11_001 మా యూరోప్ పర్యటన – జర్మనీ

.

మాస్కో. వియన్నాల తర్వాత పశ్చిమ జర్మనీ, ఆమ్‌స్టర్ డ్యామ్ కు ప్రయాణం సాగింది. పశ్చిమ జర్మనీ చేరుకున్నాము. అది ఒక పెద్ద ఆటోమొబైల్, పారిశ్రామిక ప్రదేశం.

పగలు బోట్ లో ఫ్రాంక్ఫర్ట్ పోర్ట్, సిటి లో ముఖ్యమైన ప్రదేశాలు తిరిగాము. “ సాసే జస్ ’ ఎక్కడ పడితే అక్కడ విరివిగా అమ్ముతున్నారు. మేము వేడి వేడి “ పాన్ కేక్స్ ” ( మన దోసెల లాంటివి ) తిని, తిరిగి హాంబర్గ్ చేరుకుని రైల్వే స్టేషన్ దగ్గర లాడ్జ్ లో బస చేశాము. హాంబర్గ్ అందమైన సిటి. టూరిస్ట్ బస్ లో తిరిగాము.

మరుసటి రోజు ఉదయం హాంబర్గ్ నుంచి ఆమ్‌స్టర్ డ్యామ్ కు బయిలుదేరాము. సరైన సమయానికి ప్లాట్‌ఫాం మీదకి రైలు వచ్చి ఆగింది. తలుపులు ఆటోమేటిక్ గా తెరుచుకోంగానే, నేను చిన్న సూట్ కేస్ తో ఎక్కేశాను. ఆ కంపార్మెంట్ పైన “ హాంబర్గ్ – ఆమ్‌స్టర్ డ్యామ్ ” అన్న బోర్డ్ తలక్రిందులుగా ఉండటం చూసి మావారు, రైల్వే మనిషాయే, అలవాటుగా ధీమాగా గార్డ్ ని వెతుక్కుంటూ వెళ్లారు. కొంత రైల్వే సిబ్బంది, ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళ సాయంతో వెళ్తుండగానే టక్కున కంపార్ట్మెంట్ తలుపులు మూసుకు పోయి, రైలు స్పీడు గా కదిలిపోయింది.

మేము ఎక్కవలసిన రైలు ఆలస్యంగా వస్తోందనీ, ఈ రైలు కొన్ని స్టేషన్లు దాటే వరకు ఆగదని చెప్పారుట. నేను ‘ ఆ ! ఎక్కుతారులే గార్డ్ పెట్టెలో ’ అని ధీమాగా పరిసరాలు చూస్తూ కూర్చున్నాను. కొంతసేపటికి స్టేషన్ లోని సిబ్బంది కలుగ చేసుకుని ఎదురుగా వచ్చే రైల్లో ఎక్కి రెండు స్టేషన్ల తర్వాత మూడవ స్టేషన్ లో దిగి ప్లాట్ఫామ్ నెం. 2 లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నీ భార్య ఉంటుంది అని చెప్పారుట.

నా చీర, బొట్టు, వేషధారణ, చేతిలో సూట్ కేస్ వివరాలు చెప్పారుట. ‘ నేను ఏమై ఉంటారబ్బా ఇంకా కనబడలేదు ’ అనుకుంటూ పరికిస్తూ ఆతృతగా చూస్తుండగానే రైలు ఆగింది. వెంటనే లావుగా, పొడుగ్గా ఉన్న దృఢకాయులు యూనిఫార్మ్ లో రైలు కంపార్ట్మెంట్ లోంచి నన్ను దింపారు. నేను ఏమౌతోందో తెలియక ‘ వాట్ సర్ ’ అని అడుగుతున్నా వినిపించుకోకుండా నన్ను బ్రిడ్జ్ ఎక్కించి బర బర లాక్కుని పోయారు. ఓ పది నిముషాల తరువాత, చెదిరిపోయిన క్రాఫుతో, మెడలో కెమెరాతో ( అది ఆయన ఎప్పుడూ తగిలించుకుంటారు ) చెయ్యి ఊపుతూ కనపడ్డారు. నాకు అంతవరకు పరిస్థితి అర్థం కాలేదు. అంత చలిదేశంలోనూ చెమటలు పట్టాయి.

తరువాత జర్మన్ డి‌బి రైల్వేస్ కి, వాళ్ళ సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ కార్డ్ రాసాము.

ఈ అద్వెంచర్ తరువాత ఆమ్‌స్టర్ డ్యామ్ లో మంచి లాడ్జింగ్ లో విశ్రాంతి తీసుకున్నాము. అక్కడ టూరిస్ట్ గైడ్ ద్వారా వియన్నాలో లాగే ట్రామ్స్ ప్రసిద్ధి అని తెలుసుకున్నాము.

గాజు కప్పుగల బోట్ లో కాలువల్లో తిరిగాము. ప్లాజాలు, కంట్రి సైడ్ ఓల్డ్ డచ్ టౌన్, విండ్ మిల్స్ చూసాము. అప్పుడే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రెమ్ బ్రాండ్ పెయింటింగ్లు, అనేక కళాఖండాలు గల మ్యూజియం చూసాము.

ప్లాజాలో తిరుగుతుండగా నా చీర, బొట్టు చూసి ఒకతను సంజ్ఞలు చేస్తూ ఏదో మాకు తెలియని భాషలో అడుగుతూ మాటలు కలిపాడు. అతన్ని తప్పించుకుని ఓ షాప్ లోకి వెళ్ళగానే ఫోటో రీలు కొనడానికి పర్స్ కనబడలేదు. బాక్ పాకెట్ లోంచి మాయం. అతి లాఘవంగా ఆ ఆగంతకుడు లాగేశాడు మావారి దగ్గర.

అదృష్టం కొద్దీ పాస్పోర్ట్ లు వగైరా నా దగ్గర హాండ్ బాగ్ లో భద్రంగా ఉన్నాయి. ఇలా తరచూ జరుగుతున్నాయి అన్నారు అక్కడ షాప్ వారు. తరువాత బ్రసెల్స్ వరకు మరో రైలు ఎక్కి ప్యారిస్ చేరుకున్నాము. బ్రసెల్స్ వీధుల గుండా ప్రయాణం చేసి యాంట్ వెర్ప్ అంతా తిరిగాము. యాంట్ వెర్ప్ డైమండ్ కటింగ్ కి ప్రసిద్ధి.

అవి సెల్ ఫోన్లు లేని, కంప్యూటర్లలో విషయ వివరణ లేని రోజులు. ఇది జరిగింది 1980 లో. కానీ రైళ్లు, ట్రాములు, బోట్లు చక్కగా సరిగ్గా సమయానికి రాకపోకలు జరుపుతూ ఏ ఇబ్బంది కలగకుండా ఉన్నాయి. ఆరోజుల్లోనే, యూరప్ అంతా చిన్న చిన్న దేశాలు, మధ్య కలుపుతూ పెద్ద పెద్ద కాలువలతో ప్రయాణించడం సులభమే అనిపించింది. మరో రెండు రోజుల తరువాత ప్యారిస్ చేరుకున్నాము….

.

****************************