13_002

 

ప్రస్తావన

ఒకప్పుడు అందని జాబిల్లి. ఇప్పుడు అందరి జాబిల్లి.

ఎప్పటినుంచో ఎన్నో దేశాలు జాబిల్లి ని జయించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కొన్ని కొంతవరకు విజయం సాధించాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా అందరికీ భిన్నంగా చంద్రుని దక్షిణ భాగం మీద కాలుమోపింది భారతదేశం. చంద్రయాన్ మిషన్ ద్వారా మన ఇస్రో సాధించిన ఘనత ఇది.

ఎప్పుడో అర్థ శతాబ్దానికి ముందు ఇదే జూలై లో నాసా ప్రయోగించిన అపోలో మిషన్ ద్వారా చంద్రుని మీద మనిషి కాలుమోపాడు. తర్వాత రోజుల్లో కొంతకాలం కొన్ని దేశాలు ఆ ప్రయోగాలు కొనసాగించినా చాలా విషయాలు అంతు పట్టనివిగానే ఉండిపోయాయి. మళ్ళీ ఇంతకాలానికి ఎవరూ అడుగుపెట్టని చంద్రుని దక్షిణ ప్రాంతం మీద అడుగుపెట్టే సాహసం చేయగలిగింది భారతదేశం. తద్వారా చంద్రుని మీద పరిస్థితులు, ముఖ్యంగా దక్షిణ ప్రాంతం లో వున్న పరిస్థితులను అధ్యయనం చెయ్యడానికి మార్గం సుగమం చేసింది.

గతంలోనే ఆ ప్రాంతంలో నీటి జాడలను కనుగొన్న ఇస్రో ఇప్పుడు చంద్రయాన్ 3 లోని ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా అక్కడ అనేక లోహాల జాడ కూడా కనుగొంది. ఇంకా పరిశోధన చేస్తోంది. అయితే ప్రస్తుతం చంద్రుని మీద పగలు ముగుస్తుండడం వలన ఇంధనం అందే అవకాశం లేక పరిశోధనలు ఆగిపోతాయి. ఇది తాత్కాలిక విరామమా, శాశ్వత విరామమా అనేది చంద్రుని రాత్రి అంటే 14 రోజులు ముగిసేవరకు తెలియదు. ఇది తాత్కాలిక విరామమే కావాలని, ప్రజ్ఞాన్ పరిశోధనలు కొనసాగించాలని, కొనసాగిస్తూనే ఉండాలని కోరుకుందాం.

పరిశోధన అనేది మానవ మనుగడకు ఎంతో అవసరం. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు పరిశోధనలు చేస్తుంటే అనేకం విఫలమయినా చివరకు అనుకున్న ఫలితం సాధించడం జరుగుతుంది. అద్భుతమైన ఆవిష్కరణలు జరుగుతాయి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న సౌకర్యాల ఆవిష్కరణ వెనుక శాస్త్రవేత్తల మేధతో బాటు కఠోర శ్రమ, పట్టుదల ఉన్నాయి. సమయం వృధా అవుతోందని, డబ్బు ఖర్చు అవుతోందని అనుకుంటే అసలు ఆవిష్కరణలే ఉండవు. మనందరం ఆదిమ కాలంలోనే ఉండిపోయేవాళ్లం. నాగరికత ఏమాత్రం అభివృద్ధి చెందేది కాదు. అపజయాల వెనుకే విజయం ఉంటుందని చంద్రయాన్ మిషన్ ఋజువు చేసింది. చంద్రయాన్ 2 విఫలం నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా చంద్రయాన్ 3 రూపొందింది. విజయం సాధించింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటే అపజయాలే సోపానాలు. అపజయం ఎదురైనప్పుడు ఆ శాస్త్రవేత్తలను నిందించడం మంచి పద్ధతి కాదు. ఆ అపజయం మనకి మరింత ప్రయోజనం కలిగిస్తుందని అర్థం. ఈ చంద్రయాన్ ప్రయోగం వలన దేశానికేం ఒరిగిందని ప్రశ్నిస్తున్న వారికి ఒకటే సమాధానం. ప్రతి పరిశోధనకి కొన్ని ప్రయోజనాలు తప్పకుండా ఉంటాయి. అవి వెంటనే కనిపించకపోవచ్చు. అలాగే కొన్ని పరిశోధనలు నిర్దేశించిన ప్రయోజనానికి బదులుగా మరో క్రొత్త ప్రయోజనం అందించవచ్చు. అసలు పరిశోధన అంటూ జరిగితేనే మానవాళికి ప్రయోజనం. ఆదిమ మానవుడు ఆహారం సంపాదించుకోవడం కూడా పరిశోధన తర్వాతే నేర్చుకున్నాడు. ఈ చంద్రయాన్ పరిశోధన భవిష్యత్తులో ఏ ఆవిష్కరణలకు దోహదపడుతుందో తద్వారా భారతదేశం ప్రపంచానికి ఎలా మార్గదర్శకం అవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం.

వినోదం కోసం, ఆనందం కోసం సినిమా హీరోల మీద, క్రికెటర్ల మీద అంతులేని అభిమానం చూపిస్తున్నాం. ఆ అభిమానం ఒక్కోసారి పిచ్చిగా కూడా తయారవుతోంది. అంతలా కాకపోయినా నిజమైన నిశ్శబ్ద హీరోలయిన శాస్త్రవేత్తలను, సైనికులను కూడా అభిమానించి, వారి సేవలను అభినందిస్తే వారికి లభించే ప్రోత్సాహం వలన సమాజానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

*************************************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page