10_013 కథావీధి – చాసో రచనలు – 2

.

                 కందువగు హీనాధిక మిందు లేదు అందరికి శ్రీహరే అంతరాత్మ అన్నది ఆధ్యాత్మికం లో ఎంత యదార్ధమో, లౌకిక జీవితం లో ఆర్థికం అంతే నిజం. ఇరుసున కందెన పెట్టక పరమేశుని బండి అయిన పారదు సుమతీ అని శతక కర్త అభిప్రాయం లౌకిక  జీవితంలో ఆర్థికానికి వర్తిస్తుంది. బంగారు పళ్లానికి అయినా గోడ చేర్పు కావాలి. పూల పరిమళాలని మూసుకుని రావడానికి గాలి కావాలి

ఇప్పుడు మనం పరామర్శించే కథలలో ఈ సంగతి ప్రధానంగా ప్రతిపాదించబడుతుంది. కథలలో పాత్ర ల జీవిత నేపథ్యాలు వేరు, స్వభావాలు వేరు, సంస్కారాలు వేరు, అయినా  వీరందరి సమస్యా డబ్బే !

“ ఎంపు ” అనే కథ యాచకాన్ని వ్యాపకం గా ఊరి బయట పాడుపడిన సత్రాన్ని ఠికానా గా చేసుకుని జీవించే వారి కథ. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ కొండని ఎక్కే మనుషులు పగలంతా యాచించుకుని, చీకటి పడే సమయానికి సత్రం లోకి చేరుకుని తలదాచుకుంటారు. వారికి రేపటి రోజు గురించి చింత ఉండదు అని మన అభిప్రాయం. వారికి కూడా సంసారం, సమస్యలూ, ఆప్యాయతలూ, అభిమానాలూ, అప్పులూ, భాద్యతలూ, కులాల పట్టింపులూ ఉంటాయని, వీటన్నిటి వెనక అంతర్లీనంగా ఆర్థికం తన వంతు పాత్ర ఎలా పోషిస్తుందో ఈ కథలో మనకి అవగతం అవుతుంది.

ఎర్రి అనే అమ్మాయి కుష్ఠు రోగి. ముష్టి అతనికి ఏకైక సంతానం. తండ్రి అడుక్కుని తెచ్చిన సంపాదనతో ఇంత ఉడకేసి కొంత వెనకేస్తూ ఉంటుంది. ఆ పిల్లధీ అదే వృత్తి. వయసు లో ఉన్న ఆ అమ్మాయి తమ తోటి కుంటి ముష్టి అతనితో ప్రేమలో పడుతుంరి. వారు మామూలు మనుషులంత మర్యాదస్తులు కాదు కనక వారి జీవితాలలో దాపరికాలేమీ ఉండవు. అంతా బాహాటమే.
వీరి గుంపులోనే ఒక గుడ్డి ముష్టతను ఉంటాడు. కారు నలుపు రంగు. అతని కళ్ళు పేలిన పత్తికాయలలా ఉంటాయి. ఎర్రటి నామం పెట్టుకుని చితారు ( చిన్న తంబూరా లాంటిదని భావం ) మీటుకుంటూ చిరతలు వాయించుకుంటూ అతను వేటకు వెడితే రూపాయి డబ్బులకు నాగా రాదు. పిలిచి మరీ అర్ధనా, కానీ ఇస్తారు. ఎర్రి తండ్రికి అతనంటే అభిమానం. అతన్ని చేరదీసి కబుర్లు చెప్పి అప్పుడప్పుడు ఎర్రి చేత కొంచెం గంజి నీళ్లు పోయిస్తూ ఉంటాడు.
దాపరికాలేమీ లేని జీవితాలు కనక ఎర్రి, కుంటోళ్ల ప్రేమ కథ తండ్రి కి తెలిసిపోతుంది. అతను కూతురిని ఆరా తీసే లోపే ఒకరోజు రాత్రి తండ్రీ కూతుళ్లు గంజి తాగుతున్న సమయం లో కుంటాడు వచ్చి కూర్చుని కుశల ప్రశ్నల అనంతరం తన ప్రేమ విషయాన్ని బయట పెట్టగా కుష్టు తండ్రి ఒక్క ముక్కలో కొట్టి పడిసి అతన్ని తన్ని తగలేస్తాడు. అహం దెబ్బ తిన్న కుంటాడు, కుష్టు ముష్టతని కూతురు పతివ్రతేమీ కాదని, ఇంతకు ముందు ఆ అమ్మాయి జట్కా బండి అతనితో లేసిపోయిన సెతకారీ మనిషనీ, కుష్ఠతను నెత్తి మీద పెట్టుకుంటున్న గుడ్డాడు జొన్నగుడ్డి మాల కులం వాడనీ, తన కులం అంతకన్నా ఎక్కువ అనీ తెలియజేసి వెళ్లిపోతాడు.
ఎర్రి కి కుష్టు తండ్రిమీద అభిమానం, జాలి. కుంటి ముస్టాడి మీద రోకు / ఇష్టం.తండ్రి మాట కాదనలేదు.

సందిగ్ధం లో ఉన్న కూతురికి తండ్రి జీవిత  వాస్తవాలని వివరిస్తాడు. ” కుస్టు వాడి ఉపన్యాసం ముష్టి లోకానికి ఉపనిషత్తు.”
 
దాని సారాంశం ఏమిటంటే కుంటాడు దుక్కలా ఉన్నాడు. ఆడి వోలకం సూత్తే ఏ ఆమ్మకీ కాండబ్బులెయ్యాలనిపించదు. మొహమ్మీదే భడీమని తలుపులేసిస్తారు. ఆడు ఆఖరికి ఎర్రిని ఈడీకీ, ఆడికీ తార్చి బతుకుతాడు. గుడ్డోడి కి నుదిటి మీద నామం, సేతిలో సిరతలూ ఎట్టి, మెళ్ళో సీతారు ఏలాడగట్టి ఊరిమీద కొదిలితే రూపాయ డబ్బులికి నాగాలేదు. ఆడి సంపాదనంతా ఎర్రి సేతిలో పోస్తాడు. మొత్తం కుటమానం సుఖంగా ఎల్లి పోద్ది.
కుంటాడిలా ఆడు తాగడు. బీడీలు కాల్సడు. గుడ్డోడు కనక ఎర్రి ఎవరి తో తిరిగినా తఖర్ నేదు. ముష్టి పెళ్లి కూతుళ్ళకి గుడ్డి ముస్టోల్లంత మంచి మొగుళ్లు ఎంతో పెట్టి పుడితేనే కానీ దొరకరు.

కుష్టు తండ్రి ఇంత తర్కబద్దం గా జీవితం తాలూకు సారాంశాన్ని అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు చెప్పడంతో ఎర్రి దాన్ని బోధ పరుచుకుని ఆచరిస్తుంది.

‘ ఏకరువు ’ కథలో ప్రధాన పాత్ర ఉన్నత కులానికి చెందిన పేదరికపు మనిషి. అనాధ. పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచీ వారాలు చేసుకుని బతికిన మనిషి. పెళ్లై పిల్లల్ని కని నడి వయసు లో కాలు మోపుతున్న సమయంలో ఒక సాయంత్రం సమయం లో తనని బాగా ఎరిగున్న ఒకతను ” నీకేమయ్యా అదృష్టవంతుడివి ” కొంచెం చనువుతో కూడిన అసూయ వ్యక్తం చేసి వెళ్లి పోవడంతో ఇతను ఆలోచనలో పడి జీవితంలోని ప్రతి మెట్టు దగ్గర తాను ఎలా దగా పడ్డాడో అవలోకనం చేసుకుంటాడు. తాను మోసపోయిన విషయం ఆదివరకే గ్రహించుకున్నా అణచి పెట్టుకుని భరించుకుంటాడు, కానీ ఇప్పుడీ మనిషి ఇలా అని నిప్పు రాజేయడం తో తన  ఆలోచనలను ఏకరువు పెట్టుకుంటాడు.

అనాధ అయి ఆర్థికంగా దారిద్ర్యం అనుభవించినా ఉన్నత కులం లో జన్మించడం చేత ఇతను గాలికి వదిలివేయబడలేదు. సాటి వారు సాయం చేసి చావనివ్వలేదు కానీ బతకడం దుర్భరం చేశారు. పైన పటారం లోన లొటారం. బళ్ళోకి వెళ్లే వయసులో ఒక డాక్టరు గారు ఇతన్ని చేరదీసి కలిగిన వారిళ్ళల్లో వారాలు ఏర్పాటు చేయడంతో మృష్టాన్న భోజనం ప్రాప్తం అవుతుంది, చదువులో నెగ్గుకుని వచ్చి స్కూల్ ఫైనల్ పాసయిన రోజు డాక్టరు  గారు పిలిచి ” ఇక పైన ఏమి చేద్దామనుకుంటున్నావురా? ” అని అడిగినప్పుడు ఇతను కాలేజీ లో చదువుకునే ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేయగా డబ్బులెక్కడివి ? అని ఆయన అడగగా వారాలు చేసుకుంటాను అని ఇతను సమాధానం ఇస్తాడు.” అబ్బో పెద్ద ఆలోచన మీదే ఉన్నావే ! ” అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసి, అంటే ఇతను ఎంత వరకూ ఎదగాలో అన్నవిషయం ఆయన నిర్ణయించాలి.
” అలా అయినా డబ్బు తో పని ఉంటుంది కనక ముందు పెళ్లి చేసుకుంటే సంచీడు డబ్బూ ( సుమారుగా వెయ్యి రూపాయలు), సైకిలూ ఇస్తారనీ దానితో ఇష్టం వచ్చినంత వరకూ సునాయాసంగా చదువుకోవచ్చనీ ” ఉచ్చు బిగిస్తాడు. ఇతని లాంటి వారికి పెళ్లి అవడమే గగనం. సంచీడు రూపాయాలూ, సైకిలూ కలలో కూడా ఊహించుకోవదానికి కుదరనంత ఐశ్వర్యం. వెంటనే ఒప్పేసుకుంటాడు, మరునాడు ఎవరో ఒకాయన వచ్చి తనని డాక్టరు గారు పంపారని చెప్పి ఇతన్ని వెంట తీసుకుని అతనింటికి వెడతాడు. అక్కడ వాతావరణం చూసి పెళ్ళిచూపులని నిర్ధారించుకుంటాడు. పెళ్లి కూతురు తలవంచుకుని ఉంటుంది. కారునలుపు, రూళ్ళ కర్ర లాంటి చేతులు, కొంచెం బట్టతల.
అమ్మాయి నచ్చడానికి అవకాశం లేదు కనక డాక్టరు గారు కలగజేసుకుని, నచ్చజెప్పి పెళ్లికి ఒప్పిస్తారు. మామగారి చేత సైకిలూ, సంచీడు రూపాయలూ ఇప్పిస్తారు కానీ ముందు చూపుతో ఆ వెయ్యి రూపాయాలలో ఆరువందల రూపాయలు పెట్టి అమ్మాయి కి బంగారం కొనిపించేస్తారు. శోభనం నాటికి పెళ్లి కూతురి రూపురేఖల ప్రకారం అది రజస్వలానంతర  వివాహం అనీ జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి విషయంలో తాను దగాపడ్డాననీ అర్ధం అవుతుంది.

ఇక మిగిలింది చదువు. సెలవులు కనక రోజూ సాయంత్రం సైకిలు మీద ఊరిచివరన ఉన్న జీడిమామిడి కోర లోకి వెళ్లి ఆ పూల సుగంధాన్ని ఆస్వాదిస్తూ కాలేజీ జీవితం గురించి కలలు కంటూ ఉంటాడు.

ఒక మంచిరోజు ఉదయాన్నే మావగారు హడావుడి గా వచ్చి నాలుగు కాయితాలమీద సంతకాలు పెట్టించుకుంటాడు. అందులో ఉన్న ” your most obedient servant ” అనే వాక్యం చదవగానే అది వుద్యోగానికి ధరకాస్తు అని అర్ధం అవుతుంది.

ఇహ పై చదువులకి అవకాశం లేదు అని ఉక్రోషం పడి, మళ్ళీ డాక్టరు గారి తో మొరపెట్టుకోగా ఆయన అదంతా ఒక్క ముక్కలో కొట్టి పడేసి “ఎంత చదివినా ఉద్యోగం కోసమే కదరా, పై చదువులు చదివి పరాయి ఊళ్ళల్లో చేసే ఉద్యోగాలు  ఉన్న ఊళ్ళో చిన్న ఉద్యోగాలకీ సాటి రావు. ఈ ఊరికేం తక్కువ? మేమంతా లేమా? ” అంటూ ఒప్పించేస్తారు. ఒక మంచిరోజు ఉదయాన్నే ముహూర్తం చూసి ఇతన్ని ఆ ఊరి మునిసిపాలిటీ లో మోస్ట్ ఓబీడియంట్ లోయర్ డివిజన్ క్లార్క్ గా మారుస్తారు.

సంసారం మొదలవుతుంది. అత్తమామల అజమాయిషీ. భార్య చెప్పిన మాట జవదాటనంత కాలం ఆవిడ అనుకూలవతి అయిన ఇల్లాలే!
ఈ మాత్రం భాగ్యానికే ‘ ఏ దిక్కూ లేని వీడికి ఎంత వైభోగం పట్టిందో! డాక్టరు గారు మంచివాడు మహానుభావుడు. అనాదని చేరదీసి పెంచి పోషించాడు. మావగారు  మంచివాడు, కులం గోత్రం లేని వాడికి పిల్ల నిచ్చి, సంచీడు రూపాయాలూ సైకిలూ కట్నం గా ఇచ్చి పెళ్లి చేసి, ఉద్యోగం వేయించాడు. ఇంతటి భాగ్యం ఎవరికి పడుతుంది ? దేనికైనా పెట్టి పుట్టాలి….  అంటూ ఇతని మొహం మీదే విసుర్లు.

అంతే కానీ ఇతను చురుకైన వాడు కనక చదువు అబ్బింరనీ, పై చదువులకు అవకాశం కల్పించి ఉంటే పెద్ద డాక్టరో, ఇంజనీరో అయి ఉండేవాడు అనీ, ఒక కురూపీ, అహంకారీ అయిన మనిషికి రూపవంతుడూ, మంచివాడూ అయిన భర్త దొరికాడు అనీ, ఒక సామాన్య సంసారికి గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన అల్లుడు అప్పనంగా దొరికాడనీ ఎవరూ అనరు అది నిజం అయినప్పటికీ.

ఇతనికి ఆర్థికం గా స్వాతంత్ర్యం, తల్లి తండ్రులూ ఉండి ఉంటే ఇతని జీవిత గమనం వేరేగా ఉండేది.

ఇతనికి యూడీసీ గా ప్రమోషన్ వచ్చిన రోజు సాయంత్రం ఇంటికి వస్తుంటే చిన్నప్పటినుంచీ ఇతన్ని ఎరిగున్న ఒక పెద్దమనిషి ” నీ కేవిటిరా అదృష్టవంతుడివి” అని అసూయ వ్యక్తం చేయడం తో ఇతను తనకి తాను ఏకరువు పెట్టుకుంటాడు.

.

*********************************************************