12_006 కన్యాశుల్కం – ఒక పరిశీలన

 

 

అతి కష్టం మీద లుబ్దావధానుల్ని పెళ్ళికి ఒప్పించిన రామప్పంతులు సిద్ధాంతి సహాయం తో ముహూర్తం నిర్ణయం చేసి మీనాక్షిని, మధుర వాణిని, సిద్ధాంతిని, శిష్యులను, సుబ్బిశెట్టి నీ హెచ్చరిక చేసి లౌక్యులను పిలవడానికి పెద్ది పాలెం వెడతాడు.

అంతకు మునుపే పై వారినందరినీ మధురవాణి సహాయం తో మచ్చిక చేసుకున్న కరటక శాస్త్రి, పంతులు లేని సమయంలో వివాహం కానిచ్చేసి, కన్యా వేషంలో ఉన్న శిష్యుడిని మీనాక్షి కి అప్పగింతలు పెట్టి, ధనం తో ఉడాయిస్తాడు.

పెద్దిపాలెం నుంచి లౌక్యులతో, తాషా మర్బా ల హడావుడి తో తిరిగి వచ్చిన రామప్పంతులు, విషయం తెలుసు కుని, నివ్వెర పోయి, తనకు జరిగిన మోసాన్ని గ్రహించుకుని కోపోద్రేకుడవుతాడు. ఈ తతంగమంతా వెనక నుంచి మధురవాణి నడిపించిందే. సిద్దాంతి తో సహా అందరూ ఆమె వశం లో ఉన్న వారే. అది గ్రహించని రామప్పంతులు లుబ్దావధానులతో పేచీ పెట్టుకుంటాడు, తనకి ముహూర్తం విషయం లో అబద్ధం చెప్పారనీ, పెళ్లికూతురి తండ్రి అవధానిని గాడిదని చేసి రెండో పెళ్ళి దాన్ని అంట గట్టాడనీ, ఆ విషయం తాను పసిగడతానని భయపడి తాను లేకుండా వివాహం కానిచ్చి ధనం తో చపాయించాడనీ, అంటున్న రామప్పంతుల్ని సిద్దాంతి, నయానా, భయాన్నా ఒప్పిస్తాడు.

అనంతరం శిష్యుడు మీనాక్షిని కరిచి, కంటె తో పారిపోతాడు. లుబ్దావధానుల రెండో పెళ్ళాం కంటె తో సహా అర్థరాత్రి నూతి లో దూకి ఆత్మహత్య చేసుకుని దెయ్యం గా మారిందని తీర్మానిస్తారు. దెయ్యాన్ని సీసాలో బంధించి, భూస్తాపితం చేసే నెపం తో లుబ్దావధానుల దగ్గర డబ్బు దోచేస్తారు.

కంటె లేకుండా ఇంట్లోకి రావద్దని మధురవాణి రామప్పంతుల్ని ఇంట్లోకి రానివ్వదు. నిజానికి అది రామప్పంతుల ఇల్లు.

పెళ్ళికి బంధుమిత్ర గణం తో వచ్చి ఊరి బయట చెరువు దగ్గర కాలకృత్యాల కోసం ఆగిన అగ్నిహోత్రావధానులు… బుచ్చమ్మ, గిరీశం లేకపోవడం గ్రహించి, ఆమెకు కాపలాగా బండి లో ఎక్కించిన వేంకటేశాన్ని నిలదీస్తాడు. తనని రాత్రి పూట బండి మార్చారు అని వెంకటేశం చెప్పగా అగ్నిహోత్రావధాన్లు రౌద్రుడవుతాడు. ఆ స్థితిలో, రికామీ గా చెరువు గట్టు దగ్గర తిరుగుతున్న రామప్పంతులు, అవధాని ని భోగట్టా చేసి, లుబ్దావధానులు కి కాబోయే వియ్యంకుడని తెలుసుకుని, పెళ్ళి క్రితం రోజు రాత్రే జరిగిపోయింది అని చెపుతాడు. ఆగ్రహించిన అగ్నిహోత్రావధానులు, లుబ్దావధానులతో కయ్యానికి దిగి అభాసుపాలవుతాడు. రామప్పంతులు సహాయం తో లుబ్దావధానుల పై దావా తీసుకు వస్తాడు. వ్యవహారం కోర్టు ల వరకూ వెడుతుంది. లుబ్దావధానులు కు సౌజన్యారావు పంతులు అనే వకీలు సహాయం గా ఉంటాడు.

ఇక్కడి తో రచయితకు నాటకం ఇతివృత్తం మీద పట్టు కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఆ తరవాత నాటకం నడక కొంత కృతకం గా ఉంటుంది. కథ కి అవసరం లేని, ప్రదర్శన కి అనుకూలం కాని  సన్నివేశాలతో, కథ ని సాగతీసి నట్టు గా ఉంటుంది. ఉదాహరణకు, కరటక శాస్త్రి శిష్యుడు  మారువేషం లో వచ్చి చెరువు గట్టు మీద కూర్చున్న రామప్పంతులుకి “ఇల్లు ఇల్లనియేవు “అంటూ తత్వ బోధ చేయడం, రామప్పంతులు ఇంట్లో లేని సమయాన మధురవాణి సుబ్బిశెట్టి బృందం తో పేకాట కాలక్షేపం చేస్తున్న సమయంలో కరటక శాస్త్రి శిష్యుడు రామప్పంతులు, గొంతు తో తలుపు తట్టి మధురవాణిని పిలవగానే అందరూ కంగారు పడి పెరటి గోడ దూకడం మొదలైనవి, బహుశా హాస్యం కోసం రాసి ఉండవచ్చు. అలాగే ఫౌజీ జవాను, యోగిని, హఠ యోగి ఖేచరీ గమన విద్య తో కాశీ నుంచి రావడం అతను కోర్ట్ లో సాక్ష్యం చెప్పి తనను కాపాడతాడని హెడ్డు నమ్మడం, హఠ యోగి తాగుబోతు అనీ అతను తనకు బాకీ ఉన్నాడనీ సారా దుకాణదారుడు సాధువుల కల్లుపాక సన్నివేశం లో చెప్పడం మొదలైనవి.

లుబ్దావధానుల పెళ్ళి వరకూ 5,6 కుటుంబాలకి 2,3 గ్రామాలకి పరిమితం అయిన కథ లోకి ఇప్పుడు రకరకాల పాత్రలు ప్రవేశిస్తాయి. సన్నివేశాలు అనేక ప్రాంతాలకు విస్తరిస్తాయి. దీనివల్ల నాటకం ఒక పుస్తకం లా చదవడాని కి బాగుంటుంది. ప్రదర్శన కష్టతరం. నాటకం అని రచయిత స్వయంగా ప్రతిపాదించినప్పుడు ప్రదర్శనానికి అనుకూలంగా ఉండేలా రాయడం తప్పనిసరిగా చేయాలి. లేకపోతే పెద్ద కథ గా రాసి వుండవలసింది… అని చదివిన వారికి అనిపిస్తుంది.

ఈ కారణం వలనే ఈ నాటకాన్ని ప్రదర్శించిన అనేక బృందాలవారు ముగింపుని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 

 

తరువాయి వచ్చే సంచికలో….  

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page