11_012 నివాళి – చిత్రకారుడు బుజ్జాయి

భగవానుడి లీలలు చిత్ర విచిత్రం గా ఉంటాయి. వాటిని విశ్లేషించాలి అంటే మానవమాత్రులం మన వల్ల కాదండీ! ఆయన ఎక్కడెక్కడి వాళ్ళని ఒక్క చోట చేర్చి వారి మధ్యన మైత్రీ బంధాన్ని కల్పిస్తాడు. అది కాలగమనంతో బాటు వృద్ధి పొందుతూ ఆ జన్మాంతబంధం గా పరిఢవిల్లుతుంది. 

నేను కాకినాడ లో ఇంజినీరింగ్ చదువుకునే రోజులలో,.. అంటే 1958-63 ప్రాంతాలలో తెలుగు సాహిత్యం పైన నాకున్న మక్కువ కొద్దీ ఒక పర్యాయం హైదరాబాద్ ఆకాశవాణి లో పని చేసే ప్రముఖ కవి, రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఒక పోస్ట్ కార్డు వ్రాసాను. ఆయన వ్రాసిన కొన్ని పద్య కావ్యాలు కొనుక్కోవాలంటే ఎక్కడ లభిస్తాయి అని. దానికి ఆయన వెంటనే ఆయా వివరాలను తెలుపుతూ నాకు తన దస్తూరీ లో ఉత్తరం వ్రాసారు. ఆ ఉత్తరాన్ని చాలా కాలం భద్రపరచుకున్నాను, ఒక అమూల్య ఆభరణంలా కాగా, ఉద్యోగ రీత్యా ఊళ్లు మారడం లో ఆ ఉత్తరాన్ని దురదృష్టవశాత్తూ ఎక్కడో పోగొట్టుకున్నాను… ఇప్పటికీ, ఈ విషయాన్ని తలచుకుంటే చాలా బాధ కలుగుతుంది.. ప్చ్….. !

ఇక అటు తరువాత తరం… వారి అబ్బాయి ప్రముఖ చిత్రకారుడు, చెన్నై నగర నివాసి శ్రీ బుజ్జాయి గారితో పరిచయం ఏర్పడింది. బుజ్జాయి గారికి, ఆయన సృష్టించిన… డుంబు కి అవినాభావ సంబంధం ఉంది. ఆయన ఫోను నెంబరు ను సంపాదించి, ఆయనని పలకరించి నన్ను పరిచయం చేసుకుని, ఆయనను కలవాలన్న నా కోరిక ను వెల్లడించాను. అందుకు అయన వెంటనే ఆనందం తో నా ప్రతిపాదన కు పచ్చ జెండా ఊపారు. నేను ఒక మారు పాండిచ్చేరి లో శ్రీ అరవిందాశ్రమాన్ని దర్శించుకుని బస్సులో చెన్నై కి తిరుగు ప్రయాణంలో ఈస్ట్ కోస్ట్ రోడ్ మీదుగా ప్రయాణం చేసి తిరువాన్మియూర్ ( చెన్నై ) లో దిగి వారుండే వారి అమ్మాయి ఇంటిని జర్నలిస్ట్ కాలనీ లో వెతుక్కుంటూ, వెతుక్కుంటూ వెళ్ళాను. ఆయన ఇంటి బయటకు వచ్చి రోడ్ మీద నాకోసం వెయిట్ చేస్తూ కనబడ్డారు, ఆనందంగా చేయి ఊపుతూ.. ఇద్దరం ఇంట్లో అడుగు పెట్టి, సుఖాసీనులమై పరిచయాలు, కుశల ప్రశ్నలు అయ్యాక, సరదాగా కబుర్లలో పడ్డాము. వాళ్ళ అమ్మాయి ప్రేమతో తయారు చేసి అందించిన వేడి వేడి కాఫీ, గట్రా ముగించి నేను ఆయన దగ్గర శెలవు తీసుకుని బయలుదేరే ముందు వారి అమ్మాయి మా ఇద్దరికీ కలిపి ఫోటో తీసింది. ఆయన నాకు కానుకగా ఆయన వేసిన బొమ్మల పుస్తకం కందుకూరి వీరేశలింగం గారి జీవిత చరిత్ర ను శుభాకాంక్షలను తెలుపుతూ సంతకం పెట్టి నాకు బహూకరించారు. 

నేను మా విజయవాడ కి తిరిగి వచ్చేసాకా ఇద్దరం పది, పదిహేను రోజులకొకసారి క్షేమసమాచారాలను, విశేషాలను తెలుపుకుంటూ ఫోను లో మాట్లాడుకునేవాళ్ళం ఒక సందర్భం లో ఆయన అంతరంగ కథనం తో వెలువడిన ” నేనూ – మా నాన్న ” పుస్తకాన్ని కొనుక్కుని చదవడం జరిగింది. అందులో ఎన్నో, ఎన్నెన్నో బాల్య స్మృతులను ఆయన మనతో పంచుకున్నారు. 

ఒక సందర్భం లో ఆయనని అడిగాను… మీకు ఈ బుజ్జాయి పేరెలా వచ్చిందండీ.. అసలు పేరు సుబ్బరాయ శాస్త్రి కదా అని అడిగాను. ఆసక్తి ని లోలోపల అణచుకోలేక…  అయన నవ్వుతూ చెప్పారు. చిన్నప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనకోడలు ప్రముఖ రచయిత్రి, సంగీతకారిణి, గాయని శ్రీమతి వింజమూరి అనసూయాదేవి గారు వీరి ఇంటికి తరచూ వస్తూ ఉండేవారని, అప్పుడు కుర్రాడు గా వున్న. తనను దగ్గరకు తీసుకుని ముద్దు చేసి బుజ్జీ, బుజ్జీ… బుజ్జాయి అంటూ పిలిచేవారని చివరకలా ఆ పేరే స్థిరపడిపోయిందని చెప్పారు. ” అదా సంగతి ” అనుకున్నాను. తరువాత మరొక మారు కలిసినప్పుడు తనకు గతంలో బొమ్మలు వేసి వెలువరించిన పంచతంత్రం పుస్తకాలను ( తనకోసం ) సంపాదించి పెట్టగలరా అని అడిగారు. అవి అప్పట్లో విజయవాడ లో పుస్తక విక్రేతల వద్ద లభ్యం కాకపోవడం తో హైదరాబాద్ లో ఆయన ఇచ్చిన అడ్రెస్ లో బుక్ షాపు కి వెళ్లి ఆ పుస్తకాలను కొని కొరియర్ లో ఆయనకు పంపాను. ఆయన వాటిని గమ్మున తీసుకుని ఊరికే ఉండక ఆ పుస్తకాల ధర కు నా పేరున చెక్కు వ్రాసి పంపి, బోనస్ గా నాకు అందమయిన ఉత్తరం వ్రాసారు. ఎంతో అభిమానంగా… ఇటీవల కాలం లో వయోభారం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు రావడం తో ఆయన ఫోన్ చేసినప్పుడు ” సుబ్బారావు గారూ… నా ఆరోగ్యం కోసం ఆంజనేయ స్వామిని ప్రార్ధించరూ ..” అని ఆందోళనపడుతూ అడిగారు. నేను వెంటనే అన్నాను… ” అన్నయ్య గారు… తప్పకుండా ప్రార్ధిస్తాను. మీరు ఈ తమ్ముడిని ఆజ్ఞాపించండి.. మీ మాటంటే నాకు వేద వాక్కు… ” అన్నాను. 

సెప్టెంబర్ రెండవ వారంలో, అమెరికా కి బయలుదేరే ముందు అయన ఆశీస్సులకోసం ఫోను చేసి మాట్లాడాను. ఎందుకో గానీ ఆయన స్వరం లో ఇది అని చెప్పలేని బాధ ధ్వనించింది… నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలను అందిస్తూ అన్నారు ” ఏమండీ… మీరు ఇక్కడ నుండి అమెరికా కి వెళ్ళిపోతున్నారంటే ఎందుకో నాకు చాలా బెంగగా ఉందండీ… ” అంటూ, నేను ఆయన కి సాంత్వ వచనాలు పలికి, కాస్తంత ధైర్యాన్ని అందించి వచ్చాను. నేను అమెరికా కి వచ్చినా కూడా మధ్యలో ఆయనకు ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడకపోతే నాకే తోచేది కాదు ! నిజానికి ఆయన వయస్సు తొంభై దాటినా, ఆయనది ఉత్త పసి పిల్లవాడి మనస్తత్వం… అంతే కాదు… నేటి సీనియర్, జూనియర్ చిత్రకారుల గురించి వారు తనపట్ల చూపే గౌరవము, అభిమానం గురించి ఆయన నాకు పదే పదే చెబుతూ ఉండేవారు… అలాగే ఆనాటి చిత్రకారుల గురించి, వారి సౌజన్యం గురించి కూడా. మరణం జీవితానికి ముగింపు ! నిజమే… కానీ మనవారు అనుకున్న వారు మన కళ్ళముందే కాలగర్భం లో కలిసిపోతూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటే..  ప్చ్…. మనసులో అదేదో తెలియని బాధ…

బుజ్జాయి అన్నయ్య గారి స్మృతికి నీరాజనాలను అందిస్తూ, మీనుండి ప్రస్తుతానికి శెలవు తీసుకుంటున్నాను.

 

                                ***  ధన్యవాదములు —  నమస్కారములు ***

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾