13_007 సాక్షాత్కారము 10

 

ఖరీ దైనబట్టలు వేసుకు

తిరిగినయీ దేహాలకు

చితిపై కెక్కేటప్పుడు

ఒకదారపు ప్రోవూ ఉండదు!

 

                  కాటికి చేరినప్రతితనువూ

                  కాలి మట్టి కావలసినదే!

 

పుట్టుట ఉంటే చచ్చుట తప్పదు

అతడు దేవుడే అయినా-

అంటుకొన్నచో ఎంతటివానకు

ఆరుట ఉండదు ఏశవమైనా!

 

                  మూడునాళ్ళబ్రతు కిది అని యెఱగక

                  ఆశ పెంచుకొందురు ప్రతివారూ!

                  ప్రాణం కాస్తా పోయిందంటే

                  ఎవరికి ఎవరూ ఏమీ కారు!

 

అంతా మాయయె – అని గుర్తించిన

స్వాంతమునిండా శాంతి!

‘అంతా నాదే’ అనుకొనుజీవికి

చివరకు మిగిలే దశాంతి!

                  నిరాశ నింపేయీశ్మశానమే

                  ప్రతిదేహానికి అంతిమగమ్యం!

                  ముందూ వెనుకా – అంతే తేడా-

                  అందఱికీ యిది అంతిమగమ్యం!

 

తే.గీ.  గాలి పోయినదేహము నేల రాలి

      కుళ్ళి కంపుకొట్టును; పురుగులును పుచ్చు;

      కప్పి పెట్టుటొ కాల్చుటో తప్ప దాని

      వలన లాభ మెవ్వరికి నావంత లేదు!

 

తే.గీ.  కట్టియలపైకి చేరినకాయ మరరె!

      కట్టియలతోడ తానును కాలిపోవు!

      కట్టెలే వ్యర్థకాయముకన్న మేలు;

      మంట పెట్టుటకై నను బనికివచ్చు!

 

తే.గీ.  తాను గారాబుసుతుడుగా తలచి పెంచి

      పెద్దచేసిన పుత్రుడే భీతి గొలుపు

      కాటిలో చితిపై తనకాయ ముంచి

      తలకు ని ప్పుంచి అటనుండి తరలిపోవు!

 

తే.గీ.  మట్టిలో పుట్టుబ్రతుకులు మట్టిగానె

      మారి మట్టిలో కలియు నన్‌ఘోర మైన

      సత్యమును కన్నులన్ గట్టుచంద మరయ

      వచ్చు నీరుద్రభూమిలో పవలు రేలు!

 

తే.గీ.  ఎంతఅందాలబరిణెల నేని కాల్చి

       ప్రేల్చి ఒడ లంతయును కకావికలు చేసి

       కుందుచున్ చూచువారల గుండె పిండి

       వైచి వైరాగ్యమును నేర్పు వల్లకాడు!

      

తే.గీ.  కాటిలో తిష్ఠ వేసి అక్కజపుతపము

        చేయుభస్మాంగు డెదడైన చితిని మిగులు

        బూది తను వెల్ల పులిమికో బూనెనేని

        పాడుదేహాని కది మహాభాగ్యమె కద!

 

తే.గీ.  అనుచు పరిపరివిధముల నాత్మలోన

        తలచి – మన సొకలా గయి – తనువు మఱచి

        రుద్రభూమిలోన కపోతి రుద్రు తలచి

        మదిని లయకారకునికి నమస్కరించె !

        ఒక ప్రక్కగా మండుచున్న పుల్లనునోట

        కఱచుకొన్నకపోతి గగనాల కెగసినది!

                  రివ్వురివ్వున వచ్చి ప్రీతిమై తా ముండు

                  చెట్టుకడ చేరినది బిట్టు నిట్టూర్చినది!

 

           ఇన్నాళ్లు పతియు తా

     నున్న గూటిని చూచి

      ఒకసారి పక్షి ని

      ట్టూర్పు నిగుడించినది!

      

తే.గీ. చల్లగా పదికాలాలు జంట గూడి

       కాపుర మ్ముండవలె నన్న కాంక్షతోడ

       ఇక్కడక్కడ పుల్లల నేరి తెచ్చి

       కట్టుకొనుగూడె తమకు బంగారుమేడ !

 

తే.గీ.  తమిని కాపుర ముండెడు స్థావరమ్ము

       అదియె భువిమీదిస్వర్గ మల్లదియె అదియె

       తమకు బంగరుమేడ అందాలవాడ!

       తరుణి కాపతినీడ రత్నాలమేడ!!

 

తే.గీ.  అనుగుపతి శాశ్వతముగ ద వ్వైన వేళ

        ‘ఇంక గూటితో తనకు ప నేమి?’ యనుచు

         పరవ వైరాగ్యభావము పట్టి గుండె

         పిండివేయ కపోతి కంపించిపోయె!

 

తే.గీ.   కష్టపడి తాను తనజంట కట్టుకొన్న

         గూడు తనముక్కుతో తాను కూల్చివేసి

         అందు కలచిన్ని పుల్లల నన్ని తెచ్చి

         అవిరాగిణి మంటలో నట్టె వై చె!

 

              ఎక్కడెక్కడియెండుపుల్లలు

            ముక్కుతో ‘పట్టుకొని తెచ్చుచు

            చిన్న మంటను పెద్దజ్వాలగ

            చేసినది పౌరావతాంగన.

 

తే.గీ.  దుఃఖవశమున తనగుండె తూట్లు పడియు

      ఎద రగిల్చెడువేదన నదిమి పట్టి

      “అన్న! ఇదె మంట – ౘలి క్రాగు” మని పులుంగు

      అతిధిదేవుని కనియె సమాదరమున

 

తే.గీ.  ఆవియోగినిడెందము నట్టె కాల్చు

       వేదన నెఱింగెనో లేదొ వేటగాడు

      ఆమె రగిలించుచలిమంట కపుడు తనిసె

      కడుపె కైలాస మనుపక్షి ఘాతకుండు!

 

            రాగమయ మైన ఆపావురాలౙ౦ట

            కాపురము కూల్చివేసిసఘాతకుండు

            అభము శుభమును తెలియని ఆకపోత

            దంపతుల ప్రేమమయజీవితాలు రెండు

            గంగలో కల్పివేసినఘాతకుండు!

 

      ౘలిక్రాగి వెౘ్చనూర్పుల విడుచుబోయఁ గని

      “హాయిగా నున్నదా?” అని యడిగినది పక్షి!

 

      “పైమంట కొక్కింత

      బాధ తగ్గెను; కాని

      లో నిఆక టిచిచ్చు

      లో నార్చుచున్న దే!

 

            తినుట కేమైన పె

            ట్టిన సంతసింతునే ”

            అని కిరాతకుడు దై

            న్యముతోడ నన్నాడు!

 

      అపుడు దైన్యముతోడ

      అన్న దాపావురము:

      “ఓఅతిధిదేవతా!

      ఓకిరాతప్రభూ!

 

            మాకు వలసినయంత

            మాత్రమే మెసవేదము:

            “రే” పనెడు మాటయే

            లేదు మా బ్రతుకులకు!

 

      నాశరీర మ్మొక టె

      నాయధీనము కనుక

      దీని నర్పింతు – నీ

      తిండికై – కొనుము!

 

            అతిథి వౌనీతృప్తి

            అదె నాకు చాలు నని

            మంటచుట్టును మూడు

            మార్లు తిరిగె కపోతి !

 

తరువాయి వచ్చే సంచికలో….

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page