———————————————————————————————-
తేనెకన్నను తీయ నైనది
తెలుగు – అది మనభాషరా !
అమ్మ ఉగ్గూ పాలతో మన
కలవరించినభాషరా !
—
అఆ ఇఈ ఉఊ ఎఏ
ఒఓ ఐఔ అచ్చులురా !
తెనుంగుమాటలచివర అచ్చులే
తెను గందులకే మధురమురా !
—
ఇటలీభాషే తీయన !
ఈతెలు గొకటే తీయన !
ఈరెండింటికి సమాన మైనది
ఇక లేదోయీ నాయనా !
—
తేనెలతేటలు
తెలుంగుమాటలు !
అమృతపుఊటలు
ఆంధ్రుల కవితలు !
—
అందుకె అంధ్రిని బంగరుపూవుల
పూజించా డాప్రౌఢరాయలు !
అందులకే ఆతెలుంగుకవితకు
పల్లకి పట్టెను కృష్ణరాయలు !
—
లక్ష్మీ అంటే సంస్కృతము !
లచ్చీ అంటే ప్రాకృతము !
సంస్కృత మంతా మనసొత్తు !
ప్రాకృత మన్నది మనసొత్తు !
—
అందులకే విజ్ఞానం అంతా
అంతా మనసొంతం !
అందులకే ఆభాషలలోపలి
అందా లన్నీ మనసొంతం !
*******