13_006 మందాకిని – ఆత్మానాం మానుషం మన్యే రామం దశరధాత్మజమ్

 

రావణవధ జరిగిన తర్వాత వచ్చిన దేవతలండరు తనకు జేజేలు పలుకుతున్నపుడు రాముడు తన గురించి తాను చెప్పిన మాటలు అవి.

“ ఒక రాక్షసుడిని చంపిన నన్ను మీరు దేముడు అంటున్నారు. కానీ నేను మాత్రం నా తండ్రి దశరధ మహారాజుగారి పుత్రుడిగానే భావిస్తున్నాను. నా భార్యని చెరపట్టిన వానిని హతమార్చి నా కర్తవ్యం నిర్వర్తించాను ” అని చెప్పిన శ్రీరాముని మించిన ఉత్తమ మానవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా పుట్టలేదు… పుట్టబోడు అన్నది జగద్వితం.

నీలమేఘ శ్యాముడిగా పిలవబడే రాముడు అందగాడు, ఆజానుబాహుడు, అజాత శత్రువు మరియు అందరివాడు. సీతాదేవిని నందనవనంలో చూసిన తొలిచూపులోనే వలచిన వాడు. ఆమె కూడా అతని మోములో ఉన్న తేజస్సు, కళ్ళలో కాంతి, పెదవులపై చిరునవ్వు చూసి ఆయన్ని ఇష్టపడింది. ఆ విషయం ఆయనకి అర్థమైంది. అంతమాత్రాన యువరాజుగా తన అజమాయిషీ చూపించలేదు. గురువు విశ్వామిత్రుడు చెప్పిన విధంగా పాటించి శివధనస్సు విరిచి స్వయంవరంలో నెగ్గి ఆమెను తన ఆలిని చేసుకొన్నాడు. ప్రేమించడం ఒక్కటే కాదు. అందుకోసం ఎంత కషమైన ఎదురొడ్డి, తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళ అభీష్టం మేరకే తన వివాహం జరిగేలా చేసి తరతరాలకి ఆదర్శం ఆయాడు.

తెల్లవారితే రాజు కావల్సిన సమయంలో తండ్రి కోరాడని వనవాసానికి వెళ్ళాడు. రాజ్యం, అధికారం, ధనంలాంటివి తాత్కాలికం అని, మాటమీద నిలబడడం, తల్లిదండ్రులకోసం వారిచ్చే ఆస్తులు కూడా వదులుకోవడం లాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఉత్తములని ఛాతీ చెప్పాడు. ఆస్తులకోసం, వాటిలో వాటాల కోసం తల్లిదండ్రులను, తోబుట్టువులను వదులుకునే ఈ రోజుల్లో వీళ్ళని, వీళ్ళ ఆనందాన్ని మించిన ఆస్తులు, ఐశ్వర్యాలు ఇంకొకటి లేవని చూపించి, ఆచరించిన రాముని మించిన దైవం ఎక్కడా ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

సోదరుడి భార్యని చెరపట్టి రాజ్యాన్ని ఆక్రమించుకొన్న వాలిని చాటుమాటుగా, తన భార్యని చెరబట్టి దేవతలని సైతం ముప్పుతిప్పలు పెట్టిన రావణుని విభీషణుడి సలహాతో నాభికి ఎక్కుపెట్టి హతమార్చి దుష్టశిక్షణ అంటే ఎదురుగా తలపాదడమే కాదు వారి వారి పాపాలని, తప్పులని పట్టి వారిని శిక్షించే విధానం కూడా ఉండాలి అని తెలిపాడు. శిష్టరక్షణ కోసం దుష్టసంహారం చేయక తప్పదని నిరూపించాడు.

కొనఊపిరిలో వున్న రావణాసురుని దగ్గరకు లక్ష్మణుని పంపి తన దగ్గర ధర్మసూత్రాలు నేర్చుకుని రమ్మని చెప్పాడు. తద్వారా మన శత్రువైనా అతడిలో వున్న గొప్ప లక్షణాలని ఆకళింపు చేసుకోవాలన్నాడు.

లోకనింద రాకుండా సీతని అగ్నిప్రవేశ పరీక్ష చేసి ఆమె శీలవతి అని నిరూపించి అందరి నోళ్ళు మూయించాడు. తన ప్రేమ ఛాతీ చెప్పాడు. ప్రేమంటే మనం ఎదురుగా వున్నపుడు ఒకలాగా, లేనప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడం కాదు. ఎటువంటి సందర్భాలలో అయినా సరే నమ్మినవాళ్ళకి అండగా వుండాలి అని తెలిపాడు. ఎటువంటి సందర్భాలలో అయినా సరే నమ్మిన వాళ్ళకి అండగా వుండాలి అని తెలిపాడు. భర్త అంటే అండగా వుండాలి. ఎవరు ఏమన్నా తన ఆలిపై తనకి నమ్మకం వుండాలి. తనపై మాట రానివ్వకుండా చూసుకోవాలి. తనకోసం అవుసరం అయితే యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా వుండాలి. వెనుకడుగు వెయ్యకూడదు. తనలో ధైర్యం నింపాలి. అది రామునిలో అడుగడుగునా వుంది. రాజు అయి వుండి అపహరింపబడిన సీతకోసం వెతకాల్సిన అవుసరం లేకపోయినా, యుద్ధం చేయాల్సిన వచ్చినా, ఏడాది తర్వాత కలిసిన తనని ఏలుకోవాల్సిన అవుసరం లేకపోయినా, మోహించి మారువేషంలో వచ్చిన శూర్పణఖకి బుద్ధి చెప్పి పంపాల్సిన అవుసరం లేకపోయినా ఆయన ఎప్పుడూ పక్కదారి పట్టలేదు. భార్యంటే బరువు కాదు భాధ్యత అని నిరూపించాడు. ఏకపత్నీ వ్రతుడిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించాడు.

మృదుస్వభావి, లేతమనసున్న ఆయన, యువకుడిగా ప్రేమను గెలిచాడు. భర్తగా భార్యని గెలిచాడు. కొడుకుగా తండ్రి కోరిక నెరవేర్చాడు. అన్నగా తమ్ముళ్ళకి రాజ్యాన్ని ఇచ్చాడు. చివరికి రాజుగా ప్రజల సంక్షేమం కోసం, వంశగౌరవం నిలబెట్టడం కోసం తన ఆరోప్రాణం అయిన సీతనే అడవులకి పంపి గొప్ప రాజుగా క్షత్రియ ధర్మం నిలిపాడు. సీత లేని ఎడబాటు భరిస్తూనే రాజ్యపాలన నిర్వర్తించాడు తప్ప ఇంకో పడతి వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉన్నపుడు సొంత ప్రయోజనాల కంటే విధి నిర్వహణే ముఖ్యం అని ఎలుగెత్తి చెప్పాడు.

దేముడు అంటే మాయలు చేసేవాడు, కోరికలు తీర్చేవాడు కాదు. నిజాయితీగా వుంటూ, తలిదండ్రుల్ని గౌరవిస్తూ, తోబుట్టువులని ఆదరిస్తూ, కట్టుకొన్న దాన్ని ప్రేమిస్తూ, పిల్లల ఆలనా పాలనా చూస్తూ సమాజానికి తగినంత మంచి చేస్తున్నవాడు అని యుగాలు గుర్తుండిపోయేలా తెలియజేశాడు.

“ దైవం మానుష రూపేణ ” అను దానికి నిలువెత్తుని దర్శనం మన శ్రీరాముడు.

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page