10_016 గురజాడ తెలుగుజాడ

.

‘ కొత్త తరానికి గురువెవరంటే గురజాడని నేనంటాను…… ‘ అంటారు దాశరధి. గురజాడ భావాలు 20 శతాబ్ధానికే కాదు, 21, 22 శతాబ్ధాలకు కూడా వర్తిస్తాయి అంటారు సాహితీ విమర్సకులు. క్రాంతిదర్శులైన కవులు తరాల తరబడి నిలబడే రచనలు చేస్తారు కాబట్టే వారి రచనలు సార్వకాలికం. పైగా ఒక ప్రయోజాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు.

“ నా కావ్య కళ నవీనం” అంటారు గురజాడ. ప్రజలకి ఉపకరించే ఉద్యమం చేపట్టి సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి సాహిత్యాన్ని ఒక ఆయుధంగా చేసుకున్నారు నాటి సంస్కర్తలు. కందుకూరి సాంఘిక సంస్కరణ, గిడుగు వ్యావాహరిక భాష ఉద్యమం గురజాడ మీద ప్రభావాన్ని చూపేయి. అందులో భాగంగా ఆ రోజుల్లో జరుగుతున్న బాల్య వివాహాలు ఆయన లో కలవరం లేపేయి. పసిబాలికలను కసాయి తల్లిదండ్రులు కన్యాశుల్కాలకు ఆశపడి అమ్మేయడం అమానుషమనుకున్నాడు. ముసలి పెళ్లికొడుకులు కాలం చేయగా, జీవితాంతం విధవలుగా జీవించడం కూడా ఆయన భరించలేకపోయాడు. వెరసి కన్యాశుల్కం రూపుమాపడం, విధవా వివాహాలు చేయడం, వేశ్యావృత్తి నిర్మూలనం చేయడం మొదలైనవి ఆయన ముందున్న సమస్యలు. ఈ సమస్యల పై ప్రజలకు అవగాహన కల్పించాలనే తలంపులు గురజాడని “ కన్యాశుల్కం నాటకం “ రూపంలో రూపుదాల్చింది. ఈ నాటకం లో ఆయన “ మృదు పద లలిత పద బంధాన్ని” వాడేడు. ఇప్పటికీ ఈ నాటకం లోని పాత్రలు …. మూర్ఖపు అగ్నిహోత్రవధానులు, లుబ్ధావధాన్లు, గిరీశం, రామప్ప పంతులు సజీవ పాత్రలై మన కళ్ళముందు కనబడతాయి. మధురవాణి లాంటి మేధస్సు కలిగిన స్త్రీలు సమాజానికి నిత్యం మరమత్తులు చేస్తూనే ఉన్నారు, ఉంటారు కూడా. స్త్రీలు చదువుకొని సంసారాలు చక్కబెట్టుకోగలరనే నమ్మకం గురజాడకు కలిగిన కారణంగానే “ దిద్దుబాటు “ కధలో కమలినీ పాత్ర వెలసింది.

నాటకం,,కధ, కవిత, వ్యాసం అన్ని ప్రక్రియలకు జీవం పోసారు గురజాడ. గురజాడ రాసిన “ ముత్యాల సరాలు “ లో రాసిన కవితా ఖండికలు ప్రజలకు చేరువయ్యాయి. ఒక పార్శీ గజల్ నడకని తన కవిత లో పొందుపరచానన్నాడు గురజాడ.

“ గుత్తునా ముత్యాలు సరములు

కూర్చుకుని తేటైన మాటల

కొత్తమేలు కలయిక,

క్రొమ్మెరుంగులు చిమ్మగా……….. అని ప్రారంభించాడు

బాల్య వివాహాలకు బలయిపోయిన “ పూర్ణమ్మ “ కథ కరుణ రసాత్మకం. నాటికి నేటికీ ఇంత చక్కని కవితాఖండిక తెలుగు కవిత సాహిత్యం లో అరుదైనదనే చెప్పాలి.  

“ మేలిమి బంగరు మెలతల్లరా,

కన్నుల కాంతుల కలువల్లారా

అమ్మలగన్న అమ్మల్లార

విన్నారమ్మా ఈ కథను 

అని ప్రారంభించి, పూజారి ఇంట పుట్టిన పూర్ణమ్మ ని ముదుసలి మొగుడుకి ఇచ్చి వివాహం చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది …. ఆ విషయాన్ని గురజాడ వర్ణించిన తీరు ఆయన్ని మహాకవి గా నిలబెట్టింది.

“ కన్నుల కాంతులు కలువుల చేరేను

మేలిమి చేరేను మేని ఫసల్

హంసలు చేరేను నడకల బెడగులు

దుర్గను చేరేను పూర్ణమ్మ ,,,,,,,,,,,,,,,,,,,,, ఈ చివరి పాదాలు చదివి, ఒక మహా కావ్యాన్ని చదివిన అనుభూతి కలిగిందన్నాడు శ్రీశ్రీ. 

ఇలా గురజాడ కవితా వైభవాన్ని చూసిన మనం ఎంతో అదృష్టవంతులం. ఆయన తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం, కానీ ఆయనకి దురదృష్టం. అందుకే కన్యాశుల్కం నాటకం లో గురజాడ గిరీశం పాత్ర చేత ముందే పలికించాడు “ మన వాళ్లోట్టి వెధవాయులోయ్ “ అని. లేకపోతే ప్రక్క రాష్ట్రాల్లో కాస్తో కూస్తో కవిత్వం గలిగిన ప్రతి ఒక్కడు అందలాలెక్కుతాడు. మనం మాత్రం ఎదుగుతున్న వాళ్ళని కాళ్ళు పట్టుకుని క్రిందకు లాగుతుంటాం. ఇప్పటికీ గురజాడ కి జాతీయ కవి స్థానం దక్కలేదు అన్నది అత్యంత విచారకరం. ఇంతకి అసలు విషయానికి వస్తే …..

దేశమును ప్రేమించుమన్నా,

మంచియన్నది పెంచుమన్నా,

వట్టి మాటలు కట్టిపెట్టోయ్

గట్టి మేలు తలపెట్టవోయ్

స్వంత లాభం కొంత మానుకు

పొరుగు వాడికి తోడుపడవోయ్

దేశమంటే మట్టికాదోయ్

దేశమంటే మనుషులోయ్

దేశభక్తి గేయం నిండా ఇటువంటి సార్వకాలికమయిన హితవాక్యాలే ఏ దేశానికైనా, ఏ కాలానికైనా వర్తిస్తాయి, విశ్వశ్రేయః కావ్యం అన్న సూక్తికి అన్వర్ధమయింది ఈ దేశభక్తి ఖండిక.

ఇదే తెలుగు వాళ్ళ గుండెల్లో వేసిన గురజాడ అడుగుజాడ. ఆయన సదా స్మరణీయులు. ఈ విశ్వం ఉన్నంతవరకు ఆయన కవిత్వం ఉంటుంది. ఎందరో కవులు ఆ అడుగుజాడల్లో నడిచి, తెలుగు భాషని సుసంపన్నం చేశారు.

గురజాడ అప్పారావు గారు రాసిన కథల్లో దిద్దుబాటు, పెద్ద మసీదు, సంస్కర్త హృదయం, మాటా మంతి ఎన్నదగ్గవి. ఆంగ్లం లో కూడా ఆయనకి ప్రవేశం ఉంది. ఆంగ్లం లోకి అనువాదం చేసిన “ సాంగ్స్ అండ్ ద బ్లూ హిల్స్” కూడా ఉంది.

ఆయన రాసిన కన్యాశుల్కం తో పాటు, పూర్ణమ్మ, లవణరాజు కల, డైరీలు, నీలగిరి గేయాలు మొ!! ఆయనకి పేరు తెచ్చిపెట్టినవి.

.

******************************************

.

Chaganti Prasad

Hyderabad

Mobile : 9000206163  Email : prasadchaganti137@gmail.com 

.

__________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

__________________________________________________