10_016 తెలుగు వారి క్రీడా సంస్కృతి

.

కనుమరుగవుతున్న తెలుగు వారి క్రీడా సంస్కృతి

సంస్కృతి అంటే ఒక జాతి అభివృధ్హి పథంలో నడిచిన విధాన్ని సంస్కృతి అని అనవచ్చు. ఈ సంస్కృతిని గురించి రకరకాల నిర్వచనాలున్నాయి. అయితే తరతరాలుగా మన జీవనశైలిలో వస్తూ ఉన్న వివిధ అంశాలను సంస్కృతిలో భాగంగా చెప్పుకోవచ్చు. అనాదిగా వస్తున్న ఆచారాలను అనుసరించడమే సంప్రదాయం అని చెప్పవచ్చు. ఒక జాతి జీవిత చరిత్రను తెలుసుకోవడమే సంస్కృతి అని అనవచ్చు. ఆ జాతికి చెందిన ప్రజలు ఎలా జీవించారు? ఎలాంటి ఆటలు ఆడి పాటలు పాడారు? ఎలాంటి వస్తు సామగ్రీని వినియోగించారు? వారి ఆచారవ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయని మనం పరిశీలిస్తే ఆ జాతి సంస్కృతిని గురించి కొంత తెలుసుకున్నవారమవుతాము. ఈ రకంగా పరిశీలిస్తే, తెలుగువారికి ఒక ప్రత్యేక సంస్కృతి ఉందని చెప్పాలి. అయితే ఏ సంస్కృతీ కూడా నిలకడగా అలాగే ఉండదు. జీవన విధానాన్ని బట్టి ఎప్పటికప్పుడు అనేక మార్పులకు లోనవుతుందని ఏ జాతి చరిత్రను పరిశీలించినా తెలుస్తుంది. పరాయి దేశాల ఆక్రమణల వల్ల ఎన్నో దేశాల నాగరికతలు నామరూపాలు లేకుండా నాశనం అయ్యాయని మనకు ప్రపంచ చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఆ కోణంలో చూస్తే మన భారత దేశం భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. 11 వ శతాబ్దం నుండి అనేక రకాల వారి పరాయి పాలనలో మగ్గి లెక్కలేనన్ని కష్టాలకు ఓర్చి నిలబడటం ఒక్క భారత దేశానికే చెల్లింది. నేటికీ భారతీయ సంస్కృతికి  ప్రపంచమంతా తలలు వంచి నమస్కరిస్తూ, అనుసరించే స్థాయిలో ఉందంటే ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఒక్క భారత జాతికే చెందినవి మాత్రమే కాదు సార్వకాలికమైనవి. సార్వజనీనమైనవి అని చెప్పడంలో భారతీయులమైన మనం గర్వపడాల్సిన విషయం.

ఎన్నో రకాల ఆటుపోట్లకు తట్టుకుని నిలబడ్డ మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమైన మన తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలకు ఒక ప్రత్యేక స్థానమున్నదనడంలో అతిశయోక్తి లేదు. మన తెలుగువారి సంస్కృతికి ప్రతీకలుగా ఉన్నవి మన కళలు. కళలు అంటే మొత్తం 64 ఉన్నా, లలిత కళలు వాటిలో ప్రధానమైనవి. సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం అనే అయిదింటిని లలితకళలు అని అంటారు. ఇవన్నీ కలిసి మన తెలుగు వారిని ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడుతున్నాయి. వీటితో పాటూ ఇంకా అనేకం కలగలిస్తేనే సంస్కృతి అవుతుంది. మన పండుగలు, వాటిని ఆచరించే పద్ధతులు, ప్రకృతిని పూజించే విధానం, మన కట్టుబొట్టు, వివాహాది శుభాశుభ క్రతువుల్లో గల ఆచారాలు, హస్త కళలు, వివిధ క్రీడలు ఇత్యాది అన్ని అంశాల్లోనూ మన సంస్కృతికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రానున్న మన ఉగాది పండుగ సందర్భంగా మన సంస్కృతిలో ఒక భాగమైన క్రీడా సంస్కృతి గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మన తెలుగువారి ఆటలు ఎలాంటివి? అవి ఆడటం వల్ల ఉన్న ఉపయోగాలు, ప్రాచీన కాలంలో ఎలాంటి ఆటలు ఉన్నాయి? అలాంటి ఆటలు నేడు కనుమరుగయ్యే దుస్థితికి వచ్చాయా? అసలు అవి నేటి తరానికి తెలుసా? తెలియకపోవడనికి గల కారణాలు మొదలైన వాటి గురించి నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాను.

నాటి ప్రాచీన కావ్యాల్లో కూడా క్రీడలకు సంబంధించిన వర్ణనలు ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి మన క్రీడా సంప్రదాయం ఎంత ఘన చరిత్ర కలిగి ఉందో తెలుస్తోంది. నాటి నుండి నేటి వరకు ఉన్న ఆటల్లో ప్రముఖంగా ఉన్నవి చూద్దాం.

.

నాలుగు స్తంభాలాట : ఈ ఆటకు కనీసం 5 మంది పిల్లలు ఉండాలి. ఆడుకునే స్థలం ఆరు బయట అయితే నాలుగు కర్రలను పాతాలి. ఇంట్లో పూర్వం స్తంభాలుండేవి కాబట్టి దీన్ని ఇండోర్ గేమ్ గా కూడా ఆడుకోవచ్చు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారిల్లు పెద్ద భవనంలా ఉండటం వల్ల, స్తంభాలు ఇంట్లోనె ఉండటం వల్ల మేము వేసవి సెలవులకు వెళ్తే ఇంట్లోనే ఆడుకునే వారం. నాలుగు స్తంభాలున్న చాలు. ఇలా ఒక గంట కొట్టగానే అయిదుగురు పరుగున వెళ్ళి స్తంభాలను పట్టుకోవాలి. ఎవరు పట్టుకోలేక పోతారో వారే దొంగ గా ఉండాలి. తక్కిన వారు స్తంభాలు అటూఇటూ మారుతూ ఉంటారు. అప్పుడు కాళీ ఉన్నచోట ఈ దొంగ వెళ్ళి స్తంభాన్ని పట్టుకుంటే విడిచేసిన వారు దొంగాగా మారాల్సి ఉంటుంది. ఈ పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది.

.

గోటీబిళ్ళ : బిల్లంగోడు, కఱ్ఱా బిళ్ళ అని కూడా ఈ ఆటను మరికొన్ని ప్రదేశాల్లో అనడం కద్దు. ఈ ఆట వయసుతో నిమిత్తం లేకుండా ఆడుకునే ఆట. నేటి క్రికెట్ ఆటకు ప్రాచీన రూపమని చెప్పినా అతిశయోక్తి కాదు. 2 లేదా 3 అంగుళాల వెదురు లేక కర్ర ముక్కను రెండు వైపులా మొనదేలేలాచెక్కిన ముక్కనే “బిళ్ళ” అంటారు. దీన్ని రెండడుగుల పొడవుతో ఉండే ఒక గట్టి కర్రతో ఆ బిళ్ళను నేల మీద ఉంచి గట్టిగా కొట్టాలి. అలా కొట్టినప్పుడు గాలిలోకి ఆ బిళ్ళ లేస్తుంది. అలా లేచినప్పుడు వెంటనే మరోసారి గట్టిగా కొడితే అది దూరంగా పోయి పడుతుంది. ఎవరెంత దూరం కొడతారు అనే దానిమీద విజేతను నిర్ణయిస్తారు. అంటే క్రికెట్లో బంతి ఎంత దూరం పోతే అన్ని పరుగులు వచ్చినట్లుగా అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా క్యాచ్ పట్టుకుంటే అవుటయ్యే ప్రమాదం ఉంది. గాల్లోకి లేచిన బిళ్ళను ఎవరైనా పట్టుకుంటే ఇక ఆ ఆటగాడు అవుటై వెనుదిరగాల్సిందే. ఈ అటలో గురి చూసి కొట్టడం, కర్రను వాటంగా చేతిలోకి తీసుకుని బిళ్ళను దూరంగా కొట్టడంలో ఆటగాడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. ఎంత దూరంలో బిళ్ళ పడుతుంది అనే దానిమీద పాయింట్స్ ఇవ్వడం ఉంటుంది. తద్ద్వారా విజేత అవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆటకు శారీరక దారుఢ్యం చాలా అవసరం. దీన్ని చిన్న పిల్లలు నుండే ఆడటం వల్ల శరీర దృఢత్వం కలిగి జిమ్ లకు వెళ్ళాల్సిన పని లేకుండానే సిక్స్ ప్యాక్ బాడీలు సహజంగా ఏర్పడతాయి.

.

మూడు కంచాల ఆట : 10*6 అడుగుల వైశాల్యంతో ఎత్తుపల్లాలు లేకుండా మంచి చదును నేల చూసి మూడు గుంటలను మూడు అడుగులు ఎడంగా తవ్వుకోవాలి. లోతు గోలి అంత ఉండాలి. అంటే ఆ గుంట చుట్టూ నేల చదునుగా ఉండి గోలి పడటానికి అనువైనదిగా ఉండటం ముఖ్యం. ఈ ఆటను ఇద్దరి నుండి ముగ్గురు ఆడుకోవచ్చు. మూడు గుంటలు ఒకే సరళ రేఖలో ఉండటం అవసరం. గోలీలు గుంటలో పడేలా ఒక చేతి బొటనవేలు, మధ్యవేళ్ళతో పట్టుకుని గట్టిగ నొక్కి వేగంగా వదిలాలి. అవతలి వాడి గోలీని కొట్టినా, గుంటలో పడినా గెలిచినట్లు లెక్క. అంటే ముందుగా ఎన్నిమార్లు ఆడాలనే నియమం పెట్టుకుంటామో అన్ని ఎక్కువ మార్లు ఎవరు సరిగ్గ వేస్తారో వారు గెలిచినట్లు. గురి చూసి కొట్టే నేర్పు తెలుసుకోవడం, వేగాన్ని నియత్రించడం ఇందులో ఆటగాడి ప్రజ్ఞను తెలుపుతుంది.

.

ఏడు పెంకులాట : ఈ ఆటలో ఏడు పెంకులను వరసగా పేర్చుకుని ఆటగాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయి ముందుగా అనుకున్న ఆటగాడికి ఒక బంతినిచ్చి గురి చూసి ఆ పెంకులకు తగిలేలా కొట్టడమే. ఒకవేళ పెంకులకు తగలకపోతే అవతలి వారు ఆడాలి. ఈ ఆట నేడు పెద్ద పెద్ద మాల్స్ లో సీసాలు పెట్టి బంతి వేయడం మనం చూస్తుంటాం.

.

బచ్చాలు : సీసా మూతలను గానీ, నాణాలను గానీ సేకరించి పెట్టుకోవాలి ముందుగానే. వీటిని 6 నుండి 8 అడుగుల దూరంలో ఉంచి అవతలి పక్షం వారు చూపించిన నాణాన్ని గానీ, మూతను గానీ అరచేతి పరిమాణం ఉన్న రాయితో గురి చూసి కొట్టాలి. ఇదే ఈ ఆటలో ఉన్న ప్రధానంశం. అవతలి పక్షం వాళ్ళు చూపిన నాణాన్ని కొట్టలేని పక్షంలో, వేరే దానికి తగిలినా  వారికి ఒక నాణాన్ని ఇచ్చేయాల్సి ఉంటుంది. నేటి బిల్లియర్డ్స్, స్నూకర్, క్యారం లాంటి వాటికి కావాల్సిన ప్రతిభ ఈ ఆట ఆడటానికి కావాలి అని చెప్పవచ్చు. 

.

గవ్వలాట : దీన్నే కొన్ని ప్రాంతాల వారు అచ్చనగాయలని కూడా అంటారు. ఈ ఆటకు చింత పిక్కలైనా, గవ్వలైనా, రాళ్ళైనా ఉపయోగపడతాయి. ఒక రాయిని పైకి ఎగరేసి కిందున్న రాళ్ళను ఒక్కటి లేక రెండు లేక ఆ పైన కూడా పట్టుకుని రెండో చేతిలోకి వేసుకోవాలి. మధ్యలో చేయి జారి పిక్క గానీ గవ్వ గానీ, రాయి గానీ ఏది ఉపయోగిస్తామో అది జారి కింద పడిపోతే ఆట అవతల వారికి పోతుంది.

.

వామనగుంటలు : ఈ ఆట రామాయణంలో సీతమ్మవారు ఆడిందని చెప్పుకునే పౌరాణిక ఆటగా ప్రసిద్ధి. ఈ ఆటను ఇద్దరు ఆడతారు. మొత్తం 18 గుంటలుంటాయి. మొత్తం 19 గింజలు లేక గవ్వలు తీసుకుని ఒక్కొక్క గుంటలో ఒక్కొక్క గింజ వేసుకుంటూ పోవాలి. ఇలా అయిదుమార్లు ఆడిన తరువాత ఒక గింజ పక్కకు పెట్టి మళ్ళీ మిగతా గింజలతో ఆడుతూ ఉండాలి. అన్ని గింజలు ముందు అయిపోయినవారు గెలిచినట్లు. ఈ ఆటలో కూడా ప్రాంతాలను  బట్టి చాలా రకాలుగా ఆడుతుంటారు.

.

వీరీ వీరీ గుమ్మడిపండు/ దాగుడు మూతలు : నేటి హైడ్ అండ్ సీక్ అని చెప్పాలి. ఈ ఆటలో పది మంది పిల్లలు చేరి ఆడే ఆట. ఒకరు మరొకరి కళ్ళు మూసి, వారి వేలితో మిగతా వారిని చూపిస్తూ వీరీ వీరీ గుమ్మడిపండు వీరి పేరేమీ అని అడుగుతారు. కళ్ళు మూసి ఉండటం వల్ల ఏదో ఒకరి పేరు చెప్తారు. అప్పుడు ఆ పేరు గలవారిని పారిపో పారిపో అని అంటేరు. అందరూ దాక్కోగానే “ఎక్కడి దొంగలక్కడే గప్చుప్” అని కళ్ళ మీద చేయి తీయడం తోటే వాడు వెళ్ళి వెతికి ఒకరినినైనా పట్టుకురావాలి. ఆ దొరికిన వారు దొంగ అయి..కళ్ళు మూయించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో దీనికే “దాగుడు మూత దండాకోర్ పిల్లీ వచ్చే ఎలుకా భద్రం ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్” అని పాడటం కూడా కనిపిస్తుంది.

.

చెడుగుడు : దీన్నే నేడు కబాడ్డి అంటున్నాం. ఈ ఆటకు రెండు జట్లు ఉండాలి. రెండు జట్ల మధ్య ఒక గిరి గీసి ఉంటుంది. ముందుగా ఎవరు ఎన్నుకుంటారో వారా గిరి దాటి అవతలి వారిలో ఒకరిని పట్టుకోవాలి లేదా ముట్టుకోవాలి. అలా చేసి వెంటనే తమ గిరిలోకి వచ్చేయాలి. అలా రాలేని పక్షంలో అవుటై ఆట నుండి బయటకు పోవాలి. అవతలి పక్షం వారికి ఒక మనిషి తక్కువ అయినట్లే. గిరి దాటి చేయి పెట్టగలిగినా గెలిచినట్లే అవుతుంది. ఈ ఆటలో అవతలి వారిని పట్టుకోవడానికి వెళ్ళే ఆటగాడు “చెడుగుడు చెడుగుడు” అని అంటూనే ఉండాలి. అనకపోయినా అవుట్ అని ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇటీవలి కాలంలో ఈ కబాడ్డి ఆటకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చే పోటీలు మన దేశం నిర్వహించడం ముదావహం.

.

తొక్కుడు బిళ్ళ : గడులు గీసుకుని ఆడే ఆట. నాలుగులేక ఆరు గడులు గీసుకుని, ఒక చిన్న రాయిని తీసుకుని ఒక గడిలో వేసి కుంటుకుంటూ ఆ రాయిని తొక్కి, మరల ఆ రాయిని చేతిలోకి తీసుకుని మిగిలిన గడులన్నీ కుంటుతూ దాటి బయటకు రావడమే. మళ్ళీ రెండవ గడిలోకి రాయి వేసి ముందు చేసినట్లుగానే తిరిగి చేయాలి. రాయి గడిలో పడేయలేకపోయినా, కుంటుతూ కాలు కింద పెట్టినా ఆట అవతలి వారికి వెళ్తుంది. ఈ ఆటను గురించిన ప్రస్తావన కవిసార్వభౌముడుగా వాసికెక్కిన శ్రీనాథుడు తన శృంగార నైషధ కావ్యంలో వర్ణించాడు.

.

కోతికొమ్మచ్చి : ఈ ఆటలో పెద్ద గిరి గుండ్రంగా గీసి దానిలో ఒక పెద్ద కర్ర, చిన్న కర్ర పెడతారు. ఒకరు చిన్న కర్రను కాలివేళ్ళ మధ్యలో పెట్టుకుని చెట్టు ఎక్కాలి. ఈ లోపు పెద్ద కర్ర తీసుకుని ఆ గిరి చుట్టూ 9సార్లు తిరుగుతారు. వీరు తొమ్మిదిమార్లు తిరిగే లోపు అవతలి వారు చెట్టు ఎక్కలేని పక్షంలో ఓడిపోయినట్లే.

.

ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంకా ఒప్పులకుప్పా, నేలా బండ, కాకమ్మ చెఱువు, బొంగరాలు, గోలీలాట లాంటి ఆటలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆధునిక కాలానికి అంటే మా చిన్నప్పటి కాలానికి కరెంట్ షాక్, చెయిన్ కట్, బిస్కెట్, పిన్నీసు ఆట అని రకరకాల ఆటలు అడేవారం. అందువల్ల శారీరక శ్రమ చేయడమే ఒక పెద్ద కసరత్తు లాగా ఉండేది. ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఎప్పుడూ ఏ పని చెప్పినా ఉరుకులు పరుగుల మీద, పోటి పడి మరీ చేసేవారము. కానీ ఇప్పటి తరాన్ని చూస్తుంటే కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు పరిమితం అయిపోయి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం కుంటుపడిపోతున్నా పట్టించుకునే తల్లిదండ్రులు కరువవుతున్నారు. సమాజం, ప్రభుత్వం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. యువతే దేశానికి వెన్నెముకగా ఉండాల్సింది పోయి పెడదోవ పట్టి పోతుంటే ఇక ఆ జాతికి మనుగడ ఎక్కడ? దేశాభివృద్ధి ఎలా? ఎలా సాధ్యమవుతుందని మనం అందరం ప్రశ్నించుకోవాలి. అసలు ఆఫోన్లలో ఆటలకు బానిసలై పోయి జీవితాలను అంతం చేసుకునే స్థాయికి పిల్లలు, యువత దిగజారిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. చిన్న వయసులోనే కసి, పగ, కక్షలతో, స్వార్థంతో, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, జీవితం అంటే విలువ తెలియకుండా, ఒక లక్ష్యం లేకుండా పోతోంది. దీనికి మనం నివారణ చర్యలు తీసుకోవడంలో కొన్ని కట్టిదిట్టమైన చర్యలు చేయాలి. ప్రభుత్వం ఇలాంటి ఆటలను రద్దు చేస్తూ సాంకేతికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమవంతు బాధ్యతగా పూర్వ కాలంలాగా శారీరక బలాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఆటలాడేలా ప్రోత్సహించాలి. పిల్లలను అలా పెంచే మార్గాలు చూడలి. వందల రకాల ఇంటి ఆటలు, ఆరుబయట ఆడుకునే ఆటల పట్ల ఆకర్షితులు అయ్యేలా మనమే చేయాలి.

ప్లవ నామ సంవత్సరం సందర్భంగా మనమందరం మన పిల్లలకు మన క్రీడా సంస్కృతిని నేర్పిస్తూ, వాటిపట్ల వారికి అభిరుచిని కలిగించేలా మనం కూడ తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేద్దాం.

అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

— Dr. Tummapudi Kalpana.

Asst. Professor in Telugu, DRBCCC College, Chennai

Mail : kalpanapgupta@rediffmail.com

__________________________________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

__________________________________________________________________________