10_009 కథావీధి – రావిశాస్త్రి రచనలు 5

             అలా బంగారి గాడు అమ్ములు ఇంటికి చేరి అమ్ములు కి సినిమాలో వేషాల మీద మోజు అని కనిపెట్టి తనకి తెలిసున్న వాళ్ళు మెడ్రాస్ లో వున్నారనీ అంజలీదేవి పక్కన ఏషాలిప్పిస్తారనీ చెప్పి ఆమె ని లేవదీసుకుని అన్నవరం లో ” రాస్సెప్రేమల ” మీద మోజున్న బంగారమ్మ ఇంట్లో దింపి అమ్ములు నగలు వలుచుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియక తన బంధువైన ఒక పోలీసతని ఇంటికి వెళ్ళి అక్కడ అతనిచేత చేంతాడు తో ఇంటరాగేషన్ చేయించుకుని మర్నాడు పోలీసు స్టేషన్ లో ఇంకోసారి దొర గారి చేత లాఠీ తో ఇంటరాగేషన్ చేయించుకుని కోర్ట్ లో హాజరుపరచబడతాడు. పోలీసు వారు అమ్ములు విషయం దాచిపెట్టి, బంగారం మార్చగా అమ్ములు తండ్రి ఆ బంగారం తనది కాదు అనడం తో సరి ఐన సాక్ష్యాలు లేకపోవడం తో కేసు కొట్టేసి ” పెదమ తప్పు” కింద బంగారి గాడిని విడిచి పెడతారు.  

ఈ ఇంటరాగేషన్ తో ” పోలీసోడికి మనం దొక్కిపోనాక (దొరికిపోయాక) మన్ని కాయడానికి పెదాన మంతిర్లేడు, పెసినెంటా పిండియ లేడు, దేవుడు కూడా లేడు అనీ, అంచేత పోలీసోళ్ళ తో ఎట్టుకుంటే మనం బతకలేమనీ, ఎవుడికిచ్చే దాడి కిస్తే కానీ ఫీల్డులో నిలపడలేమనీ బంగారిగాడికర్ధం అవుతుంది.

ఈ సందర్భం గా బంగారి గాడు కొన్నాళ్ళు జైల్లో వుండవలసి వస్తుంది. ఆకాలం లో బంగారిగాడు పనికొచ్చీవోడని సూర్రవెడ్డుగారు గ్రహిస్తారు. జైల్లో సిత్తర్లేక, సత్తరకాయ అనే చిల్లర దొంగలతో పరిచయం అయి బంగారం కాడ్నించి సత్తు గిన్ని దాకా పెతీ వస్తువు మీదా గురుతులేసుకుంటారనీ, అంచేతాట్ని దొంగతనం సేస్తే దొక్కి పోతామనీ, జెనాలు లోట్లని ( కరెన్సీ నోట్లు ) లెక్కెట్టుకుని పర్సులో ఎట్టుకుంటారు కానీ ఆటి నెంబర్లని నోటు సేసుకోరనీ అంచేతాట్ని దోసుకుంటే వీజీగా పనైపోతుందనీ సిత్తర్లెక ద్వారా తెలుసుకుంటాడు. సిత్తర్లేక జేబులు కొట్టడం లో ఘనుడు, సత్తరకాయ గాడు ఎలా కనిపెట్టీసీవోడో, కానీ మనిసిని లొకేసన్ సెయ్యగానే ఆడిజేబులో ఎంతుంతదో టక్కున సెప్పేసీ వోడు. ఎంటీ వోడి తొలాట సీల్మా ఆలు క్యూ కాడ ఆపరేసన్. పర్సులో డబ్బున్నోణ్ని గమనించిన సత్తరకాయగాడు ఆడి ముందూ, డబ్బున్నోడెనకాల సిత్తర్లేకగ్గాడూ, ఆడెనకాల బంగారిగాడూ నించునేటోల్లు. సూరావెడ్డుగారూ, శిశువులూ లైను కాసే వొంకతో ఈల్లకి సాయంగా వుండేవోరు, సమయం సూసి సత్తరకాయ గాడు డబ్బున్న పర్సోడితో గలాటా ఏసుకోగా సిత్తర్లేగ్గాడు ఆప్రీసన్ సేసి పర్సు కొట్టిస్సి బంగారిగాడి జోబులో ఎట్టీసీ వోడు. బంగారిగాడు సప్పుడు సెయ్యకుండా, పోలీసోల్ల సాయం తో బయటటొడేవోడు. డబ్బులు పోగుట్టుకున్నెర్రిపీరుగాడు పర్సులో ఎంతుండేదో పోలీసోల్లకి కరెట్టుగా సెప్పీవోడు. ఆనాక పోలీసోళ్ళు కర్రెట్టుగా ఆళ్ళోటాలు తీసుకొనేతోళ్ళు. అలా సూర్రావెడ్డు గారి బేచి లో స్థానం సంపాదించి, జేబు దొంగతనాల సంపాదనలో అయనకి వాటాలు ఇచ్చుకుంటూ ఉన్న కాలంలో సూత్రధారుడు సిత్తర్లేక ” ఆడి పింతల్లికి పండగ సీరెట్టడం కోసం ” ఒక బట్టల దుకాణం లో చీర దొంగిలిస్తూ పట్టుబడి సాహుకార్ల దెబ్బలకు ప్రాణం విడిచి ” బతికివున్నప్పుడు జనాల జేబులు కొట్టి చనిపోయాక పోలీసుల జేబులు నింపుతాడు “

తాడిత పీడిత వర్గాలకి కొమ్ము కాయడం న్యాయమే, కానీ ఈ వర్గాలకి చెందని వారి లో మంచిని చూడలేక పోవడం అనే అవలక్షణాన్ని అలవరచుకున్న ఎర్ర సహోదరుల పంథా లోనే రావిశాస్త్రి గారూ నడిచారు. సిత్తర్లేక చనిపోయిన సందర్భం లో పోలీసు వారు సాహుకార్లని దోచుకోవడాన్ని వివరించిన రావిశాస్త్రి గారికి పోలీసు వారు అమ్ములు మేలిమి బంగారాన్ని పాళా బంగారం గా మార్చి కోర్ట్ వారికి చూపించి, అది తనది కాదని అమ్ములు తండ్రి చేత చెప్పించి ఆ కేసు కొట్టేయించడం లో కూడా పోలీసు వారి దోపిడీ యే కనపడింది. నిజానికి వ్యవహరపరం గా చూస్తే పొలీసు వారు ఈ కేసులో బంగారాన్ని మార్చడం ద్వారా ఈ కేసు లో నుంచి అమ్ములును తప్పించి ఆమె కుటుంబ పరువునీ, భవిష్యత్తునూ కాపాడారు. ” ఒక వైపే చూడూ, రెండో వైపు చూడకూ,,, ” అని సినిమాలో బాలక్రిష్ణ చెప్పిన పద్ధతిలో పై వారు చెప్పిన సిద్ధాంతాన్ని గుడ్డిగా అనుసరిస్తే తర్కబద్ధం గా ఆలోచించలేము.

అనంతర కాలం లో సూర్రావెడ్డు గారికి స్థాన చలనం కలగడం తో గుంపు చెదిరిపోయి బంగారిగాడు మళ్ళీ ఒంటరివాడై, అనేక రాటుపోట్లకి తట్టుకుని నెగ్గుకుని నిలబడతాడు. చోర కళలో ప్రావీణ్యం సంపాదిస్తాడు, ” అనేకమంది సోరులూ ఈరులూ మందుకీ మగువకీ బానిసలై నాశనం అయి పోవడాన్ని” సొయంగా కల్ల తో సూసిన కారనం సేత బంగారిగాడు ఆటి దరికి పోనేదు. ” కూనీలూ మర్డర్లూ సేసి దొక్కి పోతే పోలీసోడు కూడా మన్ని కాపాడ్నేడు ” అని తెలుసుకున్న బంగారిగాడు ఆటి జోలికి పోలేదు. 

ఆలా రాటు దేలిన బంగారిగాడు మంచి సంపాదనా పరుడవుతాడు. పేరుకు తగ్గట్టు వంటిరంగు బంగారం, మంచి ఒడ్డూ పొడుగూ, మాటకారి కావడం తో అన్నిటిలోనూ నెగ్గుకొస్తూ అడ్డు లేకుండా పెరిగి పోతాడు. మర్యాద భాష నేర్చుకుని, డిపాట్మెంటోళ్ళ కివ్వలసినవన్నీ ఇచ్చుకుంటూ దొరల దగ్గరనుంచి శిసువులదాకా అందరితోనూ సత్సంబంధాలు పెట్టుకుంటాడు.

ఒకరోజు సందేలప్పుడు తెల్ల సలవ బట్టలు కట్టుకుని కంపినీ సిలక నెంటేసుకుని స్కూటర్ మీద సినిమాకి బయల్దేరిన బంగారి గాడు ఊరిలోకి కొత్తగా దిగిన గవుర్నమెంటాసుపత్రి కోతల డాక్టర్ లా జెనానికి అనిపించేలా వుంటాడు. దార్లో ట్రాఫిక్ దిమ్మ మీద నిలబడి డూటీ చేస్తున్న సూర్రావెడ్డు గారిని చూసి రోడ్డుపక్కన బండినీ, సిలకనీ నిలబెట్టి, తాను ఒంటరిగా వెళ్ళి నమస్తే గురూ అని సూర్రావెడ్డు గారిని పాత బాషలో పలకరించగా బంగారి గాడిని ఆనమాలు కట్ట లేక సూర్రావెడ్డు గారు కంగారుపడతారు.

కంగారు పడ్డ సూర్రావెడ్డు గారు ట్రాఫిక్ దిమ్మ మీంచి దిగి బంగారి గాడికి నమస్కరించగా విషయం గ్రహించిన బంగారి గాడు తాను బంగారి గాడిననీ ఒకప్పడు సూర్రావెడ్డు గారి శిశువుననీ తెలియజేయడంతో తేరుకున్న సూర్రావెడ్డుగారు ” ఓర్నీ నువ్వట్రా, రేత్రి పద్దాట్నాక పెద్దీదిలోని లాడ్జీ కాడకొచ్చీ, నీతో సానా పనుంది ఇప్పుడు మాట్టాద్దం కుదర్దు ” అని చెపుతారు.

సూర్రావెడ్డు గారు స్థానచలనం వలన ఆర్ధికం గా నష్టపోయిన కారణం చేతనూ, ప్రస్తుతం వున్న ట్రాఫిక్ కొలువు లో జీతం మాత్రమే దొరకడం తోనూ, ఆలోచనాపరుడై చిల్లర ముఠాలు కట్టి చిలక్కొట్టుళ్ళు కొట్టడం వలన ఆట్టే ప్రయోజనం లేదని గ్రహించి, ” లోట్ల మార్పిడిలోకి దిగుతారు ” (అసలు నోట్లుచ్చుకుని దానికి రెండు మూడు రెట్లు నకిలీ నోట్లివ్వడం) ఈ మోడస్ లో ఇమేజి కోసం ఒక మలయాళీ మనిషిని పెట్టుకుంటారు. నోట్ల మార్పిడి నిర్వహించే శేటు పాత్రధారి వేరే ఆప్రీసన్ లో దొక్కిపోయి లోపలుండడం తో ఆ పోస్ట్ ఖాళీ అయి బిగినెస్సాగిపోయింది. బంగారిగాడు ఆ పాత్రకి కరెట్టు గా సూటవుతాడు. ఇందులో ఏజెంటు పాత్ర కీలకం. వూళ్ళో కొంత డబ్బుండి ఇంకా సంపాదించాలన్న ఆశె మీదున్నాల్లనట్టుకుని ఆళ్ళ కీ దొంగ లోట్ల ఎరేసి లచ్చకి రెండు లచ్చలిస్తారని సెపితే ఆడు లచ్చ కి నాలుగు లచ్చలడుగుతాడు. అప్పుడాన్ని మలయాలీ వోడి దగ్గరకి తీసికెలితే ఆడు సాంపిల్ గా నాలుగు దొంగ లోట్లిచ్చి బజార్లో మార్చుకోమంతాడు. నిజానికయి మంచి లోట్లే. ఇసయం తెలవనెర్రి పీరుగాడు లోట్లు మార్సుకుని ఆశె పడతాడు. నాల్రోజుల్లో బొంబాయి నుంచి శేటుగారొస్తారనీ ఆయనతో ఇసయం మాటాడుకొమ్మనీ సెప్పి మలయాలీ ఓడు తప్పుకుంతాడు. ఎర్రిపీరుగాడి కి ఆశెక్కువై ఏజెంటెనకాల పడతాడు.

ఎర్రిపీరుగాడిని నాల్రోజులెంట తిప్పుకుని ఆడికి బాగా ఆసెక్కించి ఆడి దగ్గరెంత డబ్బుందో అంచనా కట్టి అయన్నీ మంచిలోట్లే అని సెక్కింగ్ సేసుకున్న ఏజంట్ సూర్రావెడ్డు గోరికుప్పందిస్తాడు. తరాత సూర్రావెడ్డు గారి ప్లేన్ పెకారం మళయాళీ ఓడి తో మీటింగవుతుంది. నాల్రోజులకి కలకత్తా శేటేసంలో బంగారిగాడు ఇసాపట్నం లో ఇమానం దిగి పెద్దొటల్లో మకాం సేస్తాడు. ఎర్రిపీరుగోడినెంటపెట్టుకుని ఏజంటెల్లీతలికి హొటల్ గదిలో లచ్చిందేవి ఫొటో ముందు అగరొత్తులూ, దీపాలూ ఎలుగుతూ గదంతా గంధం ఓసనొస్తూ వుంటాది. గంట సేపు ఏటింగ్ సేయించి పక్క రూం లోనుంచి బంగారి శేటు గారు పాల తెలుపు పైజామా లాల్చీ తో దర్సనం ఇచ్చి ఇంకోసారి అమ్మోరికి పూజ్జేసి పార్టీ కేసి సూడకుండా ఏజంట్ తో హిందీలో మాటాడుతారు. ఏజంట్ పార్టీ తో లచ్చ కి రెండు లచ్చలే ఇస్తారంట అని చెప్పగానే ఎర్రిపీరుగాడు నాలుగిమ్మని శేటు గారి కాల్లా ఏల్లా పడగా మూడు కాడికి ఒప్పందం సేసి మిగతా ఇసయాలు ఏజంటు తో మాటాడుకొమ్మని బంగారి శేటు ఇమానం ఎక్కాలని బయటపడి ఇజీనారం ఎల్లిపోతాడు. ఎర్రిపీరు గాడు రెండులచ్చలిచ్చి ఆర్లచ్చలుచ్చుకుంటానని అనగా ఏజంటు ఒప్పుకోడు. శేటు కి మాటంటే మాటే, రూలంటే రూలే అనీ, అదీ ఓరం రోజులయ్యాక మాత్రమే శేటు పంపుతాడనీ చెప్పి, మూడ్రోజులయ్యాక శేటు కి దయ కలిగి ఎల్లుండి ఆరులచ్చల లోట్లు పంపుతున్నాడనీ రేత్రి పది గంట్లకల్లా సూట్కేసు లో రెండులచ్చల లోట్లెట్టుకుని. సావుల మదం బిడ్జీకాడకి రమ్మనీ ఈలోట్లుచ్చుకుని ఇసాపట్నం లో వుంటే పోలీసోళ్ళు సెకింగ్ సేత్తారనీ అంచేతనకాపిల్లిలో రెండ్రోజులుండొస్తే ఎవురికీ అనుమానం రాదని, తనక్కడ తెలిసున్నోడి టేక్సీలో వుంటాననీ ఎర్రిపీరు గాడికి సెప్పి, ఏజంటు సావుల మదం కాడ ఆణ్ణి కలుసుకుని లోట్లు సెకింగ్ సేసి ఓ మూలాకి నించుంటాడు. రెండు గంటలెయిటింగ్ సేయించి ఓ టేక్సీ కార్లో మలయాలీ నాయరూ, నారాయణా ఎనకాల టేక్సీ లో ఫైటింగ్ బేచీ దిగుతారు. సీకట్లో కారు అద్దాలు తీసి తల బయట పెట్టిన మలయాలీ నాయర్కి ఏజంటు దండం పెట్టగానే రెడీ నా అని నారాయణ అడిగిన ప్రెశ్నె కి, డబల్ రెడీ బాబూ అని ఏజంట్ అంటాడు. అంటే ఏజంట్ లోట్లు సొయం గా సెకింగ్ సేసాడని అర్ధం. ఈ నారాయణ అనేవోడు పైటింగ్ ఈరుడు. పైకాపు కోసం వుంటాడు. ఎర్రిపీరుగాడికి తెలివెక్కువై ఆడి సొంత బేచీ తో దిగి అసలు లోట్లివ్వకుండా మనకాడ్నించి లోట్లు లాగీసుకోలనే వైడియా ఏస్తే నారాయణ బేచీ రంగం లోకి దిగుద్ది.

అసలు లోట్లున్న సూట్కేసుచ్చుకుని, దొంగలోట్ల సూట్కేసు తెరిసి బేట్రీ లైటెలుగులో దొంగ లోట్లు సూపించి బేగీ (త్వరగా) లెక్కెటుకొమ్మని హడవిడి సేసి, లెక్కలైయాక ఆళ్ళెళ్ళిపోతారు. ఇసాపట్నం దాటగానే రోడ్డుకడ్డంగా పోలీసోళ్ళు నిలబడితే డైవర్ బండాపి పారిపోతాడు. ఆళ్ళు పొలీసోల్లేసాల్లో వున్న నారాయణ మనుసులు. బండి సెకింగ్ సేసి సూట్కేసు బయటకి తీసి ఈళ్ళిద్దర్నీ జీపులో కూసున్న దొరగారి కాడికి తీసుకెడతారు. ఆయనీల్లిద్దర్నీ లాఠీ తో ఇంటరాగేసన్ సేసి డాం డూం పీస్ పాస్ అని ఇంగ్లీస్ లో కేకలేస్తారు. బొక్కలో యేసి బొవికలూడదీస్తానని అరవగా పేనాలు సచ్చిపోయినెర్రిపీరుగాడూ, ఏజంటూ ఆయన కాల్లట్టుకుని జోబులో వున్న సిల్లర లోట్లూ సేతికున్న వోసీ, వుంగరాలూ, మెళ్ళో వున్న గొలుసులూ ఇచ్చుకున్నాక, దొరగారు పెదమతప్పు కిందీళ్ళిద్దర్నీ సెమించి ఒగ్గీస్తారు. ఎర్రిపీరుగాడిచ్చిన అసలు నోట్లని అందరూ వోటాలేసుకుంటారు. ఎర్రిపీరుగాడి దగ్గర్నుంచి పోలీసేసాల్లో వున్న నారాయణ మనుసులు లాక్కున్న దొంగ లోట్లతో ఇంకో ఎర్రిపీరుగాడికెరేస్తారు. 

ఇలాటి వో డజను ఆప్రీసన్లు సేసాక బంగారిగాడికి మనసిరిగిపోతుంది. ఇక మానీద్దామని అనుకుంటుండగా, సూరావెడ్డు గారు కూడా జాగ్రత్త పరుడవడం చేత ఎక్కువ గా ఆశపడితే అసలుకి మోసం అవుతుందని గ్రహించి ఎవురివోటాలాల్లకిచ్చేసి ఆప్రీసన్లాపేద్దామని నిర్ణయిస్తారు.

ఇలావుండగా ఒకరోజు వీళ్ళకి నిద్దరోతున్నాడి మూతి మీద నల్లబల్లి పడ్డట్టు కుక్కమూతి పంతులు తగులుతాడు. ఆడు పేరుకీ, జాతికీ పంతులే అయినా ఆ లచ్చనాలేటీ ఆడికాడ లేవు. ఆడికి లేనలవాట్నేదు. కరుసుమనిసి. పెళ్ళాం పిల్లలు ఈణ్ణొగ్గీసేరు. దొరగారికి ఇన్‌ఫార్మర్ గా వుంటూ ఒకరోజు ఆయన ఇచ్చిన బంగారాన్ని మార్చి ఆ డబ్బుతో తాగి జల్సాలు చెయ్యగా ఆయనీన్నట్టకుని నాల్రోజుల్లో డబ్బు సద్దక పోతే బొవిక లేరేస్తానని ఎచ్చరించడం తో, బైరాగినాయుడి బేరం వుచ్చుకుని ఈళ్ళ కాడికొచ్చాడు. మేవిప్పుడాప్రీసన్లాపీసేం. ఈ టెండరుచ్చుకుని ఇంకో కంపినీకెల్లమని ఎంత సెప్పినా ఇనడు. ఆకరికి సూర్రావెడ్డు గారొప్పుకుంటాడు. 

భైరాగి నాయుడు పేరుకి నాయుడే కానీ బతుక్కి బైరాగోడు. ఆడు మంచితనం తో అన్నీ పోగొట్టుకుని ఇక ఏదొక పాపం పని సేత్తేకానీ తాను, తన కుటుంబం బతకలేమనే అవస్త లో వుంటాడు. పెళ్ళాం జబ్బుమనిసి. కూతుర్ని కట్నం ఇవ్వలేదని మొగుడొగ్గీసాడు, పొలం పండదు ఇలాగున్నోణ్ణి కుక్క మూతి పంతులట్టుకుని ఆడి మనసులో దొంగ లోట్ల ఆశెట్టేడు.  

ఈ ఆపరేషన్ లో మోసపోయిన బైరాగినాయుడు కుక్క మూతి పంతుల్ని పీక పిసికి చంపేసి పోలీసులకి లొంగిపోయి జైలుకి వెడతాడు. అతని కుటుంబం పడిన ఇబ్బందులు చూసి బంగారిగాడి కడుపు తరుక్కు పోతుంది. సూర్రావెడ్డు గారు కూడా విచారిస్తారు. అందరూ కలసి మీటింగెట్టుకుని బైరాగినాయుడి కుటుంబానికి డబ్బు తిరిగి ఇచ్చేద్దామనుకుని, పోలీసు వారు తీగ లాగి డొంకంతా కదిలిస్తారనీ వీళ్ళ వెనకాల వున్న పెద్ద తలకాయలన్నీ బయటకొస్తాయనీ, అప్పుడన్ని రకాలుగానూ ఇబ్బందులు పడాలని భయపడి అతనికి వేరే రకం గా సాయంచేస్తారు. 

ఈ సంఘటనతో మనసు మారిన బంగారిగాడు తన చిన్నప్పటి బంగారు రోజులూ, ఆవుకళ్ళ తన తల్లీ, బంగారం లాంటి తన చెల్లీ, సాధువుల వంటి తన నాన్నా, మేనమామ లనీ జ్ఞాపకం చేసుకుని ఆ బంగారు రోజుల అమాయకపు మేలిమి బంగారుబాబు, కాకి బంగారం లాంటి బంగారిగాడు గా ఏ దెయ్యాల కారణం గా మారాడో మళ్ళీ బాల్య జీవితపు బంగారుబాబు గా మారాలంటే ఏమి చెయ్యాలో ఏడుకొండల దేవుడికి దండం పెట్టి కనుక్కుందామని తిరుపతికి ప్రయాణం కడతాడు.

**********************************