10_006 కథావీధి – రావిశాస్త్రి రచనలు

 ——————————

                         ఇంకో.. ఉపకథ. ఈ కథ ని మూడు కథల బంగారం నవల లో సూర్రావెడ్దు గారు ( సూర్యారావు, హేడ్ కానిస్టెబుల్ ) తన అంతేవాసులైన బంగారి గాడు, మలయాళీ నాయర్ మొదలైన దొంగ నోట్ల మార్పిడి ముఠా వారికి, వీరందరూ ఒక ఆపరేషన్ కి పధకం రచిస్తున్న సందర్భం లో చెపుతారు. ఈ ముఠాని సూర్రావెడ్డు గారే కడతారు, ముఠాకి వారే సూత్ర్రధారులు. ఒక ఊరి లో సూరితాత గారు ఉంటారు. ఊరి సంపద తొంభై అయిదు శాతం సూరితాత గారి చేతిలో ఉండగా మిగిలిన అయిదు శాతం మిగతా జనం దగ్గర ఉండి పోయి సూరితాత గారికి బాధాకరం అయి ఆయన కి నిద్ర దూరం అవుతుంది. ఊరి జనాన్ని ఎలా బాగు చెయ్యాలా ? అని మధన పడుతున్న సూరితాత గారికి ఒక రాత్రి దేముడు కల లో కనపడి ధనాన్ని అప్పుగా ఇచ్చి ఊరి వారిని ఉద్దరించి ప్రతిఫలం గా కొంత మొత్తాన్ని వడ్డీ గా తీసుకొమ్మనీ, అతను ఇచ్చిన అప్పుకి తగిన జామీను గా వారి ఆస్థులను తనఖాగా పెట్టుకొమ్మనీ సలహా ఇస్తాడు. సూరితాత గారు దేముడి సలహాను తు. చ. తప్పకుండా అనుసరిస్తానని దేముడికి మాట ఇచ్చి ఒక సందెహాన్ని వ్యక్తం చేస్తారు.

” ఒకవేళ కొందరు దుర్మార్గులెవరైనా ఎదురు తిరిగి మాకు దేముడు కలలో కనపడి సూరితాత కి అసలూ వడ్డీ లు కట్టవద్దు. మీరందరూ సూరితాత ఇంటి మీదకి దండు గా వెళ్ళి మీరు తనఖా గా పెట్టిన ఆస్థులూ, రాసి ఇచ్చిన అప్పు పత్రాలూ స్వాధీనం చేసేసుకోండి. ఇది నా అజ్ఞ అని దేముడు ఆదేశించగా తాము అమలు జరప నిశ్చయించుకున్నాము అని చెపితే ఏమిటి దారి ? “

ఆ సందేహానికి సమాధానం గా దేముడు “ ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే తాను పొలీసులని సృష్టించాను ” అని సూరితాత గారిని సమాధానపరుస్తాడు. అనతికాలం లో మిగిలిన ఐదు శాతం ఆస్థులు సూరితాత గారి కైవశం అయిపోయి ఊరి జనాభా సూరితాత గారి కూలీలైపోతారు.

తొలినాళ్లలో రావిశాస్త్రి గారు అనేక కలం పేర్లతో రచనలు చేసారు. వీరి కలం పేర్లలో కొన్ని అయ్యారే బాబారే, శంకర గిరి, గిరిజా శంకర్, అంజానా, జాస్మిన్, కాంతా కాంతా, గోల్కొండ రాంప్రసాద్. వీరి తొలి రచన అల్పజీవి ని అయ్యారే బాబారే అనే కలం పేరు తోనే భారతి మాస పత్రిక కు పంపారు. వీరి నాటకం నిజం లో నటించారు. తొలి రచన అల్పజీవి కాగా ఆఖరి రచన ఏడో చంద్రుడు. ఈ రెండింటి మధ్యన కొన్ని వందల సంఖ్య లో రకరకాల రచనలు. ‘ ఏడో చంద్రుడు ’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో రెండు మూడు వారాలు ప్రచురితమైన తరవాత వీరు స్వర్గస్థులైనారు.

వి.ర.సం. సానుభూతిపరులూ ఆ సంస్థ స్టాపకులలో ఒకరూ, ఆ సంస్థ కు ఉపాధ్యక్షులు గా కొంతకాలం పని చేసిన వీరిని యమర్జన్సీ సమయం లో ప్రభుత్వం వారు అరెస్ట్ చెయగా జైల్ లో వున్న కాలం లో వీరు కొన్ని అసంపూర్ణ రచనలు చేసి అనంతరం ఆరోగ్య, ఆర్దిక, వ్యక్తిగత కారణాల వలన ప్రభుత్వం వారికీ, ప్రభుత్వ విధానాలకీ అనుకూలం గా ఉండడానికి అంగీకరించి ఆ మేరకు కాయితాలు రాసి విడుదల ఐనారు. ఇది వీరి వ్యక్తిగత వ్యవహారం. మన పరిచయం రచనల వరకే పరిమితం. షేక్స్ పియర్ రాసిన ఒక నాటకం లోని లేడీ మాక్ బెథ్ అనే ఆవిడ ఒక సందర్భంలో అవాంఛనీయమైన చర్యలు అవాంఛనీయమైన పరిణామాలకే దారి తీస్తాయని వాపోతుంది. మేధావులు, వేగుచుక్కలూ, మార్గ నిర్దేశకులూ అని తమను తాము అభివర్ణించుకున్న అనేకమంది ఉద్యమకారులూ తమ అవసాన దశలో ఇలాంటి U టర్న్ లు తీసుకొవడం ప్రపంచవ్యాప్తం గా జరిగిన విషయం. సర్వసాధారణం అన్న సంగతి ఉద్యమాల చరిత్ర చదివిన వారందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి U టర్న్ లకి ఏదో బలమైన సైద్ధాంతికపరమైన కారణం ఉండే ఉంటుంది.

వీరి ప్రత్యేకత వీరి పాత్రల సృష్టి. అది కథ కావచ్చు… నవల కావచ్చు… నాటకం కావచ్చు…. రచనలో పాత్రల నిడివితో పని లేదు. పాత్రలు ఎంత చిన్నవైనా సరే మన మనసులలొ నిలిచిపోతాయి. సేనాపతి రావు, కమ్మలింటి రాజు, గేదెల రాజమ్మ, మందుల భీముడు తో పాటు రొట్లప్పారావు, రత్తాలు, నర్సమ్మా, గంగరాజెడ్డు, సుబ్బులెడ్డు గారి తో సమానంగా అడారాదినారాయణా, వియత్నాం విమలతండ్రీ, ( ఈ తండ్రి పాత్రకి కధలో పేరు లేదు. అతను మనకి విమల తండ్రి గానే పరిచయం అవుతాడు ) శేషగిరీ, బంగారయ్య గారి లాంటి పెద్ద సారా రెంటర్ తో పాటు వారి తో కొన్ని నిముషాలే గడిపిన గవర్నమెంట్ హాస్పటల్ డాక్టర్ వైటార్సూ, ( అతని జుట్టు తెల్లగా వుండి మెడ మీదకి గుర్రపు జూలులా జారుతూ ఉంచడం తో అతనికి వైట్ హార్స్ డాక్టర్ అని పేరు అతని కింద పనిచేసే వాళ్ళు పెడతారు అతని అసలు పేరు నవలలొ వుండదు ), అలాగే వియత్నాం విమలమ్మ గురించీ, వైటార్స్ డాక్టర్ గురించీ బంగారయ్య గారికి చెప్పి జ్ఞానోదయం చేసి అయనకు చనువు చీవాట్లు వేసిన హాస్పటల్ కాఫీ ప్యూనూ మొదలైనవారు.

వీరి తొలి రచన అల్పజీవి ” చేదు విషం – జీవఫలం ” అనే పేరుతో 1952 లో భారతి పత్రికకు పంపగా వారు ఆ పేరును అల్పజీవి గా మార్చి ప్రచురించారు. ఈ నవలను రావిశాస్త్రి గారు అయ్యారే బాబారే అనే కలం పేరు తో పంపారు. ఈ నవల చైతన్య స్రవంతి పద్ధతిలో రాయబడింది. సుబ్బయ్య అనే చిరుద్యోగి నవలా నాయకుడు. చిన్నతనం లో ఏర్పడిన భయాలు అతన్ని పిరికివాని గా మార్చాయి. ఆ పిరికితనం అతని లో వున్న మిగతా అన్ని మంచి లక్షణాలనూ, తెలివితేటలనీ మంచులా కమ్మేస్తుంది.
గవర్నమెంట్ ఆఫీసు లో చిరుద్యోగి ఐన ఇతన్ని ఇతని మెదడును భయం కప్పేసిన కారణంగా ఆఫీసు లో ప్యూన్ దగ్గర నుంచి మేనేజర్ వరకూ లోకువ కట్టి అసలు లెఖ్ఖ చెయ్యరు. ఇంట్లో భార్యకీ, బావమరిదికీ, వూళ్ళో జనానికీ… ఇలా అందరికీ భయపడు తో, మాటలు పడుతూ అంతర్ముఖుడుగా తనలో తాను జీవిస్తూ తనని తనకే పరిమితం చేసుకుని బతికేస్తున్న ఇతను చివరకి ఒక టీచర్ ప్రభావం తో మారుతాడు  మారి మనిషౌతాడు. ఇదీకధ.

రావిశాస్త్రి గారి రచనా వ్యాసంగ పరిధి పెద్దది. కథా, నవలా అని విడగొట్టడం సమంజసం కాదు. పెద్దకథ, చిన్నకథ అని అనుకోవచ్చు. ఈయన కవితలూ, పద్య కావ్యాలూ రాయలేదు. కొన్ని నాటకాలు మాత్రం రాశారు. వాటిలో నిజం అనే నాటకం ఒకటి. 

ఋక్కులు, ( గోవులొస్తున్నాయి జాగ్రత్త తో కలిపి ), ఇల్లు, సొమ్మలు పోనాయండి, అల్పజీవి, ఆరు సారా కథలు, బాకీ కథలు, గూఢచారి కథలూ, రాజూ – మహిషి, మూడు కథల బంగారం, రత్తాలూ రాంబాబూ, ఏడో చంద్రుడూ…….. ఇలా అసంఖ్యాకం గా సాగిన వీరి సాహితీ సృష్టి లో నుంచి మనకి ఉన్న పరిమితుల దృష్ట్యా రత్తాలూ – రాంబాబూ, మూడుకథల బంగారం అనే రచనలను పరిచయం చేసుకుందాం.  

ఇంకో విన్నపం ఏమిటంటే కొందరు సాహితీ పరిశీలకులు రావిశాస్త్రి గారి కొన్ని రచనలని అసంపూర్తి రచనలు గా అభివర్ణించారు. వారి ఆఖరి రచన ఏడో చంద్రుడు మాత్రమే ఈ కోవ లోకి వస్తుంది, మూడు, నాలుగు భాగాలు మాత్రమే రాసి అయన అకాల మరణం చెందారు కనక. రాజు – మహిషి, రత్తాలూ-రాంబాబూ ఈ కోవలోకి రాకపోవచ్చును. ఎందుకంటే అటువంటి కధలకి ముగింపూ, ఆ కథలలో చర్చించిన సమకాలీన సమస్యలకూ ఈ కాలం లో కూడా పరిష్కారం లేదు. ఏదో ప్రయత్న పూర్వకంగా శుభం గానో, అశుభం గానో ఆ కథలను ముగించడం రావిశాస్త్రి గారి కి, ఇష్టం లేకపోవడం కారణం కావచ్చును. పత్రికల వారు ఆఖరి భాగానికి సశేషం అని పెట్టారు. అది అసంపూర్ణ రచన అనడానికి లేదు. ముగింపు లేని కథలు తెలుగు సాహిత్యం లో చాలానే వున్నాయి. అసమర్ధుని జీవిత యాత్ర, అంపశయ్య, చివరకు మిగిలేది, హిమజ్వాల, అనుక్షణికం మొదలైనవి. ఈ లిస్ట్ ఇంకా పెద్దది. రచయిత అసంపూర్ణం గా వదిలివేసినట్టు గా భావించి, ఔత్సాహికం గానో, వేరే అవసరాల కోసమో ఇతరులు ఆ రచనని సరి చేస్తే ఆ ప్రయోగం ఎలా వుంటుందో చిలకమర్తి వారి గణపతి రేడియో నాటకం విన్నా, కన్యాశుల్కం నాటక ప్రదర్శన చూసినా అనుభవం లోకి వస్తుంది.

తల్లీ తండ్రీ లేక పెద్దమ్మ సంరక్షణ లో వున్న రత్తాలు అనే అమ్మాయి సౌందర్య వతి. మంచితనం, అమాయకత్వం మూర్తీభవించిన కన్య. శృంగవరపు కోట అనే వూరికి కి దగ్గరలో వున్న ఒక పల్లెటూరి అమ్మాయి రత్తాలుకి వచ్చిన పెళ్ళి సంబంధాలను ఏదో కారణం చేత పెద్దమ్మ తిరగ్గొట్టేస్తూ వుంటుంది. విశాఖపట్నం లాంటి వూళ్ళల్లో కులాసా రసికులకు చిలకలు అని వ్యవహరించబడే అమ్మాయి లని సప్లయి చేసే కంపెనీలకు అమ్మాయిలని అమ్మే బ్రోకరైన సింహాచలం అనే నీచుడు ఈ అమ్మాయి పెద్దమ్మ కి దూరపు బంధువు. ఈ సింహాచలం పెద్దమ్మ ఇంట్లో తిష్ట వేసి తాను పట్నంలో కంపెనీలో పెద్ద వుద్యోగం చేస్తున్నాననీ, తనకి ఇంకా పెళ్ళి కాలేదనీ ఆ ప్రయత్నాలలో వున్నాననీ రత్తాలుతో నమ్మబలుకుతాడు. అమాయకురాలైన రత్తాలు ఆ మాటలు నమ్మి వాడి వలలో పడి వాడితో లేచిపోతుంది. ఈ సింహాచలానికి సన్నమ్మడు, ఆ వూరి సర్పంచుల సహాయం వుంటుంది. వీడి సంగతి పెద్దమ్మకు తెలియదో, తెలిసినా గుంభనగా వుంటుందో మనకి తెలియదు.

లేపుకొచ్చిన రత్తాలు సొమ్ములన్నీ దోచుకుని అవసరం తీరాక ఆమెని నరసమ్మ అనే ఆమె నడిపే కంపెనీకి వెయ్యి రూపాయలకి అమ్మేస్తాడు ఈ నీచుడు. ఈ నరసమ్మ ఒక S. I. గారి ఇలాకా. ఆయన కాలం చేశాక డిపార్ట్మెంట్ లోని గంగరాజెడ్డు ( గంగరాజు హేడ్‌కానిస్టేబుల్ గారు) గారిని ఊరించి తన ఇలాకా లోకి తెచ్చుకుని ఆయన ద్వారా డిపార్ట్‌మెంట్ లోని పెద్ద దొరల ఇంకా వూళ్ళో ఇతర పెద్ద తలకాయల ప్రాపకం సంపాదించి ఉభయతారకంగా కాలక్షేపం చేస్తూ రోజులు నెట్టుకు వస్తూ వుంటుంది. విషయం తెలియని అమాయక రత్తాలు నరసమ్మ, సింహాచలం బంధువు అనీ ఆ ఇంట్లో వుండేవారు ఆమె పరివారమనీ సింహాచలానికి ఇల్లు దొరికే వరకూ తనని అక్కడ వుంచాడు అనే భ్రమలో ఉంటుంది. లౌక్యురాలైన నరసమ్మ రత్తాలుని అదే భ్రమ లో వుండనిస్తుంది.

నరసమ్మ కంపెనీ లో ముత్యాలు అనే అమ్మాయిది కాస్త మంచి మనసు, రత్తాలు తనలా చెడిపోయి వేరే గతిలేక వచ్చిన మనిషి కాదు అనీ, మోసపోయి వచ్చిందనీ గ్రహించి ఎలాగైనా ఆమెని నర్సమ్మ కంపెనీ నుంచి తప్పించాలి అని ఆలోచిస్తూ వుంటుంది. నర్సమ్మ కంపెనీ లో రిక్షా లాగే జోగులు కి ముత్యాలు మీద ప్రేమ. నర్సమ్మ బాకీ తీర్పించి ముత్యాలుని పెళ్ళి చేసుకోవాలనే ఆలోచనలో వుంటాడు. ముత్యాలుకీ రిక్షా జోగులంటే ఇస్టమే. పిచ్చి జోగులు అనే అతను ఒక కోటీశ్వరుడి కొడుకు. అతనికి ముత్యాలు అంటే పిచ్చి ఇష్టం. డబ్బు ఇస్తూ వుంటాడు. 

ఆ వూరిలోని టూ టౌన్ స్టేషన్ లిమిట్లో బంగారప్ప కంపెనీ వుంటుంది. అది సుబ్బులు హేడ్ గారి అజమాయిషీ లో వుంటుంది. బంగారప్ప సుబ్బులు హేడ్ గారి బళ్ళకి అనగా ఆయన ఇలాకాలో వుండి వొళ్ళమ్ముకునే అమ్మాయులకి పార్కింగ్ సౌకర్యం అనగా వారి ఖర్చులు భరించాలి. ఖర్చు బంగారప్పదీ, ఆదాయం సుబ్బులు హేడ్ గారిదీ, ప్రత్యుపకారం గా సుబ్బులు హేడ్ గారు ఓ కాపు కాస్తూ వుంటారు. ఇదీ ఏర్పాటు. బంగారప్ప కంపెనీ లోని బేబీ సుబ్బులు హేడ్ గారి బండి. సివాసెలానికి అంటే రత్తాలు ని లేపుకొచ్చిన సింహాచలంకి బేబీ అంటే రోకు ( ఇష్టం ) ఏడిపిస్తూ వుంటాడు. సుబ్బులెడ్డు గారు సివాసెలాన్ని ఏమీ చెయలేరు. ఎందుకంటె సివాసెలం వన్ టౌన్ కేడీ లిస్ట్ లో వున్నప్పటికీ టూ టౌన్ దొర గారికి ఇన్‌ఫార్మర్. 

సివాసెలం ఒకసారి బంగారప్పకి అమ్మాయిని సప్లయి చేస్తానని చెప్పి ఐదు వందలు ఎడ్వాన్స్ గా తీసుకుని జల్సా చేసి, ఆ తరవాత దొరికిన రత్తాలుని వెయ్యి రూపాయలకు నర్సమ్మ కంపెనీకి అమ్మీశాడు. రత్తాలు న్యాయప్రకారం తనకు రావాలని బంగారప్ప పంచాయితీ పెడుతుంది. సుబ్బులు హేడ్ గారు సివాసెలాన్ని ఏమీ చేయలేరు. అంచేత బంగారప్ప ఓపికగా సమయం కోసం ఎదురు చూస్తూ వుంటుంది. 

రత్తాలుని తీసుకుని ముత్యాలు రిక్షా జోగులు తో కలసి ధర్మాసుపత్రికి వస్తూందని ఒకరోజు బంగారప్పకి ఉప్పందగా రత్తాలుని ఎత్తుకు రావడానికి తన బేచీ లోని మెరికలలాంటి కుర్రాళ్ళను రంగంలోకి దింపుతుంది. బంగారప్ప బేచీ రత్తాలుని తీసుకుని పొయే ప్రయత్నాన్ని రిక్షా జోగులు ధైర్యం గానే అడ్డుకుంటాడు కానీ ఆపలేకపోతాడు. ఆ సమయం లో అటుకేసి వస్తున్న రాంబాబు, బంగారప్ప బేచీ ని నిలువరించి రత్తాలుని రక్షించి ఆ ప్రయత్నం లో గాయపడతాడు. గాయపడ్డ రాంబాబుకి రత్తాలు వైద్యం చేయిస్తుంది. వైద్యం చేసిన నడి వయసు డాక్టర్ గారు కామ ధేనువు లాంటి గవర్నమెంట్ ధర్మాసుపత్రి లో పని చేస్తున్నా సొంతానికి ఒక  సైకిల్ కూడా కొనుక్కునే స్తోమత లేక బస్సులో వచ్చి వెడుతూ వుంటారు. 

రాంబాబు ఒక మోసపోయిన టీచరమ్మ కొడుకు. టీచరమ్మ ని ఒక ధనికుడు ప్రేమించి పెళ్ళికాక ముందే తల్లిని చేసి ముఖం చాటేయగా ఆమె కోర్ట్ కి ఎక్కుతుంది. ఇద్దరు మైనారిటీ తీరిన వ్యక్తులు పరస్పర అంగీకారం తో చేసిన పని కి ఒకరినే శిక్షించలేమని తీర్పు చెప్పి, ధనవంతుడు పెళ్ళి చేసుకుంటాను అని చెప్పినట్టు ఏదైనా సాక్ష్యం వుందా అమ్మా ?  ” అని కోర్ట్ వారు అడిగిన ప్రశ్నకి టీచరమ్మ కొండ మీద దేముడే సాక్షి అని చెప్పగా కేసు కొట్టేస్తారు.” కొండమీద దేవుడు నిన్ను కొండెక్కమంటాడు. కొబ్బరికాయలు కొట్టమంటాడు, హూండీలో డబ్బులెయ్యమంటాడు కానీ కొండ దిగి సాక్ష్యానికి వస్తాడా వెర్రి తల్లీ ” అని ఇదంతా చూసిన ఒక ముసలి ప్లీడరు గుమస్తా నిట్టూరుస్తాడు. 

ప్రస్తుత కాలానికి రాంబాబు ఎమ్మే పాసయ్యి, తన స్నేహితుడూ ఇన్‌కంటాక్స్ కమీషనరు గారి కొడుకూ ఐన కృష్ణ ప్రోద్బలం తో అయ్యేయస్ కి ప్రిపేర్ అవుతూ ఇదే వూళ్ళొ వున్న తన ప్రెమికురాలు వసంతని కలవడానికి వస్తాడు. ఈ సంఘటన అప్పుడు జరిగింది.

***************************************