా నేను పరిచయం అయినప్పుడు అన్నమాటలివి!

………..

మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో కొత్తగా ఉద్యోగం లో చేరడానికి వచ్చిన శ్రీ మాన్ శ్రీభాష్యం అప్పలాచార్యుల గారికి ట్రిప్లికేన్ లో ఉన్న కోరాడ వారింటి అడ్రస్ ఇచ్చి, కలిసి అడిగితే, తప్పక అన్ని విధాలా సాయం చేయగలరని చెప్పార్ట.

మైలాపూర్ లో తెలిసిన వైష్ణవులింట సాపాటు ముగించుకుని 10.గం.లకి నాన్నగారి ని కలవడానికి వచ్చారు. పరిచయాలు పూర్తి అయాక తనకి ఈ ఊరూ, భాషా కొత్త. పార్థసారథి స్వామి సన్నిధిలో నివసించాలని కోరిక. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చిన్న వాటా దొరికేలా మీరే ఏదైనా ఏర్పాటు చేసి పెట్టగలిగితే…. అన్న ఆ యువకునితో నాకూ పరిచయాలు తక్కువే. అయినా కనుక్కుంటాను అంటూ అమ్మని పిలిపించి అడిగితే,

” రంగనాయకి గారిల్లు పోయిన వారమే ఇచ్చేశారు.

ఇంక నాకు తెలిసి ఏమీ లేవు మరి ” అంటే, ఓక్షణం ఆలోచించి “అబ్బాయి ఊరికి కొత్త కదా ! పోనీ  మనింట్లోనే ఆముందు మూడు గదులూ. ఖాళీ చేసి ఇవ్వరాదూ ? ” అంతే. అంతకుముందు వాడుకుంటూన్న గదులు ఖాళీ చేసి ఇచ్చేసింది.

అలా అప్పలాచార్యులవారు మా ఇంట్లో దిగారు.

వారి శ్రీమతి గారు నన్నెంత ముద్దు చేసేవారో !

పూలజడలు వేసీ రంగు రంగు రిబ్బన్ లతో రెండుజెడలు వేసీ…. నేను చదివే ముకుంద మాల

శ్లోకాలు వారికెంత ఇష్టమో !

తర్వాతి కాలంలో… నాకు పెళ్ళై కొన్ని దశాబ్దాల తర్వాత.,. తణుకు సుందరకాండ ప్రవచనానికి

వచ్చినప్పుడు… కోరాడ వారమ్మాయినని చెబితే గుర్తు పట్టి చిన్ననాటి విషయాలన్నీ గుర్తుతెచ్చుకున్నారా పుణ్య దంపతులు ! సంగీతం నేర్చుకున్న నేను వారి కోరిక పై ముకుందమాల శ్లోకాలు రాగయుక్తంగా పాడితే, ఎంతో ఆనందించి ” ఈ ముకుందనామం ఈనాటి సమాజానికి ఎంతైనా అవసరం. సమాజానికి ఎంతైనా మేలుచేయగలదు. నువ్వు రాగయుక్తంగా పాడి కాసెట్ చెయ్యరాదూ? ” అంటూ ఆదేశించారు. అంతే! వారం రోజుల్లో 40 శ్లోకాలకూ రాగాలు కూర్చి, వ్యాఖ్యానంతో సహా పాడి కాసెట్ చెయ్యగలిగానంటే వారు నాకందించిన సంకల్పబలం. వారి తిరుహస్తాలతో ఆవిష్కరించబడిన ఈ కాసెట్ / సి.డి.లు ఇటు ఆంధ్రదేశం లోనూ, అమెరికాలోనూ కూడా విజ్ఞులైన పెద్దల మెప్పుపొందడం అదృష్టం.

ముకుంద ( మాల ) నామ గానం నాకెంత సంతృప్తినిచ్చిందనీ!!

అనుష్ఠానపరులైన పెద్దల సందర్శనమూ, వాక్కులూ, వారి ఆదేశాలూ ఎప్పుడూ దైవానికి చేరువ చేస్తాయి !!!

……………….

1950 ల్లో నాన్నగారు తిరుపతి ప్రాచ్య పరిశోధనాలయంలో చేరిన తరువాత శ్రీరాముల వారి దక్షిణ మాడ వీధిలో ఉన్న మాకు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారిల్లు దగ్గరే. వారింటి హాల్లో తరుచు కొంతమంది చేరి నిశ్శబ్దంగా కళ్ళుమూసుకుని కూర్చోవడం, ఇంకా ఏవో ప్రేయర్లూ, అవీ గమనిస్తూన్న నాకు అదేమిటో తెల్సుకోవాలనీ, అక్కడ కూర్చోవాలనీ అనిపిస్తూండేది. కానీ ఆ పరిసరాలకు పిల్లల్ని వెళ్లనిచ్చేవారు కాదు. పెద్దయాక తెలిసింది మాస్టర్. C.V.V. గారి గురించి!

ఆధ్యాత్మిక వాసనకది స్ఫూర్తి కాబోలు!!

ఆరోజుల్లోనే శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారూ నాన్నగారూ తరుచు కలుసుకుని చాలాసేపు చర్చించుకునేవారు. వెళ్ళేముందు నన్ను పిలిచి ఏం పాడుతున్నావ్? బాలరామాయణం ఎందాకా వచ్చిందీ?…. లాటివి అడుగుతూండేవారు. “ అన్నట్లు వేంకటేశ్వర సుప్రభాతం నోటికి వచ్చిందా? ” అన్నారు ఒకసారి. ఇంకా ఐదు శ్లోకాలు మిగిలి ఉన్నాయట. నాన్నగారన్నారు. (శ్లోకాలు, పద్యాలు… పుస్తకం లో రాసి చదవడం కాని, ప్రింటైనవి చూసి చదవండం కానీ ఉండేది కాదు. కేవలం వల్లింప జేయడమే!) “ అయితే ప్రపత్తి చదవలేదన్నమాట. నేచెబుతా ఇలా రా ” అంటూ ” కమలాకుచ చూచుక కుంకుమ తో …. ” అంటూ రాగయుక్తంగా పాడటం నేర్పించారు.

” సుముఖం సుహృదం సులభం సుఖధం…. వారు పాడుతూంటే ఎంత అధ్భుతంగా ఉండేదో! మొత్తానికి వేంకటేశ్వర ప్రపత్తి రాగయుక్తంగా పాడటం వారి దగ్గరే నేర్చుకున్నాను. ” నినా వెంకటేశం ననాధో ననాధః “, అజ్ఞానినా మయాదోషాన్ అశేషాన్…,”.

వీటిని ఆర్తితో పాడే విధానం వారే నేర్పారు.

తర్వాతి కాలంలో ఏ శ్లోకాన్నైనా, పద్యాన్నైనా భావం ఆధారంగా, రాగయుక్తంగా పాడటానికి ఎంతగానో తోడ్పడింది.

అది వారినుండి పొందిన స్ఫూర్తి !!

………………

ఆరోజుల్లోనే ఒకసారి, నాన్నగారు వంటింట్లోకి వచ్చి “ రేపు వస్తున్నారు మనింటికి. భోజనానికుంటారు ” అని అమ్మతో చెబుతూంటే… “ ఎవరు నాన్నా? ” అన్నాను.

“ బారిస్టర్ పార్వతీశం నువ్వు చదివావ్ కదా? కొన్ని పేజీలు కంఠతా పట్టేశావ్ కూడా! ” అన్నారు.

అవును. ఆ పుస్తకం ఎన్నోసార్లు చదివాను. నాకైతే బోల్డు సంతోషం వేసింది. చదివిన పుస్తకం లో కథ అంతా కళ్ళముందు మెదిలింది. ఆయన వస్తే, బారిస్టర్ పార్వతీశం ప్రయాణ సన్నాహం, లండన్ లో విషయాలూ అవీ ప్రత్యక్షంగా వారి నోటే వినాలని ప్రశ్నలు ప్రిపేర్ చేసుకున్నాను కూడా !

9 గం.లవుతూంటే చేతి సంచితో ఒకాయన వచ్చారు.

తలుపు తీసిన నన్ను చూసి “ అమ్మాయీ ! నువ్వు రామకృష్ణయ్య గారి కూతురువా ? ” అంటూనే మెట్లెక్కి మేడమీదికి వెళ్ళారు. ఇద్దరూ మాటల్లో పడ్డారు. ” వంట అయింది. భోజనానికి రమ్మంది ” అంటూ చెప్పాను పైకి వెళ్ళి.

కిందకు వచ్చి, పెరట్లో కెళ్ళి నూతిదగ్గర నీళ్లు తోడుకుని స్నానం చేసి వచ్చి, పీటమీద అమ్మ ఉంచిన

మడిబట్ట కట్టుకుని, విభూతి పెట్టుకుని కూర్చున్నారు.

నాన్నగారూనూ!! అదేమిటి? వీళ్ళు భోజనానికి కూర్చుంటున్నారు? బారిస్టర్ పార్వతీశం రాకుండానే?

మెల్లిగా నాన్న దగ్గరకెళ్ళి ” బారిస్టర్ పార్వతీశం రావడం లేదా నాన్నా? మీరు భోజనానికి కూర్చున్నారు? ” అన్నాను.

నాన్నగారు నవ్వి “ ఓసీ! అదా ! ఇందాకటి నుండి కాలుగాలిన పిల్లిలా వీధిలోకీ, ఇంట్లోకి తిరుగుతూంటే ఏమిటో అనుకున్నాను. బారిస్టర్ పార్వతీశం ఇంకా రాలేదని చూస్తూందిటయ్యా! ” అంటూ… “ ఇతనేనమ్మా ఆ పుస్తకం రాసింది. పేరు మొక్కపాటి నరసింహశాస్త్రి ”. 

“ మరి… బారిస్టర్ మీరు కాదా? నేను ..అంటూ రాశారు? ఎంత బాగా రాశారు! అయితే మీరు లండన్ వెళ్ళొచ్చారా? ” అన్న నా ప్రశ్నకు “ .. అబ్బే ఎక్కడమ్మా ! నేను వెళ్ళలేదు ”

“ మరి లండన్ ప్రయాణం స్వయంగా చేసినట్లే, చూసినట్లే రాశారు? ఎలా? ”

” విస్తృతంగా విషయ పరిజ్ఞానం పెంచుకునీ, దానికి ఊహని జోడిస్తే రాయొచ్చు! “

అందుకే ” రవి గాంచనిదే కవి గాంచునుగా ” అంటే ఇదేనేమో!

ఔనా !! అయితే విషయపరిజ్ఞానం పెంచుకుని, ఊహనిజోడిస్తే అంత బాగా రాయొచ్చన్నమాట..

ఆమాట స్ఫూర్తి!!!

ఇలా నాన్నగారి సన్నిహితులైన పెద్దలు ఎందరినుండో ఎన్నో రకాలుగా స్ఫూర్తిని పొందగల్గడం నేను చేససుకున్న పుణ్యం!   

ధన్యోస్మి.

KamalaDevi Bhamidi

Tanuku

Ph no.9866347513., Mail id : Kamala devi.bhamidi@gmail.com

*****************

____________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

______________________________________________________