11_012 ముకుందమాల – భక్తితత్వం

    

                                       నాస్థాధర్మేనవసునిచయే నైవకామోపభోగే

                                    యద్యద్భవ్యం భవతు భగవన్‌ పూర్వకర్మానురూపం

                                    ఏతత్ప్రార్ధ్యం మమబహుమతం జన్మజన్మాంతరేపి

                                    త్వత్పాదాంభోరుహ యుగగతా నిశ్చలాభక్తిరస్తు ॥  

            శ్రీ కులశేఖరులు పూర్వశ్లోకంలో తానుకోరని వాటిని కొన్ని చెప్పారు. ఈ శ్లోకంలో తాను కోరని మరికొన్నింటిని చెప్పి, తన కోరికను ముకుందుని ముందు ఇలా వెల్లడించుకొంటున్నారు. ఓ కృష్ణా! ధర్మాన్ని ఆర్జించాలని కానీ, అర్ధాన్ని కూడ బెట్టాలనికానీ, కామభోగాలను అనుభవించాలని కానీ, నాకు కోరిక లేదు. నా పూర్వ జన్మ కృత కర్మము ననుసరించి, ఏది ఎలా జరగాలో అలా జరుగనీ. ఈ జన్మలో కానీ, జన్మాంతరములందు కానీ, నీ పాదాలపై నిశ్చలమైన భక్తి కలగాలన్నది ఒక్కటే నా కోరిక. అంటారు మహారాజు.

            కర్మలు మంచివైనా చెడువైనా ఫలితాన్నీయక మానవు. వానిని వారించుకోవడానికి జన్మ పరంపరలూ తప్పవు. ధర్మఅర్ధకామాలు పురుషార్ధాలు. మానవుడు వీటిని కోరి సంపాదించాలి. వెనుకటి జన్మలలో చేసిన కర్మలననుసరించి ఈ జన్మలో ధర్మశ్రద్ధ, ధనమూ, కామోపభోగాలూ లభిస్తాయి. ఈ భావాన్ని తన శైలిలో రామదాసు…

            సీతారామస్వామి నే చేసిన నేరములేమి

            ఖ్యాతిగ నీపద కంజయుగమునే

            ప్రీతిగదలపక భేద మెంచి తినా॥

            రంగుగ నాపది వేళ్ళకు రత్నపుటుంగరములు విన్నడిగితినా?

            మోమోటంబిడకుండగ నీదగు మురుగులు గొలుసులు అడిగితినా

            కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితి కాని ॥

అంటారు.  ఎందటి మహనీయులకైనా, నిరంతర భగవదారాధకునికే అయినా కర్మఫలం అనుభవించడంలో మినహాయింపు లేదు. సంచిత, ప్రారబ్ధ ఆగామి రూపాల్లో ఉన్న కర్మలు అవశ్యం అనుభవించి తీరాలి. కానీ, భగవద్భక్తి వాటిని అనుభవించేశక్తిని కల్గిస్తుంది. రామదాసుకు కారాగార వాసం తప్పలేదు. పోతనకు పేదరికం అనుభవించక తప్పలేదు. పాండవులకు అరణ్యక్లేశమూ తప్పలేదు. అయినా వారి భక్తి వారికి ఓర్పు నిచ్చింది. బాధలను కూడా తేలికగా అనుభవించగల శక్తి నిచ్చింది.

            సత్కర్మాచరణంతో వీటన్నిటినీ పొందవచ్చు. కానీ అవి వ్యతిరేకముగా నున్నపుడు కూడా అంటే గత జన్మ సుకృత ఫలం లేకపోయినా, ఈ జన్మలో వాటిని కోరి, భగవంతుని ప్రార్ధించి, ధార్మికునిగా, ధనికునిగా, భోగిగా భాగ్యాలను పొందవచ్చు. కానీ వీటన్నిటి కంటే పొందదగినదీ శాశ్వత సుఖదాయిని అయినదీ భక్తి. ఈ భక్తిని సాధనంగా చేసి, పురుషార్ధాలయిన ధర్మాన్నీ, అర్ధాన్నీ, భోగాల్నీ, కామాల్నీ చివరకు జన్మరాహిత్యాన్నీ కూడా ఆర్జించవచ్చు. కానీ అలా చేయడం రేగుపళ్ళకు ముత్యాలు వెలబోసినట్లు అవివేకమే అవుతుంది. అందుకే అన్నిటికంటే ఉత్తమోత్తమమైన పరమపురుషార్ధాన్ని అర్ధించి, శ్రీకులశేఖరులు ` హే భగవాన్‌! నాకు ధర్మమందు కానీ, అర్ధమందు కానీ కోరికలేదు. ఏవిధమైన కామోపభోగాలనూ ఆశించడం లేదు. పూర్వకృత కర్మ రూపంగా నాకు ప్రాప్తించినదేదైనా సంతోషమే. చివరకు జన్మరాహిత్యాన్ని కూడా కాంక్షించనయ్యా. ఎన్ని జన్మలైనా ఫరవాలేదు. నీ పాదారవిందములందు నిశ్చలమైన భక్తిని మాత్రం ప్రసాదించు తండ్రీ. అని కోరుకుంటున్నారు. నిజానికి ధర్మార్ధకామములు భగవద్విషయమున ప్రవర్తించిన నాడు అవి పొందదగినవే కాగలవు.

            ఆ విధంగా పురుషార్ధాలు భక్తికి అంగములుగా ఆదరింపదగినవే కానీ, కేవలం వాటిని పొందడమే జీవితధ్యేయం కారాదు. అందుకే కేవల భక్తిని మాత్రం కోరుతున్నారు శ్రీ కులశేఖరులు.

                        ‘‘భక్తి బిచ్చమీయవే భావుకమగు సాత్విక      ॥ భక్తి ॥ 

                        ముక్తి కఖిల శక్తికి త్రిమూర్తులకతి మేల్మి రామ ॥ భక్తి ॥

            రామా! సర్వమంగళములనివ్వ జాలిన సత్వగుణంతో కూడిన భక్తిని బిచ్చముగా నీయవయ్యా! అంటారు త్యాగరాజు. ఇలా భక్తిని బిచ్చంగా ఇవ్వమని అడగడంలో విశేషమేమిటీ అంటే :` కులశేఖరులు చెప్పినట్లే! ‘‘లోకంలో ఎంతటి వారైనా, తమ తమ శక్తి సామర్ధ్యాలతో సంకల సంపదలనూ, సర్వ సామర్ధ్యాలనూ సంపాదించుకోగల్గుదురే కానీ, భక్తి మాత్రం కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే పొంద గలిగినది. వారివారి ప్రయోజకత్వములు భక్తి సంపాదన యందు మాత్రం, స్వయం సమృద్ధములు కావు. అంతేకాదు స్వీయ అతిశయమూ, గర్వమూ వదలి శ్రీహరికి దాసులై, యాచకులై మనసా అర్ధించి స్తుతిస్తేనే కానీ, భక్తి అలవడదు. ఆ విషయాన్ని తెల్సిన త్యాగరాజు భక్తి బిచ్చమీయవే రామా అంటూ వేడుకుంటున్నారు.

                        ధర్మ సత్య దయోపేతో విద్యావా తపసాన్వితా

                        మద్భక్త్యపేత మాత్మానం నసమ్యక్ప్రపునాతిహి ॥

            ‘‘దయ సత్యములతో కూడిన ధర్మం కానీ, తపస్సుతో కూడిన విద్యకానీ, నా భక్తి లేని వానిని అంతగా పవిత్రుని చేయజాలవు’’. అని భక్తి యొక్క అతిశయాన్ని సూచించే భగవంతుని వచనాలెన్నో ఉన్నవి భాగవతంలో. అందుకే ‘‘సంగీత జ్ఞానము భక్తివినాసన్మార్గము గలదే ఓ మనసా’’॥ సంగీత జ్ఞానమైనా సరే భక్తి హీనమయిననాడు అది ఎన్నటికీ సన్మార్గం కాలేదు. అంటూ నొక్కి చెప్పారు  త్యాగరాజు. అందుకే శ్రీ కులశేఖరులు స్వామిని భక్తిని ప్రసాదించమని అంతగా వేడుకొనడం! నిశ్చలాభక్తిరస్తు!

                               దివివా భువివా మమస్తు వాసః

                                    నరకేవా నరకాంతక ప్రకామం

                                    అవధీరిత శారదార విందౌ

                                    చరణౌతే మరణేపి చింతయామి ॥

            భగవంతుని సదాస్మరించడం తప్ప ఇతరములేవీ కోరని మహారాజు ఇక్కడ ఆ భాగ్యానికి కేవలం ప్రదేశ నియమం కూడా లేదు. అంటున్నారు. ఓ నరకాంతకా! రాక్షసుని చెరలోనున్న స్త్రీలను విడిపించి వారిని చేపట్టావు. నీ దివ్య పాదార విందాలను చూడలేని, తలచలేని, అజ్ఞాన బంధముననున్న నా చిత్తాన్ని నీవే ఉద్ధరించవలెనయ్యా.

            వర్షాకాలం కొలనులో తామరలు నీటమునిగిపోయి శరదృతువు రాగానే అందంగా నీటిపై తేల్తాయి. అవివేకమనే మబ్బు పట్టి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాది దుఃఖాలు వర్షించే స్థితిలో శ్రీకృష్ణపాదాలనే తామరలు కనబడకుండా పోతాయి.  సత్వగుణం శరత్తులా ప్రవేశిస్తే మనసు నుండి రజోగుణం అనే బురద విరిగి చిత్తమనే నదీ జలం ప్రసన్నమైనప్పుడు శారద పుండరీకాలను అంటే శరత్కాలంలో విచ్చినతామరలను ధిక్కరించజాలిన స్వామి పాదాలు కన్పట్టగలవు. ఈ స్థితి జీవించి ఉన్నప్పుడే కాదు మరణించినా కూడా, ఆ పాదారవింద విస్మృతి మాత్రం కలుగకూడదు. ఆ స్మృతి ఫలం కోసం, స్వర్గానికైనా, నరకానికైనా, మరెక్కడికి వెళ్ళినా ఫరవాలేదు. అంటే జీవద్దశలో, మరణదశలో, మరణాంతర దశలోనైనా సరే శ్రీకృష్ణ పాదారవింద స్మరణమే నాకు కావాలి. ఒక ప్రయోజన ముద్దేశించో, మరో ఉత్తమలోకప్రాప్తి కోసమో మాత్రం కాదు. ఇదే ఏకాంతకభక్తి. అదీ కులశేఖరుల వారి కోరిక!

            సదా సర్వేశ్వరుని స్మరణలోనే కాలంగడవడం వల్ల అలౌకికమైన ఆనందం అందివస్తుంది. సదా నామం వినడం వల్ల నామాంకిత రూపం మనసులో నాటుకుని, ఆ రూపం మీద అవ్యాజమైన ప్రేమ కలిగి ఏకాగ్రభావం స్ధిరపడుతుంది. అంటే సదా భగవంతుని స్మరణ ఏకాగ్రచిత్తంలో నిలిచి, అఖండానురాగాన్ని కలిగిస్తుంది. అదే బ్రహ్మానందం. ఈ భావాన్ని త్యాగరాజ స్వామి తన చిత్తరంజనిరాగ కృతిలో ఇలా శలవిచ్చారు.

            ప॥        స్మరణే సుఖము శ్రీ రామ నామ స్మరణే సుఖము

            అ.ప॥    నరుడై పుట్టినందుకు రామ  ॥ స్మరణే సుఖము

            చ.         రామనామస్మరణము వల్ల

                        నామరూపమె హృదయంబు నిండి

                        ప్రేమ పుట్ట సేయగ లేదా ని

                        ష్కామ త్యాగరాజు సేయు నామ ॥ స్మరణే సుఖము         

                        మద్భక్త్యపేత మాత్మానం నసవ్యాక్ప్ర పునాతి

            ఈ ఏకాగ్రత నాకు జీవించి ఉన్నప్పుడు మాత్రమే కాదు. మరణించినా ఆ పాదారవింద స్మృతే నాకు కలగాలి స్వామీ!!

            ఉత్తముడైన భక్తుని యొక్క మనసు ఏకాగ్రతతో పూర్తిగా భగవంతుని పాదాలపై లగ్నమై ఉండాలి. ఆ భావం ఒక సమయంలో ఉండటం మరొక సమయంలో లేకపోవడం కాకూడదు. ఏదో పూజా సమయంలోనూ, సంకీర్తన సమయంలోనో భగవంతుని గురించి స్తుతించడం పూజించడం కాకూడదు. అంతేకాదు స్వర్గ సుఖాల్లో తేలుతున్నా వేదనలో వేగిపోతున్నా భగవంతుని భావనలో మనసు ఆ స్వామి పాదాలనే పూర్తిగా ఆశ్రయించుకుని ఉండాలి.

            నిశ్చలాభక్తిరస్తు!  అని కోరుకున్న కులశేఖరులు అనుక్షణం ఆ స్వామి భావనలో హృదయం నిండి ఉండాలనీ, ఆ స్థితి నాకు జీవించి ఉన్నప్పుడే కాదు మరణించినా కూడా ఆ పాదారవింద విస్మృతి కలుగకూడదు. ఆ స్కృతి ఫలంకోసం స్వర్గానికైనా, నరకానికైనా, మరెక్కడికి వెళ్ళినా ఫరవాలేదు. అంటే జీవదశలో, మరణదశలో మరణాంతర దశలోనైనా సరే! శ్రీకృష్ణ పాదారవింద స్మరణమే కావాలి. ఒక ప్రయోజనముద్దేశించో, ఉత్తమ లోకప్రాప్తి కోసమో కాదు. ఇదీ ఏకాంతిక భక్తి. అదీ కులశేఖరులవారి కోరిక.

  1. కృష్ణ! త్వదీయ పద పంకజ పంజరాన్త

                                    మద్యైవమే విశతు మానస రాజహంసః

                                    ప్రాణ ప్రయాణ సమయే కఫ వాత పిత్తైః

                                    కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే! ?

            అనుక్షణం భగవంతుని నామ జపానందాన్ని కోరుకునే కులశేఖరులు, మరణ సమయంలో కూడా ఆ స్కృతిని నిల్పి ఉంచుకోవడం కోసం, సమాధి స్ధితిని కోరుకుంటున్నారు.

            ఈ శ్లోకంలో, శ్రీ కులశేఖరులు తన మనసును ఒక రాజహంసతో పోలుస్తూ ఉన్నారు. ఈ హంస స్వచ్ఛమైన జలమున్న మానస సరోవరంలోనిది. రజస్త మస్సులు లేని శుద్ధ సత్వంతో నిండిన మనసు అనే రాజహంస ఇది. అందుకే శ్రీ కృష్ణ పాదారవింద పంజరంలో దూరగలిగింది.

            కృష్ణా! నీ పాదమనే పంజరంలో నా మనసనే రాజహంసను ముందుగానే బంధించనీ! ఎందుకంటే, మరణకాలంలో నిన్ను స్మరిద్దాం అనుకున్నా, మరణానికి ముందు జీవద్దశలో సత్వగుణం ఆవిర్భవించడమే తటస్థిస్తే, మనసు భగవత్స్మరణ చెయ్యగలదు. మరణానంతరం ఏదో ఒక శరీరంలో ఉంటుంది కనుక, అక్కడ నీ స్మరణకు అవకాశముంటుంది. కానీ మరణ సమయమాసన్నమయిన వేళ, ఈ శరీరాన్ని ప్రాణాలు వీడి, మనసు ఇంద్రియాలతో కలిసి వేరొక శరీరానికై, ప్రయాణమయే వేళ, అలజడిపడుతూ ఉంటుంది. శరీరం నుండి ప్రాణం బయటపడే వేళ కఫవాతపిత్తములు కంఠాన్ని బిగబట్టి, ప్రాణ మాడకపోవడంతో మనసు గిజగిజలాడుతుంది. ప్రాణమాడకపోతే, మనసు పని చేయదు. మనసు పనిచేయనప్పుడు మాటా, స్మరణా ఎక్కడ! అందుకే తన మానస రాజహంసను ముందుగానే ముకుంద పాదారవిందాలనే పంజరంలో జాగర్తగా బంధింపబడును గాక! అని కోరుకుంటున్నారు. గాలి చొరరాని పంజర రక్షణలోని హంసకు బయటి వాతావరణపు ఆటుపోట్ల వలన బాధలేదు. అనవరతము శ్రీహరి స్మరణ ధ్యానాదులతో రజస్తమస్సులు లేని,శుద్ద సత్వగుణ పూరితమైనది ఈ మానస రాజహంస! ఇప్పుడిక శ్రీకృష్ణ పాద పంజరంలో క్షేమంగా ఉన్నది. ప్రాణ ప్రయాణ సమయమాసన్నమై, కఫవాత పిత్తాలచే కంఠం బిగబట్టి ప్రాణం తల్లడిల్లినా బయటి గాలి చొరరాని పంజరంలో ఉన్న హంసకు ఏమాత్రం బెదురు లేదు. మనసుకు ఏ కదలికా లేదు! మనసుకు కదలిక ఉంటేనే కదా ప్రాణం యొక్క ఆవశ్యకత!! ఇది సమాధి స్థితి. ఈ స్థితిలో మనసుతో భగవంతుని స్మరించడం కాదు. మనసే భగవత్పాదారవింద పంజరంలో ప్రవేసించేసింది. శరీరంతో, ప్రాణంతో ఏమాత్రం సంబంధం లేనిది ఈ పంజరం. అందుకే ఇప్పుడు మనసుకు దేనివలనా భయం లేదు. భగవంతునిలో ఐక్యమైన మనసు సమాధి స్థితినందినది! ఇట్టి స్థితిలో యోగి భగవంతునితో కలిసి ఉండియే తన దేహాన్ని అనాయాసంగా వీడగలడు. ఆ చరణారవిందాల భద్రత నెరిగినవారు కనుకనే ఈ స్థితినే కులశేఖరుల వారు కోరుకున్నది.

            ఇదీ శ్రీకృష్ణ పాదారవింద పంజరంస్థిత హంస యొక్క నిజస్థితి. స్వామి వివేకానందులు, స్వామి యోగానంద, రాఘవేంద్ర స్వామి వంటి ఎందరో మహాయోగులు ఇందుకు ఉదాహరణ.

            ప్రాణప్రయాణ సమయంలో ఆ దేవదేవుని పాదయుగము నాశ్రయించడమో ఆ దివ్యమూర్తి దర్శనమపేక్షించడమో భక్తులైన వారందరూ కోరుకునేది.

            శ్లో॥      వ్యత్యస్త పాద మవతంసిత బర్హిబర్హం

                        సాచీ కృతానన నివేశిత వేణురన్ధ్రమ్‌

                        తేజః పరం పరమకారుణికం పురస్తాత్‌

                        ప్రాణ ప్రయాణ సమయే మమసన్నిధత్తామ్‌ ॥

                                                                                                                                                   తరువాయి వచ్చే సంచికలో……

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

You may also like...

Leave a Reply

Your email address will not be published.