చేతికొచ్చిన పుస్తకం-11:
ఇండియన్ అబౌ ఆల్ ఎపిజె అబ్దుల్ కలాం- ఎ లైఫ్
చదవని పుస్తకాలు పేరుకు పోయినా కూడా మళ్ళీ కొనడం ఏమిటి? చదవగలమా లేదా అనే స్పృహ లేకుండా కొనడం ఖచ్చితంగా వ్యసనమే! అలా నచ్చినది కనబడగానే 2021 డిసెంబర్ 27 న కొన్న పుస్తకాలు తొమ్మిది.
అరుణ్ తివారి రాసిన 574 పేజీల ఉద్గ్రంధం ఇది. ఆరు విభాగాలుగా, ప్రతి విభాగం ఎనిమిది అధ్యాయాలుగా సాగిన ఈ పుస్తకం లో 16 పుటలలోని 32 ఫోటోలు కూడా విలువైనవి.
అవును, కలాం చాలా పుస్తకాలకు సహ రచయితగా కనబడే అరుణ్ తివారి మహాశయుడు వారు 2015 జూలై 27 న అస్తమించిన తర్వాత వెలువరించినదీ గ్రంథం.
ఈ రచనలో నాకు బాగా నచ్చింది, సాధు బ్రహ్మ విహారిదాస్ రాసిన ముందు మాట. రెండు దశాబ్దాలకు పైగా కలాం గురించి చదువుతున్నాను, ‘ఇండియా 2020’ అనువదించాను. కనుక కలాం జీవన మర్మం, సూత్రం ఏమిటని నాకు ఆసక్తి.
ఏ వయసులోనైనా విద్యార్థులు ముందు పాఠం చెబుతూ కనుమూయాలని 2006 సెప్టెంబర్ 11న అన్నారనే విషయం ప్రస్తావించారు!
‘ The way he left , he still lives ‘
చేతికొచ్చిన పుస్తకం- 12:
వలస రాయలసీమలో మహిళా చైతన్యం
అనంతపురం జిల్లా గుత్తిలో 1880 లో ఏర్పడిన మహిళా సంఘం తెలుగు ప్రాంతపు తొలి స్త్రీల సంఘమా? 1909 లో అనంతపురంలో శారదా మందిరం,1910 నవంబర్ లో కర్నూలులో హిందూ స్త్రీ విద్యాభివర్ధినీ సమాజం ఏర్పడగా 1928 జూలైలో చిత్తూరు జిల్లా వాయల్పాడులో ఏడవ ఆర్యవైశ్య మహిళాసభ జరిగింది. ఇలాంటి విషయాలు సూక్ష్మంగా పేర్కొని కొత్త పరిశోధనలు చాలా అవసరమని డా. షేఖ్ మహబూబ్ బాషా Mahaboob Basha Shaik ఇటీవల ( 2021 డిసెంబర్ లో) వెలువరించిన విలువైన చిరు పుస్తకం ‘వలస రాయలసీమలో మహిళా చైతన్యం’ చెబుతోంది.
1939 డిసెంబర్ 16-17 తేదీల్లో కడప లో జరిగిన ‘ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ’ లో ఆహ్వాన సంఘపు అధ్యక్షురాలిగా కడప రామసుబ్బమ్మ ప్రసంగంలోని జెండర్ చైతన్యం గురించి మదింపు వేయడానికి చేసిన విశ్లేషణే ప్రస్తుత 88 పేజీల పుస్తకం.
దశాబ్దం క్రితం చేసిన శోధన ప్రచురణ ఆసరా కరువై మూలబడిన వ్యాసం ‘వీక్షణం’ పత్రికలో సంవత్సరం క్రితం ప్రచురణ కావడం ఓ ఆనందకరమైన విషయం. ఎన్ వేణుగోపాల్ ముందుమాటతో వీక్షణం ప్రచురణలు, న్యూ రాయల్ బుక్ కంపెనీ కలిసి ప్రచురించిన ఈ పుస్తకం వెల 80 రూ.
పుస్తకం అందిన గంటన్నర వ్యవధిలో చదవడం నాకు ఒక సందర్భం.
చేతికొచ్చిన పుస్తకం-13:
మహాత్మా గాంధీ సమగ్ర జీవిత కథ
నిన్న చేతికొచ్చిన ఐదు వందల పైచిలుకు పుటల ‘మహాత్మాగాంధీ సమగ్ర జీవిత కథ’ గ్రంథం మహదానందం కల్గించింది! రచయిత కాటా చంద్రహాస్ తో ఒకటిన్నర సంవత్సరంగా ప్రతి మూడు, నాలుగు రోజులకోసారి చర్చించు కుంటున్న పుస్తకం కనుక, ఇంత ఆసక్తి, మురిపెం!!
ఇప్పుడు మనకు లభిస్తున్న గాంధీజీ ఆత్మకథ (నవజీవన్ ట్రస్ట్ వారికి వేమూరి రాధాకృష్ణమూర్తి చేసిన) తెలుగు అనువాదం వచ్చి మూడు దశాబ్దాలైంది. అందువల్ల నేడు హాయిగా చదువుకునే రీతిలో మళ్ళీ మరో అనువాదం అవసరమైంది.
చిన్న చిన్న వాక్యాలతో, వీలైనంత తెలుగు నుడికారంతో సాగే గాంధీజీ స్వీయచరిత్ర (1869-1920) మూడు వందల పేజీలు సాగితే , భారత స్వాతంత్ర్యోద్యమంతో సాగిన గాంధీజీ గాథ (1921-1948) మరో రెండు వందల పైచిలుకు పుటల స్వతంత్ర రచనగా ఇందులో లభ్యమవుతోంది.
రెండు దశాబ్దాలకు పైగా మారిన మనదేశ పరిస్థితుల్లో గాంధీజీ ఆలోచనలు, సిద్ధాంతాలు పదే పదే చర్చకొస్తున్నాయి. కనుక అథెంటింక్ రచనను సంప్రదించాలనుకునేవారికి కాంటెంపరరీ తెలుగులో ఆసక్తిగా చదువుకునే సదుపాయం కల్పించారు రచయిత చంద్రహాస్.
అందమైన 516 పేజీల ఈ గ్రంథాన్ని ప్రచురించిన www.clspublisherslip.com వారు రూ. 299 కే ( అవును 516 పేజీల పుస్తకాన్ని మూడు వందల కే) ఇవ్వడం అద్భుతమైన మరో సావకాశం!
చేతికొచ్చిన పుస్తకం-14:
డా కె గీత నవల ‘వెనుతిరగని వెన్నెల’
పాతికేళ్ల క్రితం కె. గీత కవయిత్రి గానే పత్రికల ద్వారా పరిచయం! తర్వాత డా కె గీత కావడం మాత్రమే కాదు, కథలు, కాలమ్స్, వ్యాసాలు, నవలలు రాయడం, ఇటీవల కాలంలో ‘నెచ్చెలి’ అంతర్జాల పత్రిక సంపాదకత్వం, దానికి ముందే తెలుగుకు కంప్యూటర్ పరిజ్ఞానంతో ముడి వేయడం, ఇవన్నీ కాకుండా గాయని గా, యాంకర్ గా రాణించడం… ముందుగా ఈ విషయాలు గుర్తుకొస్తున్నాయి. రచయిత్రి కె వరలక్ష్మి గారి అమ్మాయి అని ఈ మధ్యే తెలిసింది.
డిసెంబర్ మూడో వారంలో డా కె గీత గారు పంపిన ఈ 460 పేజీల నవల ‘ వెనుతిరగని వెన్నెల’ గతంలో 2015 నుంచి 2020 దాకా 72 మాసాల పాటు ‘కౌముది’ అంతర్జాల మాస పత్రికలో ధారావాహికంగా వెలువడింది.
2021 సెప్టెంబర్ లో వంగూరి ఫౌండేషన్ ప్రచురించిన ఈ నవలలో మంచి వస్తువు, బిగువైన శైలి, జీవిత పరిశీలన, విశ్లేషణల తో పాటు సాంస్కృతికంగా కుదుపులకు గురవుతున్న తరపు చిత్రణ కనబడుతుంది!
నవల పేరే చాలా అందంగా ఉందీ, ఎంతో హాయిని కల్గిస్తోంది!
చేతికొచ్చిన పుస్తకం-15:
కన్నడ కుసుమాలు – తెలుగు కోమలాలు
కల్లూరి జానకిరామారావు అనువాద కథలసంపుటి
అవును, మీరు నా ‘వేణునాదం’ పుస్తకంలో చదివిన సోషల్ స్టడీస్ క్లబ్ జానకిరాం గారు వీరే! నేను ఎంతగానో ఇష్టపడే మా టీచర్ అనువదించిన 17 కన్నడ కథలివి. వీరిలో మనం గౌరవించాల్సిన విషయం ఏమిటంటే డెబ్బై దాటాక ఈ అనువాద కృషిలో దిగి విజయం సాధించడం.
సరిహద్దు ప్రాంతంలో ఉన్న సౌలభ్యాన్ని గమనించిన వారు రెండు భాషల్లో పట్టు సాధిస్తారు. బెంగళూరు లో విశ్రాంత జీవితాన్ని పిల్లలతో గడుపుతూ కన్నడం కథాసాహిత్యపు కుసుమాలను తెలుగు వారికి గతదశాబ్ధమంతా వివిధ తెలుగు పత్రికల ద్వారా ఆఘ్రాణింప చేశారు.
ఒక రచయిత్రివే మూడు కథలున్నాయి, అంటే అనువాదకులు విస్తృతంగా చదువుతున్నారనీ, వైవిధ్యాన్ని ఇష్ట పడతారని గమనించవచ్చు. ఒకే రచయిత సంపుటి కన్నా ఇలా ఎంపిక చేసుకోవడంతో మరో ప్రయోజనం కూడా ఉంది. పబ్లిక్ రిలేషన్స్ తో వర్ధిల్లే సాహిత్య లోకంలో ఇలాంటి ప్రయత్నాలు తక్కువే ఉంటాయి. కనుక బహు కారణాలతో కల్లూరి జానకిరామారావు అభినందనీయులు! వీరి తెలుగు కథ కూడా ఇందులో ఉంది!
మరికొన్ని వచ్చే సంచికలో…..
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾
గీత గురించి, తన నవల గురించి చాలా బాగా రాసారు. మీరు గ్రూప్ లో పెట్టినప్పుడే చదివేను. Thanks alot వేణుగోపాల్ గారూ!