12_011 అడగాలని ఉంది

ఒళ్ళు కాలిన సుందరిని ఐ.సి.యు. లో ఉంచి, డాక్టర్లు మందులు వాడుతున్నారు. సుందరిని ఆస్పత్రి లో చేర్పించిన వాళ్ళు వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే సుందరి తల్లిదండ్రులు వచ్చారు. సుందరికి ఏమయ్యింది అని అక్కడ ఉన్న వారిని అడిగారు.

      అందరిలో వయసులో పెద్దామె రమణమ్మ గారు “ మీ అల్లుడు సరియైనవాడు కాడు. నిన్న సాయంత్రం ఊరినుండి వచ్చాడు. అతను వచ్చాక కొద్దిసేపటికి సుందరి స్కూలు నుండి వచ్చింది. ఇంతసేపు స్కూల్లో ఏమి చేస్తున్నావు అని సుందరిని తిట్టాడు. పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే ఆలస్యం అయ్యింది అంటూ సుందరి గదిలోకి వెళ్ళింది. అంతే.మీ అల్లుడు తలుపు మూశాడు. పక్క పోర్షన్ లో ఉన్న మగవాళ్ళతో సంబంధం పెట్టుకుందని రాత్రంతా సుందరిని తిట్టాడు.

      నిజం చెప్పాలంటే పక్క పోర్షన్ లో ఉన్న మగవాళ్లు, సుందరిని అక్కా! అని పిలుస్తారు. సుందరి బాగా చదువుకుని ఉద్యోగం చేస్తోందని మా ఇంట్లో అందరం గౌరవిస్తాం. నేను సుందరి పక్క పోర్షన్ లో ఉన్నాను.

      వాళ్ళు తలుపులు మూసుకున్నా వెంటిలేటర్స్ నుండి వాళ్ళ మాటలు వినిపిస్తాయి. సుందరి ఉదయం లేచి వంట ముగించి స్కూలుకు వెళుతుంటే, మరల తిట్ల దండకం మొదలు పెట్టాడు మీ అల్లుడు. అతని మాటలకు విసిగి వేసారి పోయిన సుందరి వంటి మీద కిరసనాయిలు పోసుకుని నిప్పంటించుకుని తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది.

      ఈ రభస అంతా వింటూ, మా నాలుగు పోర్షన్ల  వాళ్ళం వరండాలోకి వచ్చాం. అందరూ సుందరిని పట్టుకుని నిప్పును ఆర్పారు. ఆ సమయంలో మీ అల్లుడు బయటకు పోయాడు. ఆ పోర్షనుకు నేనే తాళం పెట్టాను. ఇంటి ఓనరు కారులో సుందరిని తీసుకు వచ్చి ఆస్పత్రిలో చేర్చారు. నేనూ వాళ్ళతో వచ్చాను. ” అని జరిగిన సంఘటను వివరిస్తూ….. 

      “ మీ అల్లుడు అసలు మగాడు కాదేమోనని నా అనుమానం. సరిఅయిన మగాడు అయితే ఎక్కడో దూరాన ఉద్యోగం చేసేవాడు సెలవు పెట్టీ భార్య దగ్గరకు వచ్చి, భార్యతో ఆనందంగా గడుపుతాడు కాని ఈ విధంగా ప్రవర్తించడు ” అంది.

అప్పుడే అక్కడకు వచ్చిన సుందరి కొలీగ్ నీరజ… “ మీరు చెప్పింది నిజమే మామ్మ గారూ ! అతనికి మగతనం సరిగా లేదని సుందరి నాతో చెప్పింది. అత్తగారికి సుందరి ఆ విషయం చెపితే…పెళ్లి చేసుకున్నాక సర్దుకుపోవాలి అని చెప్పిందట

      అలాంటి నీచుడితో ఎంతకాలం భరించగలదు ? అందుకే తెలివి తక్కువగా బ్రతుకే అంతం చేసుకుందామనుకుంది ” అంది. సుందరి తండ్రి వైపు చూసి “ మీ అల్లుడికి విడాకులు ఇప్పించి, సుందరికి మళ్లీ పెళ్లి చేయండి బాబాయి గారూ ! ” అంది.

      “ ఏమిటీ, మళ్లీ పెళ్లా? సుందరికి మళ్లీ పెళ్లి చేస్తే సమాజంలో మాకు ఎంత అప్రతిష్ఠ? మా పరువు మర్యాదలు ఏం కావాలి? ” అంది సుందరి తల్లి.

      వెంటనే రమణమ్మ గారు “ సమాజం అంటే ఏమిటి? మనలాంటి వాళ్ళమే గదా సమాజం అంటే. సాటి ఆడదానిగా నేను కూడా మీ అమ్మాయికి మళ్లీ పెళ్లి చేయమనే చెపుతాను. అందరు ఆడవాళ్ళ లాగా సుందరికీ భర్తతో దాంపత్య జీవితం గడపాలని ఉంటుంది గదా? అర్థం చేసుకోండి ” అంది.

      సుందరి తండ్రి రమణమ్మ గారి వైపు చూసి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి, “ మీరు మంచి సలహా ఇచ్చారు. తప్పకుండా మీ సలహా పాటిస్తాను ” అన్నారు.

* .     *.     *.       *

      వారం రోజులు గడిచాయి. “ ఎందుకు సుందరీ ఇంత పిచ్చి పని చేసావు? వళ్ళు కాల్చుకోవడమేమిటి? ఎం. ఏ.,బి.ఇడి, చదివి హైస్కూల్లో టీచరుగా ఉద్యోగం చేస్తూ … నీవు చేయవలసిన పని ఇదా? ” అంది నీరజ.

      “ ఏం చేయమంటావు నీరజా! అమ్మకు ఎన్నోసార్లు నా భర్త శ్రీకర్ ప్రవర్తన గురించి చెప్పాను. శ్రీకర్ మా అమ్మకు అన్న కొడుకు. అందుకే సర్డుకు పొమ్మని సలహా చెపుతుంది. శ్రీకర్ కు మగతనం తక్కువగా ఉండడం ఒకటే కాదు. శాడిస్ట్ కూడా ! ఈ సంఘటన జరిగే ముందు రోజు సాయంకాలం ఊరి నుండి వచ్చాడు. నేను స్కూలు నుండి రావడం ఆలస్యం అయ్యింది అని తిట్టాడు. నిదానంగా నేను నవ్వుతూ చెప్పిన సమాధానం విని మెత్తబడ్డాడు. నా కోసం తెచ్చినవి ఇచ్చాడు. ఇద్దరం స్వీట్స్ తిన్నాం. నాకు తెచ్చిన చీర చూపించి బావుందా? అన్నాడు. చాలా బావుంది. రంగు కొంచెం డల్ గా ఉందని చెప్పి వంట గదిలోకి వెళ్ళాను. వచ్చి చూస్తే, అతని చేతిలో కత్తెర ఉంది. చీర ముక్కలు చేసి పెట్టాడు.

      ఇదేమిటి? ఎందుకు చీరను ఇలా పాడుచేసారంటే…నేను తెచ్చిన చీర నీకు నచ్చలేదన్నావు. అందుకే దాన్ని ముక్కలు చేశాను. నేను ఏం చేసినా నీకు నచ్చదు. నాతో సరిగా మాట్లాడవు. మన పక్క పోర్షన్లో ఉన్న మగాళ్లతో నీవు సంబంధాలు పెట్టుకుని వారితో కులుకుతూ మాట్లాడతావు అన్నాడు. అలాంటి పాపపు మాటలు  మాట్లాడకండి. వాళ్ళు నన్ను అక్కా! అంటూ ఎంతో గౌరవిస్తారు అన్నాను. నీ సంగతి నాకు తెలియదా? అని నన్ను బూతులు తిట్టాడు. నా శరీరాన్ని ఎంతో హింసిం చాడు. అతనితో కలిసి బ్రతకడం అసంభవమని నేను నిర్ణయించుకున్నాను.

      తర్వాత రోజు ఉదయము నేను స్కూలుకు బయల్దేరుతుంటే…ఇంత షోకుగా వెళుతున్నావు? స్కూల్లో నీకు ఎంతమంది ప్రియులున్నారు? అన్నాడు. ఇక తట్టుకోలేక ఆ మాటలు భరించలేక, వంట గదిలోకి వెళ్ళాను. కిరసనాయిలు వంటి మీద పోసుకొని, నిప్పంటించుకుని ..గది తలుపులు తీసి వరండాలోకి వచ్చాను. ఆ తర్వాత జరిగినది నీకు తెలుసు గదా నీరజా! జీవితాన్ని గురించి ఏదేదో వూహించుకుంటాం. నాలాంటి దురదృష్టవంతులకు జీవితంలో అనుకోని కష్టాలు ఎదురౌతాయి. ఆ క్షణంలో ఆవేశంలో ఏం చేస్తామో మాకే తెలియదు ” అని వివరించింది సుందరి.

      “ హైస్కూల్లో టీచరుగా ఉద్యోగం చేస్తూ…దుర్మార్గుడైన భర్తతో వేగలేక, నీవు ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం నాకు నచ్చలేదు సుందరీ…నీ భర్తకు విడాకులిచ్చి, నీ బ్రతుకు నీవు బ్రతకాలి. ఏ స్త్రీ కూడా నీలాగా చేయకూడదు. నా స్నేహితురాలు శ్యామల  బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారికి ఒక కొడుకు. పేరు నవీన్. శ్యామల భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు. శ్యామల తల్లిదండ్రుల అండతో కొడుకును పెంచుకుంటూ ఉండిపోయింది. శ్యామల  బాంక్ లో పని చేసే నారాయణ శ్యామలను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. శ్యామల ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది.

      నీకు పిల్లలు కూడా లేరు. నీవుచాలా అందంగా ఉంటావు. నా మాట విని ఇతనికి విడాకులు ఇచ్చేసేయ్యి. నిన్ను నీ ఉద్యోగాన్ని చూసి, నీ గుణ గణాలను మెచ్చి, ఎవరైనా పెళ్లి చేసుకుంటానని వస్తె…తప్పకుండా పెళ్లి చేసుకో సుందరీ ! ” అంది నీరజ.

* .   *.   *.   *

      సుందరికి విడాకులు వచ్చాయి. భర్త దాష్టీకం నుంచి విముక్తి లభించింది. ఆమెకు తండ్రి మళ్లీ పెళ్లి చేయాలని ప్రయత్నించారు. కానీ బంధువుల్లో తమ పరువు పోతుందని ఆమె తల్లి ఒప్పుకోలేదు. దాంతో ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఆమె అక్క, అన్న .. హాయిగా పెళ్ళిళ్ళు చేసుకుని  పిల్లలతో ఆనందంగా ఉన్నారు.

      అన్యోన్యంగా ఉన్న జంటలను చూసినప్పుడు, కాసేపు ఆమె మనసు బాధతో నిండి పోతుంది. ఏం పాపం చేశానని దేవుడు ఇలాంటి శిక్ష విధించాడో?…ఎప్పుడైనా ఆమెకు ఆ దేవుడు కనపడితే, ఆయననే అడగాలని ఉంది.

****************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page