.
అనుక్షణికం లో కథ కానీ, కనీసం కథావస్తువు కానీ ఇదమిద్ధం గా ఉండవు. అనేకమంది వ్యక్తిత్వాల ఆవిష్కరణ, అనేక అంతరంగాల మధనం, జీవితం, జీవన గమనం, జీవిత గమ్యం పట్ల భిన్న వ్యక్తిత్వాలు, తరచుగా మార్పు చెందే భిన్నాభిప్రాయాలు…. మళ్ళీ ఈ విషయాలు అన్నీ వారి కుటుంబ, ఆర్థిక, ప్రాంతీయ, నేపధ్యాన్ని అనుసరించి ఉంటాయి. పాఠకుడికి జయింట్ వీల్ స్వారీ చేసిన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక పాత్రలో తనను తాను చూసుకుంటాడు.
.
పాత్రలు, తమ సంభాషణల సందర్భాల్లో వాడే మాటలు, వ్యక్తపరిచే భావాలూ, మరీ ముఖ్యంగా శారీరక సంబంధాల కి సంబంధించిన సంభాషణలు పాఠకులకి అతిగా, ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కానీ ” హమామ్ మే సబ్ నంగే ” అన్న సామెత నిజమే కదా ! ఇంకో విషయం ఏమిటంటే ఇలా ఇబ్బంది పడ్డాము అనుకునే వారికి, ఇటువంటి విషయాలు వివరించవలసిన సందర్బం వస్తే వారూ ఇలాగే మాట్లాడటం మనకు అనుభవమే.
.
విషయం వివరించే సందర్బంలో రచయిత భాషకి పరిమితులు ఉండకూడదు. భాష లోని భావాన్ని పట్టుకోవడం పాఠకుడి విజ్ఞత. పాత్రల, జీవన సరళి, విద్యాగంధం, వ్యక్తిగత సంస్కారం మొదలైనవి అనుసరించి వారి భావ ప్రకటన ఉంటుంది. పాత్రల సంభాషణ విషయంలో ఈ పరిమితులకు లోబడి రచయిత కలం సాగించాలి. ఈ రకంగా రచయిత ని పాత్రలు శాసిస్తాయి.
.
మొత్తానికి ఒక పెద్ద కాన్వాస్ మీద, చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన అర్ధం అయినట్టూ, కానట్టూ ఉన్న చిత్రంలా ఉంటుంది అనుక్షణికం.
.
మేకా కుమార వేంకట శ్రీపతి అనే 33 ఏళ్ళ నూజివీడు ప్రాంతపు జమీన్ దారీ వంశస్తుడూ, ఉస్మానియా విశ్వ విద్యాలయ శాశ్వత విద్యార్థి, లా కళాశాల మెట్ల మీద నిలబడి కుడి చేతి చూపుడు వేలు తో కింది పెదవిని రుద్దకుంటూ, ఏదో అలోచిస్తూ పరిసరాల్ని పరధ్యాన్నంగా అవలోకిస్తుండగా మొదలైన అనుక్షణికం, మళ్ళీ శ్రీపతి అదే కాలేజీ మెట్ల మీద అదే అవస్థలో ఉండగా ముగుస్తుంది. మొదలుకీ ముగింపుకీ మధ్య ఒక దశాబ్దపు కాలగమనం ఉంటుంది.
శ్రీపతిది దేవతల వయసు. ఎప్పుడూ 33 ఏళ్ళే. మూడు నాలుగు పీ. జీ. లూ, ఒక పి. హెచ్. డి. పూర్తిచేసిన మెరిటోరియస్ విద్యార్ది. తండ్రి లేడు. జమీన్ దారీ లెక్కలు అన్నీ వంశ పారంపర్య మేనేజర్ లకి అప్పగించి, తల్లిగారిని వాళ్ళ సంరక్షణలోనే ఉంచి, తన ప్రతిభ ఆధారంగా యూనివర్సిటీ వారు ఇచ్చిన లెక్చరర్ ఉద్యోగాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించి విద్యార్థిగానే ఉండిపోతాడు. అలా అని చదువంటే ఆసక్తి అనీ కాదు. ప్రస్తుతం లా చదువుతూ ఉన్నాడు. తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోడు.
.
శ్రీపతి ఎప్పటికీ విద్యార్థిగానే ఉంటాడు. వ్యక్తిత్వం తాత్వికం, ప్రవృతి తార్కికం. కుక్కనీ, పండితుణ్ణి సమాన దృష్టితో చూసే స్వభావం. తామరాకు నీటి బొట్టును అంటించుకోనట్టు, ఏ అనుభవాల ప్రభావం తనకి అంటించుకోడు. ఆలా అని దేన్నీ విడుచుకోడు. అనుక్షణికం పాఠకులకు, రచయిత తరవాత శ్రీపతి గుర్తుండిపోతాడు. అనుక్షణికంలో ఎక్కువ భాగం శ్రీపతి పరంగా ఉంటుంది. శ్రీపతి వివరణ ఎక్కువ భాగం చైతన్య స్రవంతి లోనే సాగుతుంది.
.
ఎక్కువ మందికి జీవిత యాత్ర కొయ్య గుఱ్ఱపు స్వారీ…..రజ్జు సర్ప భ్రాంతి…ఎక్కడ వేసిన గొంగళి అక్కడే…”హమ్ క్యాకహే.. ఆహ్ తాబోన్ నే క్యా నుమాయిష్ కర్ గయే హై… బి. ఏ. కియీ నౌకరీ హుయీ… పెన్షన్ లియీ… ఫిర్ మర్గయీ ” లాంటి మాదిరి.
.
అంతరంగం లోని ఆలోచనలని ఆచరణలో పెట్టడానికి అనేక అడ్డంకులు. అసలు లోపలికి చూసుకోవాలి అంటేనే భయం. ఇందులో ఎక్కువ భాగం స్వయంగా కల్పితాలే. ఎక్కువ మందికి ఆలోచించే అవకాశం దొరకదు. ఆలోచించ గలిగే అవకాశం దొరికిన కొద్దిమందిలో తమ ఆలోచనలను ఆచరణ లో పెట్టే అవకాశం చాలా తక్కువ మందికి లభిస్తుంది. ఈ తక్కువమందిలో శ్రీపతి ఒకడు.
.
పరిమితులతో జీవితాన్ని గడిపేసి, పైవాడి దయ ఇంతే అనో, ఇంతకన్నా ఇంకేం చేయగలం అనో అనుకునే వారు కొందరు, అంతా బాగానే జరిగింది ఇంతకన్నా ఇంకేం కావాలి అనుకునే వారు కొందరూ….ఇలా ఉంటారు.
.
అసలు సంగతి ఏమిటీ అంటే జీవితంలో జయాపజయాలను, కష్టసుఖాలనూ, సుఖదుఃఖాలనూ నిర్ణయించి నిర్దేశం చేసేది ఎవరూ ? అవి మనకి రావాలి అనుకున్నా, రాకుండా ఉండాలి అనుకున్నా ఏమి చేయాలి ? లేక ఏమి చేయకూడదు ? అనే విషయం ఎవరికీ తెలవదు.
.
ఆయువు ఉన్నంత కాలం జీవించి ఉండాలి. వేరే దారి లేదు. జీవించి ఉన్నంత కాలం బ్రతుకూ, బ్రతుకు తెరువూ, లోపలా, బయటా సంఘర్షణా తప్పవు. ” ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది, నిక్కము నే నమ్మితి నీ చిత్తంబికనూ ” అని అనుకునే ధైర్యం అందరికీ ఉండదు.
.
శ్రీపతి తప్ప మిగతా పాత్రలు అన్నీ ఈ కోవలోకే వస్తాయి. వీరిలో మనం కూడా ఉంటాము. ఒక్కక్కరిదీ ఒక్కో కథ. అందులో మెదటిది M. Sc. జియాలజీ Phd మెరిట్ స్కాలర్, గిటార్ విద్వాంసుడూ, స్ఫురద్రూపి అనంతరెడ్డీ, అతని జూనియర్ స్వప్న రాగలీనా ప్రేమలో పడతారు. ఇద్దరూ రాయలసీమ వారే. శ్రీపతికి సన్నిహితులే. అనంతరెడ్డిది ఉరవకొండ ప్రాంతం ఆస్థిపరుల కుటుంబం. తండ్రీ, పెదతండ్రులు పెద్ద ఉద్యోగస్తులు.
.
స్వప్న రాగలీన అసాధారణ సౌందర్యవతి. కోటీశ్వరుల కుటుంబం. తండ్రీ, పినతండ్రుల ఆస్తికి ఏకైక వారసురాలు. చదువుకునే రోజుల్లోనే ఖరీదైన కారూ, డ్రైవరూ, బంగళా, వంటమనిషీ, నౌకర్లు.
.
వివాహనికి అడ్డంకులేమీ ఉండవు. అనంతరెడ్డి విదేశాల్లో పై చదువులు ముగించుకుని ఓయూ లోనే ప్రొఫెసర్ అవుతాడు.
.
వైభవంగా జరిగిన పెళ్లికి శ్రీపతి వెడతాడు. తన కాళ్ళకి దండం పెట్టిన దంపతులకు, జేబులో ఉన్న నోట్లు కాకుండా, తన వేళ్ళకి ఉన్న ఖరీదైన ఉంగరాలు తొడుగుతాడు.
.
భార్యపై ఉన్న విపరీతమైన ఆరాధనా భావం వలన అనంతరెడ్డి శృంగారంలో విఫలుడవుతాడు. అనేక వైద్యాల అనంతరం వైవాహిక జీవితం ప్రారంభించి, జయించిన మొదటి రాత్రే, ఆ ఉద్వేగపు సాంద్రతని తట్టుకోలేని స్వప్న రాగలీన ప్రాణం విడుస్తుంది. మతి చలించిన అనంతరెడ్డి జీవితం ఎర్రగడ్డ ఆసుపత్రి లోని గొలుసులకు శాశ్వతంగా బందీ అవుతుంది.
.
పీహెచ్‌డి పూర్తి అయిపోయినా ఉద్యోగం రాక ప్రొఫెసర్ గారి దయతో ఇంకో ఏడాదిపాటు పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ సౌకర్యం పొంది, నిరాశావాదం లో కూరుకుని ” ఇది వితంతువులకిచ్చే మనోవర్తి లాంటిది. కొంతకాలం సాగాక ఇహ లాభం లేదని వైకుంఠ యాత్ర కి నోట్లో ఒక మాత్ర వేసి పైకి పంపినట్టు మన్నీ తన్ని తగలేస్తారు ” అని తనను తాను చమత్కరించుకునే పప్పు వరాహ శాస్త్రి, అతని అవిటి చెల్లెలు చారుమతి, అడివిలో అగ్గి రాజేయడానికి వెళ్లి సహచరుల వెన్నుపోటుతో పోలీసుల కుతంత్రాలకు బలైన MA చదివే మోహన్ రెడ్డి, కడుపులోని చిన్నారి అరుణతో భర్త ఆశయ సాధన కోసం అడవి బాట పట్టిన అతని సహచరి శొంఠి గాయత్రి, ఆడవాళ్ళ పొందు కోసం సినిమా నిర్మాతగా మారి భ్రష్టు పట్టిన చిత్తకార్తె అంకినీడు, తనని మనసా వాచా ప్రేమించిన మరదలు నళిని, ధనవంతురాలు కనక అహంకారి అనే భ్రమతో ఆమెని తిరస్కరించి విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రి గా ఎదిగి అది కోల్పోయే సందర్బంలో, మరదలు నళిని సహాయం కోరిన మధ్య తరగతి రవి, ఇలా అనేక జీవితాల సంక్షిప్త పరిచయం…..
( 2వ భాగం సమాప్తం )
—(0)—