10_018 వాగ్గేయకారులు-మైసూర్ సదాశివరావు

.

మైసూరు సదాశివరావు 

(1800-1885)

మైసూరు సదాశివరావు గారు ఒక ప్రముఖ వాగ్గేయకారులు. వీరు శ్రీ త్యాగరాజ స్వామి వారి శైలిలోనే తమ సంగీతాన్ని రూపొందించారు. మైసూరు మహారాజూ అయిన కృష్ణరాజ వడియార్ (III) ఆస్థానంలో సంగీతకారునిగా ఉండేవారు. మైసూరు శైలి సంగీతాన్ని కర్ణాటక సంగీతంలో ప్రవేశ పెట్టిన ఘనత వీరిదే. 

మంచి శరీర దారుఢ్యమూ, ఒడ్డూ పొడవు, తేజోవంతంగా ఉండే కనుదోయి, పెద్ద మీసాలతో గంభీరంగా కనపడే వీరు ఎల్లప్పుడూ సాదా దుస్తులు ధరించటానికి ఇష్టపడే వారు. సౌమ్యంగా మాటలాడే వీరు మరాఠీ మాట్లాడినప్పుడు వినటానికి ఎంతో ఇంపుగా ఉండేదిట. స్మార్త మహారాష్ట్ర దేశస్థ బ్రాహ్మణ కుటుంబం లో ఒక ఆడపిల్ల ఇద్దరు మగ బిడ్డలలో వీరు ఒకరు. వీరి బాల్యం గురించి ఎక్కువగా తెలియదు. కానీ వీరు నేటి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జన్మించారు. వీరికి గల సంగీతాభిరుచిని కనిపెట్టిన దొడ్డ మునుస్వామి శెట్టి, వారి తమ్ముడు చిక్క మునుస్వామి శెట్టి వీరిని తమ వెంట మైసూరు తీసుకువెళ్లారుట. ఆ విధముగా తన 30వ ఏట మైసూరుకు వెళ్లిన సదాశివరావుగారు తన ఎనభైవ ఏటా మరణించే వరకూ మైసూరులోనే నివాసం ఉన్నారు. ఇప్పటికీ మైసూరు ఆస్థానము వారు వీరి సంతతి వారిని ఆదరిస్తూనే ఉండటం గమనార్హం. 

శ్రీ త్యాగరాజస్వామి వారి ముఖ్య శిష్యులలో ఒకరైన వాలాజీపేట వెంకటరమణ భాగవతార్ గారి శిష్యులు. త్యాగరాజు గారు కంచి దర్శనానంతరం వాలాజపేట వచ్చినప్పుడు వెంకటరమణ భాగవతార్ గారు “పట్టాన ప్రవేశ” వేడుకను ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా సదాశివరావుగారు “త్యాగరాజ స్వామి వెడలిన” అనే కృతిని వారి గౌరవార్థం తోడి రాగంలో రచించారు. 

తమ శిష్యులకు తామే గొప్ప సంగీతజ్ఞులమనే గర్వం ఉండరాదని సతతం హెచ్చరిస్తూ ఉండేవారు. ఏ సంగీతమూ తక్కువకాదనీ, ఎలా పాడేవారినైనా కించపరచరాదని బోధించేవారట. వీరు చాలా ఆచారవంతులు. లక్ష్మీనరసింహులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవారట. వీరికి ఏ గురువూ లేరనీ, కేవలం దైవకృప వల్లనే సంగీతం అబ్బిందనీ కొందరు అభిప్రాయం పడుతూ ఉంటారు. ప్రతిరోజూ దైవధ్యానం తరువాత, బ్రాహ్మణులను పూజించి వారికి అన్న, ధనదానాలను చేసేవారట. ఆ విధంగా ఆస్తి అంతా  హరించుకుపోవటంతో విధిలేక, మైసూరు ఆస్థానంలో నెలకు ముప్ఫై రూపాయల వేతనం పై చేరారట. ఆ కృతజ్ఞతతోనే కృష్ణరాజ వడియార్ పై ఒక తిల్లాన కూడా రచించారు. 

వీరి గురించి ఒక చిన్న కథ కూడా ఉంది. ఒకసారి శ్రీరామ ఉత్సవాలలో పాటకచ్చేరిలో వీరిని ఆహుతులు “నరసింహుడు” అనే కీర్తన (కమలామనోహారి) పాడమని కోరారట. తాను నిష్టతో లేనందున పాడనని ఎంతగా విన్నవించుకున్నా, ప్రేక్షకుల బలవంతంపై పాడగా ఆ సభలో వ్రేలాడ దీసి ఉన్న లక్ష్మీనృసింహుని పఠం క్రిందపడి, చిన్నాభిన్నమైపోయిందట. అది చూసి, ప్రేక్షకులు సదాశివరావు గారిని క్షమాపణలు కోరారట. 

వీరు త్యాగరాజస్వామి వారిని తన ఇరవై ఒకటవ ఏట కలిసి వారి ఆశీర్వాదాలు పొందారట. ఆ సంవత్సరంలోనే త్యాగరాజ స్వామివారు అనంత లోకాలకు వెళ్లిపోయారు కూడా.  

సదాశివరావు గారు హంసధ్వని రాగంలో ఒక స్వరజతి, వర్ణాలు, కృతులు, తిల్లానాలు రచించారు. సంస్కృతం, తెలుగు బాగా తెలిసిన వీరి రచనలలో స్వరసాహిత్యాలు అత్యంత రమ్యంగా ఉంటాయి. వీరి ముద్ర “సదాశివ”. వీరిది అత్యంత సునాయాస మరణం. అవసాన దశలో “కమల కాంత” అనే కృతిని మాయామాళవగౌళ రాగంలో రచించారు. వారి మృత్యు సమయంలో వారి తంబూరా తీగెలు వాటంతటవే మ్రోగి, తెగిపోయాయని చెప్తారు. 

వీరి శిష్యులలో ప్రముఖులు వీణ శేషన్న, వీణ సుబ్బన్న, శామన్న (బెట్టడపురా) మరియు గంజాం సూర్యనారాయణ. వీరి కుమార్తెకు ఒక కొడుకు టి. వెంకట రామారావు నటుడిగా “కర్టెన్ రామారావు” అనే పేరుతొ ప్రసిద్ధి గాంచారు. 

మహారాష్ట్ర కుటుంబంలో జన్మించి, కర్ణాటక సంగీతంలో పేరుప్రతిష్టలు సంపాదించినా వీరి చరిత్ర విన్నప్పుడు, సంగీతానికి ఎల్లలు లేవనే మాట జ్ఞప్తికి రాక మానదు. 

ఉదాహరణలు: 

.

సాకేత నగర నాధ… – హరికాం బోజి రాగం – రూపక తాళం – ఎమ్మెస్ సుబ్బులక్ష్మి 

.

.

వాచామగో చరుడని…. అఠానా రాగం – అది తాళం – పాల్ఘాట్ రామ భాగవతార్

.