చేతికొచ్చిన పుస్తకం – 56
రావిశాస్త్రి సెంటినరీ వాల్యూమ్ అక్షర స్ఫూర్తి
వైజాగ్ నుంచి వచ్ఛేసి ఒకటిన్నర దశాబ్దం అయినా నా మైత్రీ బంధం కొనసాగుతోంది. ప్రతిరోజూ ఆర్కే బీచ్ లో హంసతో గానీ, ఎస్హన్మంత్రావ్ తో గాని నడిచే కాలంలో రావిశాస్త్రి విగ్రహం సదా పలకరించేది. ఆలోచనలు విచ్చుకునే కాలంలో ఆయన ‘రత్తాలు-రాంబాబు’ సీరియల్ వస్తుండేది. అదే సమయంలో మా కాలేజీ లైబ్రరీ లో ‘అల్పజీవి’ నవల చదివా! అది శైలి కాదు, రావిశాస్త్రి మాయాజాలం!!
ఇప్పుడే ‘నిజం’ శ్రీరామమూర్తి ఒక విషయం గుర్తు చేశారు, ” వాడు లంచగొండి కాదు మంచగొండి”అనే అద్భుతమైన పదప్రయోగం గురించి.
వందమంది సమకాలీన ప్రముఖులు రాసిన వ్యాసాలతో పాటు మరో 19 రచనలతో విశాఖ రసజ్ఞ వేదిక ఈ శతజయంతి ప్రత్యేక సంచికను 2022 జూలై 30-31 న జరిగిన వేడుకల్లో విడుదలయింది. 332 పేజీలలో 12 మాత్రమే అడ్వర్టైజ్మెంట్లు ఉండటం గమనార్హం, అభినందనీయం. ఇలాంటి ప్రయత్నాలు చేసేవారు గమనించాల్సింది ఏమంటే పుస్తకం సైజు! ఇది ఫోటోల్లో బాగుంటుంది కాని దాచుకోవడానికి, చదువుకోవడానికి మామూలు పుస్తకం పరిమాణం చాలా సౌకర్యం!
కాలం గడిచేకొద్దీ, ఏ సాహిత్యమైనా మరింత పరీక్షకు నిలబడుతుంది. కనుక ఇలాంటి సంచికలు, సంకలనాలు చారిత్రకమైన పరిణామాలు అంచనా వేయడానికి ముందు ముందు దోహద పడతాయి. అయితే వ్యాసాలు రాసేవారంతా ఆ స్పృహతో రాయడం అనేది వారి అవగాహన బట్టి ఉంటుంది.
మిత్రుడు, ఈ సంచిక సంపాదకులలో ఒకరు మేడా మస్తాన్ రెడ్డి పట్టుబట్టి నాతో ఓ చిన్న వ్యాసం రాయించినందుకు, సంచిక పంపినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
చేతికొచ్చిన పుస్తకం – 57
కలం నా ఆయుధం
మహా సంపాదకుడు కోటంరాజు రామారావు నలభయ్యేళ్ళ పాత్రికేయ అనుభవాలు
ఇరవయ్యో శతాబ్దపు తొలి సగభాగంలో దేశస్థాయిలో గొప్పగా తమ పాత్రికేయ సామర్థ్యంతో రాణించిన తెలుగు వారు – చింతామణి, చలపతిరావు, కోటంరాజు సోదరులు, ఖాసా, కుందూరి ఈశ్వర దత్, కృపానిధి, ఎ. ఎస్. రామన్ గురించి తలచుకుంటే పులకలు కలుగుతుంటాయి. అలా గర్వించదగ్గ సందర్భపు కొనసాగింపు ఈరోజు తారసపడింది!
పుస్తకాలు చేతికొస్తున్నా, ఎంతోమంది ఎదురు చూస్తున్నా ‘ చేతికొచ్చిన పుస్తకం’ రెగ్యులర్ గా రాయ లేకపోతున్నాను వేరే పనులతో తలమునకలై ఉండటంతో. గుంటూరు నుంచి కందిమళ్ళ శివప్రసాద్ తాను చేసిన అనువాదం అందుకోవడం మహదానందం కల్గించింది.
నాలుగు దశాబ్దాల తన పాత్రికేయ వృత్తిలో రెండు డజన్లకు మించిన సంఖ్య దాకా వివిధ ఇంగ్లీష్ పత్రికలలో పనిచేసిన కోటంరాజు రామారావు (1896-1961) తన అనుభవాలను ‘ది పెన్ యాజ్ మై స్వోర్డ్’ గా 1960లో రాశారు. 1964లో భారతీయ విద్యా భవన్ ప్రచురించిన ఆ పుస్తకాన్ని మిత్రులు కందిమళ్ళ శివప్రసాద్ అనువదించి ప్రచురించారు. ఎంతో తీవ్రమైన కాంక్ష ఉంటే తప్ప ఇలాంటి గొప్ప పనులు జరగవు! అనువాదం హాయిగా అలవోకగా మాత్రమే కాదు అర్థవంతంగా సాగిందని శివప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు చెబుతున్నాను. అదే సమయంలో నాన్ ఫిక్షన్ ఇంగ్లీష్ కంటెంట్ ను రెగ్యులర్ గా తెలుగు చేయాలని అభ్యర్థిస్తున్నాను.
ఇఃకా తను ప్రారంభించిన కె. ఈశ్వర దత్ ‘ది స్ట్రీట్ ఆఫ్ ఇంక్’ అనువాదం కొనసాగించాలని కూడా కోరుతున్నాను!
292 పేజీల పుస్తకం ధర 150 రూపాయలు.
ఆసక్తి ఉన్న వారు రచయితను 9441270979 నెంబర్ తో సంప్రదించవచ్చు.
ఫోటోలో అనువాదం, నా దగ్గరున్న మూలం కలిపి సంయుక్తంగా మీరు చూడొచ్చు.
చేతికొచ్చిన పుస్తకం: 58
ద్రౌపది ముర్ము… కీర్తి శిఖరాలు
ఈ మధ్య సైన్స్ రచనలకు సంబంధించిన వర్క్ షాప్ లో లెక్చర్ ఇవ్వడానికి ఉస్మానియా యూనివర్సిటీ వెళితే పార్టిసిపెంట్ గా వచ్చిన డా. షేక్ హసీనా నుంచి ఈ రెండు పుస్తకాలు కానుకగా లభించాయి.
యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్టుగా షేక్ హసీనా ఆరేడేళ్ళుగా ముఖాముఖి పరిచయం. ఇదివరకే మహిళలకు సంబంధించి పలు పుస్తకాలు వెలువరించిన హసీనా గారిలో శ్రమ, ఓపిక, నేర్పరితనం, మైత్రీ భావం అభినందనీయం. భారత రాష్ట్రపతి పదవి, ఎన్నిక విధానం, గత రాష్ట్రపతుల ఎంపిక మొదలైన వివరాలతో పాటు ప్రస్తుత రాష్ట్రపతి నేపథ్యం, ఎన్నిక విశేషాలతో సమాచార భరితంగా ‘భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము’ అనే 40 పేజీల చిరు పుస్తకాన్ని 2022 ఆగస్టులో డా హసీనా వెలువరించారు. వెల రూ 50.
రాజకీయ, విద్య, సాహితీ, మీడియా, న్యాయ, చట్ట, వైద్య, సేవా, క్రీడా, కళా రంగాల్లో ప్రధానంగా సమకాలీన, తెలుగు, ముస్లిం మహిళలు గురించి వెలువడింది ఈ 232 పుటల ‘కీర్తి శిఖరాలు’ పుస్తకం. మహిళలకు 100 రూ. గ్రంథాలయాలు, ప్రముఖులకు 200 రూ అమ్మబడే ఈ పొత్తం మామూలు పురుషులు, పిల్లలు కూడా చదువుకోవచ్చు. అయితే వారికి అమ్ముతారో లేదో సూచించలేదు. శ్రమకోర్చి మహిళలు, మీడియా, ముస్లిం వంటి జనర్ లో పుస్తకాలు వెలువరిస్తున్న డా షేక్ హసీనా గారిలో అవుట్ స్పోకెన్ నెస్ అభినందించదగ్గ మరో గుణం!
ఈ రెండు పుస్తకాల గురించి ఆసక్తి ఉన్న వారు…. ప్రచురించిన భాను పబ్లికేషన్స్ 7032929486 ను సంప్రదించవచ్చు.
చేతికొచ్చిన పుస్తకం – 59:
ఎగిరే కప్పలు — నడిచే పాములు
అసలు ‘ఎగిరే కప్పలు – నడిచే పాములు ‘ వినగానే శీర్షికా, చూడగానే ఆ పుస్తకం కవర్ పేజీ ఇట్టే ఆకర్షిస్తాయి! దాదాపు మొత్తం సర్వీస్ ‘ఈనాడు’లోనే గడిపి, ‘చతుర విపుల’ జంట మాసపత్రికల సంపాదకులుగా పేరుగాంచిన కంతేటి చంద్రప్రతాప్ 2022 ఆగస్టులో వెలువరించిన బాలల కథల సంపుటిది.
ఇది 86 పేజీల పుస్తకమే కానీ అన్ని హంగులు పుష్కలంగా ఉన్నాయి! ఇందులో 28 కథలు, వాటికి 10 మంది చిత్రకారులు వేసిన బొమ్మలు, ఇద్దరి ముందు మాటలు, రచయిత అభిప్రాయం, సూర్యస్తుతి పేరుతో ఒక పద్యం అన్ని చక్కగా అమిరాయి.
వినోదం, లోకజ్ఞానం, ఆసక్తి కలిగించే కథనం కలగలిసిన చక్కని మౌఖిక సంప్రదాయం బాలసాహిత్యపు ఆయువుపట్టు! పాశ్చాత్య పోకడలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించిన గాడ్జట్స్ తో మనదేశం కోల్పోయిన గొప్ప వారసత్వం అవ్వ, తాతలు పిల్లలకు చెప్పే కథలు! ఆ గొప్ప వారసత్వానికి కొనసాగింపు పంచతంత్రం కథలూ, పిమ్మట ‘చందమామ’ పత్రిక వివిధ భాషల్లో దేశవ్యాప్తంగా కొనసాగించిన అరశతాబ్దపు కథల వ్యాప్తీ. ఇప్పుడిదంతా గత వైభవపు కలవరింత! పెద్ద ప్రచురణ సంస్థలు వేలాది కాపీలు వెయ్యాల్సిన పుస్తకం ఇప్పుడు ఇరవయ్యొకటవ శతాబ్దం లో రచయితే స్వయంగా అచ్చు వేసుకోవాల్సిన విషాదం!
ఆసక్తి ఉన్న వారు 150 రూ విలువగల ఈ పుస్తకం కోసం తపస్వి మనోహరం పబ్లికేషన్స్ వారిని (8008143507 నెంబర్ లో) సంప్రదించవచ్చును.
చేతికొచ్చిన పుస్తకం – 60
విశ్వనాథ ‘ వీరవల్లడు ’
2021 సంవత్సరం ముగుస్తున్న సమయంలో హైదరాబాద్ బుక్ ఫేర్ నడుస్తున్న వారంలో ఫేస్బుక్ లో ఈ శీర్షిక ప్రారంభించాను. ఇంతవరకు సంవత్సరం వ్వవధి లో కేవలం 59 పుస్తకాల గురించి మాత్రమే ఇక్కడ రాయగలిగాను. ఇంకా చాలా పుస్తకాలు అలా పెరిగి, పేరుకు పోతున్నాయి!
మా విల్లా హైట్స్ అపార్ట్మెంట్ మిత్రులు, మంచి చదువరి అయిన దేవప్రసాద్ తో కలిసి డిసెంబర్ 30 మధ్యాహ్నం 3 గంటలకు బుక్ ఫేర్ కు వెళ్ళా. సంత కెళ్ళూతున్నప్పుడు చాయిస్ తో వెళ్ళడం సబబు కాదేమో! ఆసక్తి కలిగించే పుస్తకం కనబడితే కొనాల్సిందే, చదవడం విషయం తర్వాత సంగతి ఏమైనా! ఒక తమాషా విషయం చెప్పాలని ఇది రాస్తున్నాను.
డీసెంబర్ 30 న బుక్ ఫేర్ అవుట్ గేట్ ఇన్ గేట్ అయ్యింది. నా కది సౌలభ్యం. అంతకు ముందు సాహితీవేత్త ఏ కే ప్రభాకర్ తో ఒకరోజు, మా హంస తో మరోరోజు వెళ్ళి చాలా షాప్స్ చూసి ఉన్నాను, చివరి సీరియల్ గా రెండు వరసలే మిగిలి ఉన్నాయి. దేవప్రసాద్ ముందు చూపుతో పెద్ద సంచి కూడా తెచ్చారు. తనూ నేనూ కొన్ని పుస్తకాలు కొన్నాం.ఇదంతా ఓకే.
అసలు సంగతి ఏమిటంటే విశ్వనాథ సత్యనారాయణ రచనల స్టాల్ కనబడగానే రాళ్ళబండి కవితాప్రసాద్, ఆయన తరచూ చెప్పిన ‘విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు ‘ సంగతులు గుర్తుకొచ్చి ఆ పుస్తకం కనబడగానే కొనేశాను.
140 పేజీల ఈ నవల వెనుక మరో 40 పేజీల ‘వీరవల్లడు’ నవలిక పుస్తకం ఇంకోవైపు నుంచి మొదలవుతుంది.మా మిత్రుడు కూడా ఈ పుస్తకాన్ని కొన్నారు.
పదుకొండున్నర గంటల తర్వాత పడుకునే ముందు ఈ పుస్తకం అటు ఇటు తిప్పుతూ కనీసం పుస్తక నేపథ్యమైనా చదవాలని ‘వీరవల్లడు’ వైపు చూపు తిప్పాను. ఆసక్తి అనిపించి ఓ గంటలో 20 పేజీల దాకా చదివాను. నిజానికి యద్దనపూడి సులోచనారాణి మీద విశ్లేషణ వ్యాసాల సంకలనం చివరి దశ పనిలో ప్రస్తుతం తలమునకలుగా ఉన్నాను. అటువంటి సందర్భంలో అర్ధరాత్రి సమయంలో ఆసక్తిగా సగం నవలిక చదివేశాను. మరుసటి రోజు ఉదయం మిగతా పూర్తి చేసి గాని మరో పని ముట్టుకోలేదు.
సరే, ఈ పుస్తకం లోపలి విషయం గురించి వీలైనప్పుడు ఒక వ్యాసం రాయాలి, ఏదో ఒక పత్రిక ప్రచురిస్తుంది. ఏ పుస్తకం కొంటామో, ఏది చదువుతామో నేనైతే చెప్పలేను. ఆమాత్రం’ అన్ నోన్ ‘ కోణం ఉండాలి కనీసం అప్పుడప్పుడైనా!
2023 లో నా కలం ‘చేతికొచ్చిన పుస్తకం ‘ శీర్షికను సంపద్వంతం చేస్తుందని ఆశ!
****************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page