13_003 నవవిధ భక్తి మార్గం

 

భక్తి సోపానాలు

భగవంతుడిపై చూపే ప్రేమకే ‘ భక్తి ’ అని పేరు. దేవుడితో బంధం ఏర్పడేది బాహ్య క్రియలతో కాదు, మలినం లేని భక్తితోనే అని పురాణాలు చెబుతున్నాయి. భక్తుడు భగవంతుని చేరేందుకు ఉపయోగపడే సూత్రాలు పదకొండింటిని నారదుడు ఉపదేశించగా తదనంతరం అవి తొమ్మిదిగా క్రోడీకృతమయ్యాయి.

స్మరణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అన్నవి నవవిధ భక్తి సోపానాలు. ఒకదానితో ఒకటి ముడిపడి ఉండి ఒకస్థాయి నుంచి మరొకస్థాయికి దారి తీస్తూ ఉంటాయి. నిజానికి ఇవి భక్తి మార్గాలు కావు. భక్తికి తొమ్మిది మెట్లు లేక తొమ్మిది లక్షణాలుగా వేదవ్యాసుడు పేర్కొన్నారని ప్రముఖ సంగీత శాస్త్ర నిపుణుడు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు అంటారు. దక్షిణాది సంగీత చరిత్రను చూస్తే…. తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై నవవిధ భక్తిని ఎన్నో కృతులు, సంకీర్తనల్లో ప్రకటించి భక్తికి సంబంధించిన అనేక పార్శ్వాలను వివరించిన అరుదైన వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి. నృత్యం, నాటకం వంటి భారతీయ ప్రదర్శనా కళలకు ఇతిహాసాలు, ప్రకృతి సౌందర్యమే ఆధారం కనుక అవి నవవిధ భక్తిని అడుగడుగునా కలిగి ఉంటాయి.

శ్రవణం

ఎవరికైనా భక్తి ‘ శ్రవణం ’ అంటే వినడం తోనే ప్రారంభమవుతుంది. ప్రేమించదగిన గుణాలను, క్రియలను చూస్తుంటే ప్రేమ భావన అదే కలిగినట్లు భగవంతుని సుగుణాలు, లీల, మహిమ మనసుకు చెబుతూ ఉంటే భక్తి అదే ఉదయిస్తుంది. ‘ శ్రవణం ’ అంటే భగవత్కథా శ్రవణం. ఇది పండితుల నుంచి కాక భక్తుడి హృదయం నుంచి, భక్తుడి దృష్టితో వినాలి. వినే కొద్దీ ఎదుగుతూ వస్తుంది. ఎదిగిన కొద్దీ పరిణితి చెందుతుంది. కీర్తనం, స్మరణం తదితర లక్షణాల మీదుగా ప్రయాణించి చివరికి ఆత్మ నివేదనంగా పరిణమిస్తుంది.

ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారద మహర్షి నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తారు. బాల భక్తుడిగా పుట్టుకతోనే విష్ణువుకు ఆత్మను నివేదిస్తాడు ప్రహ్లాదుడు. కీర్తనం, స్మరణం, వందనం తదితర లక్షణాలను ఎప్పుడూ కలిగే ఉన్నాడు. అయినా తల్లి గర్భంలో ఉండగా విన్న నామమే అతని భక్తికి ఆధారమైంది కాబట్టి ‘ శ్రవణ ’ భక్తికి ఉత్తమ ఉదాహరణగా నిలిచాడు. శాపవశాత్తూ ఏడు రోజుల్లోనే సంపూర్ణ భక్తిలో భాగవత కథా శ్రవణం చేసి ముక్తిపొందిన పరీక్షిత్తు కూడా శ్రవణానికి చక్కటి ఉదాహరణ.

త్యాగరాజ వైభవం :  ‘ సుధా మధుర భాషణ ’ ( సింధురామక్రియ రాగం ) అన్న కృతిలో ‘ కథామృతముచే బహుకాలము ఆకలి తీరియున్నాను ’ అంటూ సంతృప్తిని వ్యక్తం చేస్తారు త్యాగయ్య. ‘ రామ కథా సుధారస పానం ’ ( మధ్యమావతి ) అన్న మరో కృతిలో శ్రవణం గొప్పదనాన్ని తెలుపుతారు. పరమాత్ముడి రూప గుణ విశేషాలు వినడం ద్వారా మోక్షాన్ని పొందేందుకు ఉపకరించే సాధనం శ్రవణమని పలు కృతులు, కీర్తనల్లో వివరించారు.

అర్చనం

పరమాత్మునిపై ప్రేమను వెల్లడించడం ద్వారా మనఃశుద్ధి పొందడమే అర్చన భక్తి ఉద్దేశం. విగ్రహారాధనలో దేవతామూర్తులకు, ఊహాచిత్రాలకు చేసే షోడశోపచారాలు, అర్చనలు అర్చన భక్తిలోనివే. వేళ్ళకు నీరందిస్తే చెట్టులోని భాగాలన్నీ నీటిని అందుకున్నట్లు ఒక్క పరమాత్మను పూజిస్తే విశ్వమంతా శాంతినిస్తుందన్న విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నదే అర్చన సేవ.

రాముడి రాకకోసం ఎంతోకాలం ఎదురు చూసింది శబరి. ఆ కాలమంతా ఆశ్రమాన్ని శుభ్రపరచి అందమైన పూలు చల్లడం ద్వారా రోజూ స్వాగతానికి ఏర్పాట్లు చేసింది. అర్చన కి ఉత్తమ ఉదాహరణగా నిలిచింది.

త్యాగరాజ వైభవం అర్చన భక్తికి త్యాగరాజ ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఉత్తమ ఉదాహరణలు. ఇష్టదైవాన్ని నిద్రలేపడం మొదలుకుని రాత్రి నిద్ర పుచ్చేవరకు చేసే ఉపచారాలు, అలంకారాలు ‘ అర్చనం ’ కోవకే వస్తాయి. ఉదయాన్నే ‘మేలుకోవయ్య’ ( బౌళి ), హరతిచ్చే సమయంలో ‘శోభనే’ ( పంతువరాళి ), అలంకరించే సమయంలో ‘ గంధము పుయ్యరుగా ’ ( పున్నాగవరాళి ), చల్లరే రామచంద్రునిపై పూలు ’ ( ఆహ్రీ ), నిద్రపుచ్చే వేళలో ‘ ఉయ్యాలలూగవయ్యా ’ ( నీలాంబరి ) వంటి ఆహ్లాదకరమైన కీర్తనలే ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు. ఈ ఉపచారాల క్రమంలో స్నానానికి ముందు నలుగు పెట్టే సందర్భానికి కూడా ‘ నగుమోము గలవాని నా మనోహరుని ’ ( మధ్యమావతి ) అంటూ ఒక కీర్తనను త్యాగరాజ స్వామి కూర్చడం విశేషం.

 

కీర్తనం – అంతులేని ఆనందం

భగవంతుని నామాన్ని, గుణగణాలను కీర్తించడమే కీర్తనం. శ్రవణం ద్వారా ఎదిగిన భక్తితో మనసు నిండిపోగా ఆ ఆనందాన్ని ఉత్సాహంగా వెల్లడించేందుకు, మరింతమందికి పంచేందుకు ఉపకరించే సాధనం సంకీర్తనం. ‘ పరమాత్మ తో ప్రేమలో ఉన్నప్పుడు ఒక్క నామం వినిపించినా అంతులేని ఉల్లాసం కలుగుతుంది ’ అని భక్త రామదాసు పేర్కొన్నారు.

వాగ్గేయకారులందరూ కీర్తనానికి ఉదాహరణలే. సంగీతాన్ని ఆధారం చేసుకుని ఉత్తమ సాహిత్యంలో నవవిధ భక్తిని చాటిచెప్పిన భక్తులే. పాడుతూ తరించినవారే. అన్నమాచార్య, సంగీత త్రిమూర్తులు, వారి శిష్యబృందం, మొదటి మహిళా వాగ్గేయకారిణి కుట్టి కుంజా తంగాచ్చి ( కేరళ ) దక్షిణాదికి చెందిన వాగ్గేయకారులలో కొందరు. తుకారాం తదితర అభంగ్ కర్తలు, మీరాబాయి వంటి భక్తులు తమ సంకీర్తనలతో ఉత్తరాదిన భక్తి ప్రచారం చేశారు. అక్కడి సంగీతాన్ని పరిపుష్టం చేశారు.

త్యాగరాజ వైభవం…

‘ ఇంత సౌఖ్యమని నే చెప్పజాల

ఎంతో ఏమో ఎవరికి తెలుసును ’ ( కాపీ రాగం )

అంటూ భగవంతుడి గుణగణాలను కీర్తించడంలో కలిగే ఆనందాన్ని ప్రకటించారు. త్యాగరాజస్వామి స్వరం, రాగం, లయలతో రామనామమనే కంద చక్కెరను ఆరగించే శివుడికి ఈ ఆనందమెంతటిదో తెలుసని కూడా ఇదే కీర్తనలో అన్నారు. ‘ ఏలావతారంబెత్తితివో ’ ( ముఖారీ ) కృతిలో ‘ వందలకొద్దీ శ్రేష్టమైన రాగ రత్నాలను ( కీర్తనలను ) కూర్చిన త్యాగరాజుకు వరమిచ్చేందుకే నువ్వు అవతారమెత్తావేమో ’ అంటూ రాముడిని ఉద్దేశించి అంటారు. సంకీర్తనతో దేవుడినే భూమి మీదకి రప్పించవచ్చనే నమ్మకాన్ని కలిగించారు.     

 

ఆత్మ నివేదనం

భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలో తన బలంపై నమ్మకం కోల్పోయిన గజేంద్రుడు తనను తాను కాపాడుకునే ప్రయత్నాలను మాని శ్రీహరిని ప్రార్థించాడు. అప్పుడే అతణ్ని పట్టుకున్న మొసలిని సంహరించి గజేంద్రుణ్ణి కాపాడాడు శ్రీహరి. అహంకారం ఉన్న ప్రతి భక్తుడూ మదించిన ఏనుగే. తన బలం మీద నమ్మకం తగ్గి తనకు మించిన బలాన్ని నమ్మడం శరణాగతి…. ఇదే ఆత్మనివేదనం. ఆత్మనివేదనే భక్తికి పరాకాష్ఠ.

“ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ”

అని శరణాగతిని పొందడం ఆత్మ నివేదన. నవవిధ భక్తి సోపానాలలో ఏ ఒక్కదాన్నో, కొన్నింటినో ఆశ్రయించి ఈ స్థాయిని పొందొచ్చు. శ్రవణం నుంచి మొదలు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ పరాకాష్ఠ కు చేరుకోనూ వచ్చు. శరణాగతి కూడా రెండు రకాలు. ‘ మార్జాల కిశోర న్యాయం ’ లో తన పిల్లలను సంరక్షించుకునే పిల్లి ఉదాహరణ. ఇక్కడ తల్లిదే పూర్తి బాధ్యత. తల్లిపై పిల్లలకు విశ్వాసం ఉండటమే కావాల్సింది. దీన్నే ‘ ప్రపత్తి ’ అంటారు. రెండోదైన ‘ మర్కట కిశోర న్యాయం ’ లో పిల్ల కోతి తల్లి కోతిని పట్టుకోవాలి. ఈ విషయంలో పిల్లలకు కొంత బాధ్యత ఉన్నట్లు భక్తులకీ కొంత ఉంటుంది.

ఉదాహరణలు : ఆత్మనివేదనానికి వయసుతో పనిలేదు. పరిణితి మాత్రమే ముఖ్యం. మార్కండేయ, ధృవ, ప్రహ్లాదాది బాలభక్తులందరూ పరమాత్మలో లయించినవారే. మహాభారతంలో గోపికలు సమర్పణ భావానికి ప్రతీకలు. ద్రౌపది శరణాగతి వల్లే కృష్ణుడు ఆమెను ఎన్నో కష్టాలు, సవాళ్ళ నుంచి రక్షించాడు. కురుసభలో మాన సంరక్షణ ఆత్మ నివేదనానికి గొప్ప ఉదాహరణ.

త్యాగరాజ వైభవం : ‘ నిన్ను వినా నా మదెంతో ’ ( నవరస కన్నడ రాగం ) కృతిలో ‘ నా తపము యోగఫలము నీవే త్యాగరాజ సన్నుత ’ అంటూ తపస్సూ రాముడే, తపస్సులో లభించే మోక్షమూ రాముడేనంటూ రెండింటికీ అభేద్యాన్ని అనుభవపూర్వకంగా తెలిపారు. మరో కృతి ‘ నిన్నే నెరనమ్మి నానురా ’ ( పంతువరాళి ) లో వేద పురాణ విద్యలనుపయోగించి వాదనలు పెట్టుకునే వారిని, భోగాల కోసం యాగాలనాచరించే వారిని చూసి చిన్ననాడే తాను రాముడిపై విశ్వాసముంచిన విషయాన్ని రాముడికే నివేదిస్తారు. 

 

వందనం

దేవుడి విషయంలో మనసా వాచా కర్మణా చేసే ప్రతి సేవా వందనమే. వందనమంటే నమస్కారం. వినయానికి ప్రతీక. నమస్కారం చేయడం ద్వారా వినయాన్ని ఇనుమడింపజేసుకుంటాం. అంటే నమస్కారం వల్ల భావం తెలుస్తుంది. ఒకరిని గౌరవించడానికి, ధన్యవాదాలు తెలపడానికి, ప్రార్థించడానికి, సమర్పణ భావాన్ని వెల్లడించడానికి ఉపయోగించేది నమస్కారాన్నే. దేవుడికి, భక్తులకు ఒకరకంగా… స్నేహితులకి ఒక విధంగా, పెద్దవారికి మరో రకంగా, చిన్నవారికి మరోలా నమస్కరిస్తూ ఉంటాం. అందుకే బాహ్యంగా చేసే నమస్కారం అనేక విధాలుగా ఉంటుంది. మనసులో ఆ సమయంలో ఉదయించే భావం కూడా మనం చేసే నమస్కారం పై ప్రభావాన్ని చూపిస్తుంది. నాట్యం వంటి ప్రదర్శనా కళలలో ఇది పలు భంగిమలలో వెల్లడవుతుంది.

త్యాగరాజ వైభవం :  ‘ వందనము రఘునందనా ’ ( శహన రాగం ) అన్న త్యాగరాజ కీర్తన బహుళ ప్రజారణ పొందింది. ఇందులోనే ‘ ఓడను భక్తి వీడను ఒరుల వేడను నీవాడను రామా ’ అని వేడుకుంటూ దండం పెట్టారు. ‘ దండము పెట్టేనురా ’ ( బలహంస ), ‘ నమో నమో రాఘవాయ ’ ( దేశ్యతోడి ) వంటి అనేక వాగ్గేయ సౌరభాలలో త్యాగరాజ స్వామి రాముడికి పదేపదే మొక్కారు. ‘ విధులకు మ్రొక్కెద ’ ( మాయా మాళవ గౌడ ) లో అనేకమంది సద్భక్తులను, సంగీత కోవిదులను ప్రస్తావించి అందరికీ నమస్కరిస్తారు.  

 

పరమపావనం – పాద సేవనం

పరమాత్మ పాదాలను ఆశ్రయించడం, సేవించడం, స్మరించడం… అత్యుత్తమ కైంకర్యాలు. ఏ పాదాల వద్ద గంగ వెలసిందో ఆ పాదద్వయాన్ని సేవించడం ద్వారా భక్తులు తమ మనసుల్లోని మలినాన్ని కడిగేసుకోవచ్చని పురాణాలు ఉద్ఘాటించాయి. వినయంతో చేసే ఆ పాదసేవనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది. అహంకారాన్ని అణగదొక్కే ఈ సేవనం వినయాన్ని కలిగిస్తుంది. ఇన్ని ప్రత్యేకతల కారణంగా మహారాష్ట్రలోని పండరీపురంలో మూలమూర్తుల పాదాలను స్పృశించే అవకాశాన్ని నిత్యం ఎందరో భక్తులు అందిపుచ్చుకుంటుంటారు.

శ్రీరాముడి పాదుకలనే సర్వస్వంగా భావించి పూజించిన భరతుడు, రామపాద స్పర్శ కోసం వేల సంవత్సరాలు తపించిన అహల్య, రామపాదాలను ఆశ్రయించిన గుహుడు, మధురానగరంలో బాలకృష్ణుడిని సేవించిన మాలాకారుడు సుధాముడు పాదసేవనంతో తరించిన వారే. లక్ష్మీదేవి విష్ణువుకు ఆత్మనివేదనం చేసుకున్నా పాలకడలిలో ఎల్లప్పుడూ ఆయన పాదాలను సేవించడంలో పాదసేవనకు ఉదాహరణేనని కొందరు శాస్త్రనిపుణుల అభిప్రాయం.

త్యాగరాజ వైభవం : రామభక్తుడైన త్యాగరాజస్వామి ఎన్నో కృతులు, కీర్తనలలో రామపాదాలను కీర్తిస్తారు, స్మరిస్తారు, వివరిస్తారు. ‘ శ్రీరామ పాదమా నీ కృప చాలునే ’ ( అమృత వాహిన్ రాగం ) అంటూ తరించడానికి రాముడి అనుగ్రహమే ఉండనక్కర్లేదు… రాముడి పాదం తన మీద దయ తలిస్తే చాలునని చెబుతారు. ఇదే కీర్తనలో శూర అహల్యను బ్రోచిన రీతిలో తనను కూడా చరణ స్పర్శ తో అనుగ్రహించమని రామపాదాన్నే వేడుకుంటారు. ‘ రఘునాయక నీ పాదయుగ రాజీవములనే విడజాల ’ ( హంసధ్వని ) అని పాదాలనే ఆశ్రయించారు.

‘ సందేహమును దీర్చుమయ్యా ’ ( రామప్రియ ) కృతిలో నీ మహిమా ? నీ నామ మహిమా ? అని అడిగినట్టు నీ పాదాలు గొప్పా లేక నా పాదుకలు గొప్పా అని రాముడినే ప్రశ్నిస్తారు. ‘ ఘనత చెందిన మునులు ధ్యానించిన పాదములు వారికి వైకుంఠాన్ని కలిగించగా భరతుడు పూజించిన పాదుకలు నిన్నే ఇచ్చాయి కదా ’ అని రాముడితో అంటారు.  

 

సఖ్యం

కృష్ణార్జునులు, నరనారాయణులు మిత్రులు. కృష్ణుడు, కుచేలుడు బాల్యంలో సహాధ్యాయులు. వీరిద్దరూ స్నేహితులే. ఒకానొక సందర్భంలో గురుపత్ని మూటకట్టి ఇచ్చిన అటుకులను కృష్ణుడు నిద్రిస్తుండగా ఒక్కడే తినేస్తాడు కుచేలుడు. అయినా కుచేలుడిపై కృష్ణుడికి ఆదరణ తగ్గలేదు. రామ – సుగ్రీవులు, రామ – విభీషణులు ఒక స్థాయి వారు, స్నేహితులు. తనకన్నా తక్కువ స్థాయి ఉన్నవారిని తనతో సమానంగా చూడటం కూడా సఖ్యమే. అందుకే పరమాత్ముడు తన అవతారాలలో ఆశ్రితులకు ఎంతో స్నేహితుడయ్యాడు. మార్గదర్శకుడిగా నిలిచాడు. దైవంపై నమ్మకంతో కూడిన ఇలాంటి స్నేహం రెండు విధాలైన సఖ్యాలలో ఒకటి. కుచేలుడు కృష్ణుణ్ణి ఆశ్రయించి దర్శనం చేసుకున్న ఘట్టంలో కృష్ణుడు స్వయంగా తన స్నేహితుడి పాదాలను సేవించాడు. ఈ విధంగా తనతో సమానంగా చూసి ఆదరించడం ఇలాంటి స్నేహ క్రమంలోని ఒక ఘట్టం. బృందావనంలో గోపాలురందరూ కృష్ణుడి స్నేహితులే. ఇక్కడ భగవంతుడు, భక్తుడు అన్న తేడాలు లేవు. పూర్తి స్నేహ భావనలతో నిండిన ఈ రకమైన స్నేహంలో అందరూ సమానులే. ఇది ఉత్తమమైన సఖ్యం.

త్యాగరాజ వైభవం : ‘ చెలిమిని జలజాక్షుకంటే ’ ( యదుకుల కాంభోజి రాగం ) అనే కృతిలో రాముడికి మించిన స్నేహితుడెవరని త్యాగరాజస్వామి ప్రశ్నిస్తారు. శ్రీహరి కనిపిస్తే తన ప్రేమను తెలియజేయమని భాగవతులను ప్రార్థిస్తారు. ‘ దయరానీ ’ ( మోహన ) లో ‘ శ్రీ త్యాగరాజుని చెలికాడు నీవే రామా ’ అంటూ నిజభక్తుడి మనోభావాలన్నీ మార్గదర్శకంగా చూపిస్తూ రాముణ్ణి కొలిచారు. తన మిత్రుడిగా రాముణ్ణి సంబోధిస్తారు. ‘ అమ్మ రావమ్మ తులసమ్మ ’ అనే మరో కృతిలో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసిని ‘ త్యాగరాజుని మిత్రి ’ గా పేర్కొంటారు. ఈ విధంగా తాను మిత్రుడిగా కూడా భావించిన రాముడి సన్నిహితులను కూడా మిత్రభావంతో చూస్తారు. 

 

**********************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page