12_003 తో. లే. పి. – దశిక శ్యామలాదేవి

 

ఆరేళ్ళ నాటి మాట  ! 

 

అమెరికా లో చికాగో లో మా పెద్ద అబ్బాయి సుధాకర్ ఇంట్లో మకాం ఉన్న సందర్భం లో కాలక్షేపం గా అనేక వ్యాసంగాలు ఉండేవి నాకు. వాటిలో ఒకటి పుస్తకాల సేకరణ, చదువు… అందులో భాగంగా నాకు హ్యూస్టన్ లో ఉంటున్న వంగూరి ఫౌండేషన్ అధినేత శ్రీ చిట్టెన్ రాజు గారు, వారు ప్రచురించే అనేక పుస్తకాలతో బాంధవ్యం ఏర్పడింది. రాజు గారి సాహితీ సేవ నాకెంతో నచ్చి, ఆ అభిమానం తో ఫౌండేషన్ కి చిరు సమర్పణ గా చిన్న చెక్కు ను పంపడం, వారు ప్రతి స్పందన గా ఎంతో ఖరీదు చేసే వారి పుస్తకాల సెట్ ని పంపడం జరిగింది. వాటిలో దేనికదే మహా గొప్ప పుస్తకం,

 

ఆ కోవలో అందిన పుస్తకం ” అమెరికా ఇల్లాలి ముచ్చట్లు “.  అసలు ఆ టైటిలే మహా గొప్పగా అనిపించింది నాకు. రచయిత్రి శ్రీమతి దశిక శ్యామలాదేవి. సరే ! .. అందిన ఆ ‘అనుభవాల ‘ సంకలనం నన్ను, నా మనసును అయస్కాంతం లా ఆకర్షించింది మరి ఏ విషయమయినా సరే — విన్నా, చదివినా నాకు నచ్చితే గనక వెను వెంటనే స్పందించడం మరి నాకు అలవాటో, మరొకటో ఇధమిత్తం గా చెప్పలేను, శ్యామలాదేవి గారికి నేను నా స్పందనను తెలియజేయడం, వారు  వెంటనే ప్రతి స్పందనను నాకు అందించడం జరిగాయి… ఆ రచనలలో ఉన్న మాధుర్యమే మమ్మల్ని మరింత సన్నిహితులను చేసింది, అది ఎంతవరకు వెళ్ళింది అంటే — మా పరిచయం దృష్ట్యా నేను తనని మా అమ్మాయి గా భావించి “ అమ్మాయి.. ” అని పిలవడం, తాను నన్ను బాబాయి గారు అని పిలవడం వరకు. శ్యామలాదేవి రచనలలో ప్రత్యేకత ఏమంటే జీవితానుభవాలను క్రోడీకరించి యధాతధంగా వ్రాస్తూ అందులో చిరు హాస్యాన్ని జోడించడం. 

 

అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ఉన్నా, ఇద్దరం కలుసుకునే సందర్భం రాలేదు. చివరకు అది సాధ్యపడింది మేరా భారత్ మహాన్ లో. శ్యామల తల్లిదండ్రులు గుంటూరు లో ఉంటారు. ఒక సందర్భం లో తాను వారిని చూడడానికి అమెరికా నుండి గుంటూరు వచ్చి అక్కడ వారింట్లో మకాం చేసి నన్ను అక్కడకి రమ్మనమని ఆహ్వానించింది… సరే — ఆ అమ్మాయి ని చూడవచ్చు. తన తల్లిదండ్రులు… పెద్దలు, పూజ్యులు వారిని కూడా చూసే అవకాశం లభించినది కదా అనుకుని సంతోషం తో వెంటనే మా విజయవాడ నుండి గుంటూరు కి బయలుదేరాను. నేను గుంటూరు చేరి స్వామి టాకీస్ దగ్గర నిలబడి తనకోసం వెయిట్ చేస్తూండగా తాను ఆటో లో వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. వాళ్ళ అమ్మ, నాన్న గార్లకు నన్ను పరిచయం చేసింది. ఆ ఇద్దరినీ చూస్తూ ఉంటే నాకు సాక్షాత్తు ఆది దంపతులన్న భావన కలిగి వారికి పాదాభివందనం చేసాను. ఆయన నన్ను సంస్కృతం లో ఐదు నిముషాల పాటు ఆశీర్వదించారు. నిజం చెప్పాలంటే, పెద్దలు, పూజ్యులు వారి ఆశీస్సులు నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతం… నాకు లభించిన భగవద్దత్తమయిన వరం ! శ్యామల నాన్నగారు గతం లో సంస్కృత ఉపాధ్యాయులుగా పని చేసేవారట. పరిచయాల అనంతరం మా మధ్యన ఎన్న–ఎన్నెన్నో కబుర్లు…. వాటితో మా పరిచయం మరింత బలపడింది. తరువాత భోజనాలు… శ్యామల అమ్మగారు కన్నతల్లి లా వంటకాలతో బాటుగా, వాత్సల్యాన్ని కూడా జోడించి నాకు వడ్డన చేసారు. భోజనాలు ముగిసాకా శ్యామల అంతటితో ఊరుకోకుండా నూతన వస్త్రాలు, తాను వ్రాసిన పుస్తకం ( 2 వ భాగం ), రెండు పెన్నులు కానుకగా తన చేతులతో నాకు అందించి, నాకు నమస్కరించి, నా ఆశీస్సులను తీసుకుంది. అంతకు ముందు ఎప్పుడో ఒకసారి మాటలలో తనతో ప్రస్తావించాను.. మాది చేబ్రోలు అని, అక్కడే నా బాల్యము, విద్యాభ్యాసం జరిగాయని.. చేబ్రోలు లో ఒకనాడు 101 దేవాలయాలు, – వాటి ప్రక్కనే 101 బావులు ఉండేవని, ఆ ఊరు అసలు పేరు షణ్ముఖపురం అని స్థల పురాణం చెబుతోందని. ఇప్పటికి 101 కాకపోయినా 50-60 కి పైగా దేవాలయాలు ఉన్నాయని.. మరొక ప్రత్యేకత ఏమంటే సాధారణం గా మనం చూడని చతుర్ముఖ బ్రహ్మ ఆలయం అక్కడ ఉన్నదని.. ఈసారి నువ్వు గుంటూరు వస్తే, మనం అక్కడికి వెళ్లి వద్దామని. ఈ విషయాలు నాకు గుర్తు చేసి ” మనము అక్కడకి వెళ్లి చూడడానికి మీకు వీలవుతుందా అండీ.. మీరు సరే అంటే వెళ్ళివద్దామా…. కేబ్ అరేంజ్ చేస్తాను..” అని నాతో అనడం నేను వెంటనే ” సరే ” అనడం, ఆ వెంటనే కేబ్ రావడం క్షణాలలో జరిగాయి. ఇద్దరం అందులో వెంటనే చేబ్రోలు కి ( గుంటూరు నుండి అరగంట ప్రయాణం. అంతే ) బయలుదేరాము. 2, 3 గంటలలో ఆ యాత్రను విజయవంతం గా ముగించుకుని గుంటూరు చేరాము. అలా నేను గుంటూరు వెళ్లడం శ్యామలని, తల్లిదండ్రులను కలవడం, పనిలో పని గా చేబ్రోలు దేవాలయాలను దర్శించి రావడం ఒక తీపి జ్ఞాపకం. 

 

ఇక మరి శ్యామలాదేవి గురించిన మరికొన్ని విశేషాలను కూడా క్లుప్తంగా ఇక్కడ ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంటుందని, అప్రస్తుతం కాబోదని నేను భావిస్తున్నాను. 

 

శ్యామలాడేవి పుట్టి పెరిగింది బాపట్ల వద్ద చెరుకూరు అనే గ్రామం లో. హైస్కూలు చదువు అక్కడ ముగించి 1971-76 వరకు హైదరాబాద్ లోని రావు బహద్దూర్ వెంకటరామారెడ్డి కళాశాల లో 1971-76 మధ్య కాలంలో ఇంటర్, డిగ్రీ చదువు పూర్తి చేయడం జరిగింది. 1975 లో రామకృష్ణ గారితో వివాహం.. ఆ వెంటనే దంపతులు 1976 లో అమెరికా లో, న్యూజెర్సీ లో నార్త్ బ్రున్స్విక్ లో నివాసం. ఈ దంపతులకు ఒక కుమార్తె జ్యోతి. ఆ అమ్మాయి తెలుగులో ధారాళంగా మాట్లాడడం ఒక విశేషం. శ్యామల 30 సంవత్సరాల పాటు హెల్త్ కేర్ ఫీల్డ్ లో పని చేసింది. తాను అభిమానించే రచయిత శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. ఆయన ‘ ఇల్లాలి ముచ్చట్లు ” అన్న రచన ఎంతో పేరెన్నికగన్నది. శర్మ గారి రచనలపై అభిమానం, అయన పట్ల గౌరవ భావం తో తన రచనకు ” అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ” అని పేరు పెట్టింది. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ అన్నా శ్యామల కు ఎంతో అభిమానం. 

 

శ్యామల రచనల విషయానికి వస్తే.. ఆ రచనలలో కొన్ని : 1992 ఏప్రిల్ ” నిరాశ “, 1994 అగస్ట్ ” ఆనాటి అమెరికా అనుభవాలు “, 1995 జూలై ” ఆ రోజులే వేరు “, 2000 డిసెంబర్ ” మార్పు ” ( తెలుగు జ్యోతి ), 1996 – అమెరికా తెలుగు కధానిక- 3 వ సంకలనం ” శ్రీ చుక్క “.

 

దశిక శ్యామలాదేవి ఎంతో ప్రేమ, వాత్సల్యాలతో ఇటీవల తన బాబాయి కి ( = నాకు ) వ్రాసి పంపిన ఉత్తరమే ఈనాటి తోక లేని పిట్టగా మీ ముందు వాలబోతోంది… దయచేసి చిత్తగించండి.

 

<><><>***  నమస్కారములు ~  ధన్యవాదములు ***<><><>

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾